తెలంగానం

తెలంగాణవాదులు రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యటానికి రకరకాల కారణాలు చెబుతారు – వివక్ష, వెనుకబాటుతనం, ఆత్మగౌరవం, ఆంధ్రుల దోపిడీ, వగైరా, వగైరా. ఇవన్నీ ఏదో ఓ రూపేణా ఎంతోకొంత లేని ప్రాంతాలు దేశంలో – ఆ మాటకొస్తే మన రాష్ట్రంలోనే – మరెక్కడా లేవా అంటే వారినుండి మౌనమో మరే డొంకతిరుగుడు సమాధానమో బదులు. ప్రత్యేక రాష్ట్రంతో రాజకీయ నిరుద్యోగులకే తప్ప నిరుద్యోగ యువతకి, నిరుపేదలకీ వచ్చేదేమీ లేదని తెలిసినా తెలియనట్లు నటించే మేధావివర్గం అనబడేదొకటి ఉబుసుపోకకో, ఉడుకుమోత్తనంతోనో తెలంగాణవాసుల్లో లేనిపోని భావావేశాలు రెచ్చగొట్టే పనిలో బిజీ బిజీగా మునిగుంది. తాజా తెలంగాణ ఉద్యమానికి ముందీ మేధోగణం ఎక్కడుందో, పీడిత తాడిత ప్రజాబాహుళ్యానికేమి ఒరగబెట్టిందో అడిగేవాడు లేడు. ప్రత్యేక రాష్ట్రమంటూ వస్తే బండెలా నడిపిస్తారనేదానికి తెల్లమోహాలే వీళ్ల సమాధానం, లేదా ‘మా రాష్ట్రం మాకిస్తే మా తిప్పలేవో మేం పడతాం’ అనే అరిగిపోయిన రికార్డు. ఇన్నేళ్లుగా ఆంధ్రా నాయకుల కారణంగా తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఊదరగొట్టే గొంతులు ‘తెలంగాణనుండొచ్చిన ఓ ప్రధాని, ఐదుగురు ముఖ్యమంత్రులు, డజన్లకొద్దీ చట్టసభల సభ్యులు ఏం ఊడబొడిచారు’ అంటే మాత్రం నీళ్లు నములుతాయి. మరీ గట్టిగా రెట్టిస్తే వచ్చే రెడీమేడాన్సరు, ‘ప్రజల్లో సెంటిమెంటుంది’. ఒకప్పుడు సెంటిమెంటుతో సినిమాలు నడిచేవి, ఇప్పుడు ఉద్యమాలు కూడా నడుస్తున్నట్లున్నాయి.  రైళ్లూ, బస్సులూ కూడా నడిస్తే బాగుండు.

సెంటిమెంటు పాట పాడీ పాడీ అదేదో నిజంగానే ఉందేమోననే అనుమానం అన్ని పార్టీల్లోనూ విజయవంతంగా కల్పించేశారు. దానితో  రాష్ట్రంలో పార్టీలన్నింటికీ తెలంగాణ జ్వరం పట్టుకుంది. నిన్నా మొన్నటి దాకా సమైక్య రాగం ఆలపించిన తెలుగుదేశం కూడా ఇప్పుడు స్వరం మార్చి తెలంగానం అందుకోవటం రానున్న ఎన్నికల్లో లబ్ది కోసమేనన్నది చంద్రబాబు దాచినా దాగని రహస్యం. సమైక్య వాదంతో పోటీ చేసి 2004 ఎన్నికల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో కన్నా తెలంగాణలోనే మెరుగైన ఫలితాలు రాబట్టటం, ఒట్టు తీసి గట్టునపెట్టకుండానే గత ఉప ఎన్నికల్లో కూడా అక్కడ మంచి విజయాలు సాధించటం .. వీటిని ఎవరైనా ‘సమైక్యవాదానికి తెలంగాణలో మంచి మద్దతే ఉంది’ అని అర్ధం చేసుకుంటారు. బాబు మాత్రం ‘సమైక్య వాదంతోనే ఈ విజయాలొస్తే, వేర్పాటు పల్లవందుకుంటే మరెంత లాభసాటో’ అనుకున్నట్లున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టటం కూడా  తెలుగుదేశం ట్యూను మార్చిన కారణాల్లో ఒకటి. తక్కిన పార్టీల తెలంగాణ బాట, గత జూన్ ఉప ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెరాసకి తిరిగి జవసత్వాలు సమకూర్చేదే. తెలంగాణ విషయంలో ఏదీ తేల్చకుండా మిగిలిన పార్టీ ఇక కాంగ్రెస్ ఒక్కటే. ముఖ్యమంత్రి మంకుపట్టు వల్ల విభజనకి అనుకూలంగా ఓటెయ్యకుండా అధిష్టానం ఆగిపోయింది కానీ లేకుంటే ఆ పార్టీ సైతం జై తెలంగాణ అనుండేదేమో.

తెలంగాణ విషయంలోనే కాకుండా, మన దేశంలో ఏ అంశమ్మీదైనా ఇలా ప్లేటు ఫిరాయించే ముందు పార్టీలన్నీ వల్లెవేసే చిలకపలుకులు, ‘ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికొచ్చాం’. ఈ ప్రజాభిప్రాయం ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడెక్కడ, ఎంత శాస్త్రీయమైన పద్ధతుల్లో సేకరించారో అడిగే నాధుడు, చెప్పే మహానుభావుడు ఉండరు.  అసలు రాష్ట్రాన్ని చీల్చాలో వద్దో కొందరు తెలంగాణ అతివాదుల కోరిక మీద ఆధారపడి ఎలా నిర్ణయిస్తారు? అవకాశమిస్తే, మా పలనాడునీ ప్రత్యేక రాష్ట్రం చెయ్యమనే ప్రబుద్ధులున్నారు నా ఎరుకలో. ఆంధ్రప్రదేశ్ మనుగడకి సంబంధించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి నిర్ణయించాలి; ఏ ఒక్క ప్రాంతం వారో, ఏ కొందరు నాయకులో కాదు. అనేక దేశాల్లో ఇటువంటి వివాదాస్పద అంశాల పట్ల ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేసే సంప్రదాయముంది. ఉదాహరణకి, నిన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడెవరనేదానితో పాటు ప్రాంతీయంగా, జాతీయంగా ముఖ్యమైన అనేక అంశాల పట్ల ప్రజల తీర్పుని కోరటం జరిగింది (వీటిని ప్రపోజిషన్స్ అంటారు). గే మ్యారేజెస్, స్త్రీలకు అబార్షన్ హక్కులు, మొదలైనవున్నాయి ఇలా తాజాగా ప్రజాభిప్రాయం సేకరించిన వివాదాస్పద అంశాల్లో. మన దేశంలో కూడా ఇటువంటి సత్సంప్రదాయం ఎందుకు మొదలు పెట్టకూడదు? అవసరమైతే దానికనుగుణంగా రాజ్యాంగ సవరణొకటి చెయ్యొచ్చు. ఎన్నికలంటే ఎమ్మెల్యేలనో, ఎంపీలనో ఎన్నుకునే తప్పనిసరి తంతు మాత్రమే అనే తప్పు అభిప్రాయం ఒకటి ఇన్నేళ్లుగా పాతుకుపోయుంది మనలో. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వోటర్లని ఒక్కచోటికి చేర్చే ఆ సందర్భాన్ని వివిధ అంశాలపై ప్రజానాడిని పట్టుకోటానికి వాడుకోవచ్చు కదా. ‘ఏ వెధవకి ఓటేసినా ఒరిగేదేముంది’ అన్న నిర్లిప్తతతో ఓటింగుకి వెళ్లటమే మానుకున్న లక్షలాదిమంది ఇటువంటి ప్రపోజిషన్స్‌పై తమ అభిప్రాయాలు వెల్లడించటానికి వచ్చే అవకాశాలు మెండు. తిరిగి తెలంగాణ విషయానికొస్తే – ఎలాగూ మరో ఆరేడు నెలల్లో అంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి వాటిని రాష్ట్రవ్యాప్తంగా విభజన గురించి ప్రజాభిప్రాయం కనుక్కోటానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు?

17 స్పందనలు to “తెలంగానం”


 1. 1 కె.మహేష్ కుమార్ 7:02 సా. వద్ద నవంబర్ 5, 2008

  ‘తెలంగాణా’ అన్నిపార్టీలకూ ఒక రాజకీయ అవసరమేతప్ప, నిబద్ధత వున్నట్లు ఎక్కడా అనిపించదు.సెంటిమెంటు పేరుచెప్పి, వీళ్ళు ఉద్యమాల్ని notional గా నడిపేస్తున్నారేతప్ప,ప్రజలస్థాయిలో తెలంగాణా ఉద్యమం విస్తృతంగా కనిపించడం లేదనేది ఎవరూ కాదనలేని నిజం.పైపెచ్చు ఈ రాజకీయ ప్రహసనాలతో ప్రజల్లో ఒకరకమైన నిరాసక్తత కనిపిస్తోంది.

 2. 2 మేధ 7:59 సా. వద్ద నవంబర్ 5, 2008

  >>రైళ్లూ, బస్సులూ కూడా నడిస్తే బాగుండు
  అలా జరిగితే ఎంత బావుండు!!!

  నాకు ఆ ప్రజాభిప్రాయం అనే వాదన ఎప్పుడూ అర్ధం కాదు.. ప్రజలని ఎవరు అడిగారు.. కేవలం నాయకులు మాట్లాడుకోవడం తప్ప, ప్రజలకి ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారా..? కానీ చంద్రబాబు కూడా అలా స్వరం మార్చేస్తారని ఊహించలేదు.. ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా!

  మీరన్నట్లు క్రొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏం చేస్తారు అన్న ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పారు.. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా కూడా, అభివృధ్ధి ఎవరికి కావాల్లెండి, నాయకులు బాగుపడితే చాలు కదా!

 3. 4 chilamakuru vijayamohan 10:54 సా. వద్ద నవంబర్ 5, 2008

  సమైక్యవాదాన్నాలపించిన చంద్రబాబును ప్రజలు ఎందుకు గెలిపించలేకపోయారు. ఆయనను గెలిపించిఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోవుకదా ! ఇప్పటి పరిస్థితులబట్టి ఆయన కూడా తెలంగాణానికి మద్ధతు పలకాల్సివచ్చింది.ఇప్పుడు ప్రజలు ఆయనను అవకాశవాది అనడం సమంజసంగా లేదు.

 4. 5 చంద్ర మోహన్ 11:31 సా. వద్ద నవంబర్ 5, 2008

  తెలంగాణా వస్తే రాజకీయ నాయకులకే కాదు, IAS, IPS వర్గాలకు కూడా లాభమే. మరో ముఖ్య కార్యదర్శి, డిజిపీ, బోలెడంతమంది కార్యదర్శులు, ఎన్నో ప్రమోషన్లు, హోం టౌన్ పోస్టింగులు, పైరవీలు… ఇదో కనిపించని మాఫియా లాంటిది. అందుకే వారందరి మద్దతు లోపాయికారీగా విభజనకే.

 5. 6 తాడేపల్లి 1:21 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డం చాలా కష్టంతో కూడుకున్న విషయం. దానికంటే అమెరికాకి ఒక తెలుగువాడు అధ్యక్షుడు కావడం సులభతరం. తెలంగాణ నాయకులకి ఈ విషయం బాగా తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తూంటారు. తెలియనిదల్లా అమాయక తెలంగాణ ప్రజలకే. అసలు ఈ నినాదం ఈ మధ్యకాలంలో మూలపడింది. కానీ నాలుగు నెలల్లో ఎన్నికలనేసరికి మళ్ళీ తన్నుకొచ్చింది. ఎన్నికలయ్యాక మళ్ళీ మూలపడుతుంది. తాటికాయలంత అక్షరాలతో వచ్చే పేపరు ప్రకటనలూ, పతాక శీర్షికలూ చూసి అదే మహోద్యమంగా భావించే మేధకుల్ని చూసి జాలిపడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేం.

  నాయుడుగారిది అవకాశవాదం కాదు, సందర్భోచిత వాదం. కానీ ఆయన పదిమందిలో పదకొండోవాడు మాత్రమే.

 6. 7 సుజాత 4:05 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  తెలంగాణా అవసరం లేదని, జనంలో సెంటిమెంట్ లేదనీ, పచ్చి తెలంగాణా వాదులకు కూడా తెలుసు!

  ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మీ అభిప్రాయమే నాదీ!

  చంద్రమోహన్ గారు చెప్పినట్టు మరో రాష్ట్రం ఏర్పడిందంటే మళ్ళి సచివాలయం నుంచి అన్నీ మొదలెత్తుకోవాలి కాబట్టి, ఉద్యోగాలు, పైరవీలు అన్నీ పెరిగిపోతాయి.

  తెలంగాణాకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడప్పుడే కాదు కదా, ఎప్పటికీ తేలేవి కాదు లెండి!

  అన్నట్టు, సెంటిమెంటుతో రైళ్ళు, బస్సులే కాక కార్లు, టూ వీలర్లు కూడా నడిచే ఏర్పాటు ఉండాలని కోరుకోవచ్చు కదండి!

 7. 8 బాబు 8:00 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  అసలు వీలందరూ ఇస్తానన్నా పైపు తో ప్రాణవాయువు పట్టుతున్న ములాయం కుదర్దంటున్నాడు.
  ఒక వేళ వాళ్లు ఒప్పుకున్నా మహిళా బిల్లు ఎట్టా పార్లిమెంట్ గడపల మీద అఘోరిస్తావుందో ఇదీ అంతే అవుతుంది.
  ఇంకోవేల జరగరానిది జరిగి బిల్లు పెడితే భాగ్యనగరం బాంబు ఉండనే ఉంది.
  తెలంగాణా వాదమంటే ఆదిలాబాదు నుండి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు భూముల ధరల పెంచి తగ్గించే స్ గాలి వాదం లాంటిది.

 8. 9 Prabhakar Mandaara 8:08 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  ప్రత్యేక తెలంగాణా మెజారిటీ తెలంగాణా ప్రజల ప్రగాఢ వాంఛ. అది నిజం కానట్టయితే టి.ఆర్‌.ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, సిపిఐ, తెలుగుదేశం, ప్రజారాజ్యం, నవతెలంగాణా తదితర పార్టీలన్నీ తెలంగాణా పాటపాడేవే కాదు. ఎవరో సెంటిమెంటు (!?) వుందని ప్రచారంచేస్తే అవన్నీ అమాయకంగా బుట్టలోపడ్డాయనుకోవడం మీ అజ్ఞానం, అవగాహనా రాహిత్యం.

  ప్రజల్లో ఆ భావన లేకపోతే తెలుగు దేశం ఎందుకు స్వరం మారుస్తుంది… ఎట్లా లబ్దిపొందగలుగుతుంది? ఉపఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు తాము తెలంగాణాకు అనుకూలమని ప్రచారం చేయడంవల్లనే విజయాలు సాధించాయి. అవి ఎక్కడా సమైక్యవాదమే మా విధానమని చెప్పలేదు. ఇప్పటికీ కాంగ్రెస్‌ ఎన్నికలనగానే తెలంగాణా పాటపాడుతూ, ఎన్నికలు లేనప్పుడు లోపాయికారీగా ఆ వాదాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ విధానాన్ని అనుసరించడం మీకు అద్భుతంగా అనిపిస్తుందేమో కానీ దానిని బట్టి కూడా తెలంగాణా వాదం ఎంత బలంగా వుందో కాస్త విచక్షణతో ఆలోచిస్తే మీకే బోధపడివుండేది.
  టిఆర్‌ఎస్‌ ఒక్కటే తెలంగాణా ప్రజలకు ప్రతినిధికాదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని, పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి పదేపదే ఎన్నికల బాటపట్టినందున, అప్రజాస్వామిక ఒంటెత్తు పోకడలు అనుసరించినందువల్లనే అది పరాభవం పాలైంది.

  తెలంగాణా వాదం ముందుకొచ్చినప్పుడల్లా ప్రత్యేక రాయలసీమ వాదన, హైదరాబాద్‌ను కేంద్రపాలిత రాష్ట్రం గా ప్రకటించాలన్న ప్రచారం, అనంతపురాన్ని కర్ణాటకలో కలపాలని, ఉర్దూ వాళ్లకి ఒక రాష్ట్ర కావాలి లేకపోతే వారికి రక్షణ వుండదు అన్న దగుల్భాజీ ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలు ముందుకు వస్తున్నాయి. ఈ చిలకపలుకులు, కాంగ్రెస్‌ ద్వంద్వ విధానం మీకు ప్రజాభిప్రాయంగా అనిపించడం, తెలంగాణా ప్రజల ప్రగాఢ వాంఛ మీకు కనిపించకపోవడం విచిత్రం. అమాయక తెలంగాణాను చాలూ ఆంధ్రాతో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలన్న కోరిక వేర్పాటు వాదం కాదు కానీ ప్రత్యేక తెలంగాణా కోరిక మాత్రం వేర్పాటు వాదమా?

  ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా తెలంగాణాను ఆంధ్రాతో విలీనం చేయడం, అప్పుడు కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధనలని తుంగలో తొక్కడం, ఉద్యోగాల్లో, సాగునీటి పంపిణీలో, విద్యావకాశాల్లో న్యాయమైన వాటా ఇవ్వకపోవడం, ఇన్నేళ్లయినా మేం ఆంధ్ర, వాళ్లు తెలంగాణా అన్న భావన పోకపోవడం, మనమంతా తెలుగువాళ్లం అన్న సమైక్యభావన ఏర్పడకపోవడం, తెలంగాణా సంస్కృతిని, భాషనీ, యాసని చులకనగా చూడటం ఇవేవీ మీకు కనిపించకపోవడం విచిత్రం. ఇంకా ఎందుకండీ శుష్క సమైక్యత. తెలంగాణా భారతదేశంలోంచి విడిపోవాలని కోరుకోవడం లేదుకదా. తెలుగు వాళ్లకి రెండు కాదంటే మూడు రాష్ట్రాలు వున్నంత మాత్రాన ఎవరికి నష్టం? అన్నదమ్ముల్లా విడిపోయే అవకాశాలను దెబ్బతీసి ఇంకా ప్రజల నిస్సహాయతతో ఎన్నాళ్లు ఈ చెలగాటం?

 9. 10 రమణ 10:15 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  ప్రభాకర్, పేపరు చదవడం ద్వారానే వార్తలు తెలిసే నాకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కె.సి.ఆర్, గౌడ్ లాంటి వాళ్ళకాన్నా నాయకులు వున్నట్టు కనిపించడం లేదు. వీళ్ళకి ఏమాత్రం ఇంటిగ్రిటీ లేకపోయినా, ఆ వాదానికి వీళ్ళ కన్నా రిప్రజెంటేషన్ కనబడకే, మీరు చెప్తున్న ‘అన్నదమ్ముల్లా విడిపోయే’ అవకాశాలు దెబ్బతింటున్నాయి. కె.సి.ఆర్ మాటలు చదువుతుంటో చాలాసార్లు నాకు బాల్ థాకరేనే గుర్తుకోస్తున్నాడు. ఈ పొత్తలన్ని ఇక్వేషన్స్ కోసమేకాదా, మీరు చెప్ప్తన్నంత బలం తెలంగాణా వాదానికి తెలంగాణాలో వున్నట్టయితే యింతకన్నా గొప్పనాయకత్వం ఎందుకు కనబడటం లేదు అన్నది నా ప్రశ్న.

 10. 11 bujji 11:21 ఉద. వద్ద నవంబర్ 6, 2008

  ”అసలు రాష్ట్రాన్ని చీల్చాలో వద్దో కొందరు తెలంగాణ అతివాదుల కోరిక మీద ఆధారపడి ఎలా నిర్ణయిస్తారు?”
  ఏ కొందరు అతివాదులో,తెలంగాణాని వద్దంటున్న మితవాదులెవరో , ఏఏ శాస్త్రీయ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ”అతివాదులే కోరుకుంటున్నారు సాధారణ ప్రజలు కాదు ” అని మీరు ఈ నిర్ణయానికొచ్చారో కూడా చెప్పండి.

 11. 12 అబ్రకదబ్ర 6:50 సా. వద్ద నవంబర్ 6, 2008

  @మహేష్:

  నిబద్ధత నిజంగానే ఎవరికీ లేదు. ఈ గోల వీలైనన్నేళ్లు సాగదీస్తారు, ఆ తర్వాత అదే చల్లారిపోతుంది.

  @మేధ,విజయమోహన్,తాడేపల్లి:

  చంద్రబాబుకి తప్పని పరిస్థితి కల్పించారు, నిజమే. కానీ సమైక్యవాదానికి కట్టుబడి ఎంతో నష్టపోయినవాడు తెలంగాణ వాదం చల్లబడుతున్న సూచనలు కనిపిస్తుండగా ఇప్పుడు గొంతు మార్చటమే నాకర్ధం కాని విషయం. ఆయన చాణక్యమేమిటో మరి!

  @సుజాత:

  కార్లు, స్కూటర్లు, విమానాలు కూడా 🙂 అప్పుడు అణు విద్యుత్ ఊసే ఉండదు; మన్మోహనుడికీ ఎర్ర చొక్కాలతో ఓ గొడవ తీరుద్ది.

  @బాబు,శివరాజేష్,చంద్రమోహన్,రమణ:

  ధన్యవాదాలు.

 12. 13 అబ్రకదబ్ర 7:15 సా. వద్ద నవంబర్ 6, 2008

  @ప్రభాకర్:

  >> “అమాయక తెలంగాణాను చాలూ ఆంధ్రాతో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు”

  అమాయకులు తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రాలోనూ ఉన్నారు. అలాగే అతితెలివిగలవారు, లౌక్యులు రెండు చోట్లా ఉన్నారు. ముందు మీవంటివారు ఆంధ్రావాళ్లంతా దోపిడీదారులనే భావాన్ని వదిలించుకోవాలి. నేనెక్కడా నా టపాలో తెలంగాణా ప్రజలని అవమానిస్తూనో, చులకన చేస్తూనో రాయలేదే. అంత ఆవేశం ఎందుకు?

  >> “తెలుగు వాళ్లకి రెండు కాదంటే మూడు రాష్ట్రాలు వున్నంత మాత్రాన ఎవరికి నష్టం?”

  తెలుగు మాట్లాడే వారు రెండు రాష్ట్రాలుగా ఉన్నా, ఇరవై నాలుగు రాష్ట్రాలుగా ఉన్నా నాకు పోయేదేమీ లేదు. మీకు వచ్చేదేమన్నా ఉందా అన్నదే ప్రశ్న.

  >> “అన్నదమ్ముల్లా విడిపోయే అవకాశాలను దెబ్బతీసి ఇంకా ప్రజల నిస్సహాయతతో ఎన్నాళ్లు ఈ చెలగాటం?”

  ఎవరు చెలగాటాలాడుతున్నారండీ? రాజధాని కాబట్టి ఉద్యోగాల కోసం ఆంధ్రా నుండి హైదరాబాదొస్తే దోపిడీదార్లు అంటూ చులకన చేస్తుంది ఎవరు? అదేమంటే పెద్ద మనుషుల ఒప్పందాలు, ముల్కీ ఒప్పందాలు అంటూ జమానా కాలం నాటి తంతులేవేవో గుర్తు చేస్తారు. రజాకార్లతో పోరాటానికి విజయవాడ నుండీ, ఆంధ్రా ప్రాంతం నుండీ కమ్యూనిస్టు యోధులు తెలంగాణకొచ్చి ప్రాణాలర్పించిన నాడే అభ్యంతర పెట్టకపోయారా? ‘నిజాం సాగర్ కాలవల కింద వ్యవసాయం చెయ్యటానికి ఆ పద్ధతులు తెలిసిన రైతులు ఇక్కడికొచ్చి మా వాళ్లకి సహాయం చెయ్యండహో’ అంటూ నిజాం డప్పులతో ఆంధ్రా ఊర్లలో దరువులేసి మరీ చాటింపేయించిన నాడే వద్దనకపోయారా? తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలకి ఎగిరెళ్లటం న్యాయమే కానీ తెలంగాణేతరులు తెలంగాణలో స్థిరపడటం దోపిడీయా?

 13. 14 Prabhakar Mandaara 3:37 ఉద. వద్ద నవంబర్ 7, 2008

  రమణ గారూ
  తెలంగాణాలో ఇప్పటికీ ఇంకా సరైన నాయకులు ఉద్భవించకపోవడం మా దౌర్భాగ్యం. గుడ్డిలో మెల్ల మేలని వున్న వాళ్లలోనే కాస్త మెరుగైన వాళ్ల తోకలు పట్టుకుని నడవాల్సి వస్తోంది ఇక్కడి జనానికి. మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్‌ లాంటి వాళ్లు ఏదో ఉద్ధరిస్తారనుకుంటే మొత్తం ఉద్యమాన్నే గంగలో కలిపారు వాళ్లు.

  తెలుగుదేశం హయాంలో తెలంగాణాకు ప్రత్యేక పిసిసి కావాలంటూ నానా హడావిడి చేసిన తెలంగాణా కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఇప్పుడు ఎట్లా గుంభనంగా కాలం వెళ్లదీస్తున్నారో అందరికీ తెలిసిందే. అట్లాగే టిఆర్‌ఎస్‌ టికెట్‌తో గెలిచి వేరుకుంపటి పెట్టుకున్న పదిమంది ఎంఎల్‌ఎలు తెలంగాణా ఉద్యమానికి ఏంత స్ఫూర్తినిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. రేపు కెసిఆర్‌ కూడా మరో మర్రి చెన్నారెడ్డిగా మారినా లేక తన వ్యక్తిగత ఆహంకారంతో తెలంగాణా ఉద్యమానికి తూట్లు పొడిచినా దిక్కులేదు. కొన్ని సందర్భాలలో ఆయన అనుసరించే ఒంటెత్తుపోకడలు మాకూ ఆందోళన కలిగిస్తున్నాయి.

  300 సంవత్సరాలు నిజాం పాలనలో, దొరల, జాగిర్దార్ల ఉక్కు పాదాల కింద … నీ బాంచెన్‌ కాల్మొక్త దొరా … అంటూ జీవచ్ఛవంలా బతికింది తెలంగాణా. ఆ తరువాత జీవన్మరణ పోరాటం చేసి 1948లో రజాకార్ల, దొరల పీడ వదిలించుకుని స్వేచ్ఛను సంపాదించుకుంటే … కొద్ది రోజుల్లోనే ఎవరో తీసుకున్న నిర్ణయానికి మళ్లీ ఇక్కడి ప్రజానీకం తమ స్వేచ్ఛని, స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

  ఇవాళ తెలంగాణా స్వేచ్ఛకోసం పరితపిస్తోంది. 1969నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి తెలంగాణా నాయకత్వమే ద్రోహం చేసింది. ఆంధ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం 400 మంది తెలంగాణా యువకుల ప్రాణాలు బలితీసుకుని ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో నలిపివేసింది. మళ్లీ ఇన్నాళ్లకి మరో రూపంలో సాగుతున్న ఈ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కూడా కుట్రలు కుతంత్రాలతో విచ్ఛిన్నం చేసినా తెలంగాణా ప్రజల్లోని స్వేచ్ఛా పిపాస, ఆత్మగౌరవ కాంక్ష మాత్రం ఎప్పటికీ చల్లారవు. మళ్లీ మళ్లీ అది ఏదో ఒక రూపంలో తలెత్తుతూనే వుంటుంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారంకోసం పార్టీలకతీతంగా ఉభయ ప్రాంతాల ప్రజలు ఉద్యుక్తులైతే అందరికీ మేలు జరుగుతుంది. విద్వేషాలు, అపోహలు, అనుమానాలు, అవమానలు అంతరించి పోతాయి. తెలుగుజాతి తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ దేశంలోనే సమున్నత శిఖరాలను అధిరోహించగలుగుతుంది.

  అబ్రకదబ్ర గారూ,
  అంధ్ర తెలంగాణా విలీనమైనప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని విషయాన్ని ముందు గుర్తించండి. ఆ విలీనం ఏ ప్రాతిపదికన జరగిందో, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారో తెలుసుకోండి. వాటిని ఎందుకు ఎలా తుంగలో తొక్కారో గ్రహించండి. అప్పుడే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూలమేమిటో బోధపడుతుంది. సమస్యను పైపైన తడమటం, వక్రీకరించడం, వెటకారాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు.

  1969 లో మాదిరిగా ఇవాళ ఆంధ్రా గోబ్యాక్‌ అని ఎవరూ అనడం లేదు. ఆంధ్రా వాళ్లంతా దోపిడీ దార్లని కూడా ఎవరూ భావించడం లేదు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో ఎందరో తెలంగాణా యోధులు విజయవాడ తదితర ప్రాంతాలలో తలదాచుకున్నారు. అట్లాగే ఎందరో ఆంధ్ర కమ్యూనిస్టు నేతలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. దానినెవ్వరూ కాదనడం లేదు. ఆంధ్ర తెలంగాణా సామాన్య ప్రజానీకం మధ్య లేని శత్రుత్వాన్ని సృష్టించకండి. సమస్యను అనవసరంగా కలగా పులగం చేయకండి. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మద్రాస్‌లోని తెలుగువాళ్లందరినీ వెళ్లిపొమ్మని తమిళులులేమీ నిర్బందపెట్టలేదు కదా. ఇప్పటికీ మద్రాస్‌లో లక్షల సంఖ్యలో ఆంధ్రవాళ్లు అట్లాగే వున్నారు కదా. అదేవిధంగా రేపు తెలంగాణా ఏర్పడ్డ తరువాత కూడా హైదరాబాద్‌ తదితర ప్రాంతాలలో వున్న ఆంధ్రులు యధేచ్ఛగా ఇక్కడే వుంటారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అవుతుందే తప్ప ప్రత్యేక దేశం కాదు కదా.

  >>>….. తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలకి ఎగిరెళ్లటం న్యాయమే కానీ తెలంగాణేతరులు తెలంగాణలో స్థిరపడటం దోపిడీయా? …….

  ఎవరూ అనని మాటలని అన్నట్టు ఎందుకు కల్పిస్తారు. దోపిడీ దార్లకూ పొట్టచేతపట్టుకు వచ్చేవారికీ మధ్య వున్న తేడాని ఎందుకు చెరిపెయ్యాలని చూస్తారు.
  నిజమే, తెలంగాణా జనం పొట్ట చేతపట్టుకుని నాగపూర్‌, షోలాపూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, భిమాండి, ముంబయి, దుబాయి, అమెరికాల తదితర ప్రాంతాలకు, దేశాలకు వెళ్తున్నారు. కానీ సొంత రాష్ట్రంలో భాగమైన ఆంధ్రాకు వచ్చి మాత్రం స్థిరపడలేకపోతున్నారు. అందుకు కారణమేమిటో చెప్పండి.
  హైదరాబాద్‌ను వదిలేయండి మిగతా తెలంగాణా జిల్లాల్లో ఎన్ని లక్షలమంది ఆంధ్రావాళ్లు వున్నారో, ఎన్ని స్థానిక ఉద్యోగాలను చేజిక్కించుకున్నారో … మొత్తం ఆంధ్రాలో ఎంత మంది తెలంగాణా వాళ్లున్నారో లెక్క తీయండి పరిస్థితి మీకే బోధపడుతుంది. తెలంగాణా ఎప్పటికీ ఇట్లా దగాపడుతూనే నీ బాంచన్‌ కాల్మొక్త దొరా అంటూ పడివుండాల్సిందేనా? తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రాన్ని తమకు ఇవ్వాలని కోరుకోవడం అంత పాపమా?

 14. 15 యన్.సీతారాంరెడ్డి 3:37 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  భాయిసాబ్
  మద్రాసు రాష్ర్టం నుండి విడిపోయి ఆంధ్రరాష్త్రం ఎందుకు ఏర్పడవలసిందో ఒక్క సారి ఆలోచించండి. భాషాపరంగానో, సంస్కృతిపరంగానో ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉన్నవాళ్ళు విడిగా ప్రత్యేకంగా, తమదైన ఉనికితో ఉండాలనుకొంటారు. దేశాల స్వాతంత్ర్య పోరాటాలనుండి నేడు గ్లోబలైజేషన్ వ్యతిరేక స్పృహ దాకా బుద్దిజీవులు కొట్లాడేది అదే. అమెరికా నేడు అవకాశం వస్తే ప్రపంచాన్నంతా పాలించాలనుకొంటుంది.

  స్థానికీకరణ అనేది మాత్రమే సస్టెయినబుల్ మోడల్ అవుతుంది. పెద్దపెద్ద దేశాలు, పెద్దపెద్ద సంస్థల్లో ప్రజలకు స్థానం లేకుండా పోతుంది. మిమ్మల్ని మీరు పాలించుకోగలుగుతారో లేదోనని కూడా ఆరోజుల్లో బ్రిటీష్ వాళ్ళు మనల్ని అన్నారు. అగిందా.

  స్థానిక స్వపరిపాలన అనే నినాదం లోతుగా పరిశీలిస్తే ఇదేఅర్ధం అవుతుంది. అయితే ఆ సూక్ష్మ వ్యవస్థలు వయబుల్ సైజులో ఉండాలి. తెలంగాణా కనీసానికి ఆ సైజుకన్న పెద్దగానే ఉంటుంది.

 15. 16 krishna Prasad 7:20 ఉద. వద్ద డిసెంబర్ 19, 2008

  మీరు చెప్పింది వంద శాతం నిజమండి.”తెలంగాణా” అంశాణ్ని ఏ పార్టీ వారు పడితే ఆ పార్టీ వారు వాళ్ళ సొంత లబ్ధి కొసం వాడుకోవడం మత్రమే తప్ప, ప్రజలకోసం అలోచించి నిర్ణయాలు తీసుకొనే రాజకీయ నాయకులు ఈ రొజుల్లో మనకి దొరికటం చాల కష్టం.అలా దొరకటం అంటే “Jesus” మల్ల పుట్టినట్లె

 16. 17 JSMKUMAR 4:26 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  నూతన పార్టీలు వలన ఈ సమాజ0 లో ఎ0తొ కొ0త మార్పు వస్తు0ది.
  పాత పార్టీల వలన మార్పు రాదు కదా!
  కమ్యునిస్టులు ఆ0ద్ర ప్రదెశ్ లొ అవకాశవాదులుగా మారారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: