భారతీయుల ఆహారపుటలవాట్ల గురించి మా కెఫటేరియాలో పనిచేసే మెక్సికన్ వంటవాడికో ధర్మసందేహం వచ్చిందోసారి. అతని పేరు ఎన్రికే. సిలికాన్ వ్యాలీ లోని అన్ని ఐటి సంస్థల్లా నేను పనిచేసే కంపెనీలోనూ ‘దేశీగాళ్ల’ సంఖ్య ఎక్కువే. దానితో ఎన్రికే కి నాలాంటి భారతీయ గెస్టులు కొత్త కాదు. ఎన్నాళ్లుగా ఉగ్గబట్టుకునున్నాడో కానీ, ఒకానొక మధ్యాహ్నం లంచ్ సమయంలో అదను చూసుకుని నన్నడిగేశాడు.
‘అమిగో, మీ ఇండియన్స్ కోసం వంటకాలు కస్టమైజ్ చేసేసరికి నా దుంపతెగిపోతుంది. కొందరు కేవలం శాకాహారులు, కొందరేమో మాంసాహారులు. మాంసాహారుల్లో చాలామంది బీఫ్ తినరు. కొందరికి బీఫ్ అయితే ఓకే కానీ పోర్క్ పడదు. ఇంకొందరికి గుడ్డు కూడా మాంసాహారం కిందనే లెక్క. మరి కొందరికేమో చేపలు శాకాహారం! అన్నిటికన్నా విడ్డూరం, కొందరు వారంలో కొన్ని రోజులు శాకాహారులు ఇంకొన్ని రోజులు మాంసాహారులు!! ఇన్ని వెరైటీలేమిటి అమిగో?’.
ఆ తేడాలన్నీ అతనికి వివరంగా చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. చాలా క్యూరియాసిటీ ఉన్న మనిషి మరి. ఎలాగోలా అతన్ని వదిలించుకున్నాక నాకూ అనిపించింది, ‘నచ్చింది – నచ్చలేదు ఈ రెండు కారణాలు చాలవా మాంసం తినటానికీ తినకపోవటానికీ? దేవుళ్లు, పాపం, పుణ్యం, వ్రతాలు, మొక్కులు, మెట్ట వేదాంతం ఇవన్నీ అవసరమా?’ అని.
* * * *
నా స్నేహితుడొకడున్నాడు. అసలు పేరు రాజు. ఇక్కడ తెల్లోళ్లు అదేదో మెక్సికన్ పేరనుకుని బహు మర్యాదగా రాహు అని పిలుస్తారతన్ని (San Jose ని శాన్ హోసే అని పలికినట్లు). రాహుకి చికెన్ కర్రీ అంటే ప్రాణం. మరొక స్నేహితుడున్నాడు – పేరు వేదాంతి అనుకుందాం. ఇతనో కరడుగట్టిన శాకాహారి. తను తినకపోవటమే కాక, మాంసాహారులతో వాదులాటేసుకుని అది ఎందుకు తప్పో, ఎంత పాపమో వగైరా విషయాలమీద గంటలకొద్దీ ట్యూషన్ చెబుతాడు. ఆ దెబ్బకి అతని బాధితులు పూర్తిగా మానేయకున్నా కొద్దిరోజుల పాటన్నా మాంసాహారం జోలికెళ్లటానికి జంకుతారు.
ఓ సందర్భంలో వీళ్లిద్దరూ మా ఇంట్లో కలుసుకున్నారు. అప్పటిదాకా వాళ్లు నాకు విడివిడిగా స్నేహితులే కానీ ఒకరికి ఒకరు తెలియదు. పరిచయాలు, కుశల ప్రశ్నలు, పిచ్చాపాటీ అనంతరం భోజన కార్యక్రమం మొదలయింది. రాహు దగ్గర్లో ఉన్న హైదరాబాదీ బిరియానీ హౌస్ నుండి తనకోసమే ప్రత్యేకంగా తెప్పించిన కోడి బిర్యానీ ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అతని కళ్లు అరమోడ్పులై ఉన్నాయి. ఆ తన్మయత్వం చూసిన వేదాంతికి అలవాటుగా చిర్రెత్తింది. వెంటనే తరగతి మొదలయింది.
‘అంతగా ఏముందండీ అందులో? అంత ఇష్టంగా తింటున్నారు!’, నవ్వు ముఖంతో క్వొశ్నించాడు వేదాంతి.
తిండి మధ్యలో తననెవరన్నా కదిలిస్తే రాహుకి పట్టరాని కోపం వస్తుంది. కానీ వేదాంతి అతనికి కొత్తవాడు కావటం వల్ల కోపాన్ని దాచుకుని బెనర్జీలా భావరహితమైన ముఖంతో బదులిచ్చాడు, ‘తిని చూడండి సార్. మీకే తెలుస్తుంది’.
సంవాదం మొదలయింది. నేను సరదాగా చోద్యం చూస్తున్నాను. వాదనలో ఇద్దరూ ఘటికులే కావటంతో ఎవరూ తగ్గటం లేదు. కాసేపయ్యాక వేదాంతి తన తూణీరంలోనుండి ఓ అస్త్రం తీసి వదిలాడు, ‘అసలు .. మాంసాహారం తినాల్సింది పులులు, సింహాల్లాంటి కౄర జంతువులండీ. మనుషులు తినటమేంటి? మనకీ జంతువులకీ తేడా లేదా?’.
ఈ బాణం అల్లాటప్పా వాళ్లకయితే లోతుగా దిగేదే కానీ రాహు అల్లాటప్పావాడు కాదు. అతి సులువుగా తిప్పి కొట్టాడు దాన్ని.
‘గేదెల్లా గడ్డి తిన్నా జంతువుల కిందనే లెక్క కద సార్. ఐనా, పులులు, సింహాల్లా మనక్కూడా 3-డి విజన్ ఉంది వేటాడి తినటానికే కానీ గడ్డి కోసుకు తినటానిక్కాదు’.
వేదాంతికి ఇది ఊహించని బదులు. సైన్సు పాఠం వినాల్సొస్తుందనుకోలేదతను. వెంటనే రూటు మార్చాడు. ‘అది హలాల్ చేసిన కోడేనా?’ నాకేసి చూస్తూ అడిగాడు.
‘ఆ హోటల్లో వంటవాడు పాకిస్తానీ. అది హలాల్ ఫుడ్డే అయ్యుండొచ్చు’, అయోమయంగా చూస్తూ చెప్పాన్నేను. ఈ హలాల్ డైవర్షన్ ఎందుకో అర్ధం కాలేదు నాకు. రాహు మాత్రం ఇదేం పట్టనట్లు చికెన్ అంతు చూసే పన్లో బిజీగా ఉన్నాడు.
‘హలాల్ చేసేటప్పుడు ముస్లిములు చదివే మంత్రాలకి అర్ధమేంటో తెలుసా?’ వేదాంతి రాహుకేసి చూస్తూ అడిగాడు.
‘ఊఁహు’, ఏదైతే నాకేంటి అన్నట్లు చూస్తూ బదులిచ్చాడు రాహు. అతని ధ్యాసంతా చేతిలోని చికెన్ ముక్క మీదే. ఇంతలో మోకాల్లో బల్బు వెలిగింది నాకు. పిచ్చాపాటి సందర్భంగా తనకి కర్మసిద్ధాంతమ్మీద నమ్మకమెక్కువ అని చెప్పాడు రాహు. అట్నుండి నరుక్కొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు వేదాంతి.
‘ఈ జన్మలో నా ఆకలి తీర్చుకోటానికి నిన్ను తింటున్నాను. దీనికి బదులుగా వచ్చే జన్మలో నువ్వు నన్ను తిందువుగాని అని ఆ జంతువుతో చెప్పటమే హలాల్ జపం పరమార్ధం.
‘ఓహో. అయితే నేను వచ్చే జన్మలో కోడిగా పుడతాను, ఈ కోడి అప్పుడు మనిషిగా పుట్టి నా మీద ప్రతీకారం తీర్చుకుంటుందన్నమాట’.
‘అంతేకదా మరి’.
‘కానీ నేను ముస్లింని కాదుగా. ఈ మంత్రం నాకు చెల్లదు’, కులాసాగా చెప్పాడు రాహు ఆఖరి ముక్క అందుకుంటూ.
‘హిందువుల కర్మ సిద్ధాంతమూ అలాంటిదే. ఈ జన్మలో మీరు చేసే పాపాలకి వచ్చే జన్మలో తప్పకుండా శిక్ష పడుతుంది’.
వేదాంతి ఎంతకీ వదలకపోయేసరికి రాహుకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఐనా అతి కష్టమ్మీద నిగ్రహించుకుని చెప్పాడు చివరి ముక్కని నోట్లో పెట్టుకుంటూ, ‘చూడండి సార్. ఇప్పుడే నా పూర్వ జన్మ గుర్తుకొచ్చింది. అప్పుడు నేను కోడిని, ఇదేమో మనిషి. ఆ జన్మలో ఇది నన్ను తినేసింది. అందుకే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాను’. చెప్పటం పూర్తయ్యాక వేదాంతికేసి కోరగా చూస్తూ ముక్కని కసిగా నమిలాడు.
అప్పటికీ వేదాంతి పట్టు వదల్లేదు. ‘ఎవరో ఒకరు ఈ పగలు, పునర్జన్మలు, ప్రతీకారాల సైకిల్ బ్రేక్ చెయ్యాలి కదండీ. అందుకే మీరు మాంసాహారం మానెయ్యటం మంచిది’.
రాహు నుండి మళ్లీ ఠపీమని ఆన్సరొచ్చింది. ‘నా పూర్తి పేరు త్యాగరాజు. పేరుకు తగ్గట్లే నేను చాలా నిస్వార్ధపరుడ్ని సార్. సైకిల్ బ్రేక్ చేసే అవకాశం ఈ కోడికే ఇస్తున్నా’.
వేదాంతి దగ్గర బాణాలయిపోయాయి. రాహు ప్లేట్లో కోడి ముక్కలూ అయిపోయాయి. దాంతో చర్చ మరో విషయమ్మీదకి మళ్లింది.
అద్భుతంగా రాశారు. హాస్యం కూడా పండించారు. శాకాహారం ఈ మధ్యన ఓ ఫాషన్ అయినది. ఇక జన్మతః శాకాహారులు ఉండనే ఉన్నారు. వీళ్ళు తినరు ఇంకొకరిని తిననియ్యరు. మాంసాహారం మనిషి లక్షణం కాదంటారు. మరి తినేవాడు ప్రీతితో తింటూనే ఉన్నాడు. వాడికి జీర్ణమవుతూనే ఉన్నది.ఇది చాలదా మనిషి మాంసాహారం తినడం సహజ లక్షణమేనని చెప్పడానికి.
దానిని హలాల్ అనికూడా అంటారా.నాకు బిస్మిల్లా అనే తెలుసు.కానీ ఆ మంత్రాల అర్థం మాత్రం ఇప్పటివరకూ తెలియదు. మీ టపా ద్వారా తెలుసుకున్నాను.
‘కోడి’ పురాణం బహు పసందుగా ఉంది:-)
baagu baagu…
mottam argument anthaaa raaju side biasedga anipinchindi… konta vedanti side nundi inkaastha strong arguments vunte scene inka adireedi.:)
–Vamsi..
బెనర్జీలా … :)))))
ఒక శాకాహార మిత్రుడి నుంచి మా మాంసాహార మిత్ర బృందానికి ఒక ఈమెయిలొచ్చింది. ఆ తరువాతేం జరిగిందో ఒక టపా రాద్దామనుకుని సమయం కుదరక దాటవేశాను. మీ బ్లాగులో ఇదే విషయం మాట్లాడుతున్నారు. బాగుంది.
Abrakadabra-> From the style perspective, this is one of the best from you. :-).
Vamsi-> I think this is all for fun, but you are right..if you were to take seriously..yeah…it’s certainly slanted one way 🙂
🙂 multiply with 100 thanks for the great piece
అద్భుతం! కామెడీ అదిరింది!
కొక్కొరోకో
బాగా రాశారు. ఎవరికిష్టమైనది వాళ్ళు తింటారు! ఇందులో దేవుడు, పాపం, పుణ్యం, గాడిద గుడ్డు ఇవన్నీ ఎందుకు? మనకిష్టం అయితే తినాలి, లేదంటే ఊరుకోవాలి!
“మీరు ఇవి తినకూడదు” అని ఎవరో చెప్పడం ఏమిటి? మనకి వంకాయ ఇష్టం లేదంటే వాళ్ళు మానేస్తారా?
మా ఫ్రెండొకడు ఉండేవాడు డెన్వర్ లో!
చికెన్ తొనొచ్చు గానీ బీఫ్ తినలేం కదండీ మరీ బ్రాహ్మలమై పుట్టి, ఆవు పవిత్ర జంతువు కాదూ” అని వింత వాదం వినిపించేవాడు. చికెన్ మాత్రం వదిలేవాడు కాదు! చికెన్ ది ప్రాణం కాదు, ఆవుదొక్కటే ప్రాణం!
బా రాసారు.
సుజాత: కోడిని తింటన్నాం గదాని నరమాంసం తినం గదండీ. అలాగే బీఫున్నూ! కొన్నిటిని అలా వదిలెయ్యాలంతే! ఒక్కోదాన్ని వదిలెయ్యడానికి ఒక్కో కారణం!
ఇక చికెన్ తిని మధ్యలో మానేసిన వాళ్ళుంటారు చూడండి, ఏదో ప్రపంచంలోనే పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫోజు కొడతారు. తినాలా వద్దా అన్నది, ఏది తినాలి, ఏది వద్దు అన్నది ఎవరి విచక్షణకి వాళ్ళకి వదిలెయ్యాలి. మనకి నచ్చకపోతే మనం మానెయ్యాలి.
నిజమే, ఆహారపు అలవాట్లు చిన్నప్పడు ఇంట్లో నేర్పినదాన్నిబట్టో లేక ఆ తరువాత ఏర్పడిన ఇష్టాన్నిబట్టో ఉంటాయి. వాటికి అనవసరమైన విలువలు ఆపాదించడం మూర్ఖత్వం.
అటు ఆది మానవుడూ, ఇటు అద్వైతానికి ముందు హిందూ మతం మాంసాహార భూషితమైనప్పుడు దాన్నేదో పాపంగా, ప్రకృతికి విరుద్ధంగా, అసహ్యంగా చూడ్డం నాకైతే అర్థం కాని విషయం.Its just a food habit,a matter of taste or just getting used to certain kind of food అంతే!
రాహు నుండి మళ్లీ ఠపీమని ఆన్సరొచ్చింది. ‘నా పూర్తి పేరు త్యాగరాజు. పేరుకు తగ్గట్లే నేను చాలా నిస్వార్ధపరుడ్ని సార్. సైకిల్ బ్రేక్ చేసే అవకాశం ఈ కోడికే ఇస్తున్నా’. kosamerupu superrrr
This post got my funny bone :))
ఇంతకీ మీరు ఆ మెక్సికన్ కి అర్థమయ్యేలా ఎలా చెప్పారు ?
నాకూ శనివారాలు NV తిననివాళ్ళని చూస్తే నవ్వొస్తూఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్‌తో వాదన పెట్టుకోవడానికి ట్రై చేశాను. గొడవైకూర్చుంది, నెలరోజులు వాడు నాతో మాట్లాడలేదు. అప్పటినుంచి faith కి సంబంధించిన విషయాల్లో తలదూర్చడం మానేశాను 🙂
చదువరి గారు,
నాకు మండేది అందుక్కాదు, తినే వాడు తినక మళ్ళీ ‘మరీ బ్రాహ్మలమై ఉండి ఆవు ని తినడం బాగోదంట” !అల్లా అనుకున్నవాడు అసలు ఏదీ తినకుండా ఉండాలి! చికెన్ చూస్తే తినకుండా ఉండలేడంట ‘బ్రాహ్మడు కాబట్టి బీఫ్ తినడట,’ ఇదేమి వాదం? ఇంతకంటే ఎక్కువ రాస్తే నాకు ‘సనాతనిస్టు ‘లు విభ్రమం చెంది చీవాట్లు వేస్తారు.
ఒక్కసారి కోడిని తినాలి అని నిర్ణయించుకున్నోడు, తర్కానికి పోతాడు కాని, మనం చెప్పే మాట వింటాడా? Veg Vs Non-Veg కథను ఆధారం చేసుకొని Quick Gun Murugun అనే సినిమా వస్తోంది తెలుసా మీకు? ఈ రోజే నవతరంగంలో వ్యాసం వచ్చింది. ఆ డైరెట్రు ఈ టపా చూసుంటే, ఖచ్చితంగా ఈ సీనుని తన సినిమాలో ఉంచేసుకునేవాడు.
అబ్రకదబ్రగారు, ఈ టపా చదివి మీ అభిప్రాయం చెప్పండి
http://dilbertblog.typepad.com/the_dilbert_blog/2008/03/natural-meat-ea.html
మాంసాహారం నాలుకపై రుచి తాండవం చేసినా గుండెలో మాత్రం కరాళనృత్యం చేస్తుంది.
:))) సూపర్ టపా!
దైవానిక గారు చెప్పినట్లు మధ్యలో హారమ్మార్పిడి (మాంసాహారం టూ శాఖాహారం) చేసినోళ్ళని అస్సలు పట్టలేం!!
పోస్టు అదిరింది.
ఎవరికి నచ్చింది వాళ్లు తింటారని వదిలేయక, మాంసం తినేవాళ్లందరూ రాక్షసులు, కాయగూరలు తినేవాళ్ళు మృధుస్వభావులు అంటూ సిద్దాంతీకరించేస్తుంటే చిరాగ్గా ఉంటుంది.
బాగా వ్రాసారు.
కామెడీ టచ్ ఉన్న సీరియస్ అంసం
బొల్లోజు బాబా
చదువుతున్నంతసేపూ నేననుకున్నది…..
అరే వేదాంతి భలె అడిగాడే ..రాజు ఏమిచెపుతాడో?
దిమ్మతిరిగే సమాధానం… భేష్ రాజు
అవును కదా…నిజమే….:) 🙂 🙂
మొన్నా మధ్య ఓ పెద్దాయన మీరు మేకలు, కోళ్ళు కాబట్టి మీ మొహాలు అలావుంటాయి. చైనా వాళ్ళు పాములు, చేపలు ఎక్కువ తింటారు కదా అందుకే వాళ్ళ మొహాలు అలా వుంటాయని కూడా అన్నాడు. మీరు జొన్నలు సద్దలు తింటారు కదా. మీ మొహం జొన్న కర్రలా వుందని అనాలంటే పెద్దాయన ఏమంటాం.
మొత్తానికి మాంచి సెటైరు పేల్చారు.
సుజాత గారు,
మా స్నేహితుల్లోనే ఒకడు పరి శుధ్ధ శాఖాహారి.ఇప్ప సారా నుండి స్వచ్చమైన విదేశీ మద్య పానాలు సేవిస్తాడు. అడ్డమైన గుడెసెలూ తొక్కుతాడు కానీ ముక్క ముట్టుకోడు.
డెన్వర్ లో మీ ఫ్రెండెవరు చెప్మా?
— విహారి
బాగా రాశారు…
తినే వాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. అంతే !
శాకాహారమా, మాంసాహారమా అన్న విషయంలో, పైన కామెంటిన పెద్దలతో, పేచీ లేకుండా ఏకీభవిస్తున్నాను.
మీరు, మీ టపాలో, శాకాహారి, మాంసాహారి మీద వత్తిడి తెస్తున్నట్టుగా వర్ణించేరు. తద్విరుద్ధంగా కూడా జరిగి ఫక్తు శాకాహారి ప్రలోభానికి గురవ్వడం నేనెరుగుదును. మీ కధలో మొదటి బాణం శాకాహారే వేసేడు. కానీ, అతగాడి తూణీరం, త్వరగా ఖాళీ అయ్యి, ఎదురుదాడి కాచుకోలేని నిర్వీర్యుడై లొంగిపోయేడా అనిపించింది.
రాజు గారితో, మేచు ఫిక్సింగా? మీ వత్తాసు మాటటుంచితే, టపా, ఆద్యంతం, ఎప్పటిలాగా ఆసక్తికరంగా వుంది. అభినందనలు.
బాగుంది సంవాదం 🙂
పైన కుడి పక్కనున్న మీమాట లో ఫీల్డ్స్ తారు మారు చేసినట్టున్నారు 🙂
వికటకవి పై కొక్కొరొక్కో
విహారి పై కొక్కొరొక్కో.. అని
చూడ్డానికి కామెడీగా వుంది.
మీరు హెడ్డింగు కోటి రూపాయలు పందెం అని పెడితే ఎలా వుంటుందో ఊహించండి. 🙂
— విహారి
one of the best posts that i have read in Koodali. Brillint Narration ….!!. Not a single word has gone waste in the entire post. Too Good .
అందరు ప్రక్కవారి తల తినే వాళ్ళేకదా! మరి శాకాహరులెవరబ్బా!
@సరస్వతికుమార్:
బిస్మిల్లా అనేది కోస్తాలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న మాట (literal గా అయితే ఆ పదానికి ‘అల్లా దయతో’ అని అర్ధం అనుకుంటా). హలాల్, హరామ్ అనేవి ‘చెయ్యదగిన’, ‘చెయ్యరాని’ అనే అర్ధంలో వాడతారు. అలా, ‘హలాల్ ఫుడ్’ అనేది ‘తినదగ్గ ఆహారం’. నాకు తెలిసిన కాస్త అరబిక్ ప్రావీణ్యతా మీముందు ప్రదర్శించేశా 🙂
@ఇస్మాయిల్,రానారె,గిరీష్,అశ్విన్,బుజ్జి,మహేష్,తెరెసా,బుల్లోజుబాబా,రాధిక,ప్రవీణ్,వికటకవి,అజయ్,అమెరికా తెలుగోడు:
ధన్యవాదాలు.
@వంశీ:
నిజమే. ఈ సారెప్పుడన్నా వేరే టపాలో వేదాంతికి న్యాయం చేద్దాం. ‘Return of Vedanti – With a Vengeance’ అన్నమాట.
@స్వతంత్రుడు:
Independent, ఇకనుండి మిమ్మల్నిలాగే పిలుస్తా – స్వతంత్రుడు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@రాజేంద్రకుమార్:
100 x 🙂
@సుజాత:
మీ ఫ్రెండ్ లాంటి వాళ్లని ‘చికిటేరియన్’ అంటారు. వాళ్లంతే. (నేనూ చికిటేరియన్నే కానీ పాపమనో మరోటనో కాదు మిగతావి తిననిది … అవి నచ్చక. అంటే ట్రై చేసి వదిలేశానన్నమాట).
@చదువరి:
మీరనేదీ నిజమే. కొన్నిటిని అలా వదిలెయ్యాలంతే. కాకపోతే, అవి నచ్చి తినేవాళ్లనీ వాళ్ల మానాన వదిలెయ్యాలి. ఏమంటారు?
@దైవానిక,నిషిగంధ:
మీకో రహస్యం చెప్పేదా? ఇలాంటి ‘హారమ్మార్పిడి’ ఫ్రెండే ఈ టపాకి స్ఫూర్తి. ఇందులో రాహు, వేదాంతి రెండూ అతనే – ఓ అపరిచితుడు, ఓ గజని, ఓ చంద్రముఖి లాగా split personality టైపన్నమాట. ఒకటి మాంసాహారిగా ఉన్నప్పుడు, ఒకటి కన్వర్ట్ అయిపోయాక ఉన్న రూపాలు.
@రాలే దేవదూత:
ఇప్పుడే చదివాను. చాలా పెద్ద చర్చే నడిచినట్లుంది – ఏ రెండొందల కామెంట్లో ఉన్నట్లున్నాయి. మొత్తమ్మీద ముక్కలు తినమనే వాళ్లే ఎక్కువున్నట్లున్నారు అక్కడా. నవీన్ అన్నట్లు, ఒకసారి తినాలనుకున్నాక ఎవడికి తోచిన తర్కం వాడు చెప్పుకుంటాడు.
@నవీన్:
Quick Gun Murugan – పేరు వెరైటీగా ఉంది. వీలైతే చూడాలి రిలీజయ్యాక.
@నాగన్న:
మీర్రాసింది ఒక్క లైనే అయినా యండమూరి ‘అష్టావక్ర’ చదిన ఫీలింగొచ్చిందేం చెప్మా!!
@విహారి:
‘విహారి పై నేరాభియోగం’, ‘వికటకవి పై రాళ్ల వర్షం’ ….
భలే పట్టారు. నిజానికి ఈ విషయం ఎవరు ఎత్తి చూపుతారా అని ఎప్పట్నుండో ఎదురు చూస్తున్నాను. అది WordPress వారి సౌజన్యం సార్. ‘Vihari on KokkorokO’ అనేదాన్ని మక్కీకి మక్కీ తెలుగులోకి అనువదించి పారేస్తుంది మా బ్లాగమ్మ. మొదట్లో కొన్ని రోజులు దాన్ని మార్చటానికి కుస్తీలు పట్టాను కానీ నావల్లగాక వదిలేశాను. మీకెవరికన్నా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోగలరు. బదులుగా నా టపాల్లో అత్యుత్తమమైనదాన్ని అంకితమివ్వగలను 😉
@చిన్నమయ్య:
మేచ్ ఫిక్సింగా పాడా. పైన చెప్పినట్లు ఆ ఇద్దరూ ఒకడే.
అబ్రకదబ్ర గారు : మీరు కుస్తీ పట్టవలసింది దిగువన ఇచ్చిన link దగ్గర … మీ బ్లాగ్ థీం లో కాదు 🙂
“On” అనే ఆంగ్ల పదాన్ని తెలుగులోకి తర్జుమా చేయండి
nivasindukuri గారిచే on=పై అని 07/21/06 04:07 న తర్జుమా చేయబడింది.
మీలో ఎవరికన్నా తర్జుమా చేయాలనే ఉత్సాహం ఉంటే …
Translate WordPress in to other languages
చాలా బాగుందండి.. మీ రాహు సూపర్.
Super post!
mee kalam bahu padunugaa undi
Aaakaleste emi dorakakapote nenu evarinaina emunna vadilipettanu. Naaku maatram kadupe kailasam..
మాంసాహారం గురించి పైపైన చర్చించె వారితో నెనైతే ఏవరి ఇష్టం వారిది అని అంటాను. కాని నిజమైన సత్యన్వేషకులకు మాత్రం ఈ క్రింది విధముగ సర్వామొదయొగ్యమైన విషయముగా చెప్పగలను. ఇక్కడ ఈ బ్లాగు లొ వ్రాసిన అన్ని చదివి మాంసాహారం గురించి ఇది వ్రాయాలనిపించి రాస్తున్నాను:
—————————————-
ఈ స్రుష్టిలొ ప్రతి ఒక్క జీవి (నెను అన్న అహంకార పూరితమైన భావనను నిలుపుకొని వున్న ప్రతి ఒక్కరు) ప్రకౄతిపరిసరాలకు(దెశ కాలాలకు) బానిసలై వుంటారు. ఈ బానిసత్వం అనేది ఒక్క భౌతిక(స్థులమైనది)పరమైనదె కాకుండా సూక్ష్మమైన(చావు వల్ల భౌతిక శరీరము పొయినా, జీవుని యొక్క నెను అన్న సూక్ష్మ స్థితులు వుంటాయి)స్థితులలొ కూడ వుంటుంది.
ప్రకౄతిపరిసరాలకు బానిసలై వున్న ప్రతి ఒక్కరు (జీవులు లెదా ఆత్మలు) కర్మ బద్దులై వుంటారు. అంటే పూర్వపు పాప పుణ్యాల ప్రతిఫలమె జీవుని ప్రస్తుత స్థితి. ఒక మనిషి ప్రస్తుతము బాగ వున్నాడు అంటె, అది అతని పూర్వపు పాప పుణ్యాల ప్రతిఫలమె కాని మరిఒకటి కాదు. కర్మ నియమమునకు అడ్జెస్టుమెంట్స్ చెయ్యడానికి అస్కారములు వున్నాయి కాని తప్పించుకొలేరు(ఇది వేరె టాపిక్). ఆయితె, ప్రక్రుతి బద్దులై వున్నంతవరకు, ప్రక్రుతి ళొని జీవజాలము తొ పాతు కర్మ బద్దులై వుంటారు. ఫ్రక్రుతిలొ, ప్రతి జీవికి దాని పరిణామ క్రమము లెధ పరిణామ స్థిథి ని బట్టి ఒక నిర్దిష్ట విలువ వుంతుంది. ఇక్కద పరిణామము అన్న దానికి హేతువు “జీవము దైవత్వ స్తితిని తెలుసుకోవుటకు ఇంకా ఎంత దూరములొ వున్నది” అన్నదె. ఏక కణ జీవులకంటె చెట్లు, చెట్ల కంటె జంతువులకు, జంతువులకంతె మనుషులకు యెక్కువ విలువ వుంటుంది. మానవ జన్మ అన్నిటికంటె వుత్తమమైనది. ప్రకృతి పరమైన మాయను అధిగమించి సర్వవ్యాపకమైన దైవత్వమును తెలుసుకొనుటకు, మనిషిగా జన్మించిన జీవికి (ఆత్మకు) అధ్యత్మిక పరంగా అన్ని జీవ రాశులకంటే ఎక్కువ ఆస్కరము వున్నది.
ఒక జీవి ఒక మనిషిని చంపితే మూటకట్టుకొనె చెడు కర్మ కంటె ఒక చెట్టును చంపితె మూటకట్టుకొనె చెడు కర్మ తక్కువ. అలాగె, ఒక మనిషి అధ్యత్మికపరంగా వున్నతమైన స్తితులలొ వున్న మనిషిని చంపితె మూటకట్టుకొనె చెడు కర్మ కంటె ఒక చెడ్డ మనిషిని చంపితె మూటకట్టుకొనె చెడు కర్మ తక్కువ.
అయితె, ఇలా అది తినకూడదు, ఇది తినకూడదు అని త్యాగము చెస్తు పొతె మనకు ఆత్మాహుతి కూడ మంచిదనె అభి ప్రాయము కలుగవచ్చు. కాని ఇది తప్పు. ఏందుకంటె మన శరీరము (జీవితము) ఎంతొ కష్తపదితె వచ్చినది. అతువంతి దీనిని(మానవ జన్మ అధ్యత్మికపరంగా వుత్తమమైనది) వుపయొగించుకొని మెల్లగా మయ నుంచి , ప్రఖ్రుతి బానిసత్వము నుంచి బయతపదవలెను లెదా కనిసము ప్రయత్నము చెయ్యాలి, కాని ఒక్కసారిగా దెహత్యాగము చెయ్యదము వల్ల ప్రయొజనము లెదు, మరియు పాపము కూడ. ఇక్కడ చెయ్యవలసింది ఎమిటంటె, మనము జీవించి వుండడానికి అవసరమైనది ఏమిటొ అదే తప్ప, మనము మన జిహ్వ చాపల్యము కొసము అవతలి జీవిని చంపరాదు. జిహ్వ చాపల్యము కొసము అవతలి జీవిని చంపితె ఏక్కువ పాపమును మూటకట్టుకొవడమె అవుతుంది.
ఇక్కద ఎవరి ఇష్టము వారిది.
అధ్యత్మికముగా ప్రగతి సాధించిన వారు దైవత్వము అంటె అది సర్వ వ్యాపకమై వుంటుంది అని, అది అన్ని జీవులలొను వున్నదని గ్రహించి వారు సమస్త జీవులను ఆ దైవత్వము గానె గ్రహించి ఎంచి మాంసహారము ముట్టరు. అదె అధ్యత్మికముగా వుఛ్ఛ స్తితులలొ వున్న వారు, మాత్రము తాము సర్వ వ్యాపకమైన ఆ భగవత్స్వరూపమె అని గ్రహించి ప్రకృతి నుంచి దాని బనిసత్వము నుంచి పూర్తిగా విడివడి చివరకు అన్నాహారములు కూద ముట్టని స్తితులలొ వుంటారు.
ఇందులొ ఎంత నిజము వుంటుందో మీరు ప్రశాంతముగా వున్నపుడు ఆలొచించండి.
అబ్రకదబ్ర గారు, పైది తెలుగులొ రాసెటప్పటికి నా తెలుగు భాష ఓక్క మూలాలు గుర్తుకు వచ్చాయి. తెలుగులొ BLOGGING స్టార్ట్ చెసినందుకు ధన్యవాదములు.
హలాల్ అంటే ముందుగ గొంతు కోసి రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి ఆపై కోస్తారు, రెండవ టైపు “జుట్క”, ఈ పద్ధతిలో గొంతు మెలితిప్పి కోడి ప్రాణం తీయటం జరుగుతుంది, ఆపై కోస్తారు, రెండవ టైపు లో రక్తం కోడిలోనే ఉంటుంది, అందుచేత అందులోని క్రిములు మాంసానికి అంటుకుని ఉంటుంది కనుక దానివలన వ్యాదులు వచ్చే అవకాసం ఎక్కువ. ఇది మా ముస్లిం సోదరుడొకడు చెప్పగా తెలిసింది. అందుకే వాళ్ళు హలాల్ కట్ అయితేనే తింటారు, జుట్క ని అంతగా ప్రోత్సహించరు.
🙂 బాగుంది. ఎవరి అలవాట్లు వారివి.
గాంధీ జయంతినాడు ఇడ్లీలో చికెన్ నంజుకుని మాంసాహారం తిన్నందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గతంలో ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాంధీ జయంతినాడు మాంసాహారం భుజించడం తప్పేనని అందుకు శిక్షగా వచ్చే గాంధీ జయంతి వరకు తాను మాంసాహారం తినబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు.కొన్ని రోజులను మాంసాహారానికి నిషిద్ధ దినాలుగా ప్రభుత్వం ప్రకటించిందికానీ శాహాహారంపై ఎలాంటి షరతులూ లేవు.
జంతువుల నుండి లభించే పాలనుండి అనేక ఆహారపదార్ధాలను ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగు,జున్ను,చీజ్,పనీర్,యోగర్ట్,వెన్న,నెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తాయారు చేసే తేనెను ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.చేపలు,పాములు,పక్షులు,గుడ్లు,రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.ఎలుకలు, ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం అలవాటే.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.దానాలలో శ్రేష్టమైనది అన్నదానం.పరిచయస్తులకు కాఫీ,టీ లనైనా అందిచడం సంప్రదాయమే.పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు జలపుష్పాలుగా పరిగణిస్తారు.కాశ్మీర్లో బ్రాహ్మణులు పాక్షిక మాంసాహారులు.శాకాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది..పాకిస్థాన్‌లోని షిన్ తెగకు చెందిన ముస్లింలు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు..గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇచ్చేవారు..వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. తైత్తరేయ బ్రాహ్మణంలో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. సుతపథ బ్రాహ్మణంలో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది..ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48).రంతిదేవుని వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు.- (డి.ఎన్. ఝా Paradox of the Cow : Attitudes to Beef Eating in Early India, D.N.Jha ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు). హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రథమ ముద్రణ: 2002.
రహంతుల్లా గారు,
వైదిక కాలంలో యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది వున్నదని నిరూపించడనికి మీరు చాలా కష్టపడ్డారు. ఆ చేత్తోనే మీరు చెప్పిన బ్రహ్మణంలొ ఏ శ్లొకములొ గో మాంసం తినేవారు అని చెప్పబడినదో ఆ శ్లొకము ఇక్కడ వ్రాయండి. ఆలాగె ఋగ్వేదం X.14-18 AND అధర్వణ వేదం X 11.2, 48 శ్లొకాలను ఇక్కడ వ్రాయండి.
వెరెవాళ్ళు వ్రాసారని మీరు కూడ తెలియకుండ గుడ్డిగ వ్రాయకూడదు. “గో మాంస భక్షణం” అనెది యొగం లో ఒక నిఘూఢమైన ప్రక్రియ. తెలియని వాళ్ళు “గో మాంస భక్షణం” అనెది ఆవును చంపి తినడము అని మూర్ఖముగ అనుకుంటారు. భగవంతుడు సర్వ వ్యాపి మరియు సర్వ జీవులలొ వున్నాడు అని నొక్కి చెప్పె వైదికధర్మం మరియు సర్వ జీవులను భగవదంశ గా ప్రెమించమనె భగవద్గీత యెప్పుడు జీవులను చంపి తినమని చెప్పలెదు. Bhagavadgeetha affirms that violence against any life is a violence against ALL PERVADING GOD.
అది కాక, ఈ మధ్య కొంత మంది వెదాలపై అబద్దపు ప్రొపగండ కొసం వేదాలు మరియు వైదిక సంబందమైన బ్రహ్మణములు , వుపనిషత్తులు నెంబర్లు ఇస్తారు. ఏందుకంటె, యెవరు వెళ్ళి వాటిని చూడరు , చూడకుండ నమ్ముతారు.
మీరు చెప్పిన ఆ శ్లొకములు ఇక్కడ వ్రాయండి. అప్పటి వరకు మీరు చెప్పినది తప్పు అని చెప్పవలసి వస్తుంది.
Please quote the verses that you mentioned above here exactly or point the give internet pointers. I will give proper explanation to them.
Please note that just like the way Holy Quran was misinterpreted many a times and many a places(in the holy quran), incapable people also misinterpreted or misused Holy Vedas and related Holy Scriptures to their benefit or by mistake. I hope you understand this and stop doing negative propaganda against Holy Vedas.
శ్రీ గారూ
ఎవరో పండితులు చెప్పింది చదివి పునప్రస్థావన చేయటం తప్ప ఉర్దూ సంస్కృతమూ అరబ్బీ రాని అచ్చతెలుగువాడిని.కొత్తసత్యనారాయణ చౌదరి,కొండవీటి వెంకటకవి,అంబేద్కర్,ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా లాంటి వాళ్ళే చెప్పారు కాబట్టి నమ్మాను.తప్పైతే చెప్పండి,సవరించుకుంటాను.ఇంతకీ నేను శాఖాహారినే.కాకపోతే ఎవరికిష్టమైంది వారు తింటారు అనేదే నా అభిప్రాయం.
కేక. ఈ టపా ఇంతకు మునుపు చదివిన గుర్తు లేదు. దోస నాజీ కథ చదివి రాహు పేరు చూసి ఆశ్చర్యపోయాను కానీ ఈ పేరు వెనక కథని అస్సలు ఊహించలేదు!
అన్నట్టు, ఏనార్బర్లో మట్టికూజా (ఆంగ్ల తర్జుమా) అని ఒక దేశీ వేగన్ పూటకూళ్ళ ఇల్లుంది. అందులో ప్రతీ టేబులు మీదా మాంసాహారులతో వాదించడం ఎలా అని పది పాయింట్ల ఎజెండాతో ఒక కార్డు ఉంటుంది. ఈ సారెళ్ళినప్పుడు అది ఫొటో తెచ్చి పెడతా.