ఎన్నికల తరుణం సమీపించేకొద్దీ మన రాజకీయుల మస్తిష్కాల్లో చిగురించే నవ రాగాలెన్నో. ఈ మధ్య కొత్తగా పేద మైనారిటీల సామూహిక వివాహాల పాటందుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం. బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా రెండొందలదాకా మైనారిటీ జంటలకు ప్రభుత్వ పౌరోహిత్యంలో ముడి పడింది. ఒక్కో జంటకూ పదిహేను వేల రూపాయల ఖర్చుతో వివాహం జరపటమే కాకుండా, పెళ్లి చూడటానికి వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారట. సామూహిక వివాహాల కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏడాదికి ఐదు కోట్ల రూపాయల నిధిని కేటాయించిందని వార్త. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘హిందువులకు తితిదే, ముస్లిములకు వక్ఫ్ బోర్డ్ ద్వారా సామూహిక వివాహాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం, త్వరలో క్రైస్తవులకూ ఈ సౌకర్యం కలిపిస్తాం’ అని చెప్పారు. ‘హిందువులకూ, ముస్లిములకూ, క్రైస్తవులకూ’ అంటూ విడివిడిగా నొక్కి వక్కాణించటమెందుకో? ‘పేద వారికి’ అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు కదా!
పేదలకు ప్రభుత్వాలే పూనుకుని పెళ్లిళ్లు జరపటం మరే దేశంలోనన్నా ఉందో లేదో తెలియదు. నేనయితే ఇది మరెక్కడా వినలేదు. పెళ్లి అనేది ఓ సామాజిక అవసరమే కావచ్చు. అయితే ఆ పని చెయ్యవలసింది ప్రభుత్వమా అన్నది ప్రశ్న. పేదరికాన్ని రూపుమాపే ఉదాత్త మార్గమా అది? పేద మైనారిటీల ఓట్ల కోసం నేడు ఫ్రీ పెళ్లిళ్ల గాలం. రేపు – పెళ్లిళ్ల పేరయ్య అవతారం కూడా ఎత్తనుందేమో ప్రభుత్వం.
గత నాలుగేళ్లలో ముస్లిములకు లబ్ది చేకూర్చే ఎన్నో నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకుందని రాజశేఖరరెడ్డిగారు కడు తన్మయంగా చెప్పారు. వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించే విషయంలో ఎవరడ్డొచ్చినా ఆగక పోరాడామని భుజాలు చరుచుకున్నారాయన. ముస్లిములకి రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉద్యమాలు నడిచిన దాఖలాలైతే లేవు. ఎవరడిగారని ఈయన ఇంతలా పోరాడారో తెలీదు. ప్రజల్ని విభజించి భుజించే విద్యలో తెల్లోడికన్నా మన డాక్టరుగారు రెండాకులు ఎక్కువే చదివారనుకోవాలి. ‘ముస్లిములకి ఇంత చేశాం, క్రైస్తవులకి అంత చేశాం’ అని చంకలు బాదుకోవటం ఏమిటి? వీరికి ఓట్లేసింది, వేసేది వాళ్లిద్దరేనా?
సారా పాకెట్లు, ఫ్రీ పెళ్లిళ్లు, కలర్ టివిలు, క్రికెట్ కిట్లు .. ఇటువంటి చిట్కాలకి ఓట్లు నిజంగా రాలతాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. జనాలు నవ్విపోతారని కూడా చూడకుండా నాయకమ్మన్యులు ఈ మంత్రాలు పఠిస్తున్నారంటే ఓటర్ల వివేకంపై వాళ్ల అంచనాయే సరైనదా? అదే నిజమైతే, తమకి నిజంగా ఏది కావాలో తెలుసుకోలేని మందభాగ్య ఓటర్లున్నంతకాలం ఈ మంద పెళ్లిళ్ల మేళాల్లాంటివి మరెన్నో చూడక తప్పదు. అప్పుడీ పుణ్యభూమిని కాపాడాల్సింది నాయకులనుండి కాదు, అమాయక ఓటర్లనుండి.
(గతంలో ఇటువంటి విషయమ్మీదనే నే రాసిన మరో బుల్లి టపా: ఓటేస్తే పెళ్లి ఫ్రీ)
ఒక trainingలో పంచాయితీల స్వయంసంవృద్ధి గురించి లెక్చరిస్తూ,”మన కుటుంబంలో పెళ్ళిళ్ళూ చావులూ మనం చేసుకోవటం లేదా! అలాగే, కొన్ని అభివృద్ధిపనులు సమిష్టిగా ప్రజలే చేసుకోవాలి” అన్నాను. ఇంతలో ఒక సర్పంచ్ లేచి, “ఇప్పుడు ప్రభుత్వం పెళ్ళిళ్ళుకూడా చేయిస్తోంది” అని నాకు గడ్డిపెట్టాడు.అప్పుడుగానీ మన ప్రభుత్వాలు ఎంత contradictory విధానాలతో వ్యవస్థని నడుపుతున్నాయో అర్థంకాలేదు.
“ప్రజల్ని విభజించి భుజించే విద్యలో తెల్లోడికన్నా మన డాక్టరుగారు రెండాకులు ఎక్కువే చదివారనుకోవాలి”
బాగా చెప్పారు.
డా.దేవుడు (దేన్నీవుంచడు) పోయిన ఎలక్సన్లప్పుడు తెలంగాణం ఆలపించాడు గెలిచాక గేలిగా ఇటలీ త్యాగశీలి నుండి గానం విందాం అన్నాడు ఇప్పుడు ఎం ఐ ఎం ద్వారా కర్ణకఠోరమని అనిపిస్తున్నాడు.
ఓట్లొస్తాయంటే రేపెప్పుడో కులాల వారీగా, మతాల వారీగా, చౌక వ్యభిచారగృహాలు కూడా నెలకొల్పవచ్చు మన నాయకులు. దానికి ‘రాజీవ్ చిన్నిల్లు పథకం’ అని పేరు పెట్టొచ్చేమో!
చంద్ర మోహన్ గారూ……! అయ్యవారు విన్నారంటే అయిడియా బాగుందనేసుకుని మొదలెట్టేస్తారు..వూరుకోండి.