జూలై, 2008ను భద్రపఱచుఉద్యోగ విజయం – 1/2

‘నీకేం మామయ్యా, హాయిగా అమెరికాలో ఉన్నావు. ఎన్ని మాటలైనా చెబుతావు’. ఇది – ‘కష్టపడకుండా ఏదీ రాదు’ అన్న ఉచిత సలహాకి చిర్రెత్తుకొచ్చిన నా మేనల్లుడి విసురు. వాడికి పరీక్షల్లో సరిగా మార్కులు రావటం లేదు, కాస్త గడ్డి పెట్టు అని మా అక్క చెబితే లేనిపోని పెద్దరికం నెత్తినేసుకోవటం వల్ల వచ్చిన తంటా అది. ఇంతకీ నాకీ హాయి(?) అప్రయత్నంగా, అనాయాసంగా వచ్చిపడిందా! ఒక్కసారిగా దశాబ్దం క్రితం సంగతులు గుర్తొచ్చాయి. ఇది నా ఒక్కడి కధ కాదు. నాలాగ ఎందరో.

నన్ను ఆంధ్రా లయోలా కాలేజీలో లెక్చరర్ గా చూడాలని మా అమ్మ కోరిక. వాళ్ల బాబాయి స్థాపించిన కళాశాల అది. ‘కరస్పాండెంట్ తెలిసినోడే. నిన్ను కళ్లకద్దుకుని తీసుకుంటాడు. మన వాడంటూ ఒకడు అక్కడ లేకపోతే రేపు మనోళ్ల పిల్లలకి ఆ కాలేజీలో సీట్లు ఇచ్చేవాడెవడు?’ – ఇది ఆమె లాజిక్. లాజిక్ బాగానే ఉంది కానీ ఎవరి పిల్లలకో రికమెండేషన్లు చెయ్యటానికి ఇష్టం లేని ఉద్యోగంలో చేరాలా! నాకు మొదటి నుండీ కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనే కోరిక. డిగ్రీ నుండి నా చదువులూ అదే దిశలో సాగాయి. ఉపాధ్యాయ వృత్తిపై నాకు గౌరవమే కానీ దాన్నే ఉపాధిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అదీకాక, ఉత్తర దక్షిణాలతో సంబంధం లేకుండా ఉద్యోగం తెచ్చుకోవాలని పట్టుదల. దాంతో అమ్మ కోరిక తిరస్కరించి హైదరాబాదొచ్చేశాను.

రావటానికైతే వచ్చాను కానీ రాజధాని నగరంలో మనకెవరూ తెలీదు. పగలంతా వీధి వీధి నీదీ నాదే బ్రదర్‌ర్‌ర్ అనుకున్నా, రాత్రయ్యేసరికి నెత్తిమీదో కప్పుండాలి కదా. ఇంట్లోవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చేశాను కాబట్టి వాళ్ల సలహా అడగటానికి అభిమానం అడ్డు. పైగా, వాళ్లతో చెబితే హైదరాబాదులో ఉన్న చుట్టాల దగ్గరికి వెళ్లమంటారు. అది నాకిష్టం లేదు. పేరుకి ‘నా ఫ్రెండ్ దగ్గరుంటా’ అని చెప్పొచ్చా కానీ ఆ ఫ్రెండ్ ఎవడో నాకూ తెలీదు. తెగాలోచిస్తే, ఇమ్లిబన్లో బస్సు దిగేలోపు బీరకాయపీచు ఫ్రెండొకడు గుర్తొచ్చాడు. ఉస్మానియా పిజి హాస్టల్లో వాడి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాడు. బస్సు దిగటంతోనే సరాసరి ఉస్మానియాకెళ్లా. నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించి, నా కధ విన్నాక రూమ్ అధినేతకి పరిచయం చేస్తూ ‘నేటి నుండీ వీడు నా మెడలో డోలు’ అని ప్రకటించాడు. అక్కడ ఆల్రెడీ మరో మూడు డోళ్లున్నాయి! అంత చిన్న గదిలో ఆరుగురం ఎలా ఉండేవాళ్లమో నాకిప్పటికీ వింతే.

వచ్చిన మర్నాటినుండే మొదలయింది నా ఉద్యోగ వేట. తర్వాత నెలన్నర పాటు రోజూ నా దినచర్య – పగలంతా టేపేసి రోడ్లని కొలవటం, చెప్పులరగదీయటం; సాయంత్రానికొచ్చి హాస్టల్లో వాలిపోవటం. ఐదుగురి మధ్యలో ఇరుక్కోలేక వెళ్లి స్టెయిర్‌కేస్‌లో పడుకునేవాడిని – స్థానిక దోమలు సమర్పించే సంగీత విభావర్లు వింటూ. ఓ రాత్రి హాస్టలుపై పోలీసు దాడి జరిగింది. ఆ మధ్యాహ్నం కేంపస్ ఎబివిపి నాయకుడు వెంకట్రెడ్డి అనేవాడిని ఎఐఎస్ఎఫ్ వాళ్లో మరెవరో ఈ హాస్టల్లోనే కాల్చి చంపేశారట. దాంతో పోలీసన్నలు హాస్టళ్లమీద పడి బయటివాళ్లందర్నీలాక్కెళ్లి లోపలేసి పెళ్లి చెయ్యటం మొదలెట్టారు. ఎంకడి చావు మా పెళ్లికొచ్చిందన్న మాట! నేనెలాగో వాళ్ల కళ్లుగప్పి పారిపోయి చాకిరేవు తప్పించుకున్నా.

తర్వాత వారం రోజులపాటు ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో కూడా గుర్తులేదు. నిలువ నీడ లేకపోవటమంటే ఏమిటో బాగా అనుభవంలోకొచ్చింది. ఇంట్లో చెబితే ‘వచ్చి లెక్చరర్ ఉద్యోగంలో చేరిపోక ఎందుకురా ఈ ఖర్మ’ అంటారని వాళ్లకీ చెప్పలేదు. వారం తర్వాత ‘పెళ్లిళ్ల సీజన్ ఐపోయింది. ఇక వెనక్కొచ్చెయ్ బెదరూ’ అని ఉస్మానియా రూమాధినేత కాకితో కబురంపితే ఎగిరెళ్లి మళ్లీ హాస్టల్లో వాలాను. అప్పటికి నీడ సమస్యైతే తీరింది కానీ, నౌకరీ గొంగళి మాత్రం వేసిన చోటే ఉంది.

కొద్ది రోజుల తర్వాత ఓ బుల్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో అవకాశమొచ్చింది. నాలుగైదు నెలల పాటు డిబి-2 డేటాబేసు మీద శిక్షణిచ్చి ఆ తర్వాత – నా పనితీరు నచ్చితే – ప్రాజెక్టులో పెడతారట. ట్రైనింగ్ సమయంలో నాకేమీ ఇవ్వరు. ‘ఎదురు డబ్బు అడగటం లేదుగా. ఖాళీగా ఉండేబదులు ఏదోటి నేర్చుకుంటే పోలే’ అనుకుని వెంటనే చేరిపోయాను. పైగా నేను వాళ్లకి నచ్చితీరుతానని పిచ్చి నమ్మకం. ఈ సంగతి ఆనందంగా ఇంటికి ఫోన్ చేసి చెబితే అట్నుండొచ్చిన అభినందన: ‘సడేలే సంబడం. జీతం గీతం లేకుండా అదేముద్యోగం! నాలుగు నెలలయ్యాక వాడు ఉత్త చేతులు చూపిస్తే?’. వాళ్ల అనుమానంలోనూ అర్ధముంది. అయితే దొరక్క దొరికిన గడ్డిపోచని వదులుకోటానికి నే సిద్ధంగా లేను.

ఉండేది ఉస్మానియా హాస్టల్లో, ఉద్యోగ శిక్షణేమో సంజీవరెడ్డి నగర్లో. రోజూ సిటీ బస్సుల్లో వచ్చిపోవటానికి రెండు గంటల పైనే పట్టేది. పైగా పది రూపాయల ఖర్చు. ఇంట్లో తెచ్చిన డబ్బు ఐపోవస్తుంది. డబ్బుకోసం ఇంటికి కబురు చెయ్యటం ఇష్టం లేదు. దాంతో, రాత్రులు కూడా ఆఫీసులోనే ఉండటం మొదలెట్టాను. మూడు నాలుగు రోజులకోసారి మాత్రమే హాస్టలుకెళ్లటం. అలా చేస్తే కాస్త డబ్బాదా, పన్లోపనిగా కొంచెం ఎక్కువసేపు కంప్యూటర్లతో గడపొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు అని చిన్ని చిన్ని ఆశ. రాత్రి రెండున్నరో, మూడో అయ్యేదాకా ప్రాక్టీస్ చెయ్యటం, తర్వాత కిటికీలకుండే కర్టెన్లు ఊడబీకి కింద పరుచుకుని నిద్రపోవటం, ఉదయాన్నే ఎక్కడి కర్టెన్లు అక్కడ సర్దెయ్యటం .. ఇదీ నా రేచర్య.

ఒక రాత్రి ఆఫీసులో ఇంటిదొంగలు పడి కీ-బోర్డులు, మానిటర్లు ఎత్తుకుపోయారట. దాంతో, రాత్రి పూట ఎవర్నీ అక్కడుండనీయొద్దని పైనుండి ఆర్డర్లొచ్చాయి. నేను వాచ్‌మేన్‌ని బతిమిలాడి ‘రాత్రి పన్నెండు దాకా పని చేసి తర్వాత వరండాలో పడుకుంటాను’ అని పది రూపాయలు చేతిలో పెడితే అతను కరుణించాడు. అప్పట్నుండీ నా పడక పోర్టికోలోకి మారింది. ఇప్పుడు కప్పుకోటానికి కర్టెన్లు కూడా లేవు. పుస్తకాలే తలగడ. ఓ కాళరాత్రి ఉరుములు, మెరుపులతో భీభత్సకరమైన వాన దంచికొట్టింది. రెండు గంటలపాటు తడిసి ముద్దైపోయాను. నా గొడవలో నేనుంటే శ్రీశ్రీ ప్రత్యక్షమై ‘తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం’ అంటూ పాత పాటందుకున్నాడు. మహానుభావుడ్ని బతిమిలాడి అవతలికి పంపించేసరికి అంత వర్షంలోనూ చుక్కలు కనిపించాయి. మహాకవి పాటకన్నా నన్నెక్కువ బాధ పెట్టిన విషయం నా పుస్తకాలు కూడా తడిసి పోవటం. మర్నాటి నుండీ తలగడ లేకుండా పడుకోవటం అలవాటు చేసుకున్నాను. నిసిరాత్రుల్లో అలా పడుకుని తళుకులీనే రేపటి గురించి కలలు కంటుంటే వర్తమానం గుర్తొచ్చి ఎక్కడలేనీ ఒంటరితనమూ చుట్టుముట్టేది. దాన్ని దూరం చేయటానికేమో మరి, అప్పుడప్పుడూ వానదేవుడలా వచ్చి పలకరించి వెళుతుండేవాడు.

రోజులిలా గడుస్తుంటే ఓ రోజు ఆఫీసుకి ఇంటి నుండి ఫోనొచ్చింది. పెళ్లి పోరు మొదలయింది. ‘ఫలానా వాళ్లమ్మాయిని చేసుకుంటే మంచి ఉద్యోగం చూపించి అమెరికా పంపిస్తామంటున్నారు’ – ఇదీ సారాంశం. వళ్లు మండింది. ‘ఉద్యోగం క్లాజు చేర్చకుండా ఉంటే ఆలోచించేవాణ్ణేమో. నాకు డైలెమా లేకుండా చేశారు. వద్దని చెప్పండి’ అని కోపంగా ఫోన్ పెట్టేశా. నాకు ఆదర్శాలేమీ లేవు. ఉన్నదల్లా నిలువెత్తు పొగరు (దీన్నే కొన్ని ప్రాంతాల్లో ‘బలుపు’ అంటారు). సొంతగా ఉద్యోగం సాధించుకోవాలనుకున్నా, కట్నం వద్దనుకున్నా, ఇంకేం చేసినా .. వాటికి నా అహమే కారణం – ఆదర్శాలు కాదు. నా తిట్ల దెబ్బకి మావాళ్లు మళ్లీ ఇలాంటి ఆఫర్లు తేలేదు.

ఎలాగో నాలుగు నెలలు గడిచాయి. నా నమ్మకం నిజం చేస్తూ కంపెనీ వాళ్లు నన్ను ప్రాజెక్టులోకి తీసుకున్నారు. జీతం నెలకి రెండున్నర వేలు. అప్పటికి రెండు నెలలుగా డబ్బుకి కటకటై ‘లంఖణం పరమౌషధం’ అనుకుంటూ ఒంటిపూట బోయనంతో సరిపెడుతున్నా. ప్రాజెక్టులో చేరగానే సిగ్గు లేకుండా అడ్వాన్స్ అడిగి తీసుకుని మరీ మళ్లీ మూడు పూట్లా తినటం మొదలెట్టాను. నాలాంటి మరో ముగ్గురు కుర్రాళ్లతో కలిసి ఆఫీసుకి దగ్గర్లోనే ఓ గది అద్దెకి తీసుకున్నాను. ఆ రకంగా ఉస్మానియా దోమల జోల, ఆఫీసు వరండాలో వాన జాగారం కూడా తప్పాయి. జీతం జానాబెత్తెడే అయినా, జీవితంలో మొదటిసారి సొంతగా ఏదో సాధించానన్న గొప్ప అనుభూతి, కాస్త గర్వం. అంతకు మించి – చాన్నాళ్లకి కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర. అయితే ఇది కొన్నాళ్ల ముచ్చటేనని నాకప్పుడు తెలీదు.

(ముగింపు రెండవ భాగంలో)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.