రుబ్బింగ్ మిషన్

మా ఊర్లో చలామణిలో ఉన్నంత వయ్యారమైన తెలుగు భాష ఆంధ్ర దేశంలో మరెక్కడా ఉండదేమోనని నా అనుమానం. పేపరుకాయితం, సైడుపక్క, డేంజరపాయం లాంటి మాటలక్కడ కోకొల్లలు. కొన్ని పదాల్నలా రెండు మూడు భాషల్లో నొక్కి వక్కాణిస్తేగానీ జనాలకి అర్ధమవదని మా వాళ్ల నమ్మకం కావచ్చు. ఇవి కాక ‘ఎగస్ట్రా పాత్రలు వెయ్యటం’, ‘మఫ్టీ ఇవ్వటం’, ‘ఫిడేలు వాయించటం’ లాంటి స్థానిక జాతీయాలకీ కొదవ లేదు. వీటిలో మొదటిదానికి ఓవర్ యాక్టింగ్ చెయ్యటం, రెండవ దానికి షేపులు మారిపోయేలా పిచ్చ కొట్టుడు కొట్టటం అని అర్ధం. మూడోదీ, రెండోదీ సమానార్ధకాలు. ఈ జాతీయాల చరిత్ర నాకు తెలీదు. తెలిసిందల్లా, వీటిని కాలేజీ కుర్రాళ్లు పుట్టిస్తారని మాత్రమే. తర్వాత అవి మెల్లి మెల్లిగా ఊరంతా పాకేస్తాయి.

స్థానిక జాతీయాలే కాదు, మా ఊర్లో వ్యాపార సంస్థల పేర్లూ రొంబ క్రియేటివ్వే. మచ్చుకి కొన్ని: తాటాకు పాకలో నడిచే ‘ఫైవ్ స్టార్ హోటల్’, ‘పల్నాడు ఎక్స్‌ప్రెస్’ నామధేయంగల గూడు రిక్షా, ఫొటోగ్రాఫర్ సత్తార్ భాయ్ ఇరుకిరుకు గదిలో నడిపే ‘యూనివర్సల్ స్టూడియోస్’, రెండు గదుల ఏకాంతస్తు మేడ ‘శ్రీ రామా టవర్స్’ …. అబ్బో ఇలాంటి సిత్రాలు మరెన్నో!

ఈ మధ్య మా ఊరెళ్లినప్పుడు కొత్తగా తెలిసిన మరో పేరు ‘రుబ్బింగ్ మిషన్’. ఒక సాయంత్రం తీరికగా మా డౌన్‌టౌన్ లో నడుస్తుంటే రోడ్డువారగా ఉన్న ఓ దుకాణం సైన్ బోర్డు మీది అక్షరాలు నన్నాకర్షించాయి. దానిమీద ఆంగ్లంలో పొందికగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ‘Rubbing Mission’ అన్న పేరు చూసి ఆగిపోయాను. రుద్దుడు కార్యం!?!  ఎవరు దేన్ని ఎందుకు రుద్దుతారో వెంటనే అర్ధం కాలేదు. కాసేపాలోచిస్తే, సూదులు గుచ్చే ఆక్యుపంక్చర్ వైద్యం మాదిరిగా వళ్లు కసకసా రుద్ది రోగాలు నయం చేసే పద్ధతేదన్నా కొత్తగా చైనా నుండి దిగుమతయ్యిందేమో అని తట్టింది. ‘ఓహో, ఇది ఆ తరహా ప్రత్యేక ఆస్పత్రి కాబోలు’ అనుకుని ఆసక్తిగా ఓ సారి దుకాణంలోకి తేరిపార చూస్తే నాక్కనపడ్డ దృశ్యానికి నవ్వాగలేదు.

అక్కడ, సుమారు పది మంది ఆడాళ్లు పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకుని లైన్లో నిలబడున్నారు. లైన్ చివర ఓ కుర్రాడు చిన్న స్టూల్ మీద కూర్చుని బిజీగా పనిచేస్తూ కనిపించాడు. లైన్లో ఉన్న మహిళామణుల దగ్గరనుండి గిన్నెలు అందుకుని అందులోనుండి నానబెట్టిన మినప్పప్పో, మరేదో తీసుకుని ఎదురుగా ఉన్న హెవీ డ్యూటీ గ్రైండర్‌లో వేసి ఎడాపెడా రుబ్బేస్తున్నాడతను. ట్యూబ్‌లైట్ వెలిగింది. తలెత్తి మరోసారి బోర్డు కేసి చూస్తే ఇంగ్లీషు పేరు కిందనే తెలుగులో చిన్న అక్షరాలతో కనిపించింది: ‘రుబ్బింగ్ మిషన్: ఇచ్చట అన్ని రకముల పిండి రుబ్బి పెట్టబడును’. అదీ సంగతి. ఆంగ్లీకరించబడ్డ రుబ్బురోలు పొత్రం అన్నమాట! ఇంతటి సృజనాత్మకత మరే ఊర్లోనైనా సాధ్యమా?

20 స్పందనలు to “రుబ్బింగ్ మిషన్”


  1. 1 కె.మహేష్ కుమార్ 7:23 సా. వద్ద ఆగస్ట్ 19, 2008

    ఈ సృజనాత్మకత మీ ఊరికే సొంతం అనుకోకండి. ఇది మన ఆంధ్ర దేశంలోని ప్రతి ఊరి తంతే.చిన్న సైజు “తాజ్” హోటల్ లేని ఊరు,ఎన్నోకొన్ని ‘స్టార్’ లు లేని మంగలి షాపులూ,కొత్తగా ‘మ్యాట్రిక్స్’ పేరుపెట్టుకోని ఎలెక్రిక్ దుకాణాలూ లేని ఊర్లు తక్కువే!

    టపా బాగుంది. ఈ సారి నేను మా ఊరెళ్ళిఅక్కడి జాతీయాలొకపట్టుపడతాను.

  2. 2 సుజాత 9:33 సా. వద్ద ఆగస్ట్ 19, 2008

    ఈ రుబ్బింగ్ మిషన్ అనే మాట కేవలం మన గుంటూరు లేదా పల్నాడు ప్రాంతానికి మాత్రమే కాదు, ఆంధ్రా అంతా ఉన్నదే! అసలు ఈ మాట ముందు మొదలైంది గోదావరి జిల్లాల్లో, తరవాతే ఈ సృజనాత్మకత మన పక్కకు పాకింది. గ్రైండర్ అని పలకడం పల్లెటూరి జనాలకు శక్తికి మించిన పని కాబట్టి, ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి ఈ మాట కనిపెట్టారనుకుంటా!

  3. 3 బ్రహ్మి 11:12 సా. వద్ద ఆగస్ట్ 19, 2008

    మా వూర్లో కూడా “రుబ్బింగ్ మిషన్” అనే అంటారండి.

    ఇలాంటిదే ఇంకో పదం, చిన్నప్పటి నుంచి విన్నప్పుడల్లా నవ్వు తెప్పించే పదం.
    “కలిపి రైటింగ్”.

    అయితే “కలిపి రాత” అయినా అయి ఉండాలి లేకపోతే పూర్తిగా ఆంగ్లంలో “మిక్సెడ్ రైటింగ్” లాంటిది అయినా అయి ఉండాలి. సగం తెలుగు, సగం ఆంగ్లం. 2 భాషలకి సమ ప్రాధాన్యం ఉంది ఈ పదంలో !!

    ఈ పదం మా వూర్లొనే కాకుండా ఇంకెక్కడైనా వాడుకలో ఉందో లేదో మాత్రం నాకు తెలియదు !!!

  4. 4 అశ్విన్ 12:22 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    రుబ్బింగ్ మేషీన్ హ హ నేను మొదటి సారి వినటం. ఇక నుండీ నేను చెలా మణి చేశ్తాను.

  5. 5 nagamurali 2:29 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    గోదావరి జిల్లాల్లోనూ, విశాఖ పట్టణంలోనూ మా చిన్నప్పటి నుంచీ చూస్తున్నామండీ ఈ రుబ్బింగ్ మిషను (రుబ్బింగు మిల్లు) అన్న మాటలు. నేను మొదటిసారి చూసింది ‘మేరీ రుబ్బింగ్ మిల్లు’ అని ఒక ఇంటి ముందు రాసి ఉండడం. తెగ నవ్వుకున్నాను. ఇంకా మా ఊళ్ళో అనే మాటల్లో కూల్ డ్రింకుల్ని ‘కలరు కాయ’ అంటారు. సీసాని సీసా కాయ అంటారు. అందులో కూల్ డ్రింకులు రంగుల్లో ఉంటాయి కాబట్టి కూల్ డ్రింకు సీసాల్ని కలరు కాయలు అంటారు.

  6. 6 కొత్తపాళీ 4:30 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    ఆశ్విన్? రుబ్బింగ్ మెషీన్ తెలీదా? అవమానం! నేనింకా విజయవాళ్ళో చదూకుంటున్న రోజుల్లోనే ఇద్ బహుళ ప్రాచుర్యంలో ఉండేది!!!

  7. 7 Srividya 4:38 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    భలే టపా… బావున్నాయి జాతీయాలు 🙂

  8. 10 bezawa 8:22 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    సార్ ఇది మా బెజావాడ లొనూ వాడుక లో ఉన్నదే. కాక పొతే “Rubbing Mission” మాత్రం మీ ఊరి ingenuity లా అనిపిస్తోంది.

  9. 11 prasanna 8:45 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    first time vintunnanadi ee rubbing mission anna mata.bavundi mee post.good.

  10. 12 Naga Muralidhar Namala 10:39 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2008

    నేను ఇదే మొదటసారి వినటం.

  11. 13 నిషిగంధ 12:26 సా. వద్ద ఆగస్ట్ 20, 2008

    భలే ఉందండి మీ ఊరి సృజనాత్మకత 🙂 🙂

  12. 14 radhika 12:42 సా. వద్ద ఆగస్ట్ 20, 2008

    ఒకసారలా పల్లెటూరికి వస్తే ఇలాంటి వింత పదాలెన్నో వినొచ్చు.
    ఐసు పెట్టె[ఫ్రిజ్]
    కూలింగ్ అద్దాలు[కూలింగ్ గ్లాసెస్]
    సంత మార్కెట్
    కంపూటర్ పెట్టి [కంప్యూటర్]…..ఏమిటో అన్నీ మర్చిపోయా

  13. 16 అబ్రకదబ్ర 3:53 సా. వద్ద ఆగస్ట్ 20, 2008

    @మహేష్,సుజాత,బ్రహ్మి,నాగమురళి,బెజవా,రాధిక:
    ఏదో మా ఊరి గురించి కాస్త డబ్బా కొడదామని అలాగన్నా కానీ వేరే చోట్ల కూడా ఇలాంటివుంటాయని నాకెరుకే 🙂 మీలాంటోళ్లు పట్టేస్తారని తెలుసు అయినా చెయ్యూరుకోక అలా రాసేశా. పట్టేశారు, నాకు తెలీని విషయాలూ కొన్ని చెప్పేశారు – ముఖ్యంగా, రుబ్బింగు మిషను అనబడేది గొడేవరీ వాళ్ల సృష్టి అనేది … ధన్యవాదాలు.

    @అశ్విన్,కొత్తపాళీ,శ్రీవిద్య,పూర్ణిమ,తెరెసా,ప్రసన్న,మురళీధర్,నిషిగంధ,రాజు:
    ధన్యవాదాలు.

  14. 18 raj 7:12 సా. వద్ద సెప్టెంబర్ 9, 2008

    loose ga undhi anadaniki loola dikkum antaranta … idhi maa oori jaatheyam

  15. 19 Hemanth 11:36 ఉద. వద్ద జనవరి 20, 2010

    Naa roommate gaadu naaku okati anta gattadu aa madya. Aada ladies, Chivarakara ani.

  16. 20 Wanderer 4:36 సా. వద్ద సెప్టెంబర్ 11, 2012

    చివరి పేరాగ్రాఫు చదువుతుంటే నవ్వాగలేదు.. గట్టిగా పావునవ్వు నవ్వి చుట్టూ ఉన్నవాళ్ళకి క్యూరియాసిటీ పెరిగిపోకుండా ఉండేందుకు మిగిలిన నవ్వుని దగ్గులోకి కన్వర్ట్ చెయ్యాల్సొచ్చింది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: