‘తెలుగుకి దక్కిన ప్రాచీన హోదా’ – మూడు రోజుల క్రితం రాష్ట్రంలో దినపత్రికలన్నింటిలోనూ ఇదే మొదటి వార్త. తెలుగుతో పాటు కన్నడాన్ని కూడా ప్రాచీన భాషగా గుర్తిస్తూ, ‘నవంబరు ఒకటిన ఈ రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కానుక ఇది’ అంటూ కేంద్ర మంత్రి అంబికా సోనీ వెల్లడించారు (‘ప్రాచీన భాష’ కన్నా ‘విశిష్ట భాష’ అనేది సరైన మాటని కొందరి అభిప్రాయం). దీనితో దక్షిణాదిన ఉన్న నాలుగు ప్రధాన భాషల్లో మూడింటికి ఆ హోదా దక్కింది. మరి మలయాళమొక్కటీ ఏ పాపం చేసిందో తెలియదు!
ఈ వార్త విన్న వెంటనే చాలామంది తెలుగు భాషా ప్రేమికుల్లో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. పక్కవాడికి ఉన్నది నాదగ్గరా ఉందన్న వెర్రి ఆనందం తప్ప దానివల్ల మనకు నిజంగా ఏమి లాభం? ఎవరూ గమనించనిది – అదే వార్తలో ‘మద్రాసు హైకోర్టులో పెండింగులో ఉన్న ఒకానొక రిట్ పిటిషన్ పై రాబోయే తీర్పుకి లోబడే ఈ నిర్ణయం అమలు’ అన్న సదరు మంత్రి గారి సన్నాయి నొక్కులు. ఆ తీర్పు ఎప్పుడొస్తుందో, ఎలా ఉండనుందో అనూహ్యం. ప్రస్తుతానికైతే కేంద్రం మనకిచ్చింది ఖాళీ కుండే. దానికే ఇంత సంతోషమా!?!
ఇంత హడావిడిగా ప్రాచీన హోదాపై ప్రకటన చెయ్యటం వెనుక రాష్ట్రంలో కొద్ది నెలల్లో రానున్న ఎన్నికల ప్రభావం లేదంటే నమ్మటం కష్టం. మన పుణ్యభూమిలో ప్రతిదీ రాజకీయమే. కాదేదీ ఓటుకనర్హం. ఇప్పుడు కేంద్రం నెత్తినెక్కించుకుంటే తెలుగుకి అర్జెంటుగా ఒరిగిపోయేదేమిటో అంతుపట్టని విషయం. ఆ మాటకొస్తే తమిళానికీ, సంస్కృతానికీ ఆ హోదా వచ్చాక జరిగిన ప్రత్యేక మేలేదన్నా ఉందా? ప్రభుత్వం చెయ్యవలసింది తెలుగునాట కొడిగడుతున్న మాతృభాషా మమకారాన్ని పెంపొందించటం, ఆంధ్రుల ఇష్టభాషగా తెలుగుని వెలిగించటమే కానీ, విశిష్ట భాషో మరోటో అంటూ జోలపాడటం కాదు.
అసలు – ఏ భాష గొప్పదనం దానిది. దేశంలో ఉన్న అనేకానేక భాషల్లో నాలుగయిదింటిని మాత్రమే విశిష్టమైనవిగా గుర్తించటమంటే మిగతావాటిని అవమానించటమే. నిజానికి కేంద్రం ఇప్పుడు చేయాల్సింది తమిళం, సంస్కృతాలకి కూడా ప్రాచీన/విశిష్ట హోదా రద్దు చేయటం, ప్రభుత్వం దృష్టిలో అన్ని భాషలూ సమానమే అని నిర్ద్వందంగా ప్రకటించటం. మన దేశంలో జన రాజకీయాలెప్పుడో కనుమరుగైపోయాయి. ఇప్పుడున్నవన్నీ విభజన రాజకీయాలే. ఇప్పటికే దేశమంతా కుల, మత, ప్రాంతాలవారీ కుంపట్లు. వాటికి భాషనీ జత చేయనవసరం లేదు. రాజ్ థాకరే లాంటి ఉన్మాదులకి మరో మంత్రదండాన్ని చేతికందించే తెలివిమాలిన పనే ఇది.
(ఈ ఏడాది మే నెలలో ఇదే అంశమ్మీద నేను రాసిన మరో టపా – ఇక్కడ)
>>పక్కవాడికి ఉన్నది నాదగ్గరా ఉందన్న వెర్రి ఆనందం తప్ప దానివల్ల మనకు నిజంగా ఏమి లాభం?
100% agreed.
ప్రాచీనభాష హోదా ఇవ్వడంతో, భాషాభివృద్ధి/వ్యాప్తి పేరుతో కొంత డబ్బులు రాష్ట్ర ఖజానాకు చెరతాయి. అంతకు మించి ఒనగూరే లాభం నాకైతే అర్థం కావడం లేదు.
ఇదొక divisive politics లో భాగం అనేది అందరికీ తెలిసిన సత్యమే అయినా, మనకు సత్యంకన్నా అబద్ధం ఇచ్చే కిక్కెక్కువకాబట్టి, ఇదొక celebration అవుతోంది. ఆనందించేవాళ్ళు తెలుగుభాషకు ఇది “అరుదైన గౌరవం” అనుకుంటూ ఆనందిస్తున్నారు. ఆనందించడంలో తప్పులేదు. కానీ, ఇదే స్ఫూర్తి భాషాభివృద్ది మీదకూడా చూపించగలిగితే మంచిదేకదా!
ఇది పాలిటిక్స్ అని చిన్నపిల్లాడికి కూడా తెలుసు.అబ్రకదబ్ర గారన్నట్టు తమిళ, సంస్కృత భాషలకూ ఆ “హోదా” ను రద్దు చేయడం ఉత్తమం.
అయితే, అలా కుదరని పక్షంలో నిజంగా భాషాభివృద్ధిని కాంక్షించే వాళ్ళకు ఇదో impetus.
ఇంకో విషయం. మొన్న ఈ టీవీ2 లో తెలుగు ప్రచార సమితి అధ్యక్షులు ఓ మాట చెప్పారు. తెలుగు హోదా ను ఆంధ్ర ప్రభుత్వమే గుర్తించలేదు. అందుకనే 6 వ తరగతి నుండీ ఆంగ్ల మాధ్యమం తప్పని సరి చేయబూనింది.ఇది ఏ రాష్ట్రం లోనూ జరుగలేదు.”
మీరు వ్రాసింది 100% నిజం. తమిళానికి ఈ హోదా వచ్చి దాదాపు ఐదేళ్ళవుతున్నా దాని వలన కలిగిన ప్రత్యేక లాభం ఎదీ ఇంతవరకూ లేదు. నిజానికి ఇప్పుడు తెలుగుకు కావలసింది ప్రాచీన భాష అనే గుర్తింపు కాదు. ఇది నవీన భాష అనే గుర్తింపు. అది ప్రభుత్వం ఇస్తే వచ్చేది కాదు.
తెలుగుకి కావల్సినది ప్రాచీన హోదా గుర్తింపు కాదు; ఆధునిక భాషగా పెరుగుదల. ఆధునిక అవసరాలకి అనుగుణంగా పెరుగుదల. అంటే వైజ్ఞానిక, సాంకేతిక, వ్యాపార రంగాలలో వాడుకకి అనువుగా పెరుగుదల. ఏ భాష అయినా వాడుతూన్న కొద్దీ వాడిగా తయారవుతుంది; వాడుక లేక పోతే వాడి పోతుంది. కనుక ఆధునిక దృక్పథంలో భాష వాడుక పెరగాలంటే దైనందిన జీవితంలో ముందు వాడుక పెరగాలి. ప్రాచీన హోదాతో మంజూరయే నూరు కోట్ల రూపాయనీ తెలుగుని ఆధునిక భాషగా మలచటానికీ, తెలుగు బోధనా పద్ధతులలో నూతన పద్ధతులని ప్రవేశపెట్టటానికీ, ఆంధ్రేతరులకి తెలుగుని రెండవ భాషగా నేర్పటానికి పనిముట్లని తయారుచెయ్యటానికీ, “ఆన్-లైన్” పాఠాలు తయారుచేసి విరివిగా ప్రచారంలోకి తీసుకురావటానికి ఉపయోగించాలని నా మనవి.