అక్టోబర్, 2008ను భద్రపఱచుముంగిట్లో శత్రువు

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944’ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941’ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941’ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్ ఎర్ర సైన్యాన్ని కదనరంగంలోకి ఉరికించాల్సిన అవసరం కల్పించిన రోజది. జెర్మనీకి వ్యతిరేకంగా సోవియెట్ యూనియన్ రంగంలోకి దిగకపోయుంటే రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు మరోలా ఉండేవనే విషయంలో చరిత్రకారులెవరికీ రెండో అభిప్రాయం లేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్-సోవియెట్ సైన్యాల మధ్య చెదురు మదురు సంఘటనలు, చిన్నా పెద్దా సైనిక చర్యలు, పోరాటాలు అనేక చోట్ల జరిగినా, వాటన్నిటిలోకీ తలమానికమైనది జెర్మన్ల చేత కీలక సోవియెట్ పారిశ్రామిక నగరం స్టాలిన్‌గ్రాడ్ ముట్టడి. ఓల్గా నది ఒడ్డునున్న ఈ నగరంపై పట్టు ఇరువర్గాలకూ వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. జెర్మన్ల బారినుండి స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోటానికి నగరవాసులు, రెడ్ఆర్మీ కలసికట్టుగా జరిపిన పోరాటం నభూతో.

జెర్మనీ-సోవియెట్ దళాల మధ్య జులై 1942 నుండి ఫిబ్రవరి 1943 వరకూ స్టాలిన్‌గ్రాడ్ వద్ద జరిగిన పోరాటం రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మిత్రరాజ్యాలకు అనుకూలంగా తిప్పింది. స్టాలిన్‌గ్రాడ్‌పై పట్టు కోసం ఇరు దేశాల మధ్య ఏడు నెలలపాటు జరిగిన హోరాహోరీ పోరులో అసువులుబాసిన వారి సంఖ్య అక్షరాలా పదిహేను లక్షల పైమాట! ప్రపంచ చరిత్రలో ఇంతకన్నా రక్తపాతం జరిగిన పోరాటం మరోటి లేదు. జెర్మనీ ఈ నగరాన్ని వశపరచుకోవటం అంటే సోవియెట్ సైన్యానికి ప్రాణాధారమైన ఇంధన నిల్వలున్న కాకస్ ప్రాంతం మీద పట్టు సాధించటమే. స్టాలిన్ పేరుతో ఉన్న ఈ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటం హిట్లర్‌కు ప్రతిష్టాత్మకం కూడా. ఇవే కారణాలవల్ల స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోవటం సోవియెట్లకు మరింత ముఖ్యం.

స్టాలిన్‌గ్రాడ్‌పై ఏడు నెలలపాటు ఏకబిగిన జరిపిన ముట్టడి విఫలమవటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్ల తిరోగమనం మొదలయింది. స్టాలిన్‌గ్రాడ్ విజయానంతరం రెడ్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో జెర్మనీలోకి చొచ్చుకుపోయి అంతిమంగా బెర్లిన్‌ని ఆక్రమించుకోవటం, హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటంతో ఒక మహా మారణహోమానికి తెరపడింది. ఆ విధంగా, స్టాలిన్‌గ్రాడ్ పోరాట ఫలితం ప్రపంచ భవిష్యత్తునే మార్చేసిందనటం అతిశయోక్తి కాదు. అయితే ఈ పోరాటంలో మొదట సోవియెట్లు భీకరమైన ఎదురుదెబ్బలు తిన్నారు. ఒకానొక దశలో నగరం అంతా జెర్మన్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ఎందరు సైనికులని కోల్పోయినా సరే, నగరాన్ని తిరిగి స్వాధీన పరచుకోవాలన్న స్టాలిన్ హుకుం కారణంగా రెడ్ ఆర్మీ మొండిగా పోరాటం కొనసాగించింది. ఇరు దళాల విచక్షణారహిత బాంబుదాడుల్లో స్టాలిన్‌గ్రాడ్ పూర్తిగా శిధిలం అయింది. ఫ్యాక్టరీలన్నీ నేలమట్టమైపోయాయి. జెర్మన్ల ప్రత్యక్ష దాడులు తట్టుకోలేని రెడ్ ఆర్మీ ఓ దశలో గెరిల్లా తరహా యుద్ధ తంత్రాలు అమలు చేసింది. ఆ తరుణంలో, వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో అడుగంటిన సోవియెట్ ఆత్మవిశ్వాసం తిరిగి ఆకాశాన్ని తాకేలా చేసిన పేరు ‘వస్సిలి జైత్సెవ్’.

వస్సిలి జైత్సెవ్ – పశ్చిమ రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతాలనుండి వచ్చి రెడ్ ఆర్మీలో చేరిన ఒక నిరక్షరాస్యుడు, గొర్రెలకాపరుల కుటుంబానికి చెందినవాడు. రెడ్ ఆర్మీలో అతి తక్కువ స్థాయిలో పనిచేసే ఈ సైనికుడి గురించి ఎవరికీ తెలియకపోయేదే – స్నైపర్‌గా అతని అద్భుత ప్రతిభని ఒకానొక సైన్యాధికారి స్వయంగా గమనించకపోయుంటే. కేవలం ఐదు గుండ్లు మిగిలున్న రైఫిల్‌తో ఐదుగురు జెర్మన్ సైన్యాధికారుల్ని మాటువేసి క్షణాల్లో మట్టుబెట్టిన అతని గురికి అబ్బురపోయిన ఆ సోవియెట్ అధికారి ఇతని గురించి సైనిక అధికారిక పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలతో జైత్సెవ్ రాత్రికి రాత్రే సోవియెట్ యూనియన్‌లో హీరో అయిపోయాడు. అప్పటినుండీ స్టాలిన్‌గ్రాడ్‌లో తిష్టవేసి ఉన్న జెర్మన్ అధికారులను మట్టుపెట్టే బాధ్యత ఇతని చేతిలో పెట్టబడింది. 1942 నవంబర్ 10 నుండి డిసెంబర్ 17 మధ్యకాలంలో ఇతను 225మంది జెర్మన్ సైనికులను మాటువేసి అంతుచూశాడు. జైత్సెవ్ వద్ద శిక్షణ పొందిన సోవియెట్ స్నైపర్లు సుమారు మూడువేల మంది ప్రత్యర్ధులను మట్టుబెట్టినట్లు అంచనా. యుద్ధానంతరం జైత్సెవ్‌కి సోవియెట్ సైన్యంలోని అత్యున్నత మెడల్ ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ లభించింది. అతని రైఫిల్ ఇప్పటికీ స్టాలిన్‌గ్రాడ్ (ఇప్పుడు వోల్వోగ్రాడ్) మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

(ఈ కధాంశంతో వచ్చిన సినిమా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ వివరాలు నవతరంగంలో)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,244

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.