మిస్టర్ ప్రెసిడెంట్

నవంబరు నాలుగున జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొన్నదనటంలో అతిశయోక్తి లేదు. ప్రపంచీకరణ దరిమిలా, అగ్ర రాజ్యంలో సంభవించే కీలక పరిణామాలు ఇతర దేశాల మీద ఏదోరకమైన ప్రభావం చూపుతాయనేది ఇటీవల తరచూ ఋజువైన విషయమే. అందుకే, అమెరికాని అభిమానించేవాళ్లూ, ద్వేషించే వాళ్లూ కూడా అధ్యక్ష ఎన్నికల మీద అమితాసక్తి కనపరచటం. ఈ నేపధ్యంలో – అమెరికా అధ్యక్షులకి సంబంధించిన కొన్ని చిన్నా పెద్దా విశేషాల సమాహారం ఈ టపా.

అమెరికాలో అధ్యక్ష పదవి ఎప్పుడూ రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్యనే దోబూచులాడుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియనిది ఈ రెండూ ఒకప్పుడు ఒకటే పార్టీ అన్న సంగతి. మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ 1800లో స్థాపించిన డెమొక్రటిక్-రిపబ్లికన్ పార్టీ 1830లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలుగా చీలిపోయింది. చీలిక వెంటనే రిపబ్లికన్ పార్టీ అంతరించి పోగా, డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ రాజకీయాల్లో కొన్నేళ్లపాటు ఏకఛత్రాదిపత్యం వహించింది. తర్వాత కొంతకాలం (1840 – 1855) విగ్ పార్టీ డెమొక్రట్ల అధిపత్యాన్ని సవాలు చేసి క్రమేణా కనుమరుగైపోయింది. 1854 లో తిరిగి అవతరించిన రిపబ్లికన్ పార్టీ అప్పటినుండీ డెమొక్రాట్లకు దీటుగా రాజకీయాల్లో కొనసాగుతుంది. డెమొక్రటిక్-రిపబ్లికన్ పార్టీకి ముందు ఓ దశాబ్దం పాటు ఫెడరలిస్ట్ పార్టీ అధికారంలో ఉండి కాలక్రమంలో మాయమైపోయింది. ప్రస్తుతం డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండు ప్రధాన పక్షాలు కాగా, గ్రీన్ పార్టీ, కాన్‌స్టిట్యూషన్ పార్టీ, లిబరలిస్ట్ పార్టీ వంటి చిన్న చిన్న పక్షాలు కూడా కొన్ని ఉన్నాయి.

అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఏ పార్టీకీ చెందని వ్యక్తి. అప్పటికి దేశంలో పార్టీ వ్యవస్థ ఏర్పడకపోవటం దీనికి కారణం. అప్పుడే ముగిసిన స్వాతంత్ర సంగ్రామంలో అమెరికన్ సేనలకు సమర్ధవంతమైన నాయకత్వం అందించిన కారణాన జార్జ్ వాషింగ్టన్ ని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షుడు రెండు దఫాలుగా మొత్తం ఎనిమిదేళ్లు మాత్రమే పదవిలో ఉండాలనే ఆలోచన ఆయనదే. ఆయన కాలం నుండీ రాజ్యాంగంలో లేకున్నా ఓ సత్సంప్రదాయంగా వస్తున్న ఆ నియమాన్ని మొదటగా (మరియు చివరగా) ఉల్లంఘించినవాడు ముప్పై రెండవ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్. రెండవ ప్రపంచ యుద్ధాన్ని సాకుగా చూపి మొత్తం నాలుగు దఫాలు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రూజ్‌వెల్ట్ తరువాత ఈ రెండు దఫాల నియమాన్ని రాజ్యాంగబద్ధం చేయటం జరిగింది.

అత్యధిక కాలం పదవిలో ఉన్న అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ కాగా, అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తి తొమ్మిదవ అధ్యక్షుడు విలియమ్ హెన్రీ హ్యారిసన్. ఈయన కేవలం ముప్పై రెండు రోజులు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జబ్బు పడిన ఈయన మరి కోలుకోలేదు. ఆయన జబ్బు పడటానికి కారణం – అతి శీతల వాతావరణంలో ఆరుబయట ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనటం. పదవిలో ఉండగానే మరణించిన మొదటి అధ్యక్షుడు కూడా ఈయనే.

అమెరికన్ అధ్యక్షుల్లో మరొక రూజ్‌వెల్ట్ కూడా ఉన్నాడు. ఆయనే, ఇరవై ఆరో అధ్యక్షుడు థియొడర్ రూజ్‌వెల్ట్ (1901 – 1909). ఈయనకి ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ చాలా దూరపు బంధువు. గొప్ప అధ్యక్షుల్లో ఒకడిగా పేరొందిన థియొడర్ రూజ్‌వెల్ట్ ని టెడ్డీ రూజ్‌వెల్ట్ అని పిలిచేవారు. వేటాడటం అంటే అమితాసక్తిగల ఈయన ఒకసారి వేటకు వెళ్లినప్పుడు వెళ్లినప్పుడు తనకు చిక్కిన ఎలుగుబంటిని చంపకుండా దయతో వదిలిపెట్టాడట. అప్పటినుండీ ముద్దొచ్చే ఎలుగుబంటి బొమ్మలకు ‘టెడ్డీ బేర్’ అనే పేరు స్థిరపడిపోయింది.

అమెరికా అధ్యక్షుల్లో నలుగురు పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు – అబ్రహాం లింకన్, జేమ్స్ గార్‌ఫీల్డ్, విలియం మెకిన్లీ, జాన్ కెనడీ. మెకిన్లీ తప్ప మిగతా ముగ్గురూ ఒక్క దఫా కూడా పదవీ కాలం పూర్తి చేయలేదు. వీటిలో మొదటి, నాల్గవ హత్యలు అమెరికా అల్లకల్లోలంగా ఉన్న దశలో జరిగినవి. లింకన్ సమయంలో అమెరికా అంతర్యుద్ధంలో చిక్కుకుని ఉండగా, కెనడీ కాలంలో వియత్నాం యుద్ధం, సోవియెట్లతో తారాస్థాయిలో ప్రచ్చన్న యుద్ధం, నల్ల జాతి హక్కుల పోరాటాలతో అమెరికా ఇంటా బయటా చిక్కుల్లో ఉంది. విలియం మెకిన్లీ రెండవ దఫా ఎన్నికయిన ఆరు నెలల్లోపే హత్య చేయబడ్డాడు. గార్‌ఫీల్డ్ పదవిలోకొచ్చిన నాలుగవన నెలలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరగ్గా, ఆ గాయం ధాటికి ఆయన మరో రెండు నెలల తర్వాత మరణించాడు. అతి తక్కువకాలం పదవిలో ఉన్న అధ్యక్షుల్లో రెండవ స్థానం ఈయనది.

ప్రస్తుత (నలభై మూడవ) అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ నలభై ఒకటవ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యు. బుష్ కుమారుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా తండ్రీ కొడుకులిద్దరూ అమెరికా అధ్యక్షులుగా పనిచేయటం ఇంతకు ముందు మరొక్క సారి మాత్రమే జరిగింది. రెండవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్, ఆరవ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ కూడా తండ్రీ కొడుకులు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా తిరిగి ఎన్నికతో పనిలేకుండా ఉపాధ్యక్షుడు ఆ స్థానంలోకి వస్తాడు. అలా ఎన్నికతో పనిలేకుండా అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎనిమిదిమంది ఉన్నారు. వీరందరిలోనూ ముప్పై ఎనిమిదో అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్‌కి మరింత ప్రత్యేకత ఉంది. ఈయన ఉపాధ్యక్షుడిగా కూడా ఎంపిక చెయ్యబడ్డాడే కానీ ఎన్నికవ్వలేదు. రిచర్డ్ నిక్సన్ కింద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన థియొడర్ ఆగ్నూ వివిధ కుంభకోణాల్లో చిక్కుకుని రాజీనామా చెయ్యటంతో నిక్సన్ జెరాల్డ్ ఫోర్డ్‌ని ఉపాధ్యక్షుడిగా నియమించాడు. ఆ తర్వాత ఏడాది తిరిగేలోపు స్వయంగా రిచర్డ్ నిక్సన్ కూడా వాటర్‌గేట్ కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుని రాజీనామా చెయ్యటంతో అప్పటి ఉపాధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ కి అయాచితంగా అత్యున్నత పదవి కూడా చేజిక్కింది (ఈయనకి, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్‌కీ ఎటువంటి చుట్టరికం లేదు)

‘అభిశంసన’ అనగానే అత్యధికులకి ఠక్కున గుర్తొచ్చేది నలభై రెండవ అధ్యక్షుడు బిల్ క్లింటన్. అమెరికా చరిత్రలో అభిశంసించబడ్డ రెండవ అధ్యక్షుడు క్లింటన్ (మరొకరు పదిహేడో అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్). క్లింటన్ అభిశంసన విషయంలో చాలామందికి అపోహలున్నాయి – అది ఆయన రాసలీలలు తెచ్చిపెట్టిన తంటా అని. నిజానికి అదీ ఒకానొక కారణమే కానీ, అదే ప్రధాన కారణం కాదు. క్లింటన్ ఆర్కన్సాస్ రాష్ట్ర గవర్నరుగా ఉన్నప్పుడు జరిగిన వైట్‌వాటర్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై జరిగిన విచారణ ఫలితాలు అభిశంసనకి ప్రధాన కారణం. ఇంపీచ్‌మెంట్‌కి గురవటం అంటే పదవి నుండి తొలగించబడటం అనే మరో తప్పు అభిప్రాయం కూడా చాలామందికి ఉంటుంది. అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయటానికి దిగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) అభిశంసిస్తే, ఎగువ సభ (సెనెట్) విచారణ జరిపి కన్విక్ట్ చేయాల్సి ఉంటుంది. క్లింటన్, జాన్సన్ ఇద్దరి విషయంలోనూ అభిశంసన మాత్రమే జరిగింది. ఇద్దరినీ ఎగువ సభ శిక్షించకుండా వదిలిపెట్టింది.

సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన వాడు నలభయ్యో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్. అంతకు ముందు ఈయన క్యాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా కూడా పని చేశాడు. ప్రస్తుత క్యాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ కూడా పూర్వాశ్రమంలో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడే. ఇద్దరూ రిపబ్లికన్ పార్టీ సభ్యులే. పుట్టుకతో అమెరికా పౌరుడు కాకపోవటం వల్ల ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌కి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం లేదు కానీ ఆ అవకాశం ఉంటే ఈ దఫా రిపబ్లికన్ పార్టీ తరపున జాన్ మెకెయిన్‌కి బదులు ఆర్నాల్డ్ రంగంలో ఉండేవాడని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అత్యుత్తమ అధ్యక్షులుగా అధికుల మన్ననలు పొందినవారు జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్, థామస్ జెఫర్సన్, ధియొడర్ రూజ్‌వెల్ట్ మరియు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ (వీరిలో మొదటి నలుగురి ముఖాలు మౌంట్ రష్‌మోర్ పై చెక్కబడి ఉంటాయి) కొందరి దృష్టిలో పదిమంది అత్యుత్తమ అధ్యక్షుల్లో బిల్ క్లింటన్ కూడా ఒకడు. మూడో దఫా పోటీ చేసే అవకాశం ఉంటే ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవాడని చాలామంది నమ్మకం.

అతి చిన్న వయసులో అమెరికా అధ్యక్ష పదవినలంకరించినవాడు థియొడర్ రూజ్‌వెల్ట్ (43 సంవత్సరాల వయసులో). ఆ తర్వాతి స్థానంలో జాన్ కెనడీ (44), బిల్ క్లింటన్ (47) ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరపున పోటీ పడుతున్న బరాక్ ఒబామా గెలిస్తే తొలి నల్లజాతి అధ్యక్షుడు, నాలుగవ పిన్న వయస్కుడు అవుతాడు.

 

6 స్పందనలు to “మిస్టర్ ప్రెసిడెంట్”


  1. 2 rudranarasimha 1:27 ఉద. వద్ద అక్టోబర్ 31, 2008

    hi..this is very fantastic and useful information …I like it
    thanks to abrakadabra

  2. 3 కె.మహేష్ కుమార్ 2:10 ఉద. వద్ద అక్టోబర్ 31, 2008

    మంచి సమాచారం. నెనర్లు (చాలా రోజుల తరువాత ఈ పదంవాడాను).

  3. 4 కొత్తపాళీ 4:02 ఉద. వద్ద అక్టోబర్ 31, 2008

    Are you sure the presidential term limits were in vogue before Franklin Roosevelt? I remember either John Adams or John Quincy Adams trying to run for president after a gap.

    Anyway, good succinct information.

  4. 5 అబ్రకదబ్ర 6:25 ఉద. వద్ద అక్టోబర్ 31, 2008

    @అరుణ,రుద్రనరసింహ:

    ధన్యవాదాలు.

    @మహేష్:

    నెనర్లు (మొట్ట మొదటిసారి ఈ పదం వాడకం, మీకోసం)

    @కొత్తపాళీ:

    ఇద్దరు జాన్ ఆడమ్సులూ ఒక్కో టెర్మ్ మాత్రమే పదవిలో ఉన్నారు. మీరు చెప్పేది టెడ్డీ రూజ్‌వెల్ట్ గురించి కావచ్చు. టెడ్డీ రెండు దఫాలు (1901 – 1909) అయిపోయిన తర్వాత 1913లో మళ్లీ రిపబ్లికన్ పార్టీ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేశాడు. అప్పుడు రిపబ్లికన్ ఓట్లు రూజ్‌వెల్ట్, బిల్ టాఫ్ట్ ల మధ్య చీలిపోయి డెమొక్రాట్ల అభ్యర్ధి ఉడ్రో విల్సన్ గెలిచాడు. టెడ్డీకి ముందు పద్దెనిమిదో ప్రెసిడెంట్ యులిసిస్ గ్రాంట్ కూడా ఇలాగే మూడో దఫా కోసం ప్రయత్నించాడు కానీ కుదరలేదు. వీళ్లిద్దరూ చెయ్యలేని పని ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 1941లో విజయవంతంగా చేశాడు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: