ఉద్యోగ విజయం – 1/2

‘నీకేం మామయ్యా, హాయిగా అమెరికాలో ఉన్నావు. ఎన్ని మాటలైనా చెబుతావు’. ఇది – ‘కష్టపడకుండా ఏదీ రాదు’ అన్న ఉచిత సలహాకి చిర్రెత్తుకొచ్చిన నా మేనల్లుడి విసురు. వాడికి పరీక్షల్లో సరిగా మార్కులు రావటం లేదు, కాస్త గడ్డి పెట్టు అని మా అక్క చెబితే లేనిపోని పెద్దరికం నెత్తినేసుకోవటం వల్ల వచ్చిన తంటా అది. ఇంతకీ నాకీ హాయి(?) అప్రయత్నంగా, అనాయాసంగా వచ్చిపడిందా! ఒక్కసారిగా దశాబ్దం క్రితం సంగతులు గుర్తొచ్చాయి. ఇది నా ఒక్కడి కధ కాదు. నాలాగ ఎందరో.

నన్ను ఆంధ్రా లయోలా కాలేజీలో లెక్చరర్ గా చూడాలని మా అమ్మ కోరిక. వాళ్ల బాబాయి స్థాపించిన కళాశాల అది. ‘కరస్పాండెంట్ తెలిసినోడే. నిన్ను కళ్లకద్దుకుని తీసుకుంటాడు. మన వాడంటూ ఒకడు అక్కడ లేకపోతే రేపు మనోళ్ల పిల్లలకి ఆ కాలేజీలో సీట్లు ఇచ్చేవాడెవడు?’ – ఇది ఆమె లాజిక్. లాజిక్ బాగానే ఉంది కానీ ఎవరి పిల్లలకో రికమెండేషన్లు చెయ్యటానికి ఇష్టం లేని ఉద్యోగంలో చేరాలా! నాకు మొదటి నుండీ కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనే కోరిక. డిగ్రీ నుండి నా చదువులూ అదే దిశలో సాగాయి. ఉపాధ్యాయ వృత్తిపై నాకు గౌరవమే కానీ దాన్నే ఉపాధిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అదీకాక, ఉత్తర దక్షిణాలతో సంబంధం లేకుండా ఉద్యోగం తెచ్చుకోవాలని పట్టుదల. దాంతో అమ్మ కోరిక తిరస్కరించి హైదరాబాదొచ్చేశాను.

రావటానికైతే వచ్చాను కానీ రాజధాని నగరంలో మనకెవరూ తెలీదు. పగలంతా వీధి వీధి నీదీ నాదే బ్రదర్‌ర్‌ర్ అనుకున్నా, రాత్రయ్యేసరికి నెత్తిమీదో కప్పుండాలి కదా. ఇంట్లోవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చేశాను కాబట్టి వాళ్ల సలహా అడగటానికి అభిమానం అడ్డు. పైగా, వాళ్లతో చెబితే హైదరాబాదులో ఉన్న చుట్టాల దగ్గరికి వెళ్లమంటారు. అది నాకిష్టం లేదు. పేరుకి ‘నా ఫ్రెండ్ దగ్గరుంటా’ అని చెప్పొచ్చా కానీ ఆ ఫ్రెండ్ ఎవడో నాకూ తెలీదు. తెగాలోచిస్తే, ఇమ్లిబన్లో బస్సు దిగేలోపు బీరకాయపీచు ఫ్రెండొకడు గుర్తొచ్చాడు. ఉస్మానియా పిజి హాస్టల్లో వాడి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాడు. బస్సు దిగటంతోనే సరాసరి ఉస్మానియాకెళ్లా. నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించి, నా కధ విన్నాక రూమ్ అధినేతకి పరిచయం చేస్తూ ‘నేటి నుండీ వీడు నా మెడలో డోలు’ అని ప్రకటించాడు. అక్కడ ఆల్రెడీ మరో మూడు డోళ్లున్నాయి! అంత చిన్న గదిలో ఆరుగురం ఎలా ఉండేవాళ్లమో నాకిప్పటికీ వింతే.

వచ్చిన మర్నాటినుండే మొదలయింది నా ఉద్యోగ వేట. తర్వాత నెలన్నర పాటు రోజూ నా దినచర్య – పగలంతా టేపేసి రోడ్లని కొలవటం, చెప్పులరగదీయటం; సాయంత్రానికొచ్చి హాస్టల్లో వాలిపోవటం. ఐదుగురి మధ్యలో ఇరుక్కోలేక వెళ్లి స్టెయిర్‌కేస్‌లో పడుకునేవాడిని – స్థానిక దోమలు సమర్పించే సంగీత విభావర్లు వింటూ. ఓ రాత్రి హాస్టలుపై పోలీసు దాడి జరిగింది. ఆ మధ్యాహ్నం కేంపస్ ఎబివిపి నాయకుడు వెంకట్రెడ్డి అనేవాడిని ఎఐఎస్ఎఫ్ వాళ్లో మరెవరో ఈ హాస్టల్లోనే కాల్చి చంపేశారట. దాంతో పోలీసన్నలు హాస్టళ్లమీద పడి బయటివాళ్లందర్నీలాక్కెళ్లి లోపలేసి పెళ్లి చెయ్యటం మొదలెట్టారు. ఎంకడి చావు మా పెళ్లికొచ్చిందన్న మాట! నేనెలాగో వాళ్ల కళ్లుగప్పి పారిపోయి చాకిరేవు తప్పించుకున్నా.

తర్వాత వారం రోజులపాటు ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో కూడా గుర్తులేదు. నిలువ నీడ లేకపోవటమంటే ఏమిటో బాగా అనుభవంలోకొచ్చింది. ఇంట్లో చెబితే ‘వచ్చి లెక్చరర్ ఉద్యోగంలో చేరిపోక ఎందుకురా ఈ ఖర్మ’ అంటారని వాళ్లకీ చెప్పలేదు. వారం తర్వాత ‘పెళ్లిళ్ల సీజన్ ఐపోయింది. ఇక వెనక్కొచ్చెయ్ బెదరూ’ అని ఉస్మానియా రూమాధినేత కాకితో కబురంపితే ఎగిరెళ్లి మళ్లీ హాస్టల్లో వాలాను. అప్పటికి నీడ సమస్యైతే తీరింది కానీ, నౌకరీ గొంగళి మాత్రం వేసిన చోటే ఉంది.

కొద్ది రోజుల తర్వాత ఓ బుల్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో అవకాశమొచ్చింది. నాలుగైదు నెలల పాటు డిబి-2 డేటాబేసు మీద శిక్షణిచ్చి ఆ తర్వాత – నా పనితీరు నచ్చితే – ప్రాజెక్టులో పెడతారట. ట్రైనింగ్ సమయంలో నాకేమీ ఇవ్వరు. ‘ఎదురు డబ్బు అడగటం లేదుగా. ఖాళీగా ఉండేబదులు ఏదోటి నేర్చుకుంటే పోలే’ అనుకుని వెంటనే చేరిపోయాను. పైగా నేను వాళ్లకి నచ్చితీరుతానని పిచ్చి నమ్మకం. ఈ సంగతి ఆనందంగా ఇంటికి ఫోన్ చేసి చెబితే అట్నుండొచ్చిన అభినందన: ‘సడేలే సంబడం. జీతం గీతం లేకుండా అదేముద్యోగం! నాలుగు నెలలయ్యాక వాడు ఉత్త చేతులు చూపిస్తే?’. వాళ్ల అనుమానంలోనూ అర్ధముంది. అయితే దొరక్క దొరికిన గడ్డిపోచని వదులుకోటానికి నే సిద్ధంగా లేను.

ఉండేది ఉస్మానియా హాస్టల్లో, ఉద్యోగ శిక్షణేమో సంజీవరెడ్డి నగర్లో. రోజూ సిటీ బస్సుల్లో వచ్చిపోవటానికి రెండు గంటల పైనే పట్టేది. పైగా పది రూపాయల ఖర్చు. ఇంట్లో తెచ్చిన డబ్బు ఐపోవస్తుంది. డబ్బుకోసం ఇంటికి కబురు చెయ్యటం ఇష్టం లేదు. దాంతో, రాత్రులు కూడా ఆఫీసులోనే ఉండటం మొదలెట్టాను. మూడు నాలుగు రోజులకోసారి మాత్రమే హాస్టలుకెళ్లటం. అలా చేస్తే కాస్త డబ్బాదా, పన్లోపనిగా కొంచెం ఎక్కువసేపు కంప్యూటర్లతో గడపొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు అని చిన్ని చిన్ని ఆశ. రాత్రి రెండున్నరో, మూడో అయ్యేదాకా ప్రాక్టీస్ చెయ్యటం, తర్వాత కిటికీలకుండే కర్టెన్లు ఊడబీకి కింద పరుచుకుని నిద్రపోవటం, ఉదయాన్నే ఎక్కడి కర్టెన్లు అక్కడ సర్దెయ్యటం .. ఇదీ నా రేచర్య.

ఒక రాత్రి ఆఫీసులో ఇంటిదొంగలు పడి కీ-బోర్డులు, మానిటర్లు ఎత్తుకుపోయారట. దాంతో, రాత్రి పూట ఎవర్నీ అక్కడుండనీయొద్దని పైనుండి ఆర్డర్లొచ్చాయి. నేను వాచ్‌మేన్‌ని బతిమిలాడి ‘రాత్రి పన్నెండు దాకా పని చేసి తర్వాత వరండాలో పడుకుంటాను’ అని పది రూపాయలు చేతిలో పెడితే అతను కరుణించాడు. అప్పట్నుండీ నా పడక పోర్టికోలోకి మారింది. ఇప్పుడు కప్పుకోటానికి కర్టెన్లు కూడా లేవు. పుస్తకాలే తలగడ. ఓ కాళరాత్రి ఉరుములు, మెరుపులతో భీభత్సకరమైన వాన దంచికొట్టింది. రెండు గంటలపాటు తడిసి ముద్దైపోయాను. నా గొడవలో నేనుంటే శ్రీశ్రీ ప్రత్యక్షమై ‘తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం’ అంటూ పాత పాటందుకున్నాడు. మహానుభావుడ్ని బతిమిలాడి అవతలికి పంపించేసరికి అంత వర్షంలోనూ చుక్కలు కనిపించాయి. మహాకవి పాటకన్నా నన్నెక్కువ బాధ పెట్టిన విషయం నా పుస్తకాలు కూడా తడిసి పోవటం. మర్నాటి నుండీ తలగడ లేకుండా పడుకోవటం అలవాటు చేసుకున్నాను. నిసిరాత్రుల్లో అలా పడుకుని తళుకులీనే రేపటి గురించి కలలు కంటుంటే వర్తమానం గుర్తొచ్చి ఎక్కడలేనీ ఒంటరితనమూ చుట్టుముట్టేది. దాన్ని దూరం చేయటానికేమో మరి, అప్పుడప్పుడూ వానదేవుడలా వచ్చి పలకరించి వెళుతుండేవాడు.

రోజులిలా గడుస్తుంటే ఓ రోజు ఆఫీసుకి ఇంటి నుండి ఫోనొచ్చింది. పెళ్లి పోరు మొదలయింది. ‘ఫలానా వాళ్లమ్మాయిని చేసుకుంటే మంచి ఉద్యోగం చూపించి అమెరికా పంపిస్తామంటున్నారు’ – ఇదీ సారాంశం. వళ్లు మండింది. ‘ఉద్యోగం క్లాజు చేర్చకుండా ఉంటే ఆలోచించేవాణ్ణేమో. నాకు డైలెమా లేకుండా చేశారు. వద్దని చెప్పండి’ అని కోపంగా ఫోన్ పెట్టేశా. నాకు ఆదర్శాలేమీ లేవు. ఉన్నదల్లా నిలువెత్తు పొగరు (దీన్నే కొన్ని ప్రాంతాల్లో ‘బలుపు’ అంటారు). సొంతగా ఉద్యోగం సాధించుకోవాలనుకున్నా, కట్నం వద్దనుకున్నా, ఇంకేం చేసినా .. వాటికి నా అహమే కారణం – ఆదర్శాలు కాదు. నా తిట్ల దెబ్బకి మావాళ్లు మళ్లీ ఇలాంటి ఆఫర్లు తేలేదు.

ఎలాగో నాలుగు నెలలు గడిచాయి. నా నమ్మకం నిజం చేస్తూ కంపెనీ వాళ్లు నన్ను ప్రాజెక్టులోకి తీసుకున్నారు. జీతం నెలకి రెండున్నర వేలు. అప్పటికి రెండు నెలలుగా డబ్బుకి కటకటై ‘లంఖణం పరమౌషధం’ అనుకుంటూ ఒంటిపూట బోయనంతో సరిపెడుతున్నా. ప్రాజెక్టులో చేరగానే సిగ్గు లేకుండా అడ్వాన్స్ అడిగి తీసుకుని మరీ మళ్లీ మూడు పూట్లా తినటం మొదలెట్టాను. నాలాంటి మరో ముగ్గురు కుర్రాళ్లతో కలిసి ఆఫీసుకి దగ్గర్లోనే ఓ గది అద్దెకి తీసుకున్నాను. ఆ రకంగా ఉస్మానియా దోమల జోల, ఆఫీసు వరండాలో వాన జాగారం కూడా తప్పాయి. జీతం జానాబెత్తెడే అయినా, జీవితంలో మొదటిసారి సొంతగా ఏదో సాధించానన్న గొప్ప అనుభూతి, కాస్త గర్వం. అంతకు మించి – చాన్నాళ్లకి కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర. అయితే ఇది కొన్నాళ్ల ముచ్చటేనని నాకప్పుడు తెలీదు.

(ముగింపు రెండవ భాగంలో)

33 స్పందనలు to “ఉద్యోగ విజయం – 1/2”


 1. 2 రాజు 4:18 సా. వద్ద జూలై 17, 2008

  బాగుంది. మీ రెండవ భాగం కోసం ఎదురుచూస్తుంటాను. మీ మేనల్లుడు చెప్పిన సమాధానమే నాకూ చాలా సార్లు ఎదురైయ్యింది. ఏం చేస్తాం. చెప్పటం మానుకున్నాను. వీరికి చెప్పినా ఏదో సోది చెప్తున్నామనుకుంటారేగానీ అర్థం చేసుకోరు.

 2. 3 వేణూ శ్రీకాంత్ 5:20 సా. వద్ద జూలై 17, 2008

  కొన్ని కష్టాలు నా జ్ఞాపకాలనీ తట్టి లేపాయండీ… ఎంత కష్టపడి సాధించారో ఇక్కడ ఉంటూ ఎంత కష్టపడుతున్నారో వివరాలు తెలీకుండా అలా “హాయిగా అక్కడ ఉంటున్నావ్…” అనే మాట ముల్లు లా తగుల్తుంది… ఇది నాకూ అనుభవమే… పోనీ అని వివరం గా చెప్తే క్లాస్ పీకుతున్నాడు రా బాబు అంటారు ఏం చేస్తాం ..!! మీ తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

 3. 4 మేధ 6:07 సా. వద్ద జూలై 17, 2008

  Same to same వేణూశ్రీకాంత్ గారి ఫీలింగ్… awaiting next posts..

 4. 6 కె.మహేష్ కుమార్ 7:32 సా. వద్ద జూలై 17, 2008

  మీరు పొగరూ, బలూపూ,అహం అనుకున్నా అది దానికి నేనుపెట్టే పేరు మాత్రం ‘ఆత్మగౌరవం’.
  ఇక మీ ఉస్మానియా ఇక్కట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తరువాత నేను పడ్దకష్టాల్లాలే ఉన్నాయి. మంచి టపా.

 5. 7 chaitanya 8:10 సా. వద్ద జూలై 17, 2008

  బాగుంది. రెండో భాగం కోసం ఎదురుచూస్తుంటాను.

 6. 8 రవి 8:14 సా. వద్ద జూలై 17, 2008

  నా కథ రాసారు 🙂 … ౨ వ భాగం కోసమ్ ఎదురు చూస్తున్నా. నేనూ, నా కథ మొదలు పెడతాను, ఈ రెంటి తర్వాత.

 7. 9 సుజాత(మనసులో మాట) 9:33 సా. వద్ద జూలై 17, 2008

  పర్వాలేదు, ఆ మాత్రం పొగరూ, బలుపూ (మా NRPTలో ఇదే మాట వాడతారు) లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే లెఖ్ఖ! పైగా అవి లేకపోతే మీరు పల్నాడులో ఉండటానికి వీల్లేదు.

  ‘మెడకో డోలు ‘ ‘ఎంతకష్టం పాట ‘బాగున్నాయి. ఇవన్నీ చెపితే మా ఆయన కూడా ఒక టపా రాసేస్తారు. తనూ ఇలాగే జీతం లేకుండా నల్లకుంటలో ఒక institute లో నెట్ వర్క్ క్లాసులు చెప్పేవాడు.

 8. 10 pedaraydu 11:15 సా. వద్ద జూలై 17, 2008

  అమెరికాలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇక్కడే ఉంటే, అమెరికాకు వెళ్ళలేదని(ఇక్కడ ఎంత పెద్ద ఉద్యోగమున్నా) మనల్ని ఒక చులకనగా చూస్తారు. దాదాపుగా నావి కూడా మీ లాంటి అనుభవాలే..కాకపోతే ‘సింగార చెన్నై” లో..ఆ రోజుల్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా వుంటుంది.

 9. 11 Ekanthapu Dileep 11:16 సా. వద్ద జూలై 17, 2008

  yes… bravo! mee meeda expectations okkasaarigaa penchEsindi… renDO bhaagam kOsam eduruchUstunnaa..

 10. 13 చైతన్య క్రిష్ణ పాటూరు 1:05 ఉద. వద్ద జూలై 18, 2008

  మాలాగా పెద్ద కష్టం లేకుండా క్యాంపస్ లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి, ఇలాంటి విషయాలు చాలా ఆశ్ఛర్యంగాను, అబ్బురంగానూ వుంటాయి. మీ పట్టుదల బావుంది. మీ పొగరు ఇంకా బాగుంది. సుజాతగారన్నట్టు, కాస్త పొగరు కూడా లేనివాడు ఏది సాధించలేడు.

 11. 14 ramani 1:47 ఉద. వద్ద జూలై 18, 2008

  బాగుంది అబ్రకదబ్రగారు. హైదరాబాదులో ఇన్ని కష్టాల?? అనిపిస్తోంది నాకు, దాదాపు నేను పుట్టినప్పటినుండి ఇక్కడే ఉన్నా ఈ ఉద్యోగ కష్టాలు అంతగా తెలియలేదు. పైగా మా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఏదో ఉద్యోగంలో స్థిరపడిపోవడంతో ఆ కష్టాలు తెలిసిరాలేదు. మీ టపా ఆకలిరాజ్యం లోని కమల్ హసన్ ని గుర్తు చేస్తోంది. “సాపాటు ఎటూ లేదు…” ఇప్పుడిలా పాట గుర్తోస్తోంది కాని,అప్పుడు మీరు ఎంత కష్టపడి ఉంటారో కదా! రెండో భాగం కోసం ఎదురుచూస్తూ… అనుభవాల దొంతర్లు కాస్త బాధ కరంగా ఉన్నా, దాటేసి వడ్డుకు చేరినందుకు అభినందనలు.

 12. 16 Pradeep 1:57 ఉద. వద్ద జూలై 18, 2008

  nenu meelaaga ekkuva kashtapadaledandii.. nenu college nunchi bayata padagaane s/w boom undindi.. daantho chaala baadhalu tappinchukunna. 🙂 kani, I was in a hostel for 1 year before getting a job. aa hostel food.. bangalore food.. cheppanakkarledanukunta.. 🙂

 13. 17 chowdary 2:41 ఉద. వద్ద జూలై 18, 2008

  చాలా బాగుంది …persuit of happiness ..cinema lo hero ki లా… మీకు అన్ని కస్తాలే … మీ బొల్గ్ నా కు చా లా నచ్హుతుంది

 14. 18 ravindra 4:21 ఉద. వద్ద జూలై 18, 2008

  నిజంగా చాలా ఇన్ స్పైరింగ్ గా ఉందండీ మీ కథ. హ్యాట్సాఫ్ టూ యూ.. 

 15. 19 చిలకపాటి శ్రీనివాస్ 9:35 ఉద. వద్ద జూలై 18, 2008

  అటువంటి సమయాలే మన వ్యక్తిత్వాన్ని రూపు దిద్దుతాయనుకుంటాను. “అబ్బో నేను ఎన్ని కష్టాలు పడిపోయేనో” అన్నట్టుగాకుండా యుద్ధంలో గెలిచిన వీరుడు తన గాయాల జాబితా చూపుతున్నట్టు మీరు రాసిన తీరు బావుంది .

  బ్లాగు పై ఫొటో చాలా బావుంది. ఎక్కడిది?

 16. 20 అబ్రకదబ్ర 11:29 ఉద. వద్ద జూలై 18, 2008

  @మహేష్
  నేను పొగరు/బలుపు అన్నదాన్ని మరికొందరు మొండితనం/మూర్ఖత్వం అంటారు. మీరు కాస్త సున్నితంగా ఆత్మగౌరవం అన్నారు. చూసే దృష్టినిబట్టి ఒకటే పలువురికి పలురకాలుగా కనిపిస్తుందేమో. Some say, there’s a fine line between self-respect and stupidity. నా వరకూ అర్ధమైనదేమిటంటే, విజయం సాధించిన తర్వాత మనం ఏ కధలు చెప్పినా అవి ఆత్మగౌరవంలానే అనిపిస్తాయి. పరాజితుడి విషయంలో అదే మూర్ఖత్వంలా కనిపిస్తుంది. That said, ‘పొగరు’ కన్నా ‘ఆత్మగౌరవం’ sounds better. I can live with that 🙂

  @రవి
  మీ కధ కోసమన్నా నాది త్వరగా పూర్తి చేసేస్తా.

  @సుజాత
  మీవారినీ బ్లాగుల్లోకి లాగెయ్యండి. నన్ను మించి తిప్పలు పడ్డవారిని నేనెరుగుదును. వాళ్లముందు నా బాధలెంత? ఇటువంటి టపాలు చదివే విద్యార్ధులెవరన్నా ఉంటే బయటి ప్రపంచమ్మీద ఓ వాస్తవిక దృక్పధం ఏర్పరుచుకుంటారని నా ఈ ప్రయత్నం.

  @పెదరాయుడు
  మీరన్నది నిజం. పైన మహేష్ కి సమాధానంలో నేనన్నట్లు, గెలిచినోడు ఏ కధ చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినోడి గొప్పదనం గుర్తించేదెవరు? (ఇక్కడ, అమెరికాలో ఉండటమే గెలుపు అని నా ఉద్దేశం కాదు)

  @చౌదరి
  నాకు బాగా నచ్చిన సినిమా The Pursuit of Happyness. ఇది చదివిన వాళ్లలో ఎవరో ఒకరు ఆ సినిమా గురించి వ్యాఖ్యానిస్తారనుకున్నాను. మీరు చేశారు. నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నానని కాదు గానీ, క్రిస్ గార్డ్‌నర్ పాత్రలో విల్ స్మిత్ జీవించటం వల్లనుకుంటా, I felt lump in my throat during some scenes. ముఖ్యంగా, క్లైమాక్స్‌లో విల్ కి ఉద్యోగం వచ్చినప్పుడు బయటికొచ్చి జనంతో కిక్కిరిసిన శాన్ ఫ్రాన్సిస్కో నగర వీధుల్లో నడుస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించలేక, అలాగని దాచుకోలేక, దాన్ని పంచుకోటానికి ఎవరూ లేక … ఆ కొద్ది క్షణాల అభినయానికే అతనికి ఆస్కార్ ఇచ్చేసుండొచ్చు పోయినేడాది (కొద్దిలో చేజారిందనుకోండి).

  @చిలకపాటి శ్రీనివాస్,
  ఇవన్నీ పెద్ద బాధలని అప్పట్లో నాకనిపించలేదు. భవిష్యత్తు గురించి ఆలోచించటానికీ, కష్టపడటానికే సమయం సరిపోయేది కాదు. బాధ పడే తీరికేది? ఇన్నాళ్లయాక వెనుదిరిగి చూసుకుంటే అవీ మధురానుభూతులుగానే అనిపిస్తున్నాయి. అందుకే వాటిని పెనుకష్టాలుగా చూపించే ప్రయత్నం చెయ్యలేదు.

  ఫొటో నేను తీసిందే. పోయినేడాది మా ఊరు వెళ్లినప్పుడు ఓ ఉదయం తీశాను. కలర్ ఫోటో. బ్లాగు కోసం దాన్ని కత్తిరించి నలుపు-తెలుపు లోకి మార్చాను.

  @ఫణి ప్రదీప్,కొత్తపాళీ,చైతన్య,ఏకాంతపు దిలీప్,ఆకాశరామన్న,చైతన్యకృష్ణ,రమణి,చావా కిరణ్,ప్రదీప్
  ఓపికగా చదివి కామెంటినందుకు ధన్యవాదాలు.

  @రాజు,వేణుశ్రీకాంత్,మేధ
  ఇవి ఎవరికి వారు అనుభవిస్తేకానీ అర్ధం కావేమో.

 17. 21 ప్రవీణ్ గార్లపాటి 12:41 సా. వద్ద జూలై 18, 2008

  కష్టపడి మీరు కావలసినదాన్ని సాధించుకున్న తీరు ఎంతో అభినందనీయం !
  మన కష్టంతో సాధించుకున్నా దాన్ని చులకనగా మాట్లాడితే నిజంగా బాధే మరి…

  మీ తరువాయి టపా కోసం ఎదురు చూస్తా.

 18. 22 independent 1:42 సా. వద్ద జూలై 18, 2008

  మీరు నన్నెక్కడికో లాక్కెళ్ళిపోయారు. మీ టపా చదువుతుంటే పాత రోజులు గుర్తొచ్చి మీరన్న “lump in the throat” అనుభవం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. వీలయినంత వరకు ఆ రోజులు అన్ని గుర్తు చేసుకోకుండా జాగ్రత్త పడతా వుంటాను, మీరో తేనెతుట్టె కదిపారు ఇప్పుడు నాలో. కాస్త అటూ ఇటూగా మీలాంటి అనుభవాలే నావి కూడా. నాకన్నా నన్ను అప్పుడు బాగా భయపెట్టింది నా మీద బాగ ఆధారపడ్డ నా చెల్లెళ్ళు. మా వూరి రైల్వే స్టేషన్ లొ దిగి, నాలుగు మైళ్ళు నడచుకుంటూ వెళ్ళడం, సరిగ్గా కడుపు నిండా తినక పోవడం, నాలుగు మైళ్ళు నడచుకుంటూ పోవడం…వద్దు లెండి, “కడుపు చించుకుంటే..అని…”. అమెరికాకి వచ్చి మొదటిసారి వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో డబ్బుల అవసరం చాలా వుందని, నన్ను నేను అనవసరంగా ఇబ్బంది పెట్టుకొని గడుపుకొనేవాణ్ణి(ఇప్పుడనిపొస్తొంది, ఆ మాత్రం సేవ్ చేయడం కోసం అంత ఇబ్బంది పెట్టుకోవాలా అని…కాని అపుడు ఇబ్బంది అనే అనిపించేది కాదు, ఎవరైనా అలాగే చేస్తారు, చేయాలి అనుకునేవాన్ని). ఇప్పుడొకటే వూరట. మా అమ్మా నాన్నలు, చెల్లెళ్ళు అంతా బాగా వున్నారు. అదే త్రుప్తి.

  రాస్తొంటే ఒక భయం..గతం గురించి రాసేప్పుడు కాని, చరిత్ర చెప్తున్నప్పుడు కాని వాటిని mythify చేయటం, dramatise చేయటం, మనకు చాలా పుస్తకాల్లో కనపడుతూ వుంటుంది. అది అస్సలు ఇష్టం వుండదు నాకు. నాకు తెలీకుండా నేనెక్కడ అలా రాస్తానో అని నాకు భయం. అన్నీ నిజాలే రాసానండి.

 19. 23 radhika 2:32 సా. వద్ద జూలై 18, 2008

  caalaa baagaa raasaaru.eadannaa ceppadamloa kuudaa vuntundi.india lo vunnvaallaloa caalaa mamdi manam ikkadedo nelaki kotlu sampaadimceasi,lakshalaki lakshalu vinoadaala koasam kharchupetteastunnaamanukumtaaru.kaanii nijaaniki india vellinappudu telustundi manaki manam elaa bratukutunnaamannadi.ikkada kuuDabetteasi india velli jalsa ceddamanukune manaki akkadi rate lu,cost of living cuusi cukkalu kanapadataayi.idi akkaDivaallevarii teliyadu.ceppukolemu.

 20. 24 వికటకవి 4:48 సా. వద్ద జూలై 18, 2008

  బాగా చెప్పారు. తరువాతి భాగం కోసం చూస్తాను.

 21. 25 వికటకవి 6:29 సా. వద్ద జూలై 18, 2008

  I also share choudary and srinivas comments.

 22. 26 అబ్రకదబ్ర 8:13 ఉద. వద్ద జూలై 20, 2008

  @ప్రవీణ్,ఇండిపెండెంట్,రాధిక,వికటకవి
  ఇప్పుడే మీ కామెంట్స్ చూశాను. Thank you.

 23. 27 Purnima 11:22 ఉద. వద్ద జూలై 20, 2008

  ‘ఎదురు డబ్బు అడగటం లేదుగా. ఖాళీగా ఉండేబదులు ఏదోటి నేర్చుకుంటే పోలే’ – ఆ సంబడమూ తీరింది మాకు. 😦 ఈజీగా ఉద్యోగాలు రాకపోతేనే మేలేమో.. అప్పుడే జీవితం బాగా తెలుస్తుందేమో!! నేనో నాలుగైదు నెలలు కష్టపడ్డా.. కానీ జీవితానికి సరిపడా.. పాఠాలు నేర్చుకున్నాను

  రెండో టపా రాయలేదేం ఇంకా.. ఎన్నాళ్ళీ వేయిటింగ్.. ??

 24. 28 అబ్రకదబ్ర 12:38 సా. వద్ద జూలై 20, 2008

  పూర్ణిమాజీ,
  వారాంతం తీరిక దొరకలేదు. మరీ ఎక్కువ ఎదురుచూపులు అవసరం లేదు .. రేపో ఎల్లుండో విడుదల 🙂

 25. 29 అబ్రకదబ్ర 7:54 ఉద. వద్ద జూలై 22, 2008

  రవీంద్ర దూపకుంట్ల,

  మీ కామెంట్ ఎందుకో స్పామ్‌లోకి వెళ్లిపోయిందండీ. ఇప్పుడే చూసి de-spam చేశాను. ధన్యవాదాలు.

 26. 30 శ్రీ 10:22 ఉద. వద్ద జూలై 22, 2008

  చాలా బాగుంది మీ టపా!ఒక నీడ కోసం మీరు పడిన పాట్లు చాలా బాధ పెట్టాయి.ఇటువంటి గడ్డూ పరిస్తితులున్నా మీరు ఉద్యోగ ప్రయత్నం మీద పట్టు సడలించకపోవడం నిజంగా గ్రేట్!

 27. 31 vijay katta 12:45 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2008

  naa kastaalu intakante daridramgaavunnayi!
  kani ippudu cheppukolenu!
  mee story chaduvutunte naene gurthochaanu,
  nenu na gamyam cheraaka naa story gurthuchesukuntaa.

  mee kastaanu inspiring gaa vunaayi.
  anduke comment rayalekundaa vundaleka pothunnanu.

 28. 32 అబ్రకదబ్ర 2:33 సా. వద్ద సెప్టెంబర్ 10, 2008

  @విజయ్ కట్టా

  మీ గమ్యం తప్పకుండా చేరుకుంటారు. అప్పుడు గుర్తు చేసుకుంటే ఇప్పటి తిప్పలన్నీ nothing అనిపిస్తాయి. All the best.

 29. 33 VenkataRamana 11:55 సా. వద్ద అక్టోబర్ 25, 2009

  బాగున్నాయి మీ అనుభవాలు. వారి వారి ఉద్యోగాన్వేషణ రోజులు గుర్తుకు వచ్చేలా చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికో వెళుతున్నాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: