కమల్‌హసన్ సినిమా పుణ్యాన ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో దశావతారాల మీద చాలా చర్చే జరిగింది. ‘దశావతారాలెన్ని’ అన్న అమాయక గణితవేత్తల నుండీ వాటిలో సృష్టి-సామాజిక పరిణామ క్రమాల్ని దర్శించిన జ్ఞానుల దాకా రకరకాల వాళ్లున్నారు. ఈ సందడంతా చూశాక దశావతారాల గురించి నాకు ఎప్పటినుండో ఉన్న సందేహాలు బయటపెట్టటానికి ఇదే సరైన సమయమనిపించింది. ఆ సందేహాలూ, వాటికి నా స్వకపోల కల్పిత సమాధానాలూ రాస్తాను. చిత్తగించండి.
అసలు ఈ ‘దశావతారాలు’ అనే పద ప్రయోగం ఎప్పటినుండీ ప్రాచుర్యంలో ఉంది? గరుడ పురాణంలో దశావతారాల ప్రస్తావన ఉంది. బమ్మెర పోతన (పదిహేనో శతాబ్దం) భాగవతంలోనో, జయదేవుడు (పదమూడో శతాబ్దం) గీత గోవిందంలోనో దీన్ని మొదటగా ప్రస్తావించాడనే వాళ్లు కొందరున్నారు. అయితే అంతకన్నా ముందే ఈ ప్రయోగం జరిగుండొచ్చా? తన సినిమాకి ‘దశావతారం’ అని పేరు పెట్టాడు కాబట్టి అవసరం లేకున్నా రెండు మూడు పాత్రల్ని కధలో ఇరికించేశాడని కమల్‌హసన్ మీద విమర్శలొచ్చాయి. దశావతారాల కధా అంతేనా? పేరు సార్ధకం చెయ్యటం కోసమే బుద్ధుడు లాంటి వారిని తెచ్చి ఇందులో ఇరికించేశారా లేక దాన్ని మించిన పరమార్ధమేదన్నా ఉందా?
‘దశావతారాలు ఎన్ని’ అన్నాయన అమాయకుడే అనుకుందాం. దానికన్నా ‘దశావతారాలు ఏవి’ అంటే సరైన ప్రశ్న అయ్యుండేదేమో. ఈ విషయంలో పెద్ద గందరగోళమే ఉంది. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహుడు, వామనుడు, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, కల్కి – వీళ్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన నవావతారాలు. మిగిలిన ఒకే ఒక స్థానం కోసం బలరాముడు, బుద్ధుడు మధ్య మ్యూజికల్ ఛైర్స్ జరుగుతుంటాయి. బలరాముడు ఆదిశేషువు అవతారం అనిన్నీ, నారాయణుడి అవతారం కాదనిన్నీ, ఆయనపై వేటు వేసే వాళ్లు కొందరు. బుద్ధుడు పురాణ పాత్ర కాకపోవటం వల్ల ఆయన్ని ఎత్తేసేవాళ్లు మరి కొందరు. మొత్తమ్మీద బుద్ధుడికే ఓట్లెక్కువ. నాకైతే ఈ రెండూ కూడా ఆ జాబితాలో అతకవన్న ఫీలింగ్. ఇస్కాన్ వారికి కృష్ణుడు స్వయం భగవానుడు; కాబట్టి ఆయన కూడా దశావతారాల్లో ఒకడు కాదు. వీళ్ల లెక్క ప్రకారం అసలు విష్ణువే కృష్ణుడి అవతారం. పదో అవతారం ఎవరనేది అవతలుంచితే, మొదట్లో నవావతారాలే ఉండేవేమో. కాలక్రమేణా వాటికి మరో అవతారాన్ని తగిలించేసి దశావతారాలు చెయ్యాలన్న ఆలోచన ఏ మహానుభావుడికో వచ్చుంటుంది. ఎవరీతడు? ఎందుకలా చేశాడు?
ఎక్కువమంది బలరాముడి బదులు బుద్ధుడినే దశావతారాల్లో ఒకడిగా గుర్తిస్తారు కాబట్టి నా పరిశీలన ఇక్కడి నుండి అదే కోణంలో సాగుతుంది. ఆ క్రమంలో మరిన్ని ప్రశ్నలు, వాటికి కొన్ని వివాదాస్పద సమాధానాలు లభిస్తాయి. అటువంటి వివాదాలని అడ్డుకోవటానికే కావచ్చు, బుద్దావతారమూ గౌతమ బుద్ధుడూ వేరు వేరనే కధొకటి సృష్టించబడింది. అయితే దాన్ని నమ్మే వాళ్లు తక్కువ.
ప్రాచీన భారతంలో ‘నవ’ శబ్దానికి ఉన్న ప్రాధాన్యత ‘దశ’ కి ఉన్నట్లనిపించదు. ఉదాహరణకి నవ ధాన్యాలు, నవ గ్రహాలు, నవ రసాలు, నవరాత్రులు. దీని తర్వాత ఉన్నంతలో ‘సప్త’ కి కూడా ప్రాధాన్యత ఉంది. దశాంశమానం ఇప్పుడున్నంత ప్రముఖంగా అప్పుడు లేకపోవటం దీనికి కారణం కావచ్చు. మన దేశంలో దశాంశమానం అమల్లోకొచ్చాకనే పదో అవతారాన్ని జోడించటం జరిగిందా? చరిత్రకారుల ప్రకారం దశాంశమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మనవాళ్లే. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికే అది ఇక్కడ అమల్లో ఉంది (కొందరు సింధులోయ నాగరికత నాటికే దశాంశమానం వాడుకలో ఉందంటారు). ఇది అటూ ఇటుగా బుద్ధుడు జీవించిన కాలం. రెండు వేల ఏళ్ల నాటి బుద్ధుడు దశావతారాల్లో ఉన్నాడంటే ఈ పదానికి అంతకన్నా తక్కువ వయసుంటుందని అర్ధమే కదా. గమ్మత్తేమిటంటే, హిందూ దేవుళ్లతో నిండిపోయిన దశావతారాల్లో హిందూత్వాన్ని దాదాపు తుడిచిపెట్టిన బుద్ధుడినీ చేర్చటం! బుద్ధుడిని ఆ జాబితాలో చేర్చటం వెనుక బౌద్ధం హిందూత్వానికి మరో రూపం అని ప్రచారం చేసే కుట్ర కోణమేదన్నా దాగుందా? హిందూ మత పునరుజ్జీవనోద్యమ కాలంలో పుట్టుకొచ్చిన భావనా ఈ దశావతారాలు? అది ఆది శంకరాచార్యుల వారి సృష్టా!?!
దశావతారాలకి సంబంధించి ఇది నా కాన్స్పిరసీ థియరీ. ఖండనమండనలకి స్వాగతం.
(బుద్దుడి జీవితంలో మనమెరుగని మరో కోణంపై ఓ చక్కని కల్పన మహేష్ పర్ణశాలలో)
చిన్న సవరణ తమిళ ఆళ్వార్లకు కృష్ణుడు కాదు స్వయంభగవానుడు నారాయణుడే.కృష్ణుడు నారాయణుని అవతారం.అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారికి(వీరు ద్వైత సిద్దాంతకర్త మధ్వాచార్యులను అనుసరిస్తారు) కృష్ణుడు స్వయంభగవానుడు.
దశావతారాల్లో బుద్ధుడిని చేర్చడం హిందూమతం యొక్క తెలివిని సూచిస్తుంది.హిందూ మతానికి వ్యతిరేకంగా పుట్టిన బౌద్ధ,జైన మతాల్లో బౌద్ధం చాలా బలంగా ఉండే మతం. దానివల్ల ఎప్పటికైనా హిందూమతం సమూలంగా తుడిచిపెట్టుకుపోయే భయం వుండివుండేదేమో.
అందుకే చాలా కన్వీనియంట్ గా తనని దశావతారం చేసేస్తే బౌద్దం హిందూమతంలో ఎన్నో వేల శాఖల్లో ఒక శాఖగా మిగిలిపోతుంది. ఈ పరిణామం బౌద్ధమతం యొక్క(హిందూ వ్యతిరేక) ఉద్దేశాలను వ్యాప్తికాకుండా కాపాడుతుంది.Hats-off to the survival instinct of Hinduism that made Buddha as 10th Avatara.
కాకపోతే, ‘స్వాభిమానంగల హిందువులు’ ఈ విధానాన్ని “assimilation power of Hinduism”అనుకుని తృప్తిపడవచ్చు. చరిత్రకు మతపరమైన వ్యాఖ్య చెబితే రెండోది కరెక్టు. కేవలం చారిత్రాత్మకంగా చూస్తే మొదటిదే సరి అనిపిస్తుంది.
మఖలో పుట్టి పుబ్బలో పోయే మతాల్లాంటి మతం కాదండి హిందూ మతం.అది సనాతనం ఎప్పటినుంచీ వుంది ఎప్పటికీ వుంటుంది మహేశ్ గారూ మీకా బెంగ అవసరంలేదు లెండి.
@చిలమకూరు విజయమోహన్: చరిత్ర తెలియకుంటే తెలుసుకోండి.క్రీస్తు శకం 8-18 వ శతాబ్దాలలో బుద్ధ,జైన ధర్మాలకు వ్యతిరేకంగా “భక్తి ఉద్యమాలు” మొదలయ్యే వరకూ మన హిందూ మతానికి ఇంత నిర్థిష్టమైన రూపం, వ్యవహారాలూ ఉండేవికావు. ఒక unorganized sects గా ఉండేవారు. నయనార్ లు, ఆళ్వార్లూ,జోగులు,నాధులు,సిద్ధులు ఇలా కొన్ని వందల శాఖలలో ఉండేవి.వీరి సాహిత్యాన్ని పరిశీలించినా అందులో సగం బౌద్ధ,జైన ధర్మాలకు (అప్పట్లో ఇవి మతాలు కావు)వ్యతిరేక propaganda కనబడుతుంది.
అప్పటి హిందూమతం అర్థంకాని సంస్కృతంవాడటంతో ప్రజలు వ్యావహారిక భాషలు మాట్లాడే ఈ ధర్మాలపట్ల మొగ్గుచూపడం సహజంగా జరిగిన పరిణామం. అంతేకాక హిందూమతం జీవితానంతరం భగవంతుణ్ణి చేరుకోవడం గురించి చెబితే, ఈ ధర్మాలు జీవితాన్ని ఎలా సుఖశాంతులమయం చేసుకోవాలో చెప్పారు. అందుకె వీటికి అప్పట్లో అంత విస్తృత ప్రచారం లభించింది.
ఈ పరిణామాలకి బెంబేలెత్తుతున్న హిందూమతాన్ని రక్షించింది ఆది శంకరాచార్యుడు. ఇప్పుడు హిందూమతం ఇలా మనగలుగుతోందంటే, ఆ మహానుభావుడి దయేతప్ప మీరు చెప్పిన “సనాతనత్వం” కాదు. Shankaracharya was a reformist,who changed Hinduism. It owns its survival to him.
బుద్దుడ్ని దశావతారాల్లోకి బలవంతంగా ఇరికించారనే నా అనుమానం కూడా. దశావతార బుద్దుడి కథ చదివితే అలానే అనిపిస్తుంది. చారిత్రక బుద్ధుడు చెప్పినవన్ని, ఈ కథలో వక్రీకరించినట్టు కనపడుతుంది. రకరకాల కథలు వున్నాయి కానీ, నాకు గుర్తున్నంతవరకు బుద్దావతారంలో త్రిపురాల్లోని రాక్షసులు యజ్ఞయాగాదులు చేసి బలవంతులుగా వున్నారని, వారిని బలహీనపరిచే ఉద్దేశంతో విష్ణువు బుద్దావతారం దాల్చి, నాస్తికత్వం బోధించి, వారిచే యజ్ఞాలు ఆపు చేయించాడని చెప్తుంది. ఇంకా త్రిపురాల్లోని రాక్షస స్త్రీలు బుద్ధుడి మోహన రూపం చూసి మోహించారని, వారి ద్వారానే బుద్దుడు రాక్షసులను ఆకట్టుకున్నాడని కథ. ఇందులో చారిత్రక బుద్దుడు చేసినవి, చెప్పినవి, రాక్షసులను తప్పుదోవ పట్టించటానికి చేసినవని, బుద్దుడి బోధనలు పాటించినవారు రాక్షసులని, అన్యాపదేశంగా చెప్పారు. చారిత్రక బుద్దుడి బోధనలకు ఎక్కువగా ఆకర్షించబడింది కూడా స్తీలేనని తెలుస్తుంది. రాజు వైదిక మతాన్ని పాటిస్తే, రాణి బౌద్దారామాలకు దానం చేసిన సంఘటనలు చాలానే వున్నాయి. ఆ విషయాన్ని కూడా కథలో వక్రీకరించారు.
అబ్రకదబ్రా గారూ,
దశాంశమానం పుట్టేంతవరకూ దశమావతారమే ఉండి ఉండదని భావించడం హాస్యాస్పదం. దశ శబ్దం చాలా ప్రాచీనమైనది. ఋగ్వేదంలోని పురుషసూక్తంలో అత్యతిష్టత్ దశాంగుళం అని దశ శబ్దం ఉంటుంది.
దశావతారాల లెక్క కొంత వివాదాస్పదమైనదే. దశావతారాల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది కొన్ని భక్తి ఉద్యమాల కారణంగా అని అని నా భావన (రెఫరెన్సులు ఇప్పుటికిప్పుడు ఇవ్వలేను). భాగవతంలో దశావతారాలే కాక ఇంకా చాలా అవతారాలు చెప్పబడ్డాయి. 21 అవతారాలు మొదలైనవి.
మహేశ్ గారూ, ‘దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చడం హిందూమతం యొక్క తెలివిని సూచిస్తుంది’. ఈరోజు ఒక ముస్లింగా పుట్టిన షిరిడీ సాయిబాబాను కొన్ని కోట్లమంది దైవంగా కొలవడం, గుళ్ళు కట్టి అభిషేకాలూ, పూజలు చెయ్యడం కూడా హిందూమతం తెలివినే సూచిస్తుంది అంటారా? మీరు చెప్పినదానికీ నేనడిగిన ప్రశ్నకీ సంబంధం ఉన్నట్టు అనిపించకపోవచ్చు. కొద్దిగా ఆలోచించి చూడండి.
ప్రజలందరూ ఒక వ్యక్తిని దైవంగా కొలిచారు అంటే ఆ వ్యక్తి అవతారమే అని హిందువులు ఇప్పటికీ విశ్వసిస్తారు. సత్యసాయిబాబా భగవంతుడి అవతారం అని చాలామంది విశ్వసిస్తారు. ప్రతీ ఆధ్యాత్మిక గురువునీ వాళ్ళ శిష్యులు అవతారమనే అంటారు. బుద్ధుడి ప్రభావం మానవులపైన అపారమైనది. కాబట్టే అతణ్ణి అవతారమని తరువాతి కాలంలో భావించడం జరిగింది.
‘ఇప్పుడు హిందూమతం ఇలా మనగలుగుతోందంటే, ఆ మహానుభావుడి దయేతప్ప మీరు చెప్పిన “సనాతనత్వం” కాదు.’ – అలాగా? మరి శంకరాచార్యుడు సనాతనం కాని ఏ కొత్త భావాల్ని కనిపెట్టాడంటారు? ఆయన తన అద్వైతానికీ, రాసిన ఇతర గ్రంథాలకీ, వేద ఉపనిషత్ ప్రమాణాల్ని చూపలేదంటారా? నేను కొత్తగా ఒక విషయాన్ని కనిపెట్టాను, తెలుసుకోండి అని చెప్పాడంటారా?
ఈనాటికీ హిందూమతం సజీవంగా ఉండడానికి కారణం శంకరులతో పాటూ, ప్రతీ దశాబ్ధంలోనూ జన్మించిన మహానుభావులు అనేకమంది కారణం. ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస, యోగానంద, రమణమహర్షి మొదలైనవాళ్ళ ప్రభావాన్ని విస్మరించకూడదు. అటువంటివాళ్ళు ప్రతీ కాలంలోనూ లేకపోయి ఉంటే హిందూమతం ఇంత సజీవంగా ఉండగలిగేది అని నేను అనుకోను.
‘కాకపోతే, ‘స్వాభిమానంగల హిందువులు’ ఈ విధానాన్ని “assimilation power of Hinduism”అనుకుని తృప్తిపడవచ్చు’. assimilation power ఉండడం ఏవిధంగానూ గర్వించాల్సిన విషయం కాదంటారా? మిగతా మతాల్లాగా మార్పుని స్వీకరించకపోవడమే ఉత్తమ లక్షణం అంటారా?
‘చరిత్రకు మతపరమైన వ్యాఖ్య చెబితే రెండోది కరెక్టు. కేవలం చారిత్రాత్మకంగా చూస్తే మొదటిదే సరి అనిపిస్తుంది.’ – assimilation power ఉన్నది అని అన్నంతమాత్రాన అది మతపరమైన వ్యాఖ్యానం చెయ్యడమా?? ఇదేమిటండీ బాబు!! చివరికి మీరు అంటున్న విషయం ఏమిటంటే, హిందూమతం చెత్త మతం అంటే చారిత్రికంగా రైటు, హిందూ మతంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అంటే అది మత తత్వం అని. కాదంటారా?
మీ కాన్స్పిరసీ థియరీ బాగుంది. ఇంకో విషయం మీరు గమనించారో లేదో. మనవాళ్ళకి ఇవొల్యూషన్ థియరీ దశావవతారాల్లో ఉంది అని చెప్పుకోవడం ఒక సరదా. భాగవతంలో దశావతారాలు మనం మామూలుగా చెప్పుకునే వరసలో రావు. భాగవతంలో చెప్పిన వరస ఒక మాదిరి క్రోనొలాజికల్ ఆర్డర్ అనుకుంటే, ఇవొల్యూషన్ లాంటి క్రమం లేదందులో.
శిష్యగణం తమ తమ గురువుల్ని అవతారాలుగా భావిస్తారని ణాగమురళిగారు చెప్పిన సంయమన వాక్యం బాగుంది.
@నాగమురళి: “assimilative power of Hinduism” నేను వాడినపదం కాదు. అది ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ వాడింది.నేను ఇక్కడ వుపయోగించింది మీరన్నంత తీవ్రంభావంతో కాదు. కాకపోతే, అప్పట్లో హిందూమతానికి వ్యతిరేకంగా ధీటుగా ఎదురునిల్చిన సిద్దాంతాల్ని కన్వీనియంట్ గా, survival కోసం కలిపేసుకుని “తూచ్” అనేసి, అదే మా గొప్పతనం అంటే ఎలా? అదొక చారిత్రాత్మక అవసరం అని నా అభిప్రాయం.
ఆది శంకరాచార్యుడు అప్పుడుగనక వేదాలకు తనదైన భాష్యం చెప్పి మతాన్ని వ్యవస్థీకరించకుండావుంటే మీరు చెప్పిన మహానుభావులకు అసలు ఇలాంటి ఒక మతం ఉండేదని తెలిసేది కాదేమో!అంతెందుకు తను శక్తిపీఠాల్ని స్థాపించకుండా వుంటే,అసలు భారతేశంలో హిందూమతానికి ఇన్ని లంకెలు వుండేవంటారా? శైవులూ వైష్ణవులూ తెగనరుక్కొని,ఒకవైపు బౌద్ధ,జైనాలూ మరోవైపు సూఫీ ప్రభావంతో హిందూమత అస్థిత్వమే ప్రశ్నార్థకమయ్యుండేది. తను అద్వైతంలో నిజానికి వేదాలకు భాష్యం చెప్పాడు..అదీ అప్పటి పరిస్థితులకి అనుగుణంగా.
He is more of a reformer than a religious leader. అందుకే ఇప్పటివరకూ అందరి ఆమోదంకలిగిన ఏకైక వ్యక్తిగా హిందూఇజంలో నిలబడ్డాడు.అతని తరువాత వచ్చిన రామానుజాచార్యులు,మధ్వాచార్యుల వారి అడుగుజాడల్లో నడిచే హిందూమతాన్ని పటిష్టపరిచారు. బౌద్ధాన్ని ఈ దేశం నుండీ బయటకుపంపారు. జైనమతం యొక్కఆస్తిత్వాన్ని పశ్నార్థకం చేసారు. These are politics of religion at that time.ఈ పరిణామాలకు పవిత్రతను ఆపాదించక చారిత్రక అవసరాలను గుర్తించి కాస్త ఎమోషన్ ని పక్కనబెట్టి స్పందించండి.
మహేశ్ గారూ,
నేను ఏ విధంగానూ ఎమోషనల్ గా స్పందించడం లేదు. నేను ఎక్కువగా చదివిన సబ్జక్టుల గురించి చర్చ జరుగుతుంటే అందులో పాల్గొని నాకు తెలిసింది చెప్పడం, కొత్త విషయాలుంటే తెలుసుకోడమే నా పద్ధతి. నేను హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించిన పుస్తకాలు కూడా చదివాను. కాబట్టి నాకు హిందూ మతం పట్ల పెద్ద మొహమాటమేమీ లేదు. దాన్ని సమర్థించడానికి పూనుకోవడమూ లేదు.
“assimilative power of Hinduism” – అన్న పదం తప్పని నేను అనడం లేదు. “హిందూమతానికి వ్యతిరేకంగా ధీటుగా ఎదురునిల్చిన సిద్దాంతాల్ని కన్వీనియంట్ గా, survival కోసం కలిపేసుకుని “తూచ్” అనేసి, అదే మా గొప్పతనం అంటే ఎలా?” – మీరూ నేనూ ఒక విషయాన్ని చర్చిస్తున్నాము అనుకోండి. అందులో మీరు చెప్పిన విషయం మంచిది. నేను నమ్మిన విషయం తప్పు. మీతో చర్చించడం వల్ల నా నమ్మకం తప్పు అని గ్రహించి నా అభిప్రాయం మార్చుకుంటే అది గొప్ప విషయం కాదా? ‘తూచ్’ అనడమా? కన్వీనియంట్ గా survival కోసం మీ అభిప్రాయాల్ని నేను కలిపేసుకోడమా? హిందూమతంలో ఉన్న దురాచారాల్ని మేధావులు ఖండిస్తే ప్రజలు మారడం లేదూ? వాళ్ళు హిందువులుగా తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే, తమ మత భావనల్ని మార్చుకోగలుగుతున్నారంటే అది చాలా గొప్ప విషయం కాదూ?
మరొక్క విషయం – “హిందూమతానికి వ్యతిరేకంగా ధీటుగా ఎదురునిల్చిన సిద్దాంతాల్ని” – శంకరుడూ, అతని శిష్యులూ వాదనల ద్వారా తప్పని నిరూపించారనీ, బౌద్ధ పండితులు కూడా వాదంలో తమ ఓటమిని ఒప్పుకున్నారనీ, ఆనాటి సమాజం ఆ వాదనల్ని అంగీకరించడం వల్లనే బౌద్ధం ఓడించబడిందనీ అనడం సమంజసం కాదా?
‘ఆది శంకరాచార్యుడు అప్పుడుగనక వేదాలకు తనదైన భాష్యం చెప్పి మతాన్ని వ్యవస్థీకరించకుండావుంటే మీరు చెప్పిన మహానుభావులకు అసలు ఇలాంటి ఒక మతం ఉండేదని తెలిసేది కాదేమో!’ – మీరు ఏ మహానుభావుల గురించి చదివారో నాకు తెలియదు. ప్రజల్ని నిజంగా ప్రభావితం చేసిన చాలామంది మహానుభావులకి అంతకు ముందున్న మతంతో పని లేదు. షిర్డీ సాయిగానీ, రమణ మహర్షి గానీ, రామకృష్ణ పరమహంస గానీ ఒకానొక ‘ఆధ్యాత్మిక అనుభూతి’ని అనుభవించారు కాబట్టే ప్రజలు వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళేమీ మత గ్రంథాలు చదువుకుని మత ప్రచారం చేసినవాళ్ళు కారు. వాళ్ళు వేదాలూ చెప్పలేదు, వేద భాష్యాలూ చెప్పలేదు.
‘అంతెందుకు తను శక్తిపీఠాల్ని స్థాపించకుండా వుంటే,అసలు భారతేశంలో హిందూమతానికి ఇన్ని లంకెలు వుండేవంటారా? శైవులూ వైష్ణవులూ తెగనరుక్కొని,ఒకవైపు బౌద్ధ,జైనాలూ మరోవైపు సూఫీ ప్రభావంతో హిందూమత అస్థిత్వమే ప్రశ్నార్థకమయ్యుండేది.’ – శంకరుడు హిందూ మతాన్ని ఆర్గనైజ్ చేశాడు అన్నమాటని నేనేమీ ఖండించలేదే??
‘తను అద్వైతంలో నిజానికి వేదాలకు భాష్యం చెప్పాడు..అదీ అప్పటి పరిస్థితులకి అనుగుణంగా.’ – అంటే అంతకు ముందు మీరు హిందూమతం ‘సనాతనం’ కాదు అన్నమాట (ఇప్పుడు హిందూమతం ఇలా మనగలుగుతోందంటే, ఆ మహానుభావుడి దయేతప్ప మీరు చెప్పిన “సనాతనత్వం” కాదు.’) తప్పని మీరే ఒప్పుకున్నట్టే కదా!!
శంకరుడి గురించి మీరు చెప్పిన మిగతా విషయాలు కూడా కొంతమటుకు సబబే. కానీ ఆయన religious leader కాబట్టే reformer కూడా కాగలిగాడు.
’These are politics of religion at that time.ఈ పరిణామాలకు పవిత్రతను ఆపాదించక చారిత్రక అవసరాలను గుర్తించి కాస్త ఎమోషన్ ని పక్కనబెట్టి స్పందించండి.’ – ప్రతిదాన్నీ పోలిటిక్సు దృష్టితో చూడడం మనకి అలవాటు. శంకరుడు గానీ, బౌద్ధులు గానీ రాజకీయ కారణాలకోసం మత వ్యాప్తికి పూనుకోలేదు. ఈరోజు మీరు సమాజ సేవ ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు అందుకే చేశారు – మనుషుల బాగు కోసం. మీ దృష్టిలో ‘బాగు’ వేరు. వాళ్ళ దృష్టిలో ‘బాగు’ వేరు (వాళ్ళ దృష్టి కోణాన్ని theology అని పేరు పెట్టుకుని మీరు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు). ఈ పరిణామాలకి నేను పవిత్రతని ఏమీ ఆపాదించడం లేదు. హిందువులకి flexibility ఉన్నది అన్న మాట మత దృక్పథంలోంచో, ఆవేశంలోంచో చెప్పిన మాట ఏమీ కాదు.
కానీ మీరన్న మాట ’కొందరు హిందూ స్వాభిమానులు దీన్ని assimilative power అనుకుని తృప్తి పడవచ్చు’ – పక్షపాతాన్ని సూచిస్తుంది. నేను హిందూ స్వాభిమానిని కాను. హిందువులకి assimilative power ఉండడం చారిత్రికంగా ఒక fact. Fact అయిన విషయాన్ని ‘చరిత్రకు మతపరమైన వ్యాఖ్య’గా ప్రకటించడం అసంగతం. అది objective view point ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇంకోళ్ళ సిద్దాంతాలు దొంగిలించేశారు, కేవలం బతకడం కోసం అని ఈసడించడం objective view point ఎంతమాత్రం కాదు (రోమిల్లా థాపర్ చెప్పినా, ఇంకా ఎంతమంది మేతావులు చెప్పినా!!). మనం పాశ్చాత్యుల నుంచి సైన్సూ, టెక్నాలజీ నేర్చుకోలేదూ? వాళ్ళ సిద్ధాంతాలు మనం కలిపేసుకున్నాం survival కోసం అంటే అది చారిత్రిక దృక్పథమా? లేకపోతే కాలంతో పాటూ మారాం, ఆధునిక పోకడలు అలవర్చుకున్నాం అంటే అది చారిత్రిక దృక్పథమా?
అబ్రకఅదబ్ర గారూ, ఈ టపా రాసినందుకు ధన్యవాదాలు. మహేష్ గారూ మీ స్పందనలకు కూడా. ఎందుకంటే మీరే కదా నాగమురళి గారిచేత పై రెండు కామెంట్లూ చేయించింది.
ఈ చర్చ లో నేను పాలు పంచుకోబోయే ముందు, మొదట జరిగిన conclusion : బుద్ధుడిని హిందూ మత వాదులు (మతం అంటే vague గా ఉంటుంది అని నా భావన) దేవుణ్ణి చేసారు.
నా అభిప్రాయం (నాకున్న పుస్తక పరిఙ్ఞానం తో) : అవును. అయితే, బౌద్ధులు, రామాయణం మీద బురద జల్లడం , జైనులు కృష్ణుని మీద బురద జల్లడం కూడా జరిగాయ్.కాబట్టి, ఓ మతం విశాల దృక్పథం కలది, ఇంకొకటి కాదు అనడం, ఒక సంబద్ధమైన వాదన గా నాకు కనిపించడం లేదు. అలాంటప్పుడు, చర్చ మతం (మత వాదులు – బౌద్ధులు/జైనులు వగైరా)మీద కాక వ్యక్తుల మీద జరిగితే మంచిది.ఎందుకటే, హిందూ మతం అయినా, బౌద్ధ మతం అయినా మరేదైనా, మౌలికంగా అదో ఇజం. (Organisation of truth is fundamentally false – JK)
ఇక ఆది శంకరుడు : ఈయన నిబద్ధత మీద నాకూ కొన్ని అనుమానాలు. బుద్ధుడు, జీసస్, ఉపనిషత్తులు వగైరా “తనను తాను తెలుసుకోవడం” అనే పాయింట్ దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు శంకరౌల వారి మౌలిక సూత్రం తీసుకుందాం.”బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః” – జీవుడు, బ్రహ్మము మధ్య వ్యత్యాసం లేదు! ఇలా చెప్పిన (ఆత్మ వికాసాన్ని ప్రబోధించిన) ఈయనే శక్తి పీఠాలు నెలకొల్పడం, గురుపరంపర నెలకొల్పడం , అనవసర తత్వ చర్చ లకు మూలమవడం (మాయావాదం), ఇలాంటి వాటిలో హిపోక్రసీ కనబడుతుంది. ఇదే పాయింట్ ను JK, ఓ గొప్ప conversation, guru and the search లో చెబుతాడు. ఓషో కూడా ఆది శంకరుడికి విమర్శకుడే. ఇలాంటివి బుద్ధుడు, జినుడు చేయలేదు. మన భారతీయులు మహా intellectuals అవడం వల్ల శంకరుడికి వచ్చిన ఆదరణ బుద్ధుడు కోల్పోయాడు అని నా భావన. ఇది శంకరాచార్యుల కుట్ర అనడం కన్నా, చారిత్రక పరిణామం అని అనడం నాకు సబబు గా కనిపిస్తుంది.
రవి గారూ, మీరు మరీ తాత్త్విక చర్చని లేవనెత్తుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చ తాత్త్వికమైనది కాదు. ‘మత రాజకీయాల’ గురించి మాత్రమే. శంకరుడు అద్వైతవాది అయి ఉండీ స్తోత్రాలు ఎందుకు రాయాలి, మాయని నిరసించినవాడై ఉండీ ‘మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ అని అమ్మవారిని ఎందుకు స్తుతించాలి, శక్తిపీఠాలు ఎందుకు నెలకొల్పాలి ఇలాంటి ప్రశ్నలకి ఇది వేదిక కాదు. శంకరుడి గురించి తాత్త్వికంగా అర్థం కాని ఒక ద్వైధీభావాన్ని ఆయన నిబద్ధతని ప్రశ్నించడంగా మార్చకూడదు.
జిడ్డు కృష్ణమూర్తిగారు కానీ, ఓషో గానీ శంకరుడి కన్నా ఒక రెండువేల యేళ్ళ తరువాతి వారు. మహా తత్త్వవేత్తలు. వాళ్ళు శంకరుడి గురించి వ్యాఖ్యలు చెయ్యడానికీ, ఓ కత్తి మహేశ్ గారో, దుర్యోధనుడు గొప్పవాడనే అబ్రకదబ్రా గారో శంకరుడు రాజకీయనాయకుడనడానికీ చాలా తేడా ఉంటుంది. వీళ్ళనేది హిందువులు కుట్రపన్ని బుద్ధుణ్ణి దేవుణ్ణి చేశారని. నష్టమేమిటని నా ప్రశ్న. బుద్ధుణ్ణే కాదు, గాంధీని కూడా దేవుడి అవతారమని నమ్మేవాళ్ళు ఉన్నారు. మహేశ్ గారు పూనుకుని సమాజసేవ చేసి, జనాల కళ్ళు తెరిపిస్తే ఆయన్ని కూడా ఆరాధించడానికి హిందువులు సిద్ధంగా ఉంటారు. అందులో తప్పేమిటన్నదే నా బాధ. పైగా అటువంటి flexibility ఉన్నదని అనడమే ఒక మత భావన అట. ముందు దాని గురించి చర్చ జరగనివ్వండి. శంకరుడి నిబద్ధతని గురించి చర్చించే సరుకున్నవాళ్ళు వేరే ఉంటారు.
మురళన్నో,
నా మాటికి నేను ఓ టపా రాసేసి పక్కన కూకుని సోద్యం సూస్తంటే నువ్వేంది గొడవలోకి నన్నూ లాగుతుండావు 🙂 దుర్యోదనున్ని గొప్పోడని నేనన్లా. పాండవ సాములూ దుర్యోదన సామి కన్నా గొప్పోళ్లేం కాదని చెప్పేదానికి ఆ తిప్పలన్నీ పడినా.
చర్చ వేడి మీద సాగుతున్నట్లుంది. కాస్త చల్లబరుద్దామని నే రెండు లైన్లు గిలికా. Don’t get distracted. Please continue.
అబ్రకదబ్రా గారూ, పాండవుల గురించి మీ కామెంట్లు నేను చదివాను. నేను సాధారణంగా ఇటువంటి చర్చల్లో పాలు పంచుకోను. పెద్ద ఆవేశపరుణ్ణీ కాను. అక్కడా మీకు సమాధానం ఇవ్వచ్చు, కానీ టైము లేకా, అనవసరం అనీ ఊరుకున్నాను. ఇవన్నీ చేట భారతాలు. తెమిలేవి కావు. ఎదురూ బొదురుగా కూర్చుని శనివారం సాయంత్రం పకోడీలు తింటూ మాట్లాడుకోడానికి బాగుంటాయి.
అనంతమైన విజ్ఞానం ఉన్నది. సైన్సూ, ఫిలాసఫీ, చరిత్రా, సాహిత్యం – ఇలాంటి వాటిల్లో మునిగితే జన్మల తరబడి తేలకుండా ఉండిపోవచ్చు. అయినా పూర్తిగా విషయాలు తెలియకుండా, ‘సాధికారంగా’ అభిప్రాయాలు ప్రకటించేస్తూ ఉంటే ఒక్కోసారి కలగజేసుకోబుద్ధి అవుతుంది. మళ్ళా నాలిక్కరుచుకుని తప్పుకుంటూ ఉంటా. అంతే.
నాది అఙ్ఞానమైతే క్షమించండి.
దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చడం హిందూమతం యొక్క తెలివిని సూచిస్తుంది. మరి అదే తెలివితో క్రీస్తును, మహమ్మద్ నూ ద్వాదశావతారాలతో కలిపేసుకునుంటే బాగుండేది. ఎందుకని అలా చేయలేదో?
అలాగే, రాముడు ఏ కళాశాలలో డిగ్రీ తెచ్చుకున్నాడో కూడా రొమిల్లా థాపర్ ని అడిగి చెప్పేస్తే మన కరుణానిధి గారికి మేలు చేసినవారవుతారు.
పెదరాయుడు గారు,
బౌద్ధం నుండి వచ్చినంత ప్రమాదం క్రైస్తవం నుండీ, ఇస్లాం నుండీ హిందూత్వానికి ఎప్పుడూ రాలేదు. జైన, బౌద్ధ మతాల ధాటికి ఒకానొక దశలో ఉపఖండంలో హిందూత్వం మైనారిటీలో పడిపోయింది. ఆ స్థాయిలో క్రిస్టియన్లో, మహమ్మదీయులో హిందూత్వాన్ని దెబ్బదీసి ఉంటే .. ఎవరికి తెలుసు, ఇప్పుడు ద్వాదశావతారాలే ఉండేవేమో.
మన చర్చ ‘ఏమి జరిగి ఉండొచ్చు’ అనేదాని మీదనే కానీ ‘ఇలా ఎందుకు జరగలేదు’ అనేదాని మీద కాదు. దీని ఉద్దేశం హిందూత్వం చెడ్డది, ఇతర మతాలు గొప్పవి అని నీరూపించటమూ కాదు. అన్ని మతాల్లోనూ మంచి-చెడు రెండూ ఉన్నాయి. ఎవరినీ నొప్పించటానికి నేనీ వ్యాసం రాయలేదు. కేవలం నా అభిప్రాయాలు బయటపెట్టటానికి, తప్పులుంటే మీలాంటి వారి వ్యాఖ్యలు చదివి దిద్దుకోవటానికి మాత్రమే రాశాను.
@నాగమురళి: ఎవరితోనైనా మనం విభేధించినంత మాత్రానా వారిపై గౌరవం తగ్గుతుందని అనుకోనఖ్ఖర లేదు.శంకరుడైనా, క్రీస్తైనా,గాంధీ అయినా వారి విలువ వారికుంది. కాకపోతే, సమయానుగుణంగా సమాజంలో, ఆలోచనా ధోరణుల్లో కొన్ని మార్పులొచ్చి, అప్పట్లో వారు చెప్పిన, చేసినవాటిల్లో కొంత తప్పుందని ఎవరికైనా అనిపిస్తే అది చెప్పడం పెద్ద నేరం కాదని నా ఉద్దేశం.అలా చెప్పడానికి పెద్ద qualification కూడా అవసరం లేదు. ఒక ఆలోచించే మనిషైతే చాలు. అంత మాత్రానా, “అతగొప్పవారి గురించి ఇలా మాట్లాడతారా?” అనే holy-cow syndrome తెచ్చుకోనక్కర లేదు.
నావరకూ everybody is open to criticism and there and no holy-cows. నిజంగా వాళ్ళుంటే ఇవన్నీ విని ఇంకా సంతోషించేవారేమో! They were much more broad minded then most.ఈ మహానుభావులెప్పుడూ తాము “మహానుభావులం” అని చెప్పుకోలేదు. సమాజానికి వారు చేసిన మేలునిబట్టి ఆ గొప్పతనం మనం ఆపాదిస్తున్నాం. అలాంటప్పుడు, కందకు లేని దురద కత్తిపీటకెందుకు? I am also a custodian of their greatness as much as anybody who is speaking in favour of them here. ఎందుకంటే, ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఒక మనిషైతే (ఈ వారసత్వం కేవలం భారతీయులదే కూడా కాదు)చాలు.
ఇలా అన్నింటినీ ప్రశ్నించడానికి అతీతంగా “పవిత్రం” చెయ్యడం వల్లనే మనం వెనుకబడున్నాం. అది మతమైనా,సామాజిక విలువైనా, వ్యక్తిగత అభిప్రాయమైనా ప్రశ్నించాల్సిందే. పూర్ణసత్యం కాకున్నా, ప్రతివొక్కరూ తమదైన సత్యం తెలుసుకోవలసిందే.
>> “అతగొప్పవారి గురించి ఇలా మాట్లాడతారా?” అనే holy-cow syndrome తెచ్చుకోనక్కర లేదు.
– ఇది నేను అన్న విషయమే కాదు. నా యాటిట్యూడ్ అంతకన్నా కాదు. శంకరాచార్యుల్ని మీరేదో విమర్శిస్తే నేనేదో మండిపడుతున్నానని మీరు భావిస్తే పొరపాటు. అది చర్చని పక్కదోవ పట్టించడమే. నిరభ్యంతరంగా విమర్శించుకోండి. కానీ నాకు తెలిసిన సత్యాలు నేను చెప్పవద్దా? మీరు తెలియక తప్పు మాట్లాడితే, లేకపోతే అసందర్భంగా, పొంతన లేకుండా మాట్లాడితే నేను తెలియజెప్పవద్దా?
>>I am also a custodian of their greatness as much as anybody who is speaking in favour of them here. ఎందుకంటే, ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఒక మనిషైతే (ఈ వారసత్వం కేవలం భారతీయులదే కూడా కాదు)చాలు.
– చాలా మంచి మాటన్నారు.
>> ఇలా అన్నింటినీ ప్రశ్నించడానికి అతీతంగా “పవిత్రం” చెయ్యడం వల్లనే మనం వెనుకబడున్నాం. అది మతమైనా,సామాజిక విలువైనా, వ్యక్తిగత అభిప్రాయమైనా ప్రశ్నించాల్సిందే. పూర్ణసత్యం కాకున్నా, ప్రతివొక్కరూ తమదైన సత్యం తెలుసుకోవలసిందే.
– మీరు నా గురించి పొరబడ్డారు. ప్రశ్నించడానికి నేను వ్యతిరేకమేమీ కాను. ఇది పవిత్రం చెయ్యడం అంతకన్నా కాదు. నేను అసలు చేస్తున్నదే మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రశ్నించడం. వాటిలోని పొరపాట్లని చూపించడం. మీరు మీ పొరపాట్లని అంగీకరించకుండా కేవలం ఉపన్యాసాలకి పరిమితమవుతుట్టు అనిపిస్తోంది.
చివరిగా ఒక్క ప్రశ్న – మీరు ఈ holy-cow syndrome కి అతీతులని బలంగా నమ్ముతున్నారా? ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు అందుకు వ్యతిరేకంగా జరిగాయేమో?? – దీని గురించి నేను చెప్పవలసిందంతా ఇప్పటికే చెప్పాను కాబట్టి ఇంక చెప్పాల్సింది ఏమీ లేదు. మీరూ ఏమీ చెప్పనక్కర లేదు. ఇతరులకి ఉపన్యాసాలివ్వడం తగ్గించి కొంచం ఆత్మ విమర్శ చేసుకుంటే చాలు.
@నాగమురళి: నేను…ఉపన్యాసమే ! ఇక ఆత్మవిమర్శ అంటావా అది ఎప్పుడూ చేసుకునేదే. ఇక ఏమీ చెప్పక్కరలేదని నిర్ణయించారుగనక, నేనూ సైలెంటే! (ఇక్కడ మాత్రమే)
నాగ మురళి గారు, మీరు చెప్పిన తర్వాత ఇలాంటి చర్చల్లో ఉన్న ఇబ్బంది, (నా పొరబాటు కూడా:-)) మరో మారు తెలిసింది. ఇలాంటి చర్చ మన వంటికి పడదు.:-)ఆవేశంతో నాకున్న అభిప్రాయాల్ని వెళ్ళగక్కి, చర్చ ను వేరే త్రోవ పట్టించేను.:-)
ఇక బుద్ధుణ్ణి దేవుణ్ణి చేయడం తప్పా?
నా సమాధానం : అవును. తప్పే, బుద్ధుడిని తప్పుగా అర్థం చేసుకునే వీలుంది. తన బోధల సారాన్శం డైల్యూట్ అయే అవకాశం ఉంది కూడానూ.
ఇంకో సమాధానం : తప్పు కాదు. ఎందుకంటే, ఇదే పని వేరే వాళ్ళు చేశారు, మా మతం (ఎక్స్ వై జెడ్) గొప్పది…మా మతాన్ని మేము నిలబెట్టుకోవాలి. మా సంస్కృతిని పరిరక్షించుకోవాలి వగైరా వగైరా..ఇంకో కోణం లో చూస్తే, మీరన్నట్టు, గాంధీని ఇంకా కొంత మందిని కూడా మనం దేవుడు అంటున్నాం తప్పేంటి? అని. ఈ దృష్టి లో తప్పు కాదు.
individual objectives ్ మీద సమాధానం ఆధారపడి ఉంటుంది.
(నా చర్చ ను ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.
రవి గారూ, మీరన్నది తప్పు అనడమో, పొరపాటు అనడమో నా ఉద్దేశ్యం కాదు. మీరు చర్చని చాలా ఉన్నత స్థాయిలో మొదలు పెట్టారు. ఇక్కడ చర్చ జరుగుతున్న frequency అది కాదు. మనం తరవాత వివరంగా శంకరుల సిద్ధాంతాల గురించీ, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ గురించీ చర్చించుకోవచ్చు.
విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో ఒక conclusion కి వచ్చే ముందు చాలా జాగ్రత్త వహించాలి. బుద్ధుణ్ణిగానీ, మరెవర్నైనా గానీ దేవుణ్ణి చెయ్యడం తప్పు అని మీరు ఎలా తీర్మానించగలరు? మీ వ్యక్తిగత నమ్మకాలనో, ఫిలాసఫీనో పక్కన పెడితే, అది తప్పు అని చెప్పడానికి ఏ ఆధారాలు మీరు వాడుతున్నారు? ఒక మనిషిని దైవంగా కొలవడం అనేది ఎందుకు చేస్తారో తెలుసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన దృక్కోణాన్ని తెలుసుకోవాలి. భాగవతం మొదలైనవి చదవాలి.
హైందవ సంస్కృతిని తప్పు అనేముందు దాని గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక పునాది ఆధారంగా చర్చించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత నమ్మకాల ప్రకారం (లేదా మరొక తత్త్వవేత్త ఫిలాసఫీ ప్రకారం) తప్పు అని తీర్మానించడం తొందరపాటు. జిడ్డు కృష్ణమూర్తిగారి శిష్యుడు ఒకాయన్ని నేను లండన్ లో కలిశాను. ఫిలాసఫీ లెక్చరరు. చాలా sensible person. మూఢ విశ్వాసాలు ఉన్న వ్యక్తి కాదు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలకు వెళ్ళాడట. ఆయన ఏమన్నాడంటే, కృష్ణమూర్తిగారు ఉపన్యిసిస్తూ ఉంటే ‘ఆయన చుట్టూ బంగారు వెలుగులతో కూడిన ఒక కాంతి పరివేషం (golden aura)’ కనపపడిందిట. (ఆయన New Age or Mystical beliefs కలిగిన వ్యక్తి కూడా కాదు.). నేను చాలా మౌనంగా ఊరుకున్నాను. ఆయన అన్న మాట కృష్ణమూర్తిగారితో డైరెక్టుగా అంటే ఆయన కూడా చాలా హాస్యాస్పదంగా భావించి ఉండేవారు. ఆ లెక్చరరు గారితో మీరు JK ని దేముణ్ణో, అద్భుత వ్యక్తినో చేస్తున్నారు. అది ఆయన ఫిలాసఫీకి విరుద్ధం అని నేను అంటే చాలా అసహ్యంగా ఉంటుంది.
మతవిశ్వాసాల roots వేరు. Richard Dawkins మతాల్ని ఎంత తిట్టినా తన God Delusion పుస్తకంలో మతం యొక్క roots గురించి కొన్ని అద్భుతమైన scientific points చెప్పాడు. ఓపిక ఉంటే మన బ్లాగు మిత్రులు చదవండి ఆ పుస్తకం. విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తియొక్క నమ్మకాలని ప్రశ్నించడానికి సాహసించే ముందు అత్యంత సానుభూతితో, అనేక కోణాల్లో ఆ వ్యక్తిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. ఈ మధ్య బ్లాగు లోకం మరీ మురిక్కాలవ లాగా తయారయింది.
మహేశ్ గారు బుద్ధుడిని అర్థం చేసుకోవడం అసలు సాధ్యమే కాదు అని ఒక అభిప్రాయం రాశారు. మీరు చూసే ఉంటారు. చర్చలు నాకూ ఇష్టం ఉండవు. sensible గా ఉన్నంత వరకు ఏది చెప్పినా పరవాలేదు. ఏ దృక్కోణాన్నైనా ఆమోదించవచ్చు. ఇంకొక దృక్కోణాన్ని ఈసడించడం మాత్రం చెయ్యకూడదు.
@నాగమురళి: “మహేశ్ గారు బుద్ధుడిని అర్థం చేసుకోవడం అసలు సాధ్యమే కాదు అని ఒక అభిప్రాయం రాశారు” where and when?
నాగమురళి గారు : అయ్యో రామ 🙂 ! మీరు పొరబాటు అన్నందుకు ఆవేశపడి నేను సమాధానం రాయలేదు. ఇలాంటి చర్చల్లో పాల్గొనేటప్పుడు, “విషయం కూలంకషంగా తెలుసుకోవడం” అన్న భావం డైల్యూట్ అవడం వల్ల వచ్చిన చిక్కు. అది నాకు స్ఫురణకు రావడం వల్ల, నాలుక కొరుక్కుని, చర్చ ను ఆపాను :-).
>>బుద్ధుణ్ణిగానీ, మరెవర్నైనా గానీ దేవుణ్ణి చెయ్యడం తప్పు అని మీరు ఎలా తీర్మానించగలరు?
జాగ్రత్త గా నా సమాధానం చదవండి. నేను తీర్మానించలేదు అన్నది మీకు తెలుస్తుంది. (సరిగ్గా ఆర్టిక్యులేట్ చేయలేకపోతున్నానా??)
>>ఆయన అన్న మాట కృష్ణమూర్తిగారితో డైరెక్టుగా అంటే ఆయన కూడా చాలా >>హాస్యాస్పదంగా భావించి ఉండేవారు. ఆ లెక్చరరు గారితో మీరు ఝ్ఖ్ ని దేముణ్ణో, అద్భుత >>వ్యక్తినో చేస్తున్నారు. అది ఆయన ఫిలాసఫీకి విరుద్ధం అని నేను అంటే చాలా అసహ్యంగా >>ఉంటుంది.
అసహ్యంగా ఉండదు. ఉన్నా అది మీ తప్పు కాదు. పచ్చి నిజం అది.
>>విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తియొక్క >>నమ్మకాలని ప్రశ్నించడానికి సాహసించే ముందు అత్యంత సానుభూతితో, అనేక కోణాల్లో ఆ >>వ్యక్తిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి.
(నా సమాధానం ఇంకో సారి చదవండి). మీ దృక్కోణం సానుభొతి, ఆ వ్యక్తి ని బాధించ రాదు, ఆ వ్యక్తి ఉన్న సాంఘిక పరిస్థితులు, అతని బాక్ గ్రవుండ్ వగైరా వగైరా అయిన పక్షంలో మీరన్నది 100 % కర్రెక్ట్. మీ దృక్కోణం (objectiveె) కేవలం సత్య సోధన అయితే, మీరు ఆ వ్యక్తి బోధ “మీరు వెదుకుతున్న” సత్యాని దగ్గరగా ఉందా అనే ఆలోచిస్తారు. ఉదా : గౌతముడు ఇల్లు విడిచి, సత్య శోధన లో పడ్డాక, ఉద్ధక రామపుత్రుడనే గురువుని ఆశ్రయించాడు. అతని వద్ద నైవ యఙ్ఞా సన్ఙ్ఞాయతనం అనే ఓ యోగ విద్య నేర్చుకున్నాడు. అదో గొప్ప యోగ విద్య. గౌతముడు, ఆ విద్య తన (సత్య శొధన) కు పనికిరాదు అని “తీర్మానించుకుని” ముందుకు సాగేడు. ఇప్పుడు తిరిగి ఆలోచిద్దాం. గౌతముడి తెర్మానం తప్పా? సమాధానం “అవును”, సమాధానం “కాదు”. నిజానికి సమాధానం తో పనిలేదు. సమాధానం “అవును” అన్నా బుద్ధుడికి అది అచ్చి రా(లే)దు.
ఇక పోతే, మళ్ళీ చెబుతున్నాను. ఇలాంటి చర్చల ద్వారా ఒకరిని ఇబ్బంది పెట్టటం అనే విషయం స్ఫురిస్తే, అది చెప్పలేనంత ఇబ్బంది గా ఉంటుంది. మీది అదే పరిస్థితి అని నాకు చూచాయగా తెలుస్తుంది :-). కాబట్టి ఇకపై చర్చ చేయబోయే ముందు స్కోప్ సాధ్యమైనంత చిన్నదిగా ఉంచుదాం అని నా ప్రతిపాదన.ఏమంటారు?
అబ్రకదబ్ర : మిమ్మల్ని వదిలేసి, ఇక్కడ కొట్టుకుంటున్నాం. లైట్ గా తీసుకోండి :-). మీ బ్లాగు తెరుచుకోడానికి చాలా సమయం పడుతా ఉంది. ఏమైనా చేయండి బాబు.
@పెదరాయుడు,కృష్ణమోహన్,కొత్తపాళీ,చైతన్యకృష్ణ,విజయమోహన్:
ధన్యవాదాలు.
@రవి,మురళి,మహేష్:
తీరిక లేకపోవటంతో ఈ చర్చలో పాల్గొనలేకపోయాను. అయినా మీ వాదోపవాదాలన్నీ చదువుతున్నాను. నాకు తెలీని విషయాలు చాలా తెలుస్తున్నాయి. ఇంత ఘాటుగా చర్చ జరిగినా ఎక్కడా హద్దులు మీరకపోవటం గొప్ప విషయం. అత్యంత హుందాగా ప్రవర్తిస్తున్నారు అందరూ. ధన్యవాదాలు.
@రవి:
కామెంట్ల సైజు నా టపా సైజుకి పదింతలు ఉన్నట్లుంది. అంత పెద్ద యూనికోడ్ పేజీలని లోడ్ చెయ్యటం కొన్ని బ్రౌజర్లకి సమస్యేమో. ఈ సమస్య ఈ ఒక్క టపాకే అయ్యుండాలి. అవునా?
రవిగారూ,
మీతో చర్చ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన అభిప్రాయాల తప్పొప్పులతో సంబంధంలేకుండా ఆసక్తికరంగా, సబ్జక్టు పరంగా చర్చ చెయ్యగలుగుతాం.
వచ్చే వారం ’ఈమాట’ లో నా జ్యోతిష వ్యాసం చివరి భాగం పబ్లిష్ అవుతుంది. అది కూడా మీరు చదివితే నేను అనేక కోణాల్లోంచి ఒక విషయాన్నిచూడడానికి తాపత్రయ పడతాను అని మీకు అనిపిస్తుంది. కొంతమటుకు అది నిజమే. మత సంబంధమైన విషయాల్లో కూడా నేను అలాగే తాపత్రయ పడతాను.
>>బుద్ధుణ్ణిగానీ, మరెవర్నైనా గానీ దేవుణ్ణి చెయ్యడం తప్పు అని మీరు ఎలా తీర్మానించగలరు?
అవును. మీరు తీర్మానించలేదు. నాదే పొరపాటు. కానీ నేనన్నది మీరు చెప్పిన మాట గురించి మాత్రమే కాదు. అసలు ఎవరైనా సరే, ఆ విషయాన్ని తప్పు అని ఎందుకు అంత తొందరగా తీర్మానించాలి అని మాత్రమే నా ఉద్దేశ్యం. (ఎక్కువ మందికి quick answers కావాలి. నాకు anwers కోసం తొందర లేదు కాబట్టి తీరుబడిగా ప్రశ్నల్ని చూయింగ్ గమ్ లాగా నమలడానికే ఇష్టపడతాను.)
>> అసహ్యంగా ఉండదు. ఉన్నా అది మీ తప్పు కాదు. పచ్చి నిజం అది.
చూశారా?? మీరు గట్టిగా నమ్మిన ఒక Truth కి contradiction చూపించేసరికి మీరు ఎలా రియాక్టు అవుతున్నారో?? కృష్ణమూర్తి గారిని (ఇంచుమించు) దేవుడిగా భావించే వ్యక్తి ఉన్నాడని మీకు చెప్తే మీరు షాకవడం సహజం. అది ఎందుకు పచ్చి ’నిజం’? అవతలి మనిషికి నిజంగానే golden aura కనిపించిందేమో!! కృష్ణమూర్తి గారు నిజంగా అవతారమేమో!! Organisation of truth is fundamentally false – అని JK చెప్పారు. మీకు నచ్చింది. మరి ఆయన చెప్పిన statement శిలాశాసనమా? దానికి contradictions ఉండకూడదా? ఉండకూడదు అంటే అది Truth ని గట్టిగా సిద్ధాంతీకరించడం (organize చెయ్యడం) కాదా? నేను చెప్తున్నది మీకు nonsense అనిపించవచ్చు. కానీ ఒకసారి సరదాగా దీనిగురించి ఆలోచించి చూడండి.
>>మీ దృక్కోణం సానుభొతి, ఆ వ్యక్తి ని బాధించ రాదు, ఆ వ్యక్తి ఉన్న సాంఘిక పరిస్థితులు, అతని బాక్ గ్రవుండ్ వగైరా వగైరా అయిన పక్షంలో మీరన్నది 100 % కర్రెక్ట్.
నా దృక్కోణం ఇది ఒక్కటే కాదు. It includes this.
>> మీ దృక్కోణం (objectiveె) కేవలం సత్య సోధన అయితే, మీరు ఆ వ్యక్తి బోధ “మీరు వెదుకుతున్న” సత్యాని దగ్గరగా ఉందా అనే ఆలోచిస్తారు.
I agree to this 100%
>> గౌతముడు, ఆ విద్య తన (సత్య శొధన) కు పనికిరాదు అని “తీర్మానించుకుని” ముందుకు సాగేడు. ఇప్పుడు తిరిగి ఆలోచిద్దాం. గౌతముడి తెర్మానం తప్పా? నిజానికి సమాధానం తో పనిలేదు.
I agree to this 100%.
Now, I have a question. There is a person ‘A’ in search of Truth. He happens to go to a meeting hall. He sees some ‘B’ lecturing there. And he sees a Golden Aura surrounding ‘B’. He experiences some peace/bliss. He realizes that he has experienced his Truth. There is nothing to think or talk about now. He just found The TRUTH. No reasons any more. No thinking, nothing.
Now, A says that B is the cause of his enlightenment and hence B is an Avataar. Unfortunately, B is deadset against the concept of Avatarhood. He hates worshipping people. Now, has A realized Truth?
In my case, it doesn’t matter for me whether A has realized the Truth or not. I don’t care. But, I don’t deny or ridicule A – as long as I know that he is sincere. You are also taking the same position as far as Buddha’s example is concerned. But, when it comes to Krishna murthy garu, you are reacting a little strongly by saying, ‘పచ్చి నిజం అది’ etc.
Am I completely wrong about this?
>> ఇలాంటి చర్చల ద్వారా ఒకరిని ఇబ్బంది పెట్టటం అనే విషయం స్ఫురిస్తే, అది చెప్పలేనంత ఇబ్బంది గా ఉంటుంది. మీది అదే పరిస్థితి అని నాకు చూచాయగా తెలుస్తుంది :-).
ఇబ్బందే. మరీ ఇబ్బంది ఏమిటంటే ఒక విషయం చర్చిస్తున్నప్పుడు మనకి ఒక stance ఉంది అని అవతల వాళ్ళు ఊహించేసుకుని శత్రువులుగా చూడడం. మన stance చాలా flexible అనీ, Diametrically opposite stances తీసుకోడంలో నాకు enjoyment ఉన్నదనీ అవతల వాళ్ళు నమ్మేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు.
One last thing. I know very little in any subject. If you judge my knowledge based on the length of my comments, you will be very disappointed.
అబ్రకదబ్రా గారూ, క్షమించాలి. మీ site లో తిష్ట వేసేసుకుని space అంతా తినేస్తున్నాం.
“చూశారా?? మీరు గట్టిగా నమ్మిన ఒక ట్రుథ్ కి చొంత్రదిచ్తిఒన్ చూపించేసరికి మీరు ఎలా రియాక్టు అవుతున్నారో?? కృష్ణమూర్తి గారిని (ఇంచుమించు) దేవుడిగా భావించే వ్యక్తి ఉన్నాడని మీకు చెప్తే మీరు షాకవడం సహజం. అది ఎందుకు పచ్చి ’నిజం’? …..”
ఓ చిన్న పొరబాటు జరిగింది. నేను పచ్చి నిజం అన్నది, మీరు చెప్పిన ఈ క్రింది వాక్యం గురించి.
“ఆయన అన్న మాట కృష్ణమూర్తిగారితో డైరెక్టుగా అంటే ఆయన కూడా చాలా హాస్యాస్పదంగా భావించి ఉండేవారు.”
ఇక “అసహ్యం” అన్నది, నేను మీ భావన పరంగా చెప్పాను. అంటే, ఈ విషయాన్ని మీరు అసహ్యంగా భావించి ఉంటే, అది అసహ్యం కాదు అని చెప్పాను. మీరు ఆ ఝ్ఖ్ భక్తుడితో “చెప్పడం” అసహ్యం (నిజానికి ఇది కొంచెం పెద్ద పదం. ఇబ్బంది అంటే సరిపోతుందనుకుంటా) అని అంటే, అందులో నాకు ఏ ఇబ్బందీ కనబడదు. i agree with u totally.
“Am I completely wrong about this?”
I feel it’s nothing to do with right or wrong. U r just trying to explore the possibilities.In fact I also tend to be in this way only in case of matters like religion etc etc..
@అబ్రకదబ్ర గారు, ఈ టపా నే ఎక్కువ టైం అవుతోంది, మీరన్నట్లు. అదీ ఇంటెర్నెట్ ఎక్స్ప్లోరర్లోనే. మంటనక్క లో ఓకే, నా దగ్గరున్న మంటనక్క పాతది. తెలుగు అక్షరాలు అలుక్కుపోయి కనిపిస్తున్నాయి.
ఇంకో ముక్క చెప్పడం మరిచాను.
“మరి ఆయన చెప్పిన స్తతెమెంత్ శిలాశాసనమా? దానికి contradictions్ ఉండకూడదా? ఉండకూడదు అంటే అది Truth ని గట్టిగా సిద్ధాంతీకరించడం (organizeె చెయ్యడం) కాదా? నేను చెప్తున్నది మీకు నొన్సెన్సె అనిపించవచ్చు. కానీ ఒకసారి సరదాగా దీనిగురించి ఆలోచించి చూడండి.”
contradictions ఉండవచ్చు. ఓ సారి పై స్తేట్మెంట్ ను రివెర్సె చేసి చూడండి. “ఓ వ్యక్తి కి ఆరా కనిపించింది, JK్ తల దగ్గర.” అది నిజమూ అవచ్చూ, అబద్దం అవచ్చు.Ultimateె Truth్ తెలియాలంటే, నేను ఓ బుద్ధుడు, మీరో పతంజలి గారో అయి ఉండాలి. :-).
unfortunately, we are not unto the standards of those greats. :-). So I tend to go according to JK and u tend to go according to Sankara or somebody.
So, it is meaningless to discuss about them. “if” we have to discuss, we should discuss the social implications and historical changes (and may be some other, which I am unable to think about) that were happened because of those people’s vision. In view of those things, some time, we may get some idea of who is genuine and who is a hypOcrite.
ఇక ఈ చర్చ కు మంగళం పాడ్డం మంచిది యేమంటారు :-). ఇంకో సారి అబ్రకదబ్ర కు సారీ!
రవి గారూ, మరోసారి ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మిరు చెప్పినట్టు మనకంత స్థాయి లేకపోయినా ఆసక్తి ఉంది కాబట్టీ, ఎంతో కొంత అర్థం చేసుకోగలం కాబట్టీ మన స్థాయిలో మనం చర్చించడం అవసరమే అనీ, అది ఒక సరదా అనీ కూడా నా భావన. దాని వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయనే నేను అనుకుంటాను. ఎందుకో తరవాత వివరిస్తాను.
అబ్రకదబ్రా గారూ, నేనూ ఈ చర్చ కి మంగళం పాడేస్తున్నా.
చాలా ఆసక్తికరంగా సాగింది చర్చ. టెన్నిస్ గేమ్ లో లాగా సర్వీస్ లు, వాలీ లు, బ్యాక్ హాండ్ షాట్లు… కళ్ళు త్రిప్పుకోకుండా మార్చి మార్చి చూడడమే సరిపోయింది. ఇప్పటికి శాంతించారు కనుక, నేనూ నా అభిప్రాయం వ్రాయాలని…
బుద్ధుడిని దేవుని చేసింది హిందువులే అనడం తప్పు. బుధ్ధుడిని దేవుడిగా చేసి గుడులు కట్టి కొలిచింది బౌద్ధులే. బుద్ధుడి రోజుల్లోనే బుద్ధుడి ప్రతీకలను ఆరాధించడం మొదలయింది. దీన్ని బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు కాని ప్రయోజనం లేకపోయింది. బుద్ధుని ప్రథమ శిష్యుడయిన ఆనందుడు– బుధ్ధుడు లేనప్పుడు ఆయన దర్శనానికి వచ్చిన వారందరూ నిరాశతో తిరిగిపోతున్నారని, వారు పూజించుకోవడానికి బుద్ధుని ప్రతీకగా విహారంలో ఏదైనా ప్రతిష్ఠించమని బలవంత పెడితే తప్పని సరై బుద్ధుడు అక్కడున్న ఓ బోధివృక్షాన్ని చూపించి అదే నా ప్రతీక అని చెప్పాడు. అప్పటినుండి బౌద్ధులకు రావిచెట్టు మహా పవిత్రమైపోయింది (చాలా మంది అనుకునేట్టు ఆయనకు ఆచెట్టుక్రింద జ్ఞానోదయం కావడం వలన కాదు). ఈ సంభాషణలు త్రిపిటకాలలోనే వ్రాసి ఉన్నాయి.
బుద్ధుని తరువాత బుద్ధుడు ఏ హిందూమత కర్మకాండలను నిరసించాడో అవే అతని అనుయయులకు ప్రీతిపాత్రమై పోయాయి. విగ్రహారాధన కూడదన్న వాని విగ్రహాలు ప్రపంచమంతటా వెలిశాయి. పునర్జన్మ సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చిన తథాగతునితో బోధిసత్వుని పేరిట ‘దశ’ కాదు శతాధిక అవతారాలు ఎత్తించారు. ఇవన్నీ బుద్ధుని బోధనలకు విరుద్ధమని మొత్తుకొన్న కొందరు ‘చాదస్తుల’ ను మీది ‘హీనయానం’ అని బయటకు గెంటేశారు. బౌద్ధం మంత్రతంత్రాలను, పౌరోహిత్యాన్ని, దయ్యాలు పారదోలడాన్ని నేర్చుకొంది. మహాయాన, వజ్రయాన, తంత్రయాన… ముక్కలు చెక్కలయింది. ఏ హిందూమతానికి ‘ఆల్టర్నేట్ ‘ గా బౌద్ధాన్ని ప్రొజెక్టు చేశారో, ఆ మతంలోని సమస్త దుర్విషయాలనూ ‘అస్సిమిలేట్’ చేసుకొంది. కానీ హిందూమతంలోని అంతర్లీనంగా ఉన్న విశ్వాత్మని గ్రహించడంలో విఫలమై తన అంతాన్ని తానే కొని తెచ్చుకొంది. ఇందులో హిందూమతాన్ని తప్పుపట్టడానికేమీ లేదు. ‘సూపర్ మాన్ ‘ సినిమా చూసి ఓ మూర్ఖుడు హీరో మహిమ అతని దుస్తుల్లో ఉందని భావించి, అలాంటి దుస్తులే ధరించి పైనుండి దూకి చస్తే ఆ మరణంలో క్రిస్టొఫర్ రీవ్ పాత్ర ఎంత ఉందో, బౌద్ధమత పతనంలో హిందూ ధర్మం పాత్ర అంత ఉండవచ్చు బహుశ. “ఆనో భద్రా: క్రతవోయన్తు విశ్వత:” (Let noble thoughts come from all directions) అని ప్రార్థించిన జాతి హిందువులది. అందుకే సహస్రాబ్దాల పర్యంతమూ వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. మత దృష్టి వద్దు అంటారా, కేవలం ధనిక వ్యాపార కుటుంబాల వారు బౌద్ధమతావలంబులై బౌద్ధారామాలను నాణాలు విరజిమ్మి పోషించడానికీ, జైన మతావలంబకులు నూటికి తొంభై తొమ్మిది మంది కాయకష్టం చేయకుండా వడ్డీ వ్యాపారాలు చేసుకొంటూ బ్రతకడానికి గల కారణాలను ‘చారిత్రిక దృష్టి ‘ తో పరిశీలించండి. సత్యం బోధపడుతుంది.
ఇక బుద్ధుడు దశావతారాలలో ఒకటన్న విషయం నమ్మే హిందువులు ఎందరన్నది అనుమానమే. కృష్ణాష్టమిని జరుపుకొనే వారిలో ఎందరు బుద్ధ జయంతిని ఇంట్లో జరుపుకొంటారు?
i read the same theory in ‘Abaddala veta – nijala bata’ by Narisetty Innaih. If you also read from the same book, plz add a reference.
@bujji
సంబోధన లేకపోవడం వలన మీ కామెంటు ఎవరిని ఉద్దేశించిందో తెలియడం లేదు. నా వ్యాఖ్య క్రిందుగానే మీ వ్యాఖ్య ఉంది గనుక, ఒక వేళ అది నాకే అయితే…
నేను మీరు చెప్పిన పుస్తకం గానీ, ఇన్నయ్య గారి మరే పుస్తకం గానీ చదవలేదు. నా వ్యాఖ్యలో రెండవ పేరా లోని విషయం అందులోనే చెప్పినట్లు త్రిపిటకాల్లోనిది. ఉదహరించిన మంత్రం ఋగ్వేదంలోనిది. ఈ రెండు మినహా మిగతా విషయమంతా నా స్వంత అభిప్రాయాలేననీ ఎవరికీ అనుకరణ గానీ అనుసరణ గానీ కాదని నా హామీ… 🙂
@chandramoha,
I dont mean ur comment, my comment is meant for the blog owner, for the following para:
“గమ్మత్తేమిటంటే, హిందూ దేవుళ్లతో నిండిపోయిన దశావతారాల్లో హిందూత్వాన్ని దాదాపు తుడిచిపెట్టిన బుద్ధుడినీ చేర్చటం! బుద్ధుడిని ఆ జాబితాలో చేర్చటం వెనుక బౌద్ధం హిందూత్వానికి మరో రూపం అని ప్రచారం చేసే కుట్ర కోణమేదన్నా దాగుందా? హిందూ మత పునరుజ్జీవనోద్యమ కాలంలో పుట్టుకొచ్చిన భావనా ఈ దశావతారాలు? అది ఆది శంకరాచార్యుల వారి సృష్టా!?!”
@బుజ్జి
అది నా పైత్యమే 🙂 ఎక్కడా చదివింది కాదు. Also, అవి ప్రశ్నలే కానీ సిద్దాంతాలు కావు.
ఇక్కడ అందరూ బుద్ధుడు గురించి , హిందు మతం గురించి చాలా బాగా తమ వ్యాఖ్యానాలు చేసారు. మీరు ఎప్పుడైనా బుద్ధుని బోధనలు చదివారా? ఎందుకండీ తమ సమయం వౄదా చేసుకుంటారు? హిందూమతం లో కుల అహంకారాన్ని ప్రశ్నించిన వాడు బుద్దుడు. ఇప్పటికి చైనా , జపాన్ తదితర దేశాలు బుద్దుని బోదనలు విని బాగుపడుతుంటే మనం మాత్రం ఉన్నత కులాల మనుకునే వారి అహంకారంతో మునిగిపోతున్నాము.