ఉప్పు, కారం, దేశభక్తి

ఈ మధ్య వచ్చిన ‘సింగ్ ఈజ్ కింగ్’ అనే సినిమాలో ఓ చోట భారత జాతీయ గీతం వస్తుంది. అప్పుడు ప్రేక్షకులెవరూ లేచి నిలబడటం లేదట, అందుకని దర్శక నిర్మాతలు తెగాలోచించి సినిమా మొదట్లో ‘జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడండి మహానుభావులారా’ అని ఓ అభ్యర్ధనాపూర్వక ప్రకటన తగిలించారు. దాన్ని పాటించేవాళ్లు ఎందరు అనేది వేరే విషయం. అసలీ అర్ధరహిత హాస్య చిత్రంలో జాతీయ గీతాన్ని ఇరికించాల్సినంత అవసరమేమొచ్చింది? బాలీవుడ్ వంటకాల్లో దేశభక్తనేదో మసాలా దినుసైపోయిందనేదానికిదో ఉదాహరణ.

ఆరేడేళ్ల క్రితం వరకూ వచ్చిన హిందీ సినిమాల్లో పాకిస్తాన్‌ని తిట్టటం ఓ ఘనకార్యంలా ఉండేది. కధానాయకుడు ఒక్కడే సరిహద్దు కంచె దూకేసి అవతలకెళ్లిపోయి పాక్ సైన్యాన్నంతటినీ కట్టగట్టి ఉత్తిచేతుల్తో చావబాదేస్తుంటే ప్రేక్షక జనాలు ఛాతీలు ఉబ్బించుకుని మరీ చూసి తరించేవాళ్లు. తర్వాత ఫార్ములా తిరగబడింది. అ.బి.వాజపేయి గారి సంఝౌతా రైలు వల్లనో మరెందుకో కానీ ఉన్నట్లుండి దర్శక నిర్మాతలకి పాకిస్తానీయులపై ప్రేమ పొంగి పొర్లింది. అప్పట్నుండీ కొన్నేళ్లు వరసగా ‘భారత్-పాక్ భాయీ భాయీ’ అంటూ సోదర ప్రేమ ఒలకబోసే సన్నివేశాలు దట్టించిన చిత్రరాజాలు రాలిపడ్డాయి వెండి తెరమీద. ప్రేక్షక జన గణం అలవాటుగా ఈ ఉదారత్వానికీ జైకొట్టేసి అక్కున చేర్చుకుంది. ఈ మోజు క్రీడారంగానికీ పాకింది. అంతకు ముందు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే యుద్ధాన్ని తలపించేది. పాకిస్తానుకి మద్దతిచ్చేవాళ్లు దేశద్రోహుల కిందనే లెక్క. మరి ఇప్పుడో, పాకిస్తానీ క్రికెటర్లంటే అవ్యాజానురాగాల ప్రదర్శన. ఎంతలో ఎంత మార్పు? ఇంతకు ముందంత ఘోరంగా దాయాది దేశాన్ని ద్వేషించేవాళ్లు ఇప్పుడు మరీ ఎక్కువ మంది లేరని చెప్పొచ్చు. పాకిస్తానుని ద్వేషించటం పదేళ్ల క్రితం ట్రెండ్. వాళ్లని అభిమానించటం ఇప్పటి ఫ్యాషన్. ఇండియా-పాక్‌ల చెలిమి చిగుర్లు వేస్తున్న తరుణంలో ఈ కొంగ్రొత్త పోకడని అక్కున చేర్చుకోవటం నేటి దేశభక్తి. మంచి మార్పే, కానీ ఈ బుద్ధి ఇంతకు ముందేమయింది?

చెప్పొచ్చేదేమంటే, దేశభక్తిని ప్రదర్శించే పద్ధతులు కాలంతో పాటు మారుతుంటాయి. ఒకప్పుడు దేశద్రోహం అనుకున్న పనే నేడు దేశభక్తికి తార్కాణం కావచ్చు. స్వతంత్రానంతరం ఎనభయ్యో దశకం దాకా మన దేశంలో సోవియెట్ జపం తారాస్థాయిలో ఉండేది. ‘గర్జించు రష్యా, గాండ్రించు రష్యా’ అన్న మహాకవి వాక్కులకి ఉప్పొంగని గుండెలు అప్పట్లో అరుదే. ఒక తరం మొత్తం ‘రష్యా మిత్ర దేశం, అమెరికా శత్రు దేశం’ అనుకుంటూనే తెల్లారిపోయింది. తొంభైల నుండీ లెక్కలు మారటం మొదలయ్యాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో రష్యాని ఇంకా గర్జించమనే ఎర్ర జెండాలోళ్లు ప్రగతి నిరోధకులు, దేశద్రోహులు ఐపోయారు. అదే సమయంలో అమెరికా మన ‘సహజ మిత్రుడు’ గా మారిపోయింది. ఊరికి వందమంది కుర్రాళ్లు అమెరికా ఉద్యోగాలకై ఎగిరిపోతున్న ఈ రోజుల్లో అమెరికా జపం దేశద్రోహం కాదు. దేశభక్తంటే ఏ ఎండకా గొడుగు పట్టటమన్నమాట.

అధిక శాతం భారతీయుల విషయంలో దేశభక్తి అనేది అడపాదడపా అనవసరమైన విషయాల్లో మాత్రమే ఉప్పొంగే భావావేశమే కానీ ఓ జీవిత కాలపు నిబద్ధత కాదు. జనగణమన వినిపిస్తే నీలుక్కుపోవటమే దేశభక్తి. నాయకులు చెప్పారని రోజుకో దేశాన్ని ద్వేషించటం దేశభక్తి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష, తెల్లోడు వాటినే కాజేసి కొత్త వస్తువులు కనిపెట్టేశాడని గొప్పలు పోవటం దేశభక్తి. మా తాతలు నేతులు తాగారనటం దేశభక్తి. మన సమస్యలన్నిటికీ ఆంగ్లేయులనో, మొగలాయీల్నో తిట్టటం దేశభక్తి. అమెరికానో ప్రపంచ బ్యాంకునో ఆడిపోసుకోవటం దేశభక్తి. ఎవడి మీద పడి ఏడుద్దామనే విషయంలో తేడాలున్నా, ఎవడో ఒకడి మీద పడి ఏడవటంలో మాత్రం ఏకాభిప్రాయమే. అలా చెయ్యనివాడు నూరణాల దేశద్రోహి. ఈ రీతిన జనాలుంటే దేశమే గతి బాగుపడునోయ్?

13 స్పందనలు to “ఉప్పు, కారం, దేశభక్తి”


 1. 1 కె.మహేష్ కుమార్ 6:39 సా. వద్ద సెప్టెంబర్ 22, 2008

  మంచి టపా! ఒకదేశంలో పుట్టాంగనక ఆ దేశాన్ని unconditional గా ప్రేమించడం లేదా ప్రేమించినట్లు తెలియజెప్పడం లేదా నటించడం ఒక default setting అంతే! దాదాపు ఇలాంటి ముక్కే నేనంటే నామీద చాలా మంది విరుచుకుపడి, కౌంటర్ టపాలు రాసారు. ఈ విషయంపై నాటపా ఈ క్రింది లంకెలో చూడండి.
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_19.html

 2. 2 వికటకవి 7:57 సా. వద్ద సెప్టెంబర్ 22, 2008

  >> దేశభక్తంటే ఏ ఎండకా గొడుగు పట్టటమన్నమాట.

  అది సత్యం కాదు. దేశభక్తి అంటూ జనగణమణ వినపడ్డప్పుడల్లా లేచి నుంచునే ఓ వీరభక్తి భావన ప్రజల్లో లేకపోవచ్చేమో గానీ(అసలు ఎక్కడపడితే అక్కడ నిలబడి ఉండాల్సిన అవసరం ఉందా?), అంత మాత్రం చేత ప్రజలు దేశాన్ని సమయానుకూలంగా ప్రేమిస్తున్నారనటం సరికాదేమో.

  >> మంచి మార్పే, కానీ ఈ బుద్ధి ఇంతకు ముందేమయింది?

  కారణాలు ఉన్నాయ్. ఒకప్పటిలా సరిహద్దుల్లో జవాన్లు రోజుకు కొందరు చొప్పున చనిపోవట్లా. మన దేశంలో బాంబు దాడులు జరుగుతున్నా, తమ తలని తామే కాపాడుకోలేని ఇప్పటి పాకిస్తాన్ ప్రభుత్వాలకి, ఇండియాలో వేలు పెట్టి బాంబు దాడులతో పీడించి ఆనందించే సమయం లేదని ప్రజలకి అర్ధమయింది. ఈ భయోత్పాతాలు, బాంబు దాడులు గతంలో లాగా సరయిన విచారణ లేకుండా, “విదేశీ శక్తులు” అంటే నమ్మే జనాలు లేరు. తీవ్రవాదం అన్నది పాకిస్తాన్ వల్ల మాత్రమే జరగట్లేదన్న సత్యం ప్రజలకి బాగా అర్ధమయింది. పది పదిహేను ఏళ్ళనాటి పాకిస్తాన్ పరిస్థితి, తాను ఎదగకుండా మనల్ని ఎదగనీయకుండా చేసే శాడిస్టు చర్యలు. అదే ఇప్పటి పాకిస్తాన్ పరిస్థితి, తాను పీకల్లోతుకి కష్టాల్లో దిగజారి ఇతరుల కీడు కన్నా, తన పీకను తాను కాపాడుకోవాల్సిన ఆగత్యం. అయితేనేం, దానివల్ల మన పరిస్థితి గతం కంటే నయం (కేవలం పాకిస్తాన్ మన పొరుగునున్న దుష్ట దేశం అని మాత్రమే ఆలోచిస్తే). ఇవి చాలవూ పాకిస్తాన్ పైన వ్యతిరేక అభిప్రాయాలు గతం కన్నా కొంత కాకపోతే కొంత తగ్గటానికి.

 3. 3 రవి 2:53 ఉద. వద్ద సెప్టెంబర్ 23, 2008

  దేశ భక్తి అన్నది theory (సిద్ధాంతం) మాత్రమే. సిద్దాంతాలకంటే మనిషి గొప్పవాడు అని ఓ ఆగష్టు 15 వ తారీఖు నాకు అనిపించింది. అదే ఓ టపాలా రాశాను. అయితే, ఇందులో చైతన్యం లేని జడత్వపు భావన అని ఓ సమాధానం లభించింది.

 4. 4 దిలీపు మిరియాల 6:00 ఉద. వద్ద సెప్టెంబర్ 23, 2008

  అన్నట్టు సినిమాలో జాతీయగీతానికి లేచి నిలబడనవసరం లేదని సుప్రీం కోర్టు రూలింగు ఇచ్చింది. (కరణ్ జోహార్ , షారుఖ్ ఖాన్ సినిమాలో వున్న ‘జనగణమణ’ గీతం సంధర్భంలో )

 5. 5 ఉమాశంకర్ 10:07 ఉద. వద్ద సెప్టెంబర్ 23, 2008

  కొద్దిగా పరుషమైన పదజాలాన్నే ఉపయోగించారు. ఫ్యాషన్ అన్నారు, ఏ ఎండకా గొడుగు పట్టడం అన్నారు.

  దేశభక్తి లో వచ్చిన మార్పు గురించే మీరు చెప్పారు గాని ఎందుకు మార్పు వచ్చిందో ఆలోచించారా? అనుకోకూడదు గాని, నిన్న మొన్నటి వరకు అంటే తొంబయ్యో దశకం మొదటి వరకూ జనానికి సమాచారాన్నందించే విషయం లో మనం చైనా కి ఏ మాత్రం తీసిపోము(ఇది వినటానికి కొద్దిగా కటువుగా ఉండొచ్చు). ఏమి జరిగినా మనకున్న మాధ్యమాలు రెండే రెండు, AIR మరియు దూరదర్శన్. రెండూ భారత ప్రభుత్వ కనుసన్నల్లో పనిచెసేవే. సరిహద్దుల్లో ఎమి జరిగినా, కాశ్మీర్ లో ఏమి జరిగినా, అన్ని సందర్భాల్లో కాకున్నా చాలా వరకు(ముఖ్యంగా భారత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయాల్లో) మనకు లభించే సమాచారం పూర్తిగా ఏకపక్షం. కొన్ని దశాబ్దాల బాటు ఈ రకమైన భావజాలం లో ఉన్న మనకు మన పక్కదేశం అంటే ఏహ్య భావం కలగడం లో ఆశ్చర్యం ఏముంది? ప్రయివేటు యాజమాన్యం లో ఉన్న వార్తా పత్రికలలో నూ ఇదే తంతు చాలా వరకు. మొదటి పేజీ లొ “సరిహద్దు లో భారత జవాను మృతి” కి ఉన్న impact మూడో పేజీలొ కులదీప్ నయ్యర్ లాంటి వాళ్ళు యెత్తి చూపే మన తప్పుల్లో ఉండదు. ఎప్పుడైతే 90 ల్లో శాటిలైట్ ప్రసారాలు మొదలయ్యాయో అప్పటి నుంచి మార్పు నెమ్మదిగా మొదలైంది. AIR లొ ఉండె ఒకప్పటి “as per the spokesman” నుంచి లైవ్ లొ “as it is happening” కి మారి పోయింది ఇప్పుడు. ఎప్పుడైతే ఆ రెండో పక్క జరిగేది కూడా తెలుస్తుందో అప్పుడే ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. సంఝౌతా లో వెల్లివిరిసిన సౌభ్రాతృత్వం “కార్గిల్” లో అటకెక్కింది గమనించలేదా? కష్ట కాలంలో మనమంతా ఒకటవలేదా? కష్టాలొస్తేనే ఒకటవుతారా అంటారేమో? ఏ మాట కా మాటే చెప్పుకొవాలి, మనదేశంలొ అన్నిటికీ పోరాటమే, వైద్యానికి కానీయండి, లెదా ఒక గవర్నమెంటాఫీసులో పని కానీయండి, చివరకి సినిమా టిక్కెట్లకి, క్రికెట్ మాచ్ టిక్కెట్లకు కూడా పైరవీలే. రోడ్డు మీదికొస్తే, ఇంటి కెళ్ళేవరకు ఒక ట్రాఫిక్ గానీ, ఇంకేమైనా గాని ప్రతిదీ మనకి చికాకు కలిగించెదే. ఈ పరిస్థితుల్లో మనసుకి కొద్దిపాటి కష్టం కలిగి దేశాన్ని తిట్టు కున్నంత మాత్రాన దేశాన్ని కాల దన్నుకున్నట్లు కాదు. అభివృద్ది చెందిన దేశాల్లొ ఇలా ఉండదు. అందుకే వాళ్ళది జీవిత కాలపు నిబద్దత లాగా అనిపిస్తుంది, మనది ద్వంద ప్రవృత్తి లాగా అనిపిస్తుంది. అమెరికా లో అవకాశాలు ఉండి ఇక్కడికి వస్తే ప్లేటు ఫిరాయించినట్లేమీ కాదండీ. కొద్దిగా బాధ గాఉంది మీనుండి ఈ మాట వింటుంటే.

  నేను చెప్పొచ్చేదేమంటే, సమాచార రంగంలో వచ్చిన పెనుమార్పే దేశభక్తి విషయంలో ఈ మార్పుకి నాంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా అన్నిరకాల విశ్లెషణలతో అది మనముందుంటోంది, దాయటానికేమీలేదు.

 6. 6 అబ్రకదబ్ర 12:02 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  @మహేష్:

  ఆ టపా చదివాను. అప్పుడే నేనూ ఈ అంశమ్మీద నా ఆలోచనలు రాయాలనుకున్నాను కానీ కుదర్లేదు. నాలుగు రోజుల క్రితం జీ-టీవిలో ‘సారేగామాపా’ అనబడే సరిగమప సంగీత కార్యక్రమంలో సారా రజా ఖాన్ అనే ఓ లాహోర్ అమ్మాయి చేసిన తంతు చూసినప్పుడు ఈ టపా వెంటనే రాయాలనిపించింది.

  @వికటకవి:

  జనగణమన వినిపిస్తే లేచి నిలబడాలనేది నా ఉద్దేశం కాదండీ. జాతీయగీతం కూడా ఓ మసాలా సరుకైపోయిందనేది నా ఆవేదన. (మన్లో మాట, నాకు జనగణమణని జాతీయ గీతం చెయ్యటం మీద భీకరమైన అభ్యంతరాలున్నాయి. దానికన్నా ‘సారే జహాసే అచ్చా’ బాగుండేదని నా అభిప్రాయం. జనగణమన వెనకనున్న వివాదం సంగతవతలుంచితే, ఆ బాణీ చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు. అసలు జాతీయగీతం అంటే ఎంత ఉత్తేజపూరితంగా ఉండాలి?)

  @రవి:

  మీ టపా లంకె ఇస్తే బాగుండేది.

  @దిలీప్:

  ఆ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’ అనుకుంటాను. నిజమేనా? అది మరో మసాలా ఉదాహరణ. ‘బోర్డర్’ లాంటి సినిమాలో కధననుసరించి జాతీయగీతమో, దేశభక్తి పూరిత సన్నివేశం మరోటో పెట్టటం ఒక రకం. సందర్భంలేకుండా ‘చూశారా మా దేశభక్తి’ అన్నట్లు దాన్నిరికించటం మరో రకం.

  @ఉమాశంకర్:

  >> “అమెరికా లో అవకాశాలు ఉండి ఇక్కడికి వస్తే ప్లేటు ఫిరాయించినట్లేమీ కాదండీ”

  నేనలా అనలేదండీ. నేనూ అలా వచ్చినవాడినే. దేశభక్తి అనబడేదానికి మనం పాటించే ప్రమాణాలు స్థిరంగా ఉండనప్పుడు, ఆ ప్రమాణాలతో దేశభక్తిని కొలవటం ఎందుకు అన్నది నా ప్రశ్న.

  >> “ఈ పరిస్థితుల్లో మనసుకి కొద్దిపాటి కష్టం కలిగి దేశాన్ని తిట్టు కున్నంత మాత్రాన దేశాన్ని కాల దన్నుకున్నట్లు కాదు”

  మీరు నా వ్యాసాన్ని సరిగా అర్ధం చేసుకోలేదు, లేదా నేనే అంత స్పష్టంగా నా అభిప్రాయాలు వెల్లడించలేకపోయాను. నేను చెప్పాలనుకున్నది, ‘మన వాళ్ల దేశభక్తి అనవసరమైన విషయాల్లో వెల్లువెత్తుతుంది’ అన్న విషయం.

  >> “కొన్ని దశాబ్దాల బాటు ఈ రకమైన భావజాలం లో ఉన్న మనకు మన పక్కదేశం అంటే ఏహ్య భావం కలగడం లో ఆశ్చర్యం ఏముంది”

  అదే నా బాధ కూడా. ప్రభుత్వమూ, నాయకులూ తమ విధానాలని ప్రజల మీద రుద్దటానికి వాడుకునేదే ఈ దేశభక్తి అనే ముసుగు. సమాచారం ఎలాంటిదైనా, అసలు మనకి పరిచయం లేనివారి మీద ఏహ్యభావం కలగాల్సిన అవసరమేముంది? వాళ్ల గురించి మనం అనుకున్నట్లే మనగురించి వాళ్లూ అనుకుంటారన్న జ్ఞానం ఉంటే చాలు కదా. కార్గిల్ గురించో, కాశ్మీర్‌లో పాకిస్తాన్ రాజేసే నెగళ్ల గురించో ఆవేశపడే వాళ్లలో ఎందరు సింధ్‌లో మన ‘రా’ నిర్వాకాల గురించి, ఎల్టీటీయీకి ఆదిలో తోడ్పాటందించి శ్రీలంకని రావణకాష్టంగా మార్చిన భారత విధానాల గురించి నిజాయితీగా మాట్లాడతారు? ఇవన్నీ AIR, దూరదర్శన్ ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లోనే నాకు అవగాహన ఉన్న విషయాలు. ఇప్పుడున్నంత మీడియా చైతన్యం అప్పుడు లేకపోయినా, నిజం తెలుసుకోవాలనుంటే అప్పటి దారులు అప్పుడూ ఉన్నాయి.

 7. 7 ఉమాశంకర్ 2:24 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  మీ వ్యాసం మూడొంతులు పైగా “మార్పు” గురించి సాగింది కాబట్టి నేను కూడా దాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రత్యుత్తరమిచ్చాను. అసందర్భం గా రాసి ఉంటే క్షంతవ్యుణ్ణి.

  మనకి పరిచయం లేనివాళ్ళ మీద ఏహ్య భావం ఎలా కలుగుతుంది అన్నారు, మన పక్క దెశం మనకి పరిచయం లేనిదెలా అవుతుందండీ? ఇక్కడ మనం మాట్లాడేది వ్యక్తుల గురించి కాదు కదా! భారత స్వాతంత్రోద్యమం, దేశవిభజన అంటూ అసలు కధ మొదలయ్యేదే దేశాల ప్ర్రాతిపదిక మీద కదా?

  >>అప్పటి దారులు అప్పుడూ ఉన్నాయి

  నా ఊహ ప్రకారం మీ నేపధ్యం లాంటిదే నాది కూడా.. అప్పట్లో అసలు విషయం తెలియాలంటే కొద్దిపాటి శ్రమ, ఇంట్రెస్టు అవసరం. ఇప్పుడలాంటి అవసరం లేదు, టాక్ షో లు కానీండి, వార్తా విశ్లేషణ లు కానీండి డైరక్టు గా మన లివింగ్ రూం లోకే వచ్చేస్తున్నాయి ఇండియాలో.

  ఇక రాజకీయ నాయకుల అవకాశ వాదం అంటారా? బ్లాగులోకం లో ఏకాభిప్రాయం ఉండే అతికొద్ది విషయాల్లో అదొకటి అనుకుంటున్నాను(ప్రస్తుతానికి) ..

 8. 8 అబ్రకదబ్ర 3:13 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  ఉమాశంకర్ గారు,

  >>”అసందర్భం గా రాసి ఉంటే క్షంతవ్యుణ్ణి”

  నా బ్లాగులో సభ్యమైన భాషలో వ్యక్తిగత విమర్శల్లోకి దిగకుండా రాసినంత కాలం అది ఎంత భిన్నాభిప్రాయమైనా సరే అపాలజీస్ ప్రస్తావనే అనవసరం 🙂 అవి నేను చెప్పను, మరొకరి నుండి ఆశించను.

  ఓపికగా ప్రత్యుత్తరమిచ్చినందుకు ధన్యవాదాలు.

 9. 9 శ్రీ కుమార్ 5:17 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  పాలిచ్చి పెంచిన తల్లిని, నీడనిచ్చి కాయలు పంచే చెట్టుని, తలదాచుకున్న ఇంటిని, అన్నంపెట్టె చేతిని చేతిని ప్రేమించడం దేశభక్తి.

  Anyway please check out the Contemporary notions of patriotism
  http://en.wikipedia.org/wiki/Patriotism

 10. 10 VenkataRamana 12:17 ఉద. వద్ద అక్టోబర్ 26, 2009

  ఆలోచింపచేసే టపా. కష్టం వస్తేనే గుర్తుకు వచ్చి, మళ్ళీ పోయే దేశభక్తి వలన ఉపయోగం ఏమీ లేదు. ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.

 11. 11 నూర్ బాషా రహంతుల్లా 4:26 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2012

  గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
  “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

  ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
  ‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.

 12. 12 జీడిపప్పు 11:34 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2012

  కాస్త ఈ “అమెరికా ద్వేషాన్ని” పక్కనపెట్టి ఆలోచించండి రహంతుల్లా గారు. ముందు ఇండియాలో ఉండి అమెరికాకు ఊడిగం చేస్తున్న కోటిమందికి పైగా ఊడిగస్తులతో ‘దేశసేవ” చేయించండి. అది సరిపోకపోతే అమెరికానుండి పిలిపించవచ్చు.

 13. 13 Rao Lakkaraju 12:40 సా. వద్ద ఆగస్ట్ 6, 2012

  కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.
  ———-
  నిజం. ఆ డాలర్లు ఇండియాకి ఇదివరకటి లాగా పంపిస్తుంటే రూపాయి ఇంతగా పడిపోయేది కాదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: