జిమ్ క్యారీ

ఆలిస్ పరుగాపి రొప్పుతూ చెప్పింది, ‘ఇదే మా దేశంలో అయితే, ఇంత వేగంగా అంత సేపు పరిగెత్తితే ఇంకెక్కడో ఉంటాం’

‘ఓహ్. ఎంత నిదానమైన దేశం!! మా దేశంలో, ఉన్న చోట ఉండటానికే ఇలా పరిగెత్తాలి. అదే ఎక్కడికన్నా వెళ్లాలంటే ఇంతకి రెట్టింపు వేగం కావాలి’, ఆశ్చర్యపోతూ చెప్పింది మహారాణి

ఆలిస్ ఇన్ ది వండర్‌లాండ్

——

జిమ్‌కెళ్లు వారు రెండు రకములు – తమకొరకు వెళ్లువారు, పరులకొరకు వెళ్లువారు.

అబ్రకదబ్ర సుభాషితాలు

**** **** ****

అతని పేరు మురుగవేల్ సంబందన్ – భారద్దేశంలో మన పొరుగు రాష్ట్రస్తుడు, ఆఫీసులో నా పక్క క్యూబస్థ మండూకం. మనిషి చాలా సౌమ్యుడు, తన పనేదో తను చూసుకునే రకం. మదరాసులో చదివిన కారణాన నాకు అరవోళ్లంటే కాస్త అభిమానం. అంచేత ఇతనితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.

మూడేళ్లుగా సంబందన్‌తో పరిచయం. ఇన్నాళ్లూ అంతా బాగానే ఉంది. ఈ మధ్యనే ఓ వింత సమస్య మొదలయింది. కారణం, అతనికీ మధ్య కండ కావరం ఎక్కువవటం. అంటే, కండలు పెంచాలనే కోరికన్నమాట. దానికి ముందు కసరత్తుగా నెల రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకుని పదో ఇరవయ్యో పౌండ్లు బరువు తగ్గాడు. ఈ స్థాయిలో కడుపు మాడ్చుకోవటం కాస్త అతిగా అనిపించినా పాపం అతనేదో తిప్పలు పడుతున్నాడు, నిరుత్సాహపరచకూడదు అన్న సదుద్దేశంతో నేనూ అతన్ని రెచ్చగొట్టాను, ‘ఇరగదియ్, అస్సలు తగ్గొద్దు, నిన్నెవడాపుతాడో చూస్తా, అడ్డమొచ్చినోడ్ని అడ్డంగా నరికేస్తా’ అంటూ. పన్లో పనిగా ‘నిన్ను చూస్తే నాకూ ఉత్సాహం వస్తుంది మచ్చా’ అని ఓ బూస్టింగ్ డవిలాగూ వదిలా. అయితే ఉత్తుత్తినే అన్న మాటని మావాడు ఇరుదయబూర్వగంగానే అన్నాననుకున్నాడని నాకప్పుడు తెలీదు.

**** **** ****

నెల రోజుల తర్వాత సంబందన్ ఘనాఘన సుందరా అనుకుంటూ తిరిగి ఘనాహారానికి మారిపోయాడు. మరి కొన్ని రోజులయ్యాక జిమ్‌కి వెళ్లటం మొదలెట్టాడు. కష్టపడి తగ్గిన బరువు మళ్లీ పెరక్కుండా చూసుకోటం, నాలుగు కండలు వెనకెయ్యటం దీని ప్రధాన లక్ష్యమట. అంత వరకూ బాగానే ఉంది. నోటి తీటెక్కువై నేనొదిలిన బూస్టింగ్ డవిలాగు గుర్తుంచుకుని నన్నూ జిమ్ముకి రమ్మని తెగ మొహమాట పెట్టేశాడు. నేనసలే ప్రపంచ మొహమాటస్థుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుణ్ని. ఉత్తుత్తినే అన్నా, ఉబుసుపోకకన్నా, ఓ సారి మాటన్నాక మార్చటం నాకు చేతకాని పని.

నాకిలా జిమ్ములకెళ్లి కరగదీయాల్సినంత కొవ్వయితే లేదు. ఆ త్రెడ్ మిల్లెక్కి గంటసేపు లగెత్తినా ఉన్నచోటే ఉండటం తలచుకుంటేనే చిరాకు. దాన్ని చూస్తే చిన్నప్పుడెప్పుడో చదివిన ఆలిస్ ఇన్ ద వండర్లాండ్ గుర్తొస్తుంది నాకు. జిమ్ దూరమని తప్పుకోటానికీ లేకుండా అది ఆఫీసులోనే ఉంది. ఇక తప్పక, ‘పోన్లే, కుర్రాడు ముచ్చటపడుతున్నాడు కదా, ఓసారెళ్లొద్దాంలే’ అని నచ్చజెప్పుకుని అతనితో పాటు జిమ్ముకెళ్లా. ఎవడన్నా జిమ్‌ నుండొచ్చేటప్పటికి అలసిపోయి నీరసించిపోతాడు, నేను వెళ్లేటప్పుడే నీరసంగా వెళ్లా. ఆ రోజు అతనేవో కుస్తీలు పడుతుంటే చూడటం తప్ప నేను లగెత్తిందీ, లాగిందీ, పీకిందీ లేదు.

ఆ రోజు నా నిరాసక్తత చూసి అర్ధం చేసుకుని నన్నొదిలేస్తాడనుకున్నా కానీ తంబికి అంత తెలివి తేటల్లేవని మర్చిపోయా. జిమ్ము నుండి వచ్చేటప్పుడు ‘రేపు మాత్రం జిమ్ డ్రెస్ తీసుకురావటం మర్చిపోకు’ అన్నాడు గుర్తు చేస్తున్నట్లు. పిచ్చోడు, ఆ రోజు డ్రస్ లేకనే ఖాళీగా ఉన్నా అనుకున్నట్లున్నాడు.

మర్నాడు డ్రస్ తీసుకెళ్లకుండానే చేతులూపుకుంటూ ఆఫీసుకెళ్లా. వెళ్లగానే సంబందన్ పెద్ద స్వరంతో డ్రస్ గురించి వాకబు చేశాడు. తీసుకు రాలేదంటే ‘నిన్ననే చెప్పాగా’ అన్నాడు నిష్టూరంగా. అంటే నిన్నటిది గుర్తు చెయ్యటం కాదు, హెచ్చరికన్న మాట! ‘రేపు తప్పకుండా తీసుకురా’ అని మరింత గట్టిగా గుర్తు చేసి వదిలేశాడు. ఇది హెచ్చరికో బెదిరింపో మరి!

తర్వాత రోజు డ్రస్ తీసుకెళ్లక తప్పలేదు. దాన్ని చూడగానే సంబందన్ కళ్లలో కోటి వెలుగులు విరజిమ్మాయి. నాటినుండి రోజూ మధ్యాహ్నం మూడు నుండి నాలుగు దాకా జిమ్ కార్యక్రమం అని ప్రకటించాడు. మనకి వెళ్లే ఉద్దేశముంటే కదా. అప్పటి నుండి పని మానేసి ఆ రోజే వంకతో తప్పించుకోవాలా అని తెగాలోచిస్తే రెండున్నరకి తట్టింది. ‘షూస్ తెచ్చుకోటం మర్చిపోయా. రేపట్నుండీ చేద్దాంలే’ అని చెప్పి ఆ రోజూ విజయవంతంగా ఎగనామం పెట్టేశా.

ఆ మర్నాడు షూస్ తీసుకెళ్లాను కానీ సరిగ్గా రెండూ యాభయ్యైదుకి నా క్యూబికిల్‌ నుండి మాయమైపోయా. ‘కాసేపెదురుచూసి వెళ్లిపోయుంటాడ్లే’ అనుకుంటూ అరగంట తర్వాత పిల్లిలా తిరిగొస్తే సంబందన్ నాకోసమే మాటేసుకునున్నాడు పులిలా. నన్ను చూడగానే ‘ఎన్నప్పా, ఎక్కడికెళ్లిపోయావు టైముకి’ అన్నాడు మొఖం ఇంత చేసుకుని. ఆఫీసు పనిమీద ఎక్కడికో వెళ్లానని చెప్పి ఎలాగో ఆ రోజుకీ తప్పించుకున్నా.

అలా ఏరోజుకారోజు ఆఫీసులో నా పని పని మానేసి జిమ్మెలా ఎగ్గొట్టాలా అని ఆలోచించటమే అయిపోయింది. చిన్నప్పుడు బడి ఎగ్గొట్టటానిక్కూడా ఇన్ని తిప్పలు పడలేదు. అప్పుడంటే, కడుపునొప్పనే తారకమంత్రముండేది. ఇప్పుడూ అదే సొల్లితే రొంబ సిల్లీగా ఇరకదూ?

ఎన్ని ఎత్తులేసినా అన్ని రోజులూ తప్పించుకోలేం కదా. అప్పుడప్పుడూ వెళ్లక తప్పదు. అలా వెళ్లిన రోజు సంబందన్ నాకు ఫిట్‌నెస్ ట్రైనర్ అవతారం ఎత్తుతాడు. ‘ఆ డంబెల్స్ ఎనిమిది సార్లు ఎత్తి దించు’, ‘ఈ వెయిట్స్ ఎనిమిది సార్లు లాగు’, ‘ఎనిమిది పుషప్స్ చెయ్యి’ .. ఇలా. అన్నీ ఎనిమిదంటే ఎనిమిది సార్లే. అంతకు ఒకటి తక్కువో ఎక్కువో చేస్తే కుదరదు. ఈ ఎనిమిది గొడవేంటో నాకర్ధం కాదు. ఆ మాటడిగితే ఎనిమిది నిమిషాల పాటు తలకిందులుగా పులప్స్ చేయమంటాడేమోనని భయం.

**** **** ****

పాఠకుడా, సంబందన్ ఎందుకలా నన్ను జిమ్ముకి లాక్కెళుతున్నాడు? ఇలా పక్కవారిని బలవంతంగా జిమ్‌కి పట్టుకెళ్లేవారిని ఆంగ్లమున ఏమందురు? జవాబులు తెలిసీ చెప్పనిచో నీ బుర్ర వెయ్యి ఎనిమిది వ్రయ్యలగుగాక.

15 Responses to “జిమ్ క్యారీ”


 1. 1 సుగాత్రి 12:32 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  పాఠకురాళ్లు చెప్పకూడదా? లేక “వాళ్లకేం తెలుసు” అనుకున్నారా? మీకు ఈ వివక్ష ఏల?

 2. 2 కె.మహేష్ కుమార్ 3:04 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  మొత్తానికి మీకూ కొంత కండకావరం ఇలా పెరుగుతోందన్నమాట! త్రెడ్ మిల్ కీ అలిస్ ఇన్ వండర్ ల్యాండ్ కీ లంకె భలే కుదిరింది. మీ సహజశైలిలో సాగింది టపా…బాగుంది.

 3. 3 sujata 3:49 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  సంబంధన్ నల్ల వాడు (మంచి వాడు) గాబట్టి మిమ్మల్ని జిం కి రమ్మంటున్నాడు ! అయితే, మీరు కడుపునొప్పని సెటిల్ అయిపోండి. అదే తర తరాలుగా బడులూ, ఆఫీసులూ, జిం లూ ఎగ్గొట్టడానికి మన వ్యవస్థ లో పాతుకుపోయిన మరియూ తిరుగులేని సాకు (ఎదుటివాడికి ఇది సాకు అని అర్ధం అయిపోతుంది క్లియర్ గా!) సంబంధన్ కి కొన్నాళ్ళకి కండలు వస్తే తొందరపడిపోయి పొగిడెయ్యకండి. మిమ్మల్ని కూడా రమ్మని బలవంతం చేసేయగలడు. ముఖ్యంగా అతన్ని మచ్చా అనడం మానెయ్యండి. కొన్నాళ్ళకి అతనే మీ దారికి వస్తాడు.

 4. 4 Vamsi 4:11 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  >>ఇప్పుడూ అదే సొల్లితే రొంబ సిల్లీగా ఇరకదూ?

  reminded me of RAW officer(character name: Balaram, not sure) in Dasavatharam movie:D…

  >>సంబందన్ ఎందుకలా నన్ను జిమ్ముకి లాక్కెళుతున్నాడు?
  పోతే గీతే ఇద్దరూ పొతారేమో అని…. తోడు కావాలి కదా మరి!!!!

  btw, Fonts are very small… for readers, if you can use bigger font size…it will be more comfortable… Of course We can increase font-size in the browser every time we see your blog… But if its possible for u to change it while writing the post itself, it will be easier for the readers….

  –Vamsi

 5. 5 కృష్ణమోహన్‌ 4:29 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  అబ్రకదబ్ర గారూ, కాసేపు నవ్వుకున్నా! ఎందుకు మిమ్మల్ని పట్టుకెళుతున్నాడంటారా? అన్యాయం సుమండీ! నేను అనుభవించిందే ఆనందం – నేను కనుక్కున్నదే సత్యం – నేను చూసిందే నిజం – ఇలాంటివాళ్ళు మీకు వేరే ఎక్కడైనా కనిపిస్తే క్షమించగలిగి, ఒక్క జిమ్ము దగ్గర క్షమించలేకపోతున్నారా?

 6. 6 బ్రహ్మి-సాప్ట్ వేర్ ఇంజినీర్ 4:31 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  క్యూబస్థ మండూకం – పోలిక బాగుంది. ఎప్పటిలానే టపా అదిరింది.

 7. 7 Purnima 7:11 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  లావుగా ఉన్నవారే అనుకున్నా, ఇలా మీలాంటి వారూ బుక్ అయ్యిపోతున్నారని తెలీదు.

  ఈ టపాలో నిజానిజాలు పక్కకు పెడితే, టపా మాత్రం అదుర్స్!

 8. 8 anamaka 8:02 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  “tell him the TRUTH!”

  AllaDin sinimAlO the gene says the same thing.

 9. 9 bollojubaba 8:11 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  బాగుంది
  మహేష్ గారన్నట్లు అలిస్ పోలిక రెండు సార్లు చదివితే కానీ అర్ధం కాలేదు. భలె కలిపారు. బ్రహ్మాండంగా సరిపోయింది.

  బొల్లోజు బాబా

 10. 10 రానారె 8:27 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  క్యూబస్త మండూకం – భలే మాటను సృష్టించారు. సూపర్.

 11. 11 ప్రవీణ్ గార్లపాటి 10:41 ఉద. వద్ద సెప్టెంబర్ 25, 2008

  మరదే జిమ్ క్యారీ పవరు… చూస్తుంటే నా చేత కూడా జిమ్ము చేయగలిగించేట్టున్నాడు మీ సంబంధన్.

 12. 12 కుమార్ 10:35 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  జిం క్యారి అంటే (home)Gym ని కొనుకున్నాక నాలుగు రోజులు వాడి తరువాత మారిన ప్రతి ఇంటికి carry చెస్తుంటారు అది అనుకన్నాను కాని దాని వెనుక (ఇంత సంబంధం ఉన్న) సంబంధన్ ఉన్నాడని అనుకోలేదు సుమా!

 13. 13 nagaprasad 2:30 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  రమ్మంటోంది జిమ్ము కే గా. కాసేపు వెళ్ళి “తంబి” ని ఎంకరేజ్ చేసి “కండల వీరుడు” కమలహాసన్ లాగా తయారు చేయొచ్చుగా.

 14. 14 shivaspeaks 3:29 ఉద. వద్ద సెప్టెంబర్ 27, 2008

  క్యూబస్త మండూకం 🙂

 15. 15 Wanderer 4:23 సా. వద్ద సెప్టెంబర్ 11, 2012

  నేను మొట్టమొదటి సారి ట్రెడ్మిల్ ని చూసినప్పుడు Alice in the Wonderland లోని exactly అవే లైన్లు గుర్తుకొచ్చాయి. అవి ఇక్కడ అదే context లో చదివేసరికి పిచ్చి ఆనందం వేసింది. మనలాంటి ఆలోచనే ఇంకోళ్ళకి వచ్చిందే అని.

  మా జిమ్ములో అబ్బాయిలంతా అమ్మాయిలని చూడటానికీ, వాళ్ళని తమ కసరత్తుల్తో ఇంప్రెస్ చేసి పడెయ్యటానికీ వస్తూంటారు. మీ జిమ్ములో అలా ఇన్స్పిరేషన్ కలిగించే అమ్మాయిలెవరూ లేరా? మీ సంబందానికి అలాంటి ఇన్స్పిరేషనేమైనా దొరికిందేమో వాకబు చేసారా? మీరు రెండు పుషప్పులు కూడా చెయ్యకుండా నిలబడి చూస్తూ ఉంటే తను ఎనిమిది పుషప్పులు చేసేసి వీరుడైపోతున్నాడేమో అమ్మాయిల ముందు.. గ్రహించారా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 276,621

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: