సెప్టెంబర్, 2008ను భద్రపఱచుజిమ్ క్యారీ

ఆలిస్ పరుగాపి రొప్పుతూ చెప్పింది, ‘ఇదే మా దేశంలో అయితే, ఇంత వేగంగా అంత సేపు పరిగెత్తితే ఇంకెక్కడో ఉంటాం’

‘ఓహ్. ఎంత నిదానమైన దేశం!! మా దేశంలో, ఉన్న చోట ఉండటానికే ఇలా పరిగెత్తాలి. అదే ఎక్కడికన్నా వెళ్లాలంటే ఇంతకి రెట్టింపు వేగం కావాలి’, ఆశ్చర్యపోతూ చెప్పింది మహారాణి

ఆలిస్ ఇన్ ది వండర్‌లాండ్

——

జిమ్‌కెళ్లు వారు రెండు రకములు – తమకొరకు వెళ్లువారు, పరులకొరకు వెళ్లువారు.

అబ్రకదబ్ర సుభాషితాలు

**** **** ****

అతని పేరు మురుగవేల్ సంబందన్ – భారద్దేశంలో మన పొరుగు రాష్ట్రస్తుడు, ఆఫీసులో నా పక్క క్యూబస్థ మండూకం. మనిషి చాలా సౌమ్యుడు, తన పనేదో తను చూసుకునే రకం. మదరాసులో చదివిన కారణాన నాకు అరవోళ్లంటే కాస్త అభిమానం. అంచేత ఇతనితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.

మూడేళ్లుగా సంబందన్‌తో పరిచయం. ఇన్నాళ్లూ అంతా బాగానే ఉంది. ఈ మధ్యనే ఓ వింత సమస్య మొదలయింది. కారణం, అతనికీ మధ్య కండ కావరం ఎక్కువవటం. అంటే, కండలు పెంచాలనే కోరికన్నమాట. దానికి ముందు కసరత్తుగా నెల రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకుని పదో ఇరవయ్యో పౌండ్లు బరువు తగ్గాడు. ఈ స్థాయిలో కడుపు మాడ్చుకోవటం కాస్త అతిగా అనిపించినా పాపం అతనేదో తిప్పలు పడుతున్నాడు, నిరుత్సాహపరచకూడదు అన్న సదుద్దేశంతో నేనూ అతన్ని రెచ్చగొట్టాను, ‘ఇరగదియ్, అస్సలు తగ్గొద్దు, నిన్నెవడాపుతాడో చూస్తా, అడ్డమొచ్చినోడ్ని అడ్డంగా నరికేస్తా’ అంటూ. పన్లో పనిగా ‘నిన్ను చూస్తే నాకూ ఉత్సాహం వస్తుంది మచ్చా’ అని ఓ బూస్టింగ్ డవిలాగూ వదిలా. అయితే ఉత్తుత్తినే అన్న మాటని మావాడు ఇరుదయబూర్వగంగానే అన్నాననుకున్నాడని నాకప్పుడు తెలీదు.

**** **** ****

నెల రోజుల తర్వాత సంబందన్ ఘనాఘన సుందరా అనుకుంటూ తిరిగి ఘనాహారానికి మారిపోయాడు. మరి కొన్ని రోజులయ్యాక జిమ్‌కి వెళ్లటం మొదలెట్టాడు. కష్టపడి తగ్గిన బరువు మళ్లీ పెరక్కుండా చూసుకోటం, నాలుగు కండలు వెనకెయ్యటం దీని ప్రధాన లక్ష్యమట. అంత వరకూ బాగానే ఉంది. నోటి తీటెక్కువై నేనొదిలిన బూస్టింగ్ డవిలాగు గుర్తుంచుకుని నన్నూ జిమ్ముకి రమ్మని తెగ మొహమాట పెట్టేశాడు. నేనసలే ప్రపంచ మొహమాటస్థుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుణ్ని. ఉత్తుత్తినే అన్నా, ఉబుసుపోకకన్నా, ఓ సారి మాటన్నాక మార్చటం నాకు చేతకాని పని.

నాకిలా జిమ్ములకెళ్లి కరగదీయాల్సినంత కొవ్వయితే లేదు. ఆ త్రెడ్ మిల్లెక్కి గంటసేపు లగెత్తినా ఉన్నచోటే ఉండటం తలచుకుంటేనే చిరాకు. దాన్ని చూస్తే చిన్నప్పుడెప్పుడో చదివిన ఆలిస్ ఇన్ ద వండర్లాండ్ గుర్తొస్తుంది నాకు. జిమ్ దూరమని తప్పుకోటానికీ లేకుండా అది ఆఫీసులోనే ఉంది. ఇక తప్పక, ‘పోన్లే, కుర్రాడు ముచ్చటపడుతున్నాడు కదా, ఓసారెళ్లొద్దాంలే’ అని నచ్చజెప్పుకుని అతనితో పాటు జిమ్ముకెళ్లా. ఎవడన్నా జిమ్‌ నుండొచ్చేటప్పటికి అలసిపోయి నీరసించిపోతాడు, నేను వెళ్లేటప్పుడే నీరసంగా వెళ్లా. ఆ రోజు అతనేవో కుస్తీలు పడుతుంటే చూడటం తప్ప నేను లగెత్తిందీ, లాగిందీ, పీకిందీ లేదు.

ఆ రోజు నా నిరాసక్తత చూసి అర్ధం చేసుకుని నన్నొదిలేస్తాడనుకున్నా కానీ తంబికి అంత తెలివి తేటల్లేవని మర్చిపోయా. జిమ్ము నుండి వచ్చేటప్పుడు ‘రేపు మాత్రం జిమ్ డ్రెస్ తీసుకురావటం మర్చిపోకు’ అన్నాడు గుర్తు చేస్తున్నట్లు. పిచ్చోడు, ఆ రోజు డ్రస్ లేకనే ఖాళీగా ఉన్నా అనుకున్నట్లున్నాడు.

మర్నాడు డ్రస్ తీసుకెళ్లకుండానే చేతులూపుకుంటూ ఆఫీసుకెళ్లా. వెళ్లగానే సంబందన్ పెద్ద స్వరంతో డ్రస్ గురించి వాకబు చేశాడు. తీసుకు రాలేదంటే ‘నిన్ననే చెప్పాగా’ అన్నాడు నిష్టూరంగా. అంటే నిన్నటిది గుర్తు చెయ్యటం కాదు, హెచ్చరికన్న మాట! ‘రేపు తప్పకుండా తీసుకురా’ అని మరింత గట్టిగా గుర్తు చేసి వదిలేశాడు. ఇది హెచ్చరికో బెదిరింపో మరి!

తర్వాత రోజు డ్రస్ తీసుకెళ్లక తప్పలేదు. దాన్ని చూడగానే సంబందన్ కళ్లలో కోటి వెలుగులు విరజిమ్మాయి. నాటినుండి రోజూ మధ్యాహ్నం మూడు నుండి నాలుగు దాకా జిమ్ కార్యక్రమం అని ప్రకటించాడు. మనకి వెళ్లే ఉద్దేశముంటే కదా. అప్పటి నుండి పని మానేసి ఆ రోజే వంకతో తప్పించుకోవాలా అని తెగాలోచిస్తే రెండున్నరకి తట్టింది. ‘షూస్ తెచ్చుకోటం మర్చిపోయా. రేపట్నుండీ చేద్దాంలే’ అని చెప్పి ఆ రోజూ విజయవంతంగా ఎగనామం పెట్టేశా.

ఆ మర్నాడు షూస్ తీసుకెళ్లాను కానీ సరిగ్గా రెండూ యాభయ్యైదుకి నా క్యూబికిల్‌ నుండి మాయమైపోయా. ‘కాసేపెదురుచూసి వెళ్లిపోయుంటాడ్లే’ అనుకుంటూ అరగంట తర్వాత పిల్లిలా తిరిగొస్తే సంబందన్ నాకోసమే మాటేసుకునున్నాడు పులిలా. నన్ను చూడగానే ‘ఎన్నప్పా, ఎక్కడికెళ్లిపోయావు టైముకి’ అన్నాడు మొఖం ఇంత చేసుకుని. ఆఫీసు పనిమీద ఎక్కడికో వెళ్లానని చెప్పి ఎలాగో ఆ రోజుకీ తప్పించుకున్నా.

అలా ఏరోజుకారోజు ఆఫీసులో నా పని పని మానేసి జిమ్మెలా ఎగ్గొట్టాలా అని ఆలోచించటమే అయిపోయింది. చిన్నప్పుడు బడి ఎగ్గొట్టటానిక్కూడా ఇన్ని తిప్పలు పడలేదు. అప్పుడంటే, కడుపునొప్పనే తారకమంత్రముండేది. ఇప్పుడూ అదే సొల్లితే రొంబ సిల్లీగా ఇరకదూ?

ఎన్ని ఎత్తులేసినా అన్ని రోజులూ తప్పించుకోలేం కదా. అప్పుడప్పుడూ వెళ్లక తప్పదు. అలా వెళ్లిన రోజు సంబందన్ నాకు ఫిట్‌నెస్ ట్రైనర్ అవతారం ఎత్తుతాడు. ‘ఆ డంబెల్స్ ఎనిమిది సార్లు ఎత్తి దించు’, ‘ఈ వెయిట్స్ ఎనిమిది సార్లు లాగు’, ‘ఎనిమిది పుషప్స్ చెయ్యి’ .. ఇలా. అన్నీ ఎనిమిదంటే ఎనిమిది సార్లే. అంతకు ఒకటి తక్కువో ఎక్కువో చేస్తే కుదరదు. ఈ ఎనిమిది గొడవేంటో నాకర్ధం కాదు. ఆ మాటడిగితే ఎనిమిది నిమిషాల పాటు తలకిందులుగా పులప్స్ చేయమంటాడేమోనని భయం.

**** **** ****

పాఠకుడా, సంబందన్ ఎందుకలా నన్ను జిమ్ముకి లాక్కెళుతున్నాడు? ఇలా పక్కవారిని బలవంతంగా జిమ్‌కి పట్టుకెళ్లేవారిని ఆంగ్లమున ఏమందురు? జవాబులు తెలిసీ చెప్పనిచో నీ బుర్ర వెయ్యి ఎనిమిది వ్రయ్యలగుగాక.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,195

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.