ఆగస్ట్, 2008ను భద్రపఱచుదశావతారాలు

కమల్‌హసన్ సినిమా పుణ్యాన ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో దశావతారాల మీద చాలా చర్చే జరిగింది. ‘దశావతారాలెన్ని’ అన్న అమాయక గణితవేత్తల నుండీ వాటిలో సృష్టి-సామాజిక పరిణామ క్రమాల్ని దర్శించిన జ్ఞానుల దాకా రకరకాల వాళ్లున్నారు. ఈ సందడంతా చూశాక దశావతారాల గురించి నాకు ఎప్పటినుండో ఉన్న సందేహాలు బయటపెట్టటానికి ఇదే సరైన సమయమనిపించింది. ఆ సందేహాలూ, వాటికి నా స్వకపోల కల్పిత సమాధానాలూ రాస్తాను. చిత్తగించండి.

అసలు ఈ ‘దశావతారాలు’ అనే పద ప్రయోగం ఎప్పటినుండీ ప్రాచుర్యంలో ఉంది? గరుడ పురాణంలో దశావతారాల ప్రస్తావన ఉంది. బమ్మెర పోతన (పదిహేనో శతాబ్దం) భాగవతంలోనో, జయదేవుడు (పదమూడో శతాబ్దం) గీత గోవిందంలోనో దీన్ని మొదటగా ప్రస్తావించాడనే వాళ్లు కొందరున్నారు. అయితే అంతకన్నా ముందే ఈ ప్రయోగం జరిగుండొచ్చా? తన సినిమాకి ‘దశావతారం’ అని పేరు పెట్టాడు కాబట్టి అవసరం లేకున్నా రెండు మూడు పాత్రల్ని కధలో ఇరికించేశాడని కమల్‌హసన్ మీద విమర్శలొచ్చాయి. దశావతారాల కధా అంతేనా? పేరు సార్ధకం చెయ్యటం కోసమే బుద్ధుడు లాంటి వారిని తెచ్చి ఇందులో ఇరికించేశారా లేక దాన్ని మించిన పరమార్ధమేదన్నా ఉందా?

‘దశావతారాలు ఎన్ని’ అన్నాయన అమాయకుడే అనుకుందాం. దానికన్నా ‘దశావతారాలు ఏవి’ అంటే సరైన ప్రశ్న అయ్యుండేదేమో. ఈ విషయంలో పెద్ద గందరగోళమే ఉంది. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహుడు, వామనుడు, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, కల్కి – వీళ్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన నవావతారాలు. మిగిలిన ఒకే ఒక స్థానం కోసం బలరాముడు, బుద్ధుడు మధ్య మ్యూజికల్ ఛైర్స్ జరుగుతుంటాయి. బలరాముడు ఆదిశేషువు అవతారం అనిన్నీ, నారాయణుడి అవతారం కాదనిన్నీ, ఆయనపై వేటు వేసే వాళ్లు కొందరు. బుద్ధుడు పురాణ పాత్ర కాకపోవటం వల్ల ఆయన్ని ఎత్తేసేవాళ్లు మరి కొందరు. మొత్తమ్మీద బుద్ధుడికే ఓట్లెక్కువ. నాకైతే ఈ రెండూ కూడా ఆ జాబితాలో అతకవన్న ఫీలింగ్. ఇస్కాన్ వారికి కృష్ణుడు స్వయం భగవానుడు; కాబట్టి ఆయన కూడా దశావతారాల్లో ఒకడు కాదు. వీళ్ల లెక్క ప్రకారం అసలు విష్ణువే కృష్ణుడి అవతారం. పదో అవతారం ఎవరనేది అవతలుంచితే, మొదట్లో నవావతారాలే ఉండేవేమో. కాలక్రమేణా వాటికి మరో అవతారాన్ని తగిలించేసి దశావతారాలు చెయ్యాలన్న ఆలోచన ఏ మహానుభావుడికో వచ్చుంటుంది. ఎవరీతడు? ఎందుకలా చేశాడు?

ఎక్కువమంది బలరాముడి బదులు బుద్ధుడినే దశావతారాల్లో ఒకడిగా గుర్తిస్తారు కాబట్టి నా పరిశీలన ఇక్కడి నుండి అదే కోణంలో సాగుతుంది. ఆ క్రమంలో మరిన్ని ప్రశ్నలు, వాటికి కొన్ని వివాదాస్పద సమాధానాలు లభిస్తాయి. అటువంటి వివాదాలని అడ్డుకోవటానికే కావచ్చు, బుద్దావతారమూ గౌతమ బుద్ధుడూ వేరు వేరనే కధొకటి సృష్టించబడింది. అయితే దాన్ని నమ్మే వాళ్లు తక్కువ.

ప్రాచీన భారతంలో ‘నవ’ శబ్దానికి ఉన్న ప్రాధాన్యత ‘దశ’ కి ఉన్నట్లనిపించదు. ఉదాహరణకి నవ ధాన్యాలు, నవ గ్రహాలు, నవ రసాలు, నవరాత్రులు. దీని తర్వాత ఉన్నంతలో ‘సప్త’ కి కూడా ప్రాధాన్యత ఉంది. దశాంశమానం ఇప్పుడున్నంత ప్రముఖంగా అప్పుడు లేకపోవటం దీనికి కారణం కావచ్చు. మన దేశంలో దశాంశమానం అమల్లోకొచ్చాకనే పదో అవతారాన్ని జోడించటం జరిగిందా? చరిత్రకారుల ప్రకారం దశాంశమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మనవాళ్లే. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికే అది ఇక్కడ అమల్లో ఉంది (కొందరు సింధులోయ నాగరికత నాటికే దశాంశమానం వాడుకలో ఉందంటారు). ఇది అటూ ఇటుగా బుద్ధుడు జీవించిన కాలం. రెండు వేల ఏళ్ల నాటి బుద్ధుడు దశావతారాల్లో ఉన్నాడంటే ఈ పదానికి అంతకన్నా తక్కువ వయసుంటుందని అర్ధమే కదా. గమ్మత్తేమిటంటే, హిందూ దేవుళ్లతో నిండిపోయిన దశావతారాల్లో హిందూత్వాన్ని దాదాపు తుడిచిపెట్టిన బుద్ధుడినీ చేర్చటం! బుద్ధుడిని ఆ జాబితాలో చేర్చటం వెనుక బౌద్ధం హిందూత్వానికి మరో రూపం అని ప్రచారం చేసే కుట్ర కోణమేదన్నా దాగుందా? హిందూ మత పునరుజ్జీవనోద్యమ కాలంలో పుట్టుకొచ్చిన భావనా ఈ దశావతారాలు? అది ఆది శంకరాచార్యుల వారి సృష్టా!?!

దశావతారాలకి సంబంధించి ఇది నా కాన్స్పిరసీ థియరీ. ఖండనమండనలకి స్వాగతం.

(బుద్దుడి జీవితంలో మనమెరుగని మరో కోణంపై ఓ చక్కని కల్పన మహేష్ పర్ణశాలలో)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.