దోశ నాజీ

ఆలీ అల్ యెగాన – ఇరాన్ లో పుట్టి పెరిగి అమెరికాకి వలసొచ్చిన వ్యక్తి, వృత్తిరీత్యా వంటగాడు. న్యూయార్క్ మహానగరంలో ‘సూప్ కిచెన్’ నాయధేయంగల ఇతని భోజనశాల, అందులో లభించే రకరకాల రుచికరమైన సూప్‌లు బహు ప్రఖ్యాతి గాంచాయి. సూప్ ప్రియులు కాళ్లు పడిపోయేలా వరసకట్టి మరీ ఇతనివద్ద సూప్‌లు కొనుక్కుని లొట్టలు వేస్తూ సేవిస్తుంటారు. ఐతే అల్ యెగానతో ఓ ఇబ్బందుంది. అది, కొనుగోలుదార్లతో అతను వ్యవహరించే పద్ధతి. ‘సూప్ కిచెన్’ సామ్రాజ్యానికి అల్ యెగాన ఎదురులేని నియంత. అక్కడ సూప్ కొనాలంటే కస్టమర్లు అనేక నియమాలు పాటించటం తప్పనిసరి. క్యూ పద్ధతి పాటించటం, క్యూలో ఉండగా ముందు వెనక వారితో సొల్లు కబుర్లు చెప్పకుండా మౌనంగా ఉండటం, కొనుగోలుకి సరిపడా చిల్లర సిద్ధంగా ఉంచుకోవటం, ఏమి ఆర్డర్ చేయాలనుకునేదీ ముందుగానే నిర్ణయించుకుని ఉండటం, వగైరా వగైరా. నియమాలుల్లంఘించినవారికి సూప్ అమ్మబడదు! ఇంత వింత మనిషైనా అతని సూప్‌ల రుచికి బానిసైన కస్టమర్లు మళ్లీ మళ్లీ ‘సూప్ కిచెన్’ కి వెళుతుంటారు.

అల్ యెగాన స్ఫూర్తితో 1995లో ప్రసిద్ధ సిట్‌కామ్ ‘సైన్‌ఫెల్డ్’లో ఒక ఎపిసోడ్ రూపొందింది. అందులో అల్ పాత్ర మారుపేరు సూప్ నాజీ.  సూప్ నాజీ దగ్గర సూప్ కొనాలనుకునేవారు పాటించాల్సిన నియమాలు, గాడి తప్పిన వారికి అతను వడ్డించే తిట్లు తమాషాగా ఉంటాయి. ఇతని దగ్గర సూప్ కొనాలనుకునే కొత్తవారు ఇంటర్యూకి వెళ్లినట్లు బాగా ప్రిపేరై వెళ్లాల్సిందే. ఎవరైనా ఇతని దగ్గర మొదటి ప్రయత్నంలోనే సూప్ కొనగలిగితే అద్భుతమే! ఏం చేస్తే సూప్ నాజీకి చిర్రెత్తుతుందో ఎవరూ ఊహించలేరు – ‘సూప్ బాగుంది’ అన్న పొగడ్తైనా చాలు అతనికి చిర్రెత్తటానికి! వళ్లు మండినప్పుడు సూప్ నాజీ విధించే ఏక వాక్య శిక్ష: ‘No soup for you’.

[పునఃప్రసారంలో] మొదటిసారి సూప్ నాజీ ఎపిసోడ్ చూసినప్పుడు భలే నవ్వొచ్చింది. తర్వాతెప్పుడో అది అల్ యెగాన అనే ఆయన స్ఫూర్తితో రూపొందిందని ఎక్కడో చదివినప్పుడు ‘వీళ్ళు మరీ ఎక్కువ చేసి రాస్తున్నారు. కస్టమర్లతో అంత ఘోరంగా ఉంటే మళ్లీ అక్కడికి ఎవరెళతారు’ అనుకున్నాను. ఆ మాటే నా స్నేహితుడు రాహుతో అంటే అతను ‘సూప్ నాజీ సంగతి అవతల పెట్టు. ఈ సారి లాస్ ఏంజెలెస్ వచ్చినప్పుడు నీకు దోశ నాజీని చూపిస్తా. అల్ యెగాన సంగతేమో కానీ ఈ దోశ నాజీ ముందు ఆ సూప్ నాజీ బలాదూర్’ అన్నాడు. ‘సర్లేవో. నువ్వు మరీను – పేపర్లు, టీవీ వాళ్లకన్నా ఎక్కువ చేస్తున్నావ్’ అన్నా నేను. రాహు నవ్వేసి ఊరుకున్నాడు. సంభాషణ వేరే విషయాల మీదకి మళ్లింది. ఇది జరిగి రెండేళ్లయింది.

* * * *

ఈ మధ్య పనిమీద లాస్ ఏంజెలెస్ వెళ్లినప్పుడు రాహుని కలిశాను. కాలక్షేపం బఠాణీలయ్యాక ‘లంచ్‌కి పోదాం రా’ అంటూ బయల్దేరదీసి బోలెడన్ని గొందులు సందులు తిప్పి ఓ బుల్లి హోటల్‌కి తీసుకెళ్లాడు. ఓ తెలుగు కుటుంబం నడిపే చిన్న హోటలట అది. ‘ముక్తి’ అని దానిముందు బోర్డుమీద రాసుంది.  ముక్తి, మోక్ష, కైవల్య .. హోటళ్లకింత ఆధ్యాత్మిక నామాలేమిటో! పేరులోనే హెచ్చరికేదన్నా దాగుందేమో? ఆ పేరు తలచుకుంటూ బెరుకు బెరుకుగా లోపలకడుగుపెడితే అక్కడ అంత గొప్పగా లేదు. దాని పేరు ‘శుచి’ అని కాకుండా ‘ముక్తి’ అనెందుకు పెట్టుంటారో ఠక్కున వెలిగింది. అక్కడ భోంచేస్తే నిర్వాణమటుంచి నిర్యాణమొందటం ఖాయమనిపించింది. శాన్‌ఫ్రాన్సిస్కో తీరప్రాంతం లోని భారతీయ రెస్టారంట్లతో పోలిస్తే లాస్ ఏంజెలెస్ లోవి అంత గొప్పగా ఉండవని రాహు తరచూ చెబుతుంటాడు. ఆ సంగతి తెలిసీ ఇలాంటి చోటికి భోజనానికొచ్చి తప్పు చేశానేమోనని అనుమానంగా చూస్తున్నాను. రాహు అది గమనించి, ‘భయం లేదులే బాసూ. చూట్టానికిలా ఉంది కానీ తిండి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నాదీ పూచీ’ అన్నాడు అభయమిస్తున్నట్లు. అయినా నా శంక తీరలేదు. దాన్ని నివృత్తి చెయ్యటానికన్నట్లు, రాహు మళ్లీ అన్నాడు.

‘ఆకారం చూసి మోసపోకు బాసూ. ఎల్లేలో ఇంతకన్నా మంచి ఆంధ్రా భోజనం ఇంకెక్కడా దొరకదు. దోశలకి చాలా పాపులర్ ఈ ప్లేసు. కానీ ఒకటే కండిషన్’.

‘ఏమిటి?’

‘నువ్వు నోరు మూసుకుని తినాలి’.

‘నోరు మూసుకుని ఎలా తింటారు బాబూ?’.

‘తిక్క ప్రశ్నలెయ్యమాక. నే చెప్పిన దోశ నాజీ హోటల్ ఇదే. ఆయన్ని చూస్తే అర్ధమవుద్ది నోరు మూసుకుని తినటమెలాగో’.

అదన్నమాట విషయం. రెండేళ్లనాటి మాట నేనప్పుడే మర్చిపోయినా గురుడు గుర్తుపెట్టుకుని మరీ నన్నిక్కడికి తీసుకొచ్చాడు. దోశ నాజీ యవ్వారమేంటో చూడాలన్న కుతూహలంలో నా ప్రాణభయం అట్టే కొట్టుకు పోయింది.

ఓ టేబుల్ వద్ద సుఖాసీనులమై అక్కడే ఉన్న మెనూ కార్డ్ తీసుకుని చూస్తున్నామిద్దరమూ. ముద్రణాయంత్రం కనిపెట్టిన కొత్తలో అచ్చేసినట్లున్నాయవి. మడతలు పడి, అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నాయి. శుభలేఖలమీద అత్తరు చల్లినట్లు శాంపిల్ కోసం మెనూ కార్డు మీద కూరలద్దినట్లున్నారు. ఎంతసేపు కళ్లుపొడుచుకుని చదివినా అందులో రాసిన పదార్ధాల పేర్లు అంతుబట్టలేదు. కాసేపు చదివాక విసుగొచ్చింది నాకు. ‘ఈ గోలంతా ఎందుకు. వెయిటర్ని రానీ, అతన్నే అడుగుతా’ అన్నా రాహుతో చిరాగ్గా.

‘ఓర్నాయనో. ఆ పని మాత్రం చెయ్యమాకు బాసూ, నీకు పుణ్యముంటుంది’ అన్నాడు రాహు భయంగా, నా మాటలు ఎవరన్నా విన్నారేమో అన్నట్లు చుట్టూ పరికిస్తూ.

‘మరెలా ఆర్డరివ్వటం?’

‘ఏవో తిప్పలు పడదాంలే. అడుగో వస్తున్నాడు, నే చెప్పినాయన. చెప్పింది గుర్తుందిగా. ఎక్కువ తక్కువ మాట్లాడమాక’ అంటూ గభాలున మెనూలో తలదూర్చాడు రాహు.

తల పక్కకి తిప్పి చూస్తే ఓ యాభయ్యేళ్ల వ్యక్తి పక్కన్నిలబడున్నాడు – ముఖంలో ఏ భావాలూ లేకుండా. నేనాయనకేసి చూడగానే ‘ఏం కావాలి?’ అన్నాడు స్వచ్ఛమైన తెలుగులో.

అమెరికాలో ఇలా తెలుగు మాటలు వింటే నాలో ప్రాంతీయాభిమానం అలై పొంగుతుంది. మరుక్షణంలో రాహు చెప్పిన జాగ్రత్తలు గాలికెగిరిపోయాయి.

‘హోటల్ పేరు బాగుందండీ. మీరే పెట్టారా?’ అన్నా పలకరింపుగా.

‘పొగడ్తలాపి ఆర్డర్ చెప్పు’, ఖంగుమంటూ మోగిందాయన కంచు కంఠం. నేను కంగు తిన్నాను. పొగడ్తకి సమాధానం విదిలింపు! పైగా ఏకవచన ప్రయోగం!! రాహు ఓ క్షణం పాటు తలెత్తి నాకేసి చూసి మళ్లీ మెనూలో దాచేసుకోవటం క్రీగంట గమనించాను. దోశ నాజీ మొదటి దెబ్బ! మెనూ మాటున రాహు నవ్వుతున్నాడా?

‘ఈ మెనూ సరిగా అర్ధం కావటం లేదు. వేరే మెనూ తెచ్చిస్తారా?’ గొంతులో ఏ భావమూ తెలీకుండా జాగ్రత్త పడుతూ అడిగాను – అందులో వెటకారం ధ్వనిస్తే ఈసారేమంటాడో మరి.

మెరుపులా ముందుకొంగాడు దోశ నాజీ, చేతులు చెరోటి మా ఇద్దరికేసీ చాస్తూ. ఓ క్షణంపాటు గుండె గుభేలుమంది – మెనూ మార్చమన్న పాపానికి మా ఇద్దర్నీ కాలరుచ్చుకుని బయటికి గెంటేయబోతున్నాడా? ఏం చేస్తున్నాడో అర్ధమయ్యేలోపే నా చేతిలో మెనూ రాహు చేతిలోనూ, అతని చేతిలోది నా చేతిలోనూ ఉన్నాయి. అమ్మయ్య, బతికిపోయాం. అయితే ఈ మెనూ కూడా మొదటిదాన్లాగే ఉంది. ఆ సంగతి చెప్పి మళ్లీ మార్చమంటే ఈ సారి నిజంగానే బయటికి తరుముతాడేమోనని భయమేసింది.

నేను మళ్లీ నోరు తెరిస్తే ఏమౌతుందోనని భయపడ్డట్లున్నాడు, రాహు చప్పున ఆర్డర్ చెప్పేశాడు, ‘రెండు మసాలా దోశ, రెండు కాఫీ’ అంటూ. ఇంతకు ముందు వచ్చిన అనుభవంతో మెనూ కాస్త గుర్తుంది కాబోలు. అయితే నాకు మసాలా దోశ పెద్దగా నచ్చదు. కాస్త గట్టిగా చేసిన పూరీ కూరని, దోశనీ కలిపేసి దాన్నే మసాలా దోశ అంటారెందుకో నాకంతుపట్టదు. దానికన్నా మామూలు దోశనే నేను ఇష్టపడతాను. అందుకని రాహు ఆర్డర్లో జోక్యం చేసుకున్నాను.

‘ఒకటే మసాలా దోశ. నాకు ప్లెయిన్ దోశా ఇవ్వండి’.

అప్పటికే ఆర్డర్ రాసుకుని వెళ్లిపోబోతున్న పెద్దాయన నా మాటలకి చివ్వున వెనక్కి తిరిగాడు. ‘ప్లెయిన్ దోశా ఏమిటి. శుభ్రంగా సాదా దోశ అనొచ్చుగా?’ మళ్లీ మోగింది కంచు కంఠం.

అయ్యారే, నాకే తెలుగు బోధనా!?! అయితే ఆయనతో వాదులాడే ఉద్దేశం లేకపోవటంతో ‘సరే అదే పట్రండి’ అన్నా భావరహితంగా చూస్తూ.

‘ఏం. మసాలా దోశ ఎందుకొద్దు?’, వెంటనే అనుబంధ ప్రశ్న.

‘నాకు నచ్చదండీ’, అప్పుడే తలెత్తుతున్న కోపాన్ని, విసుగుని బయటపడనీయకుండా విశ్వప్రయత్నం చేస్తూ చెప్పాను.

‘అదే, ఎందుకు నచ్చదు?’, అదే అనుబంధ ప్రశ్న – మరింత సూటిగా.

నా దవడ కండరం బిగుసుకుంది. ‘ఆ ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి, బంగాళా దుంపల గుజ్జు నాకు పడదు లెండి’, ఈ సారి విసుగుని దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు నేను. ఆయన దోశ నాజీ అయితే నేను పల్నాటి పులి. ఏదో పెద్దాయన కదా అని ఊరుకునేకొద్దీ మరీ రెచ్చిపోతే ఎంతకని తగ్గుతాం?

‘అయితే ఇంక దోశ మాత్రం ఎందుకూ? నాలుగు కూరగాయలు, క్యారట్ ముక్కలు ఉడకబెట్టి తెచ్చిస్తా. అవి తిను’.

నా ముఖంలో ఈస్ట్‌మన్‌కలర్‌లో మారుతున్న రంగులు ఆందోళనగా గమనిస్తున్నాడు రాహు. నేనూ రెచ్చిపోతే ఎక్కడ ‘మీకు దోశల్లేవు’ అంటాడేమోనని వాడి భయం. అయితే ఈసారి నేను తగ్గదలచుకోలేదు.  బోడి దోశ కోసం పౌరుషాన్ని పణంగా పెట్టాలా? ఈయనకి ఏదో ఒకటి గట్టిగా రిటార్ట్ ఇవ్వాల్సిందే అనుకుని బుర్రకి పదును పెట్టాను. కానీ నాకా ఛాన్సివ్వకుండా దోశ నాజీ వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. పావుగంటలో తిరిగొచ్చాడు మా ఆర్డర్లతో. ఈలోగా రాహు నన్ను బతిమిలాడి శాంతింపజేశాడు. నాకు నిజంగానే కూరగాయలు తెస్తాడేమోననుకున్నా కానీ సాదా దోశే పట్టుకొచ్చాడు. ఇద్దరం నోరు మూసుకుని తినేసి అరగంటలో అక్కడనుండి బయటపడ్డాం. దోశ నాజీ తరహా ఎలాగున్నా దోశలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి – రాహు చెప్పినట్లే. ఆ రుచి కోసమే ఆయన విసుర్లు భరిస్తూ జనాలు మళ్లీ మళ్లీ వెళుతుంటారట. నాకా అవసరం లేదులెండి – నా నివాసం లాస్ ఏంజెలెస్‌లో కాదు; పైగా నేనుండే చోట అంతకుమించిన దోశ ప్రదేశాలు బోలెడున్నాయి.

11 స్పందనలు to “దోశ నాజీ”


 1. 1 కె.మహేష్ కుమార్ 8:44 సా. వద్ద అక్టోబర్ 2, 2008

  ఆసక్తికరంగా ఉంది మీ ‘ముక్తి’ ప్రయాస.

 2. 2 లచ్చిమి 9:48 సా. వద్ద అక్టోబర్ 2, 2008

  మరి రవ్వ దోశ ప్రయత్నించి వుండాల్సింది సారూ :):):)
  ఏదేమయితేనేం విజయవంతం గా తన్నులు కాకుండా దోశలే తిని వచ్చారన్నమాట పులి గారు 🙂

 3. 3 నాగన్న 10:03 సా. వద్ద అక్టోబర్ 2, 2008

  చాలా బాగుంది టపా! ఈ విషయం చెప్పకుండా ఇంట్లో వాళ్ళను ఆ రెస్టారెంటుకు ఒకసారి తీసుకుపోవాలి…!

 4. 4 చిన్నమయ్య 12:18 ఉద. వద్ద అక్టోబర్ 3, 2008

  రచనలోని అతిశయానికి కొంత ముదరా ఇచ్చినా, కొనుగోలుదారే కింగూ అని కన్స్యూమరిజానికి పెద్ద పీట వేసిన గడ్డ మీద – ఔరా, ఇంత చేటా అనిపిస్తోంది.

  అరువులో కొని, పూర్తిగా నగదుకి మాత్రమే అమ్మే అతి కొన్ని వ్యాపారాల్లో భోజనశాలలు ముందుంటాయి. నా ఎరుకలో, హోటళ్లలో దురుసు ప్రవర్తన కానరాలేదు – ఇరానీ హోటళ్లు కూడా కలుపుకుని. రైల్వే స్టేషన్లూ, బస్టాండ్లూ మినహాయింపు.

  అంత నెయ్యేసి పెట్టినా, అందర్నీ ఆప్యాయంగా “అన్నయ్య” అని పలకిరిస్తాడనే, బబాయ్ హోటలు (బెజవాడా)కి అంత పేరు. అందర్నీ, గుర్తెట్టుకు పలకరిస్తాడని వన్ టౌను ఆంజనేయ విలాస్ గురించీ చెప్పుకోగా విన్నాను. రామారావు పేట (కాయినాడ) సుబ్బయ్యోటలు గురించి ఏంచెప్పాలి? పైవూళ్లనించొచ్చిన వాళ్లు, వెతుక్కుని మరీ వెళ్లే కోమల విలాసు (నెల్లూరు), దసపల్ల గీతా కేఫు (గుంటూరు) – ఇంకా ఎన్నో వున్నాయి.

  హోటళ్లలో రుబాబు రైల్వే స్టేషన్లూ, బస్టాండ్లకే పరిమితమని అనుకుంటున్నాను. కాదన్నమాట!

 5. 5 gaddeswarup 5:56 ఉద. వద్ద అక్టోబర్ 3, 2008

  చాలా చక్కగా వ్రాసారు.కొంచెం వేరే దోవలో బిగ్ నైట్ (Big Night)అనే సినిమా వచ్చింది. ఇప్పటివరకు చూడకపొతె ఒకసారి ప్రయత్నించండి.దానిని గురించి ఏమి రాస్తారో అని కుతూహలంగా ఉంది.

 6. 6 gangabhavani 7:10 ఉద. వద్ద అక్టోబర్ 3, 2008

  “శుభలేఖలమీద అత్తరు చల్లినట్లు శాంపిల్ కోసం మెనూ కార్డు మీద కూరలద్దినట్లున్నారు”
  superb. Awesome narration. chaalaa baagundi.

 7. 7 teresa 7:40 ఉద. వద్ద అక్టోబర్ 3, 2008

  అంత బ్రహ్మండంగా ఉన్న దొశ మరోటి తినకుండా ఎందుకు పారిపోయారూ? ఇంతకీ ఆ బ్రహ్మండమేవిటో వర్ణించితే బావుండేది.

 8. 8 ప్రవీణ్ గార్లపాటి 1:08 సా. వద్ద అక్టోబర్ 3, 2008

  నాకు ఇష్టమయిన సైన్‌ఫెల్డ్ ఎపిసోడ్లలో సూప్ నాజీది ఒకటి. ఇలాంటి వారు నిజంగానే ఉన్నరంటే భలే ఆశ్చర్యం.

 9. 9 వేణూ శ్రీకాంత్ 7:46 సా. వద్ద అక్టోబర్ 3, 2008

  చాలా బాగుంది, ఇదంతా నిజమే అంటే నమ్మ లేనట్లుంది కానీ మీ టపా చదివాక గుర్తొచ్చింది మద్రాస్ టి నగర్ లో విజయవాడ మెస్ అని ఒకటి ఉండేది. ఎప్పుడూ చాలా రద్దీ గా ఉండేది దాని ఓనర్ కూడా అంతే ఉండే వాడు తింటే తిను లేక పోతే పో అన్నట్లు మాట్లాడేవాడు, పార్సెల్ కావాలంటే క్యారేజ్ పట్టుకుని వెళ్ళాలి లాంటి రూల్స్ పెట్టేవాడు. ప్లేస్ కూడా చాలా ఇరుకుగా ఉండేది కానీ భోజనం చాలా రుచి గా ఉండేది.

 10. 11 vineela 12:29 ఉద. వద్ద జనవరి 17, 2010

  chala bagundandi mee narration…mee blog chala kalam kritam rasinatlunnaru…meeku gurtunte LA lo ee mukti ekkado selavistara manchi dosalu tini chala kalam ayindi.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: