బెర్ముడా రహస్యం

బెర్ముడా ట్రయాంగిల్ – ఈ ప్రదేశం ఎక్కడుందో తెలీక పోయినా దానికి సంబంధించిన వింతలు, విశేషాలు వినని వారుండరు. ఈ సముద్ర ప్రాంతంలో పయనించే నౌకలు మునిగిపోతాయని, దాని పైగా ఎగిరే విమానాలు అంతుపట్టని రీతిలో కూలి పోతాయని, వాటి అవశేషాలు కూడా లభించవని .. ఇలా ఎన్నెన్నో కధలు. అక్కడ ఇలా జరగటానికి ఎవరికి తోచిన కారణాలు వారు చెబుతారు – అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువని, అయస్కాంత క్షేత్రం ఎక్కడాలేనంత ప్రభావశీలంగా ఉంటుందనీ చెప్పేవారు కొందరు; అక్కడ అధికంగా ఉత్పత్తయ్యే హీలియం లేదా మీధేన్ వాయువుల ప్రభావంతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేవారు మరి కొందరు; గ్రహాంతర వాసుల వల్లనో, సముద్రం అడుగునున్న ఏదో వింతలోక జీవుల వల్లనో ఇవి జరుగుతున్నాయనేవారు ఇంకొందరు; మానవాతీత శక్తులు, ఆత్మలు, భూతాల వంటి వాటివల్లనని నమ్మేవారు చాలామంది. భూమండలమ్మీద వివరించలేని వింతలన్నిటి వెనుకా అమెరికన్ ప్రభుత్వ కుట్రేదో ఉందని మనసా వాచా నమ్మే కాన్‌స్పిరసీ థియొరిస్టులయితే మహదానందంగా ‘అక్కడ తమ సైన్యం జరిపే రహస్య ప్రయోగాల గుట్టు వెల్లడవకుండా అమెరికన్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమే ఇది’ అనేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఆసక్తిని రేకెత్తించే బెర్ముడా త్రికోణం మర్మమేమిటి?

* * * *

ఫోర్ట్ లాడర్‌డేల్, ఫ్లోరిడా. డిసెంబర్ 5, 1945 మధ్యాహ్నం 1:15 గంటలు: అమెరికన్ నౌకాదళానికి చెందిన ఐదు చిన్న తరహా అవెంజర్ యుద్ధ విమానాలు అట్లాంటిక్ మహాసముద్రంపై రోజువారీ పహరాకి బయలు దేరి వెళ్లాయి. వాటిలో ఉన్న పైలట్లు ఐదుగురూ ఇంకా యుద్ధ విమానాలు నడపటంలో విద్యార్ధి దశలో ఉన్నవారే. మూడు గంటల ప్రాంతంలో నౌకా కేంద్రానికి రేడియో ద్వారా సందేశం వచ్చింది, ‘మేం దారి తప్పాం’ అంటూ. వారిని వెనక్కి రప్పించటానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ ఐదు అవెంజర్ విమానాలు మరి తిరిగి రాలేదు. నౌకా దళం జరిపిన దర్యాప్తులో దిశా నిర్దేశంలో ప్రధాన పైలట్ చేసిన తప్పిదం వల్ల ఐదు విమానాలూ దారితప్పి అట్లాంటిక్ లోలోపలికి వెళ్లి, తిరిగి రావటానికి సరిపడే ఇంధనం లేక సముద్రంలోనే కూలిపోయి ఉంటాయని తేలింది. దారి తప్పాక వాళ్లు ఏ దిశలో వెళ్లిందీ అంతుపట్టకపోవటంతో, ఎంత గాలించినా ఆ మహాసముద్రంలో కూలిపోయిన విమానాల ఆచూకీ దొరకలేదు (అరవయ్యేళ్ల క్రితం ఇప్పటంతగా రాడార్ వ్యవస్థ అభివృద్ధి చెందలేదు). ఇదిలా ఉండగా, పైలట్ల తప్పిదాల వల్ల ఇది జరిగిందనే వాదన ఒప్పుకోని కుటుంబ సభ్యుల ఒత్తిడితో నౌకాదళ నివేదికలను ‘అంతు పట్టని కారణాలతో విమానాలు ఆచూకీ తెలియకుండా పోయాయి’ అని మార్చటం జరిగింది. బెర్ముడా రహస్యానికి బీజాలిక్కడే పడ్డాయి.

* * * *

అర్గొసీ – 1960లలో అమెరికాలో వెలువడిన ఒకానొక మసాలా వారపత్రిక. పాఠకులకు ఉపయోగపడే విషయాలకన్నా సంచలనాత్మకమైన పల్ప్ ఫిక్షన్ తరహా వ్యాసాలు, కధలు, వగైరా విశేషాలతో అమ్మకాలు పెంచుకునే వందలాది చెత్త పత్రికల్లో ఒకటి. ఇందులో ప్రచురితమయ్యే వార్తల్లో వాసి నాస్తి, వదంతులు జాస్తి. బస్టాండుల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ కొని చదివి అవతల పారేసే ‘టైం పాస్’ తరహా వీక్లీ అన్నమాట.

కాలక్షేపం బఠానీలు వండి వార్చటంలో పెన్ను తిరిగిన విన్సెంట్ గడ్డిస్ అనే రచయిత 1964 ఫిబ్రవరిలో అర్గొసీ కోసం ఓ ముఖపత్ర కధనం రాశాడు. ‘ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్’ పేరుతో వచ్చిన ఆ కధనంలో ఆచూకీ తెలియకుండా పోయిన ఐదు అవెంజర్ విమానాల ఘటనకి మరి కొన్ని ఊహాజనిత సంఘటనలు జోడించి అద్భుతమయిన మసాలా వంటకం తయారు చేశాడు. ఫ్లోరిడా రాష్ట్ర తీరం, బెర్ముడా దీవి, ప్యూర్టో రికో దీవుల మధ్యనుండే అట్లాంటిక్ సముద్ర ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు ఇతనే మొదటగా వాడుకలోకి తెచ్చాడు. ఆ ప్రాంతంలో శాస్త్రం వివరించలేని అతీంద్రియ శక్తులేవో ఉన్నాయని, వాటి ధాటికి అటు నుండి వెళ్లే నౌకలూ విమానాలూ అంతుచిక్కని రీతిలో మాయమైపోతాయనీ రాసిన ఈ కాల్పనిక గాధ ఎంతగా పండిందంటే, చదివిన చాలామంది ఇది నిజమేననుకున్నారు! ఈ కధనం ఊహించనంతగా విజయవంతం కావటంతో విన్సెంట్ గడ్డిస్ ఆ మరుసటేడాది ఇదే కధని మరింత విస్తరించి ‘ఇన్విజిబుల్ హొరైజన్స్’ పేరుతో ఏకంగా ఓ పుస్తకమే రాసి పారేసి సొమ్ములు చేసుకున్నాడు. ఇదీ విజయవంతం కావటంతో మరింతమంది రచయితలు బెర్ముడా ట్రయాంగిల్ ఇతివృత్తంతో ఎడాపెడా కధలు, కాకరగాయలు వండి వడ్డించేశారు. తన ఊహాశక్తే హద్దుగా ఒక్కో రచయితా బెర్ముడా త్రికోణం పరిధిని ఒక్కో రకంగా మార్చేశాడు. కొంతమందికి ఇది ఐదు వందల చదరపు మైళ్ల త్రికోణమైతే, కొందరికి యాభై వేల చదరపు మైళ్ల ట్రెపిజాయిడ్! అలా, అలా, పదేళ్లు గడిచేసరికి ప్రపంచమంతా బెర్ముడా త్రికోణమనేది ఓ మాయదారి ప్రాంతంగా పేరుపడిపోయింది.

* * * *

ఇంతకీ బెర్ముడా త్రికోణం మిస్టరీ వెనుక ఏముంది? సమాధానం: ఏమీ లేదు. అసలక్కడ మిస్టరీయే లేదు. అంటే, అక్కడ నౌకలు, విమానాలు మాయమైపోవటంలో నిజం లేదా? సమాధానం: అవెంజర్ విమానాలని తీసేస్తే అక్కడ మాయమయిన విమానాలు ఏవీ లేవు. అవెంజర్లు కూడా మానవ తప్పిదం వల్ల కూలిపోయుంటాయనేది అమెరికన్ నౌకాదళం అసలు నివేదిక చెప్పే సత్యం. పైగా, అవి బెర్ముడా త్రికోణంలోనే కూలిపోయాయనేదానికీ ఆధారాల్లేవు. ఇక నౌకల మాయం విషయానికొస్తే, ఆ ప్రాంతంలో గల్లంతైన నౌకలు ఎన్నో ఉన్నాయి. కానీ, మిగతా సముద్ర ప్రాంతాల్లో ఏ కారణాలతో నౌకలు గల్లంతయ్యాయో అవే ఇక్కడ కూడా కారణాలు: తుఫానులు, మానవ తప్పిదాలు, భీకరమైన అలలు, వగైరా. బెర్ముడా ప్రాంతంలో విరివిగా వచ్చే హరికేన్ల తాకిడికి మునిగిపోయిన నౌకలే వీటిలో ఎక్కువ. యు.ఎస్. కోస్ట్ గార్డ్ నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలో నమోదైన దుర్ఘటనలు అన్నింటికీ సహజసిద్ధమైన కారణాలే ఉన్నాయి. మిస్టరీ రచయితలు గల్లంతైనవిగా పేర్కొన్న సంఘటనలు కొన్ని వేరే ప్రాంతాల్లో జరిగినవి, మరి కొన్ని పూర్తిగా కల్పితం కాగా ఇంకొన్ని సంఘటనల్లో మాయమైనవిగా చెప్పబడ్డ పడవలు, నౌకలు నిజానికి క్షేమంగానే ఉన్నాయి. మొత్తమ్మీద ఇక్కడ జరిగినవిగా ప్రచారంలో ఉన్న దుర్ఘటనల్లో మసిపూసిన మారేడుకాయలే ఎక్కువ.

బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇప్పటికీ చాలామందిలో ఉన్న అపోహ: ఆ ప్రాంతం గుండా నౌకా, విమాన యానాలు నిషేధించబడ్డాయి. ఇది పూర్తిగా అసత్యం. అట్లాంటిక్ మహాసముద్రం లోని ప్రముఖ జల రవాణా మార్గాల్లో ఒకటైన ఫ్లోరిడా జలసంధి బెర్ముడా ట్రయాంగిల్ గుండానే సాగుతుంది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తో సహా కమర్షియల్ ఎయిర్ లైనర్లు ఎన్నో ఈ ప్రాంతం మీదుగా ప్రతి రోజూ విమానాలు నడుపుతుంటాయి. బెర్ముడా ట్రయాంగిల్‌ పరిధిలోకొచ్చే బహామా దీవుల్లోని ఫ్రీపోర్ట్ నగరం నుండి ఏటా యాభై వేలకి పైగా విమాన సర్వీసులు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు నడుస్తుంటాయి. ఇదే నగరంలోని ఓడ రేవు అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే నౌకా రవాణా కేంద్రాల్లో ఒకటి.

మరి, బెర్ముడా ట్రయాంగిల్ గురించిన అసలు నిజాలు అంత ప్రముఖంగా వెలుగులోకి రాకపోవటం వెనుక మతలబేంటి? కారణం చాలా చిన్నది. అది మీ ఊహకే వదిలేస్తున్నా.

10 స్పందనలు to “బెర్ముడా రహస్యం”


 1. 1 వికటకవి 7:04 ఉద. వద్ద అక్టోబర్ 28, 2008

  మీరు అసలు కారణం (నాకైతే ఇదే చాలా సరైనది అనిపించింది) “మీథేన్ గాలి బుడగలు” వదిలేసారు. నేషనల్ జియోగ్రఫీలో మంచి ఉదాహరణలతో సహా చూపించారు. మీకు తెలిసే ఉంటుంది.

 2. 2 అబ్రకదబ్ర 7:53 ఉద. వద్ద అక్టోబర్ 28, 2008

  వికటకవిగారు,

  మీథేన్ బుడగల గురించి నేను మొదటి పేరాలో పైపైన ప్రస్తావించి వదిలేశాను. మీరు చెప్పిన కార్యక్రమం చూశాను. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందది. అయితే, మీధేన్ హైడ్రేట్స్ వల్ల ఓడలు మునిగిపోయే అవకాశముందనే వాళ్లు రుజువు చెయ్యగలిగారే కానీ బెర్ముడా ప్రాంతంలో ఆ స్థాయిలో మీథేన్ విడుదలవుతున్నట్లు రుజువుల్లేవు. అక్కడ ఆ స్థాయిలో మీథేన్ ఉత్పన్నం అవదని యుఎస్‌జిఎస్ వాళ్ల నివేదికలు కూడా తేల్చాయి. అందుకే దాన్ని గురించి వివరంగా రాయలేదు.

 3. 3 nagaprasad 9:04 ఉద. వద్ద అక్టోబర్ 29, 2008

  బెర్ముడా ట్రయాంగిల్ గురించిన అసలు నిజాలు అంత ప్రముఖంగా వెలుగులోకి రాకపోవటం వెనుక మతలబేంటో నా మట్టి బుర్రకి తట్టట్లేదు. అది కూడా మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి. ప్లీజ్.

 4. 4 bollojubaba 9:47 ఉద. వద్ద అక్టోబర్ 29, 2008

  నాదీ నాగప్రసాద్ గారి విన్నపమే కానిచో డిమాండ్ 🙂

 5. 5 వర్మ 6:04 సా. వద్ద అక్టోబర్ 29, 2008

  మంచి డాటా ఇచ్చారు. ధన్యవాదాలు.. సమాధానం మాత్రం మీరే చెప్పాలి….

 6. 6 సుజాత 2:00 ఉద. వద్ద అక్టోబర్ 30, 2008

  దీని తాలూకు సినిమా కూడా చూసినట్టు గుర్తు!

 7. 7 Bosu Babu 3:26 ఉద. వద్ద అక్టోబర్ 30, 2008

  hello
  naaku konchem chebuthara ee article yekkada chadhavaccho clear ga….

  and NG channel lo ah programe ela chudagalanu ippudu?

 8. 8 రవి 3:53 ఉద. వద్ద అక్టోబర్ 30, 2008

  ఓహో ఊరికే ఊదరగొట్టారన్నమాట. దాన్ని ఆధారంగా (లైట్ గా) దేవీ పుత్రుడు అని తెలుగు సినిమా వచ్చిందన్నట్టు గుర్తు.

  నాదీ మృణ్మయ మస్తకమే. నాకు సమాధానం తట్టట్లేదు.

 9. 9 అబ్రకదబ్ర 10:01 ఉద. వద్ద అక్టోబర్ 30, 2008

  @నాగప్రసాద్,బాబా,వర్మ,రవి:

  సమాధానం – మిస్టరీలంటే ఇష్టపడే మానవ నైజం. చందమామ కధలంటే పెద్దలు కూడా చెవికోసుకోవటం ఎందుకు? అక్కడ ఏదో వింత ఉందంటేనే కదా ఎవరికైనా ఆసక్తి; ‘ఏమీ లేదు, అంతా మామూలే’ అంటే ఎవరు పట్టించుకుంటారు? బెర్ముడా ట్రయాంగిల్, అట్లాంటిస్, షాంగ్రీ-లా, ఏరియా-51, యు్ఎఫ్ఓ, ఏలియన్ అబ్డక్షన్స్, క్రాప్ సర్కిల్స్ .. సంఘటనలు, స్థలాలు ఏవైనా వాటిచుట్టూ అల్లుకున్న మిస్టరీ పొగే కదా ఇంతింత కాల్పనిక సాహిత్యానికి, సినిమాలకి, టీవీ సీరియళ్లకీ, ఎపిసోడ్లకీ ప్రాణం; వందల కోట్ల డాలర్ల వినోద వాణిజ్యానికి కీలకం. బెర్ముడాలో మిస్టరీ లేదంటూ సినిమా తీస్తే ఎవడు చూస్తాడు?

  @సుజాత:

  చాలా ఫీచర్ ఫిల్మ్స్ వచ్చాయి బెర్ముడా త్రికోణం గురించి. ఇక టీవీ చిత్రాలయితే లెక్కలేనన్ని.

  @బోసుబాబు:

  ఇది నేను ఒకచోట నుండి సంగ్రహించిన వ్యాసం కాదు. చాలాచోట్లనుండి (books, history channel programs, online resources, etc) వివరాలు సేకరించి క్రోడీకరించి రాశాను. మీరు ‘bermuda triangle’, ‘flight 19’, ‘vincent gaddis’ లాంటి పదాల కోసం గూగులమ్మనడిగితే చాలా వివరాలు దొరుకుతాయి. వికీపీడియాలో కూడా చూడండి. నేషనల్ జియోగ్రఫిక్ విడియో దొరక్కపోవచ్చు కానీ, యూ ట్యూబ్ (లేదా గూగుల్ వీడియో) లో బెర్ముడా ట్రయాంగిల్ విడియోలు చాలా దొరుకుతాయి .. చూడండి.

 10. 10 వాసు 1:07 ఉద. వద్ద ఆగస్ట్ 21, 2010

  ఆసక్తికరంగా ఉంది. ఆఖరున చదువు తున్నది నేనేనేమో


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: