ఆగస్ట్, 2008ను భద్రపఱచురుబ్బింగ్ మిషన్

మా ఊర్లో చలామణిలో ఉన్నంత వయ్యారమైన తెలుగు భాష ఆంధ్ర దేశంలో మరెక్కడా ఉండదేమోనని నా అనుమానం. పేపరుకాయితం, సైడుపక్క, డేంజరపాయం లాంటి మాటలక్కడ కోకొల్లలు. కొన్ని పదాల్నలా రెండు మూడు భాషల్లో నొక్కి వక్కాణిస్తేగానీ జనాలకి అర్ధమవదని మా వాళ్ల నమ్మకం కావచ్చు. ఇవి కాక ‘ఎగస్ట్రా పాత్రలు వెయ్యటం’, ‘మఫ్టీ ఇవ్వటం’, ‘ఫిడేలు వాయించటం’ లాంటి స్థానిక జాతీయాలకీ కొదవ లేదు. వీటిలో మొదటిదానికి ఓవర్ యాక్టింగ్ చెయ్యటం, రెండవ దానికి షేపులు మారిపోయేలా పిచ్చ కొట్టుడు కొట్టటం అని అర్ధం. మూడోదీ, రెండోదీ సమానార్ధకాలు. ఈ జాతీయాల చరిత్ర నాకు తెలీదు. తెలిసిందల్లా, వీటిని కాలేజీ కుర్రాళ్లు పుట్టిస్తారని మాత్రమే. తర్వాత అవి మెల్లి మెల్లిగా ఊరంతా పాకేస్తాయి.

స్థానిక జాతీయాలే కాదు, మా ఊర్లో వ్యాపార సంస్థల పేర్లూ రొంబ క్రియేటివ్వే. మచ్చుకి కొన్ని: తాటాకు పాకలో నడిచే ‘ఫైవ్ స్టార్ హోటల్’, ‘పల్నాడు ఎక్స్‌ప్రెస్’ నామధేయంగల గూడు రిక్షా, ఫొటోగ్రాఫర్ సత్తార్ భాయ్ ఇరుకిరుకు గదిలో నడిపే ‘యూనివర్సల్ స్టూడియోస్’, రెండు గదుల ఏకాంతస్తు మేడ ‘శ్రీ రామా టవర్స్’ …. అబ్బో ఇలాంటి సిత్రాలు మరెన్నో!

ఈ మధ్య మా ఊరెళ్లినప్పుడు కొత్తగా తెలిసిన మరో పేరు ‘రుబ్బింగ్ మిషన్’. ఒక సాయంత్రం తీరికగా మా డౌన్‌టౌన్ లో నడుస్తుంటే రోడ్డువారగా ఉన్న ఓ దుకాణం సైన్ బోర్డు మీది అక్షరాలు నన్నాకర్షించాయి. దానిమీద ఆంగ్లంలో పొందికగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ‘Rubbing Mission’ అన్న పేరు చూసి ఆగిపోయాను. రుద్దుడు కార్యం!?!  ఎవరు దేన్ని ఎందుకు రుద్దుతారో వెంటనే అర్ధం కాలేదు. కాసేపాలోచిస్తే, సూదులు గుచ్చే ఆక్యుపంక్చర్ వైద్యం మాదిరిగా వళ్లు కసకసా రుద్ది రోగాలు నయం చేసే పద్ధతేదన్నా కొత్తగా చైనా నుండి దిగుమతయ్యిందేమో అని తట్టింది. ‘ఓహో, ఇది ఆ తరహా ప్రత్యేక ఆస్పత్రి కాబోలు’ అనుకుని ఆసక్తిగా ఓ సారి దుకాణంలోకి తేరిపార చూస్తే నాక్కనపడ్డ దృశ్యానికి నవ్వాగలేదు.

అక్కడ, సుమారు పది మంది ఆడాళ్లు పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకుని లైన్లో నిలబడున్నారు. లైన్ చివర ఓ కుర్రాడు చిన్న స్టూల్ మీద కూర్చుని బిజీగా పనిచేస్తూ కనిపించాడు. లైన్లో ఉన్న మహిళామణుల దగ్గరనుండి గిన్నెలు అందుకుని అందులోనుండి నానబెట్టిన మినప్పప్పో, మరేదో తీసుకుని ఎదురుగా ఉన్న హెవీ డ్యూటీ గ్రైండర్‌లో వేసి ఎడాపెడా రుబ్బేస్తున్నాడతను. ట్యూబ్‌లైట్ వెలిగింది. తలెత్తి మరోసారి బోర్డు కేసి చూస్తే ఇంగ్లీషు పేరు కిందనే తెలుగులో చిన్న అక్షరాలతో కనిపించింది: ‘రుబ్బింగ్ మిషన్: ఇచ్చట అన్ని రకముల పిండి రుబ్బి పెట్టబడును’. అదీ సంగతి. ఆంగ్లీకరించబడ్డ రుబ్బురోలు పొత్రం అన్నమాట! ఇంతటి సృజనాత్మకత మరే ఊర్లోనైనా సాధ్యమా?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.