రాముని తోక గురించి తెలీని తెలుగు వాళ్లుండరేమో. వాక్యాల్లో పదాలని ఇష్టమొచ్చినట్లు విరిచేస్తే వచ్చే తంటా అది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమనేలుతున్న గాయక శిఖామణుల్లో అత్యధికులు రాముడితో పాటుగా సీతకీ, కుశలవులకీ కూడా టోకున తోకలు తగిలించగల ఘనాపాటీలే. మన బాలు గంధర్వుడి తొలినాళ్లలో తమిళం నేర్చుకుంటే తప్ప అరవ పాటలు పాడనీయమన్న సంగీత దర్శకులున్నారు. ఇప్పటికీ బాలు హిందీ పాటల్లో ఉఛ్చారణా దోషాలెంచటానికి ఉత్తరాది వాళ్లు ముందుంటారు. మనం మాత్రం హిందీ నాసికా గాయకాగ్రేసురుల ధాటికి ముక్కలు చెక్కలౌతున్న తెలుగు పాటలు తన్మయంగా వింటూ తరించిపోతుంటాం. తెలుగు పదాలని ఇలాగే పలకాలి అన్నంత ధీమాగా ముక్కు విప్పి పాడే ఉదిత్ నారాయణులు, కుమార్ సానూలకి వహ్వా అంటూ వీర తాళ్లేసి ఊరేగిస్తుంటాం.
అసలే ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం ఎండమావి. పొంతన లేని పదాలతో కూర్చిన వాక్యాల్లో ఏదన్నా అర్ధముందేమో అని వెదుక్కునేసరికి తాతలు దిగొస్తారు. ఇంత కమ్మగా ఉండే సాహిత్యానికి పాటగాళ్ల విరుపుల మెరుపులు ఉచితాలంకారం. వీళ్ల దెబ్బకి పాటల అసలర్ధాలు కనుక్కోవటం తలకుమించిన పని. ఈ మధ్యొచ్చిన దశావతారంలో ‘లోక నాయకుడా’ అంటూ కమల్ని ఎత్తేసే పాటొకటుంది. పాడినాయన పేరు వినీత్ సింగ్ అట. రాగాలల్లింది ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా. సందర్భమేదయినా, భాంగ్రా రీతిలో తప్ప మరో రకంగా బాణీలు కట్టలేకపోవటం ఈయన ప్రత్యేకత. ఆయనకొచ్చిన పదో పరకో రాగాలనే తిరగేసి, మరగేసి ఇప్పటికి ఓ పాతిక హిందీ సినిమాల్లో వాడేసుకున్నాడు. వాటిలో కొన్నిటినెత్తుకొచ్చి దశావతారంలోనూ పెట్టేశాడు. అంత ప్రతిష్టాత్మక చిత్రానికి ఈతడిని ఎంచుకోటంలో మతలబేమిటో ఆ సకల కళా వల్లభుడికే ఎరుక. సరే, మళ్లీ ‘లోకనాయకుడా’ దగ్గరికొస్తే, పాటలో ఓ చరణంలో ఓ వాక్యాన్ని గాయకులుంగారు ఆలపించిన విధానం: ‘నీరస హృదయం రాయని కవిత’! నా రస హృదయం అది విని నీరసించిపోయింది. గాయకుడు తప్పు చేస్తే దిద్దటానికి సంగీతకారునికి భాష తెలిస్తే కదా. పాట రికార్డింగప్పుడు గీత రచయిత పక్కన లేడా? అసలు ఆయనకన్నా తెలుగొచ్చో లేదో.
ఈ మధ్యకాలంలో నేవిన్న తెలుగు పాటల్లో ఇలాంటి విచిత్ర పద ప్రయోగాలెన్నో. తప్పుల్లేని పాట ఒక్కటీ ఉండదు. పోయినేడాదొచ్చిన బుడ్డ ఎన్టీయార్ ‘యమదొంగ’లో ఇలాంటిదే ఒకటుంది, ‘రబ్బరు గాజులు’ అనే పాటలో. పాడినాయన దలేర్ మెహందీ. ఈ సర్దార్జీ పల్లవిలోనే ‘నువ్వంటే పాడి పాడి ఛస్తానే’ అంటూ తెగ ప్రయాసపడిపోయాడు – నువ్వంటే పాడి పాడి అనేదాన్ని మూడు మూడు సార్లు ఒత్తొత్తి పలికి మరీ. పాడి పాడి ఆయన చావటమేమో కానీ నవ్వీ నవ్వీ నేను అల్లాడిపోయాను. కీరవాణికేం పోయేకాలమో. శుభ్రంగా తెలుగొచ్చినోడే కదా. పక్కనుండీ దిద్దకుండా ఏం చేశాడో మరి!
తెలుగు సినీ గేయాల మీద పరభాషా గాయకుల దాడి అనాదిగా ఉన్నదే. అలనాటి మధుర గాయకుడు మహ్మద్ రఫీ కూడా తెలుగు పాటల్ని ఓ పట్టు పట్టినోడే. కాకపోతే అర డజనో, డజనో పాడి వదిలేశాడు కాబట్టి ఆయనెంత పట్టి పట్టి పాడినా మనోళ్లు అబ్బురంగా విన్నారు. వర్తమాన గాయకులూ అలా తెలుగులో అప్పుడప్పుడూ మెరిసి మాయమైతే సమస్య లేదు. లేదా, ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలుగు పాటలు శుభ్రంగా పాడితే ఎన్నిట్నయినా హాయిగా వినొచ్చు. ఈ విషయంలో పాకీస్తానీ వాడయినా అద్వాన్ సమీ మెరుగు. తెలుగులో పాడింది ఒకట్రెండే అయినా ఉన్నంతలో ఉచ్ఛారణా దోషాల్లేకుండా పాడాడు. పాత తరంలో తలత్ మహ్మూద్ కూడా ఇలాగే ఒకటో రెండో పాడాడు – ఆయన తెలుగోడే అనిపించేంత బాగా (వాటిలో ఒకటి 1950లలో వచ్చిన ‘మనోరమ’ లోనిదని విఏకే రంగారావు గారంటే విన్నట్లు గుర్తు)
పరభాషా గాయకులనగానే అంతా ఉత్తరాది వాళ్లనుకోవటం సహజం. అయితే తెలుగుని భయంకరంగా ఖూనీ చేసేది మాత్రం మలయాళీ గాయకులు. జేసుదాస్ వంటి ఒకరిద్దరు పాతకాపులు తప్పిస్తే మిగిలిన వాళ్లంతా పరుషాలకీ సరళాలకీ తేడా లేకుండా పాడేసే రకాలే. వాళ్ల భాషలో ఆ రెంటికీ తేడా లేకపోవచ్చు. అయితే తెలుగులో విరివిగా పాడేటప్పుడు ఈ భాష తెలుసుకోవటం కనీస ధర్మం కాదా? ఇలా ఘోరాతి ఘోరంగా పాడే వాళ్లలో మొదటి వరుసలో ఉండేవాడు ఈ మధ్య తెలుగులో తెగ పాడేస్తున్న జెస్సీ గిఫ్ట్. తెలుగే కాక ఆంగ్ల పదాలు కూడా సరిగా పలకలేకపోవటం ఇతని విశిష్టత. ఆ రకంగా ఆయనకి భాషా భేదాల్లేవని మనం సరిపెట్టుకోవాలేమో మరి! ఈయన్లాంటోడే, ఓ రకంగా ఇతన్ని మించినోడు మరొకడున్నాడు, ఉలగనాధన్ అనే తమిళ సింగరుడు. మన అదృష్టం కొద్దీ ఇతను తెలుగులో ఒకే ఒక్క పాట పాడి క్షమించి వదిలేశాడు (‘ఖరత్నాక్’ లో). ‘మనసు’ ని ‘మణసు’, ‘కోలాటం’ ని ‘కోళాటం’ అంటాడీయన.
అడపాదడపా ఉత్తరాది గాయకులు, అప్పుడప్పుడూ జేసుదాస్ వంటి పొరుగు భాషల వాళ్లు వచ్చి ఒకటీ అరా పాడి వెళ్లిపోయినా ఎనభైల దాకా తెలుగు సినిమాల్లో తెలుగొచ్చిన గాయకులదే హవా. ఎనభయ్యో దశకం మధ్యలో నటశేఖరుడికి బాలసుబ్రహ్మణ్యంతో ఏవో గొడవలొచ్చి రాజ్ సీతారాం అనబడే పక్క రాష్ట్రపాయన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. ‘ఆకాసంలో ఒక తారా’ అంటూ దూసుకొచ్చిన ఆయన శషభిషల్లేకుండా శ, ష, స లని ఏకరీతిన గౌరవిస్తూ కృష్ణ సినిమాల్లో వంద పైబడి పాటలు పాడేసి తర్వాత మనదృష్టం కొద్దీ కృష్ణ-బాలులకి సయోధ్య కుదరటంతో తిరుగు టపాలో వెళ్లిపోయాడు. ఆ రకంగా అప్పటికి తప్పిన ముప్పు తొంభయ్యో దశకంలో అల్లా రఖా రెహ్మాన్, మణిశర్మ ప్రభృతుల ప్రయోగాల పుణ్యాన మళ్లీ ముంచెత్తింది – ఈ సారి మరింత ధాటిగా. ఎస్పీ చరణ్ (‘ఎక్కడ ఉందో తారక’ – మురారి, ‘ఎగిరే మబ్బుల లోన’ – హ్యాపీ), కన్నడ గాయకుడు రాజేష్ (‘ఎటో వెళ్లిపోయింది మనసు’ – నిన్నే పెళ్ల్లాడతా, ‘బుగ్గే బంగారమా’ – చందమామ), వర్ధమాన గాయకుడు కారుణ్య (‘ఎక్కడో’ – చిరుత) వంటి ఆణిముత్యాలు బోలెడు మందుండగా ఈ తప్పుల తడకల పాటగాళ్ల మీద అంత మోజెందుకో సంగీత దర్శకులకి! గుడ్డిలో మెల్లలా, ఈ సమస్య దాదాపుగా గాయకులకే పరిమితం. అదృష్టవశాత్తూ ఆశా భోంస్లే లాంటి ఒకరిద్దరు తప్ప, పరభాషా గాయనీమణులు చాలావరకూ తెలుగు పదాలు బాగానే పలుకుతారు. వీళ్ల పుణ్యాన హీరోయిన్ల సోలో గీతాలు పూర్తిగానూ, యుగళ గీతాలు సగమైనా వినసొంపుగా ఉంటాయి కనీసం.
తెలుగు పాటలు తెలుగు వాళ్లే పాడాలని గిరిగీసుకోనవసరం లేదు. ఎవరైనా పాడొచ్చు. మనవాళ్లు ఇతర భాషల్లో జెండా ఎగరేసిన సందర్భాలూ ఉన్నాయి – ఎస్పీబీ ఈ మధ్యదాకా తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రస్థానంలో ఉన్నవాడే. కానీ తమిళాన్ని తమిళులంత బాగా మాట్లాడటానికి ఆయన చేసిన కృషిలో కొంతైనా ఈనాడు తెలుగులో పాటలు పాడుతున్న పరభాషా గాయకులు చేస్తున్నారా? ఆమధ్య కీరవాణి ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు, ‘ఒకప్పుడు సినిమా సంగీతం దుర్భేధ్యమయిన కోటలాంటిది. ఛేదించుకుని లోపలికెళ్లటం అత్యంత కష్టసాధ్యమైన విషయం. కష్టపడి లోపలకి వెళ్లినోళ్లకి మాత్రం వజ్ర వైఢూర్యాలు దొరికేవి. ఇప్పుడో, లోపలికెళ్లటం చాలా తేలిక. కానీ అక్కడ దొరికేదేమీ లేదు’. వర్తమాన తెలుగు సినీ సంగీతం గురించి ఒక్క ముక్కలో తేల్చేశాడలా. అయితే ఇందులో నాకర్ధం కానిది – లోపల విలువైనది ఏమీ లేదు కాబట్టి అందర్నీ ఎడాపెడా రానిచ్చేస్తున్నారా, లేక ఎవరుబడితే వాళ్లు విచ్చలవిడిగా లోపలికొచ్చేసరికి అక్కడేమీ లేకుండా పోయిందా?
హహహహ.. కాదనలేని సత్యం. కానీ శ్రేయా గోశాల్ మాత్రం ఈ నవతరపు తెలుగు గాయకీమణులకంటే వంద రెట్లు మెరుగు.
I feel your pain 🙂
హ హ 🙂 మొదటి సారి విన్నపుడు వాడి అసలు ఉద్దేశ్యం అర్ధమవడానికి నాకూ కొంచెం టైం పట్టింది. కానీ పాటని Stylish గా స్వరపరచడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల తెలుగు మరింత గా ఖూనీ అవుతుంది అని నా అనుమానం. ఉదాహరణకి యమదొంగ లో పాడి పాడి ఇదే కోవలోకి వస్తుంది అనుకుంటున్నా అందుకే కీరవాణి వదిలేసి ఉంటారు 🙂
“నిదుర పోరా తమ్ముడా” గుర్తుందా.. ఎవరైనా తెలియని వాళ్ళుంటే.. అది తెలుగురాని వాళ్ళు పాడారంటే నమ్ముతారా.. అరగంట రిహార్సిల్ తరువాత లత పాడిందట. కమిట్మెంట్ అంటే అది.. నాసికా గాయకుల దెబ్బకి చెవులు మూసుకోవాల్సి వస్తోంది. బాగా రాసారు.
ఏమిటి, అది “నీ రస హృదయమా”? నేనింత వరకూ “నీరస హృదయం అనే అనుకుంటున్నానే!
ఇలాంటి వాటి గురించి రోజంతా మాట్లాడుకున్నా, మన హృదయాలు మరింత నీరస పడటం తప్ప ఎవరూ మన గోడుని పట్టించుకోరండీ! పరభాషా గాయకులకు పాట గురించి ముందు వివరించి,ఒకట్రెండు సార్లు ప్రాక్టీస్ చేయించి, ఉచ్చ్చరణా దోషాలు సరిదిద్ది, అప్పుడు పాడిస్తే కొంచెం బాగుంటుంది. అంత టైమెక్కడుంది మనవాళ్లకి? వాళ్ళు ముంబై ఫ్లైట్ దిగొచ్చేసరికి ఎవరో ఒకరు ట్రాక్ పాడేసి ఉంటారు. గాయకుడు లేదా గాయని రాగానే తెలుగు పాటని హిందీ లో రాసుకుని ఎడాపెడా మన చెవుల్లో సీసం పొసే ఏర్పాట్లు చేసి నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోతారు వాళ్ళు.
పరభాషని మాతృభాషలా ఉచ్చరించే ఇంకో గాయని గురించి మర్చిపోయారు మీరు. వాణీ జయరాం గారు. ఆవిడ కూడా తెలుగు రాని కారణంగా హిందీలో రాసుకుని పాడతారు. ఈ విషయం ఎక్కడో చదివే దాకా నాకు తెలీనే తెలీదు.తెలిసాక ఆవిడ భాషలో తప్పులు దొరుకుతాయేమోనని చూశాను గానీ కుదరనివ్వలేదావిడ! అలాగే జేసు దాస్ హిందీ ఉచ్చారణ ఎంత సజహంగా ఉంటుందో! అన్ని పాటలూ హిట్లే! ఇంకా బాలు, భాష మరింత స్పష్టంగా ఉండాలనో ఏమిటో, హిందీ అంత బాగా ఉచ్చరించడు. బాలు హిందీ పాటలు నేను ఇష్టపడను.
అద్నాన్ సామి తెలుగు విషయంలో మీతో ఏకీభవిస్తున్నాను. అలాగే తలత్ విషయంలో కూడా! మనో రమ లో “అందాల ప్రేమా సుధా నిలయం..ఈ లోకమే దివ్య ప్రేమ మయం”(లిరిక్స్ తప్పుంటే క్షమించాలి) పాట తలత్ పాడాడని మొదట్లో పసిగట్టలా నేను! అంత సహజంగా ఉంటుంది. రఫీ భలే తమ్ముడు సినిమాలో “ఎంత్త వ్వారు గ్గాన్నీ వ్వేద్దాంత్తులైన్న గ్గాన్నీ..” అని వత్తి వత్తి చంపేసినా, అక్బర్ సలీం అనార్కలి నాటికి కొంచెం భాషను మెరుగు పరిచి….బాగా పాడాడు. “సిపాయీ ..”పాట, ‘తానే మేలి ముసుగు తీసి..” “తారలెంతగ మెరిసేనో” పాటల్లో ఆయన తెలుగు బాగుంటుంది గమనించండి.
ఉదిత్ నారాయణ గురించి మాట్లాడాలంటేనే చిరాకొస్తుంది. ఎన్ని తెలుగు పాటలు పాడినా తెలుగు సరిగ్గా నేర్చుకుందామనుకోడు. నేర్చుకోనక్కర్లేదు…కనీసం ఆ పాట వరకైనా ఎలా పాడాలో అడిగి తెలుసుకోడు.
గాయనీ మణులందరిలోకీ శ్రేయా ఘోసల్ నయం. ఆనంద్ సినిమాలో పాటలు చక్కగా దోషాలు లేకుండా పాడింది. చందమామ సినిమాలో అనుకుంటాను..ఆశా భోంస్లే ఒక పాట పాడింది. “నాలో ఊహలకు…నాలో ఊసులకు” అనే పాట. విని తీరాల్సిందే గానీ చెప్పలేను.
పరభాషా గాయకుల చేత పాడించడం అనేది ఇదివరలో ఒక ప్రయోగం, ఒక వెరైటీ కోసం మాత్రమే! ఇప్పుడది కంపల్సరీ అయి కూచుంది. అలాగని వాళ్ళ తప్పుల్ని సరి దిద్దే బాధ్యత ఎవరన్నా తీసుకుంటారా అంటే అదీ లేదు. కీరవాణి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికేం లెండి. ప్రతి పాటా ఎక్కడినుంచో ఎత్తుకొచ్చిన ట్యూన్ల నుంచి జిరాక్స్ తీయడంలో బిజీగా ఉంటుంటే, తెలుగొచ్చిన సంగీత దర్శకులు మాత్రం తప్పులు దిద్దటానికి టైం ఎక్కడ కేటాయిస్తారు చెప్పండి?
మీరు చెప్పింది నిజం..”ఎవరు బడితే వాళ్ళని రానిచ్చే సరికి అక్కడ ఏమీ లేకుండా పోయింది..”..ఇదే నిజం!
పరభాషా గాయకుల ఉచ్చరణా దోషాలెంచే ఉత్సాహంలో నేను బోలెడు తప్పులు టైప్ చేసాను. కరెంట్ పోయే టైం అవడంతో సరి చూసుకోకుండానే కామెంట్ పెట్టేసాను.క్షమించాలి.
హహ 🙂 చాలా మందికి “ళ” పలకదు గమనించారో లేదో. మల్లి కి, మళ్ళీ కి తేడా తెలియదు, పెల్లి కి పెళ్ళికి తేడా తెలియదు. నాకెవరైనా ఈ మధ్య తెగ హిట్టైపోయిన “రెడీ” సినిమాలోని “ఓం నమస్తే బోళో మహా” అనే పాట సాహిత్యం చెప్తారా, నాకు అర్థం చేసుకోవాలి అని తెగ ఉబలాటం గా ఉంది
జనాలు వైవిధ్యం కోరుతున్నారన్న నెపంతో ఇలాంటి ఖూనీకోర్లని జనాలమీదికి వదిలేస్తున్నారు.శ్రేయాఘోశాల్ మినహాయింపని ఒప్పుకోవాల్సిందే. మరీ పలకనిపదమైతేతప్ప మిగతావి నేర్చుకునిమరీ పాడుతుంది.
తెలుగుగాయకుల చేతకూడా ఈ ఘనకార్యం చేయించే సంగీత దర్శకుడు చక్రిని వదిలేసారు మీరు. ఈ సంగీతదర్శకుడివలన హైదరాబాద్ గాయకులు చాలా మంది సినీపరిశ్రమలో అడుగుపెట్టినా, గాయనీమణులుతప్ప గాయకులచేత విచిత్రమైన కూతలూ అరుపులూ పెట్టించకమానడు. ఇక తానేపాడితే ఇహ చెప్పలేము. ఈ మధ్యకాలంలో ఈ దర్శకుడు కొణ్ణి ఆణిముత్యాల్లాంటి పాటల్ని అందించినా ట్రెండుకుపోయి నానాగోలా చేస్తుంటాడు. ఇదేమిఖర్మొ!శ్రోతల పాపమో!!
అప్పుడెప్పుడో కొత్తపాళీ మాస్టారు రాసారు ఇలాంటి మీద. తర్వాత మీరు.బాగా చెప్పారు. నాకు మాత్రం భలే నవ్వొస్తుంది., ఇలాంటి పాటల్ని వింటే., కాబట్టి క్షమించేస్తుంటా.
జేసుదాసు ఓకే కానీ, 100 % కాదు. “ర” ను “ఱ” అని పలుకుతాడతను. మన బాలు ని ఒక్కోసారి పైకి కనబడకుండా విమర్శించేస్తూ ఉంటాడు అప్పుడప్పుడూ, గొంతులు మారుస్తూ పాడే గాయకుడు అంటూ …
నీరస హృదయం హ..హా విన్నాకా నీరసం రాక చస్తుందా !
మొన్నేదో చిత్ర పాడిన పాట వింటుంటే, ” ఆ చేయి ఈ చేయి అత్త గోడలి చేయి” అంది. ఈ గోడలేమిటా అని ఒక్క సారి కంగారుపడ్డాను. ఒకవేళ ఏమైనా సంధి జరిపిందేమోలే అని సరి పెట్టుకోవలసి వచ్చింది :). ఆ పైన చెప్పిన పాటకి అవార్డు కూడా వచ్చిందండోయ్.
ఇలాంటి పొరపాట్లు నేను కూడా చేస్తూ ఉంటాను. పూర్వం ఇంత తేలిగ్గా పాటలు దొరికేయి కాదు. గుర్తున్నంతవరకు కూనిరాగాలు తీస్తూ ఉండేవాల్లం. కొన్నాళ్ళకు మాటలూ, రాగాలూ కూడా మారిపోయేయి. ఒకపాట గురించి రాస్తాను. చివరికిమిగిలేది లో మల్లాది రామక్రిష్ణశాస్త్రి గారు రాసిన ఒక చక్కటి పాట ఉంది.
“చెంగున అలమీద మిడిసి పోతది మీను
చినవాడు ఎదురైతే మరచి పోతవు మేను
కాదంటావా చినదానా
వల్లమాలిన మమత కమ్మతెమ్మెర లాగ
కమ్ముకున్నది నిన్ను చినదానా
సమ్మతైన వాడు సరసనే ఉన్నాడు
పల్లకుంటావేలే చినదానా”
కొన్నాళ్ళైన తరవాత నా మనసులో మొదటి పాదము ఇలా మారిపోయింది.
“చెంగూన అలమీద చెదిరిపొతది మేను”
ఏదో గాలికి చెంగు అలలాగ ఊగుతున్నది శరీరము కంపించిపోయింది కాబోలు అనుకుంటూ ఉండెవాడిని. ఇంకొకాయిన తెమ్మెరను, తిమ్మెరగా మార్చేసారు.
ఒక రోజెందుకో ఆఫీసు ఎగ్గొట్టి, మధ్యాహ్నం నిద్ర రాక/ పోక నవీన అనే టివి9 కార్యక్రమం చూశాను. ఆంకర్ ఝాన్సీ ఓ పది మంది అమ్మాయిలేసుకుని రాళ్ళ మీద కూర్చుని తీవ్రంగా చర్చిస్తోంది. వాళ్ళు మాట్లాడినవి నాకు గుర్తున్నంత వరకూ:
> తెలుగువాళ్ళని తెలిస్తే దాదాపు పాటను పాడే ఛాన్స్ పోయినట్టే. అదృష్టం బాగుంటే కోరస్ గా ఉండచ్చు.
> తెలుగు పదాలను తెలుగులా పలకకూడదు. Stylized or westernized ధోరణిలో పలకాలి. చక్కని తెలుగు వచ్చిన వారికి “ప్రాక్టీసు” తప్పదు మరి.
> పాడేవారి ఎంపికలో సంగీతదర్శకుని కన్నా, హీరో, ప్రొడ్యూసర్ల హవా ఎక్కువ. పేరున్న వాడితోనే పాడించుకోవాలి. పాట సాహిత్యం, గొంతు సూట్ అవుతుందా, తెలుగు పలకగలడా లాంటివి అనవసరమట.
ఆహ్.. ఇవ్వన్నీ ఎంచుమించు వినే ఉన్నాం కదా అనుకున్నా, కానీ అప్పుడే ఒక భీకరమైన షాకు తగిలింది.
స్టూడియోలో కోరస్ పాడడానికి వెళ్ళే అమ్మాయిలు తప్పనిసరిగా జీన్స్ వేసుకోవాలి! western outfit. వేసుకు రాకపోతే పాడనివ్వరట. పాపం, ఒక అమ్మాయి సినిమాలో పాడడానికే ఇంట్లో వాళ్ళు చచ్చీ చెడి పంపిస్తే, ఇక్కడ ఈ ట్విస్ట్ అట. అమ్మాయిలంతా 18-౩౦ yrs లోపే ఉంటారు. ఒక్కొక్కరూ మొదలెడతారే గానీ, ఆపరే! నాకు మతి చెడిపోయింది ఈ ప్రోగ్రాం చూసి.
ఇందులో గోదావరిలో “రామ చక్కని సీతకి” పాట పాడిన గాయత్రి కూడా ఉన్నారు. చివర్లో ఆ పాట వేశారు.. కానీ నాకు మాత్రం అదే సినిమాలో ఇంకో పాటలో చరణం గుర్తొచ్చింది..
కన్నీరైన గౌతమి కన్నా
తెల్లారైన పున్నమి కన్నా
మూగపోయా నేనిలా ..
ఆ సమయంలో నా పరిస్థితి అది. ఇప్పుడు చెప్పండి.. ఈ టపాలో దేని గురించి మాట్లాడారో.. తెలుగు సినిమా పాటలా? తెలుగును కాసేపు మర్చిపోతే.. వీటినీ “ఎంజాయ్” చేయచ్చు!
@వికటకవి,కొత్తపాళీ,వేణు,అరిపిరాల,లక్ష్మి,మహేష్,చైసా:
ధన్వవాదాలు.
@సుజాత:
హిందీవాళ్లలో కుమార్సాను కూడా ఫరవాలేదనిపించాడు. ఈయన హిందీలో ముక్కుతో పాడే పాటలు నాకు నచ్చేవి కావుగానీ, తెలుగులో ‘దేవుడు వరమందిస్తే’ చక్కగా పాడాడనిపించింది. ‘మేఘం’ లాంటి పదాల్ని శుభ్రంగా పలికాడు. ఉఛ్చారణపై ఘంటాడి కృష్ణ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడేమో మరి.
@రవి:
జేసుదాసు విషయంలో మీరన్నది నిజమే. కాకపోతే తమిళ, మలయాళీ గాయకుల్లో జేసుదాసు మెరుగు.
@దైవానిక:
‘కలికి చిలకల కొలికి’ కదా అది – సీతారామయ్యగారి మనవరాలు లోది.
@గద్దేస్వరూప్:
మీ సొంత పదాలు కూడా బాగున్నాయి 🙂
@పూర్ణిమ:
ఎంజాయ్ చెయ్యక ఏం చేస్తాం 😦 కాకపోతే అప్పుడప్పుడూ ఆవేశం ఇలా తన్నుకొస్తుంది.
ఆపాటలు నేను వినలేదు కానీ మీ టపా మాత్రం చదివి ఆనందించడనికి బాగుంది. కామెంట్లు అదనంగా బోనస్. అవునండీ మరి ఇలా బాధ పడేవాళ్లున్నా, ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించదు ఎంచేత. మరి ప్రజావాణికి విలువ లేదా
హ్హ హ్హ హ్హ … మీ టపా చూసి … పాడి పాడి , పాడి పాడి , నవ్వానే !
యాభై కే … జీల మందారాన్ని ” ( మన్మధుడే బ్రహ్మను పూని పాట — నా ఆటోగ్రాఫ్ చిత్రం లో ) ఆ పాట నాకు మొదటి సారి వింటే అస్సలు అర్థం కాలేదు !
నీరస హృదయమా … నువ్వెక్కడ ? అని ఈ గాయకులని కడిగేయాలి మనం ! 🙂
నేనొక మలయాళీ పాట నేర్చుకుంటే, ఎక్కడా ఉఛ్చారణ దోసెలు ( దోషాలు) లేకుండా 😉 జాగ్రత్త పడుతుంటాను … ఏదో లొల్లాయి గా స్నేహితుల ముందు పాడేందుకు కూడా ! ఇలా మరి కోట్ల మంది వినే సంగీతాన్ని పట్టించుకోకపోవటం విడ్డూరమే !
( ట్యూన్ ని, భాష ని , గాయకులని etc )
అబ్రకదబ్ర గారూ, మంచి టపా ! ఆనందించాను అని చెప్పలేను … కానీ పాడి పాడి నవ్వుకున్నా, తర్వాత నీరస హృదయం తో ఈ జవాబు !
(P.S: నేను ఇంతకు ముందు చైతన్య నే ! )
అలనాటి పాత చిత్రాల లోని పాటలు చక్కటి సంగీతం, సాహిత్యాల తో కూడి, తెలుగు వచ్చిన గాయకులు, భాష, భావం చెడకుండా పాడటం వలన వినసొంపుగా ఉండేవి. పర భాషా గాయకులకు, తెలుగు భాషపై పట్టులేని కారణంగా, ఉచ్ఛారణా దోషాలతో హింసిస్తున్నారు. వీరిపై మన సంగీత దర్శకులు వ్యామోహం కొంత తగ్గించుకోవటం అవసరం. లేకుంటే మనము కూడా, Queen’s English Society లాగా, తెలుగు పాటల్లో, తెలుగు రక్షణకై ఒక సంస్థ స్థాపించి, దానిని e-Telugu సంఘం లో ఒక శాఖగా చెయ్యటం, ప్రస్తుత కర్తవ్యం గా తోస్తుంది.
avunu andaru baluni thega mechchesukuntunnaru kaani ayana sri ni ‘shree’ anee aasalu ni aashalu ani yenni sarlu padeyyaledu? yee madhy net lo yedo paadutha thiyyaga program lo pillalni sa and sha and another ssa antu… okatey peekudu….gatham marchipokoodamma…. kaneesam class peekaaka… nenu kuda meelaagey ilanti thappu chesevadni’ ani oka mukka cheptey yempothundi…. naakaithey ollu mandindi sumee…..
sorry andee yee telugulo wrayadam yelago shuddenga (abba..meeru mareenu… suddenga ani artham chesukoleroooo) samjgaley…. jera semincheyyunri mee kalmokkutha…..
’మీ’ రసహృదయాన్ని బాగా చెప్పారండి.
===
బై ద వే… మీరు గుంటూరు హిందు హైస్కూల్ లో చదువుకున్నారా? ’రాయల్’ అని ఒకతను మా క్లాసులో ఉండేవాడు పదవ తరగతిలో. విజయవాడ నుండి వచ్చి చదువుకుంటున్నాడని చెప్పేవారు. అతని పూర్తి పేరు తెలీదు. అతను మీరేనా?