పరవస్తు చిన్నయసూరి గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు మా నాన్న ఓ సంగతి చెప్పారు. మహా పండితుడైనప్పటికీ, ఆయన బ్రాహ్మడు కాకపోవటం వల్ల శాస్త్రి అనే విశేషణం ఇవ్వకుండా సూరి తో సరిపెట్టారట. ‘మరి పరవస్తు అనేది ఆయన ఇంటిపేరా’ అనడిగితే ‘కాదురా. సంస్కృత పంచచంత్రాన్ని కాపీ కొట్టి తెలుగులో నీతిచంద్రిక రాశాడని పర వస్తు చిన్నయ సూరి అంటారు’ అని ముక్తాయించారు. తెలుగు పంతుళ్లపై జోకులేసే సంప్రదాయం చిన్నయసూరి తరం నుండీ ఉందన్నమాట!
నేను బ్లాగుల్లో రాతలు మొదలెట్టి రెండు నెలలయింది. తెలుగు మీద నాకింత పిచ్చెందుకబ్బా అని మొన్నోసారాలోచిస్తే హైస్కూలునుండి ఎమ్.ఫిల్ దాకా నాకెదురయిన తెలుగు మాస్టార్లు గుర్తొచ్చారు. వీళ్లలో కొందరు నాకు పాఠాలు చెప్పిన వాళ్లు, కొందరు కాదు. వాళ్లని ఇతర మాస్టార్లు చూసే చిన్నచూపూ, విద్యార్ధుల్లో వాళ్లమీద చెలామణిలో ఉండే జోకులు కూడా గుర్తొచ్చాయి. ఎందుకోగానీ తెలుగు టీచర్లంటే పిల్లలెవరూ భయపడేవారు కాదు. చిన్నయసూరి వారసత్వం కొనసాగిస్తూ, వీళ్లంతా చిత్ర విచిత్రమైన మారుపేర్లతో తరించిపోతుండేవారు.
హైస్కూల్లో ముగ్గురు ముత్యాల్లాంటి తెలుగు టీచర్లుండేవారు మాకు. గమ్మత్తేమిటంటే, ముగ్గురి పేర్లూ ఎస్.వెంకటేశ్వర్లు! ఒకాయన సాగి వెంకటేశ్వర్లు, మరొకాయన సూరాబత్తుల వెంకటేశ్వర్లు, ఇంకొకాయన శిష్ట్లా వెంకటేశ్వర్లు. ఎవరెవరో గుర్తుపట్టటానికో ఏమో, వీళ్ల ముగ్గురికీ మూడు మారు పేర్లుండేవి. శిష్ట్లా గారు చక్కగా పంచె కట్టుకుని, కండువా వేసుకుని ముఖాన ఇంత విభూతి పూసుకుని మరీ వచ్చేవారు. దాంతో ఆయన్ని ‘గోచోడు’ అనే వాళ్లు పిలగాళ్లు. సూరాబత్తుల వారి నిక్‌నేమ్ చాలా వెరైటీగా ఉండేది: లంగడ బాబాయి. అంటే ఏంటని అడగొద్దు – నాకూ దెల్దు (ఆయనేసుకునే బెల్‌బాటం పాంటుకీ, ఆ పేరుకీ బాదరాయణ సంబంధమేదో ఉండుండొచ్చని అప్పట్లో అభిజ్ఞవర్గాల భోగట్టా). ఇక సాగి వెంకటేశ్వర్లు గారిని కాస్త గౌరవంగా ‘సాగోడు’ అనే వాళ్లు. ఇంటి పేరునే నిక్‌నేమ్‌గా పొందటం గౌరవప్రదమే కదా – మిగతా ఇద్దరితో పోలిస్తే.
వీరిలో సాగి వెంకటేశ్వర్లు గారు నాకు ఆరు నుండి పదో తరగతి దాకా పాఠాలు చెప్పినాయన. నేను ఈమాత్రం తెలుగు మాట్లాడ/రాయ గలుగుతున్నానంటే దానికి ఆయనేసిన పునాదులే కారణం. ఒక్కో పద్యం రాగయుక్తంగా పాడి మరీ ప్రతిపదార్ధాలు వివరిస్తుంటే ‘ఓస్.. తెలుగింత వీజీయా’ అనిపించేది. ఆయనప్పుడు నేర్పిన ఛందస్సు వాడకపోయినా నాకిప్పటికీ గుర్తుంది.
ఛందస్సంటే గుర్తొచ్చింది. ఉత్పలమాలకి భరనభభరవ, చంపకమాలకి నజభజజజర అని తేలిగ్గానే గుర్తుండేవి కానీ, మత్తేభం, శార్దూలం విషయంలో నాకో పెద్ద కన్ఫ్యూజనుండేది. దేనికి మసజసతతగనో, దేనికి సభరనమయవనో ఎంతకీ గుర్తుండేది కాదు. ఆ సమస్య తీర్చింది స్వయానా వేటూరి సుందర్రామ్మూర్తి! గీతాంజలి సినిమాలో ‘నందికొండ వాగుల్లోన’ అనే పాటలో ఓ చోట ‘ఓ బాలా మసజసతతగ శార్దూలా’ అనొస్తుంది. పాఠాలు గుర్తున్నా లేకపోయినా పాటలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయికదా. దెబ్బతో నా మత్తేభం-శార్దూలం గొడవొదిలిపోయింది (అంచాత, పియమైన పెజలారా, లొల్లాయి పాటలన్జెప్పి సిల్మా పాటల్ని తీసిపారెయ్యమాకండ్రి. ఏటి పెయోజనాలు ఆటికుంటై).
ఎనిమిదో తరగతిలో అనుకుంటా, ఓ సారి సాగి మేస్టారు చినకత్తి రామారావు అనబడే నా సహోధ్యాయిని లేపి ‘అష్ట దిగ్గజాల పేర్లు చెప్పు నాయనా’ అన్నారు ఆప్యాయంగా. పేర్లో ఉన్న పదును చదువులో లేని మావాడు అష్టకష్టాలు పడి ఏడేనుగులపేర్లప్పజెప్పగలిగాడు గానీ, బుర్రెంత బద్దలుకొట్టుకున్నా అష్టమ గజమేదో తట్టలేదు. ఇంతలో పక్కనున్న తుంటరెవడో గోణిగాడా నామం. మావాడేమో ముందూ వెనకా ఆలోచించుకోకుండా మాస్టారికి అందించేశాడు: ‘ఆచార్య ఆత్రేయ’ అంటూ. అంతే, క్లాసు గొల్లుమంది; వాడి చెంప ఛెళ్లుమంది.
హైస్కూల్లో సాగి వెంకటేశ్వర్లుగారి పుణ్యాన తెలుగు మీద ఏర్పడ్డ ఆసక్తితో, ఇంటర్మీడియెట్‌లో నా స్నేహితుల్లో చాలామంది తేలిగ్గా మార్కులొస్తాయని హిందీనో, సంస్కృతమో రెండో భాషగా తీసుకున్నా నేను మాత్రం తెలుగే ఎంచుకున్నాను. అక్కడ మా మేస్టారు కొక్కెర కోటయ్యగారు.
కోటయ్యగారు మరీ పండితుడేమీ కాదు. ఆయన పాఠాలు చెప్పే విధానం సోసోగా ఉండేది. అయినా హైస్కూల్లో పడ్డ గట్టి పునాది వల్లా, ఇంటర్లో కొత్తగా నేర్చుకోవలసిన తెలుగ్రామరేమీ లేకపోవటం వల్లా మంచి మార్కులే వచ్చేవి. అది పెద్ద విశేషమేమీ కాదు. అసలు విశేషం, ఇంటర్ రెండో ఏడాదిలో ఉండగా మేం కనుక్కున్న రహస్యం. అదేమంటే, కొక్కెర కోటయ్యగారుగా మేమింతకాలం అనుకుంటున్నది ఆయన నిక్‌నేమ్ మాత్రమే! ఆయన అసలు పేరు గాంధీ. వారు పాఠాలు చెబుతుంటే కోడి కొక్కిరించినట్లుగా ఉంటుందని క్రియేటివ్ బుర్రలుగల మా సీనియర్లాయనకిచ్చిన టైటిల్ ‘కొక్కెర కోటయ్య’.
డిగ్రీలోకొచ్చాక మళ్లీ రెండో భాషగా తెలుగే ఎంచుకున్నా. ఇక్కడ ఇద్దరు మేస్టార్లు. ఒకాయన పేరు నాకు గుర్తు లేదు కానీ ఆయన నిక్‌నేమ్ బహు రొమాంటిక్ గా ఉంటుంది. ప్రబంధాల స్పెషలిస్ట్ ఈయన. అవసరాన్ని మించిన శృంగార వర్ణనలు చేస్తాడని పూర్వ విద్యార్ధులు ఆయనకి ప్రసాదించిన బిరుదం: సెక్స్‌బాంబ్. రెండో మేస్టారి పేరు రవీంద్ర బాస్. నేనెరిగిన తెలుగు మాస్టార్లలో మారుపేర్లు పెట్టించుకోనిది ఈయనొక్కడే. పాత తరం తెలుగు మేస్టార్లలా కాకుండా ఆధునికంగా కనిపిస్తూ విద్యార్ధులతో కలిసిపోవటంవల్ల కాబోలు, ఈయనకి మాలో మంచి గౌరవముండేది. తెలుగులో మంచి పండితుడే కానీ, ఆగ్రహమొస్తే మాత్రం ఆంగ్లంలో దంచిపారేసేవాడు. అదేమంటే, ‘ఎంతైనా ఇంగ్లీషు ఇంగ్లీషేనోయ్. తెలుగులో తిడితే ఎవడు పట్టించుకుంటాడు? అదే ఇంగ్లీషులో ఓ కేకేస్తే చాలు, కిక్కురుమనకుండా కూర్చుంటారు కుర్రకుంకలు’ అనేవాడు చిద్విలాసంగా.
ఇక మద్రాసు లయోలా కళాశాలలో పిజి, దాన్తర్వాత రిసెర్చ్ చేసినప్పుడు తెలుగుతో అవసరం లేకుండాపోయింది. అయితే ఆ కాలేజీలోనూ తెలుగు డిపార్టుమెంటుండేది. అందులో ఏక్ నిరంజన్‌లా ఒకే ఒక్కడుండేవాడు – ఆయనే హెడ్డు, ఆయనే స్టాఫ్. కాకతాళీయంగా ఆయన పేరు ఎస్.వెంకటేశ్వరరావు. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆయన మారుపేర్ల గురించీ తెలీదు. ఏదో ఒకటి ఉండే ఉంటుంది. లేకపోతే వింతే.
తెలు – గోడు గారు,
భాగున్నాయండి.మీ చందస్సు గోలలు, లీలలు.దాంతోనే మీ తెలుగు మీది మమకారాన్ని చెప్పకనే చాలా బాగా చెప్పారు. thanks keep going.mee tapaalanni bagunnai.mee క్రికెట్ బాంబు,’ఆరు’ నారాయణ మూర్తి chaala baagunai.
నాకూ మీకున్న కన్ఫ్యూజనే ఉండేది, మత్తేభం, శార్దూలం మీద. మా వాడికొకడికి త వత్తు కి, ఐత్వానికీ కన్ఫ్యూజన్. ఇంతింతై వటుడింతై అన్నదానికి, ఇంతింత్తె వటుడింత్తె…ఇలా రాశాడోసారి.
ఇన్నాళ్లకి తీరిక కుదిరింది ఓ బ్లాగు చదవడానికి… ప్చ్. దాదాపు రెండు మూడు వారాల తరువాత నేను చదివిన మొదటి టపా మీదే. చదివీ చదవగానే భలే ఫీలింగు కలిగింది, చచ్చేటంత నవ్వూ వచ్చింది. ప్రత్యేకించి, ఆచార్య ఆత్రేయ అష్టదిగ్గజాల్లో చేరినప్పుడు.
మీరన్నట్టుగా మత్తేభానికి శార్దూలానికి తేడా సంగతి అటుంచితే, వేటూరివారు ఇలా వ్రాసే వేగంగా వ్రాసినా పాటల్లో చెత్త వ్రాస్తాడనే అపప్రథని మూటగట్టుకున్నారు.
నిజమే, తెలుగు మాస్టార్లకెప్పుడూ ఇలాంటి తతంగం ఉంటుందే!
@క్రాంతి,
రొంబ నండ్రి. అన్నట్లు, తెలుగు రాస్తూ మధ్యలో ఇంగ్లీషులోకి స్విచ్చయిపోయేవాళ్లని చూశాగానీ, మీలాగా కాస్త తెలుగు లిపి, కాస్త ఆంగ్ల లిపి కలిపి కొట్టేవాళ్లని చూడలా .. 🙂 మీ రూటే వేరు.
@రవి,
మీరన్న ‘మావాడు’ మీరేనా?
@రాఘవ,
వేటూరి కలానికి రెండువైపులా పదునే. ‘ఆబాలగోపాలమా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ’ అన్న పెన్నుతోనే ‘ఒలమ్మీ తిక్క రేకిందా’ అనిపించిన ఘనుడు. నా దృష్టిలో ఆయన్రాసిన చెత్త కూడా చాలామంది సమకాలీకుల బెస్ట్ కన్నా గొప్పగా ఉంటుంది (సీతారామశాస్త్రిని మినహాయించి).
@మహేష్,
మిగతా వాళ్లకీ తప్పదు కానీ తెలుగు మాస్టార్లకి మాత్రం ఈ బాదుడు కాస్త ఎక్కువేననుకుంటా.
హ హ తెలుగు మాష్టార్లు మారు పేర్లు బావున్నాయండీ… వేటూరి గారి గురించి మీరు చెప్పింది నిజం… కొన్ని చెత్త పాటలు అని పేరు తెచ్చుకున్నవి కూడా బానే ఉన్నాయ్ అనిపిస్తాయి. ప్రకంపనలు స్పందనలు నేను కూడా చాలా గమనిస్తున్నాను ఈ మధ్య చాలా బ్లాగ్ లు interlinked అయి వుంటున్నాయి.
“మీరన్న ‘మావాడు’ మీరేనా?”
మంచి పట్టే పట్టారు :-).
మర్చిపోయిన 8వ గజం కందుకూరి రుద్ర కవి అనుకుంటా. ఈయన కృష్ణ రాయల వారి క్షురకుడు ’కొన్డోజీ’ రెకమెండేషన్ తో భువన విజయం లో ప్రవేశించాడని చదివాను.
నేనుకూడా డిగ్రీ వరకు తెలుగుని వదల్లేదు. అదేమిటోగానీ ఎంత ప్రయత్నించినా నాకు ఇంటెర్లో తెలుగు చెప్పిందెవరో గుర్తురావడంలేదు. ఇక డిగ్రీలో ఎవరు చెప్పారో కూడా తెలీదనుకోండి. స్కూల్లో మాత్రం మాక్కూడా ముగ్గురు తెలుగు మాష్టార్లు ఉండేవాళ్ళు. ఒకసారి తెలుగులో మార్కులు ఎక్కువ వచ్చాయని మావాడికొకడికి పెన్సిల్ బహుమానం ఇచ్చారు మా మాష్టారు. అది చూసి ఉబ్బిపోయిన వీడు ఆ మాష్టారికి మేము పెట్టిన నిక్‌నేమ్స్ చెప్పడమే కాకుండా ఆ పేర్లు పెట్టేవాళ్ళ లిస్టులో నన్ను కూడా చేర్చాడు( నేనేదొ అనలేదని కాదు, అనేవాళ్ళని ఇంకా చాలామందిని వదిలేసి నన్ను ఎందుకు ఇరికించాడా అని ). దాంతో మేము ప్రతీ రోజు లంచ్ అవ్వగానే(ఆ మాష్టారు క్లాస్ రోజూ లంచ్ తర్వాత లెండి) అరగంట ముందొచ్చి 200 ల గుంజీలు తియ్యాలి. ఈ కార్యక్రమ పర్యవేక్షకుడు మల్లీ వాడే. పది రోజులపాటు మేము వాడికోసం నానా పాట్లు పడి బిస్కట్లు, చాక్లెట్లు ఇచ్చి గుంజీలు తప్పించుకునేవాళ్ళం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్లాస్‌లో మిగతా పిల్లలు కూడా మేము మాష్టార్ని మొసం చేస్తున్నమని నేరం మోపి తాయిళాలు గుంజేవారు. ఆ తర్వాత మేమందరం వాడిమీద వేరేగా కక్ష్య తీర్చుకున్నాం లేండి. అబ్బో చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. చిన్నయసూరిగారి గురించి మీరు చెప్పింది నిజమేనా? కాదన్నా నమ్మలేకుండా ఉన్నాను మీ వ్యాసం చదివాక. ఈ అష్ట దిగ్గజాల ప్రశ్న సొషల్ క్లాస్‌లో బాగా ఇబ్బంది పెట్టడం గుర్తుంది కానీ, తెలుగు క్లాస్‌లో గుర్తులేదు. ఒకవేళ సిలబస్ మారుండొచ్చు ( మా బ్యాచ్‌కి ఎప్పుడూ క్రొత్త సిలబస్ లేండి ). ఇవన్నీ గుర్తొచ్చేలాంటి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు.
@రవి,
కృష్ణరాయల కాలంలోనే రికమండేషన్లుండేవన్నమాట!
@శంకర్,
చిన్నయసూరి గురించి నే రాసింది సగం నిజం, సగం అబద్ధం. ‘సూరి’ వరకూ నిజమే. ‘పరవస్తు’ మాత్రం నిజంగానే ఆయన ఇంటిపేరు.
గుంజీల ప్రస్తావన తెచ్చి అప్పట్లో అమల్లో ఉన్న ‘గోడ కుర్చీలు’, ‘మోకాళ్లు వేయటం’ లాంటి శిక్షలు గుర్తు చేశారు. ఒక మేస్టారయితే చాలా మనసున్నోడు. ఆయన నాలుగైదు బెత్తాలు పట్టుకొచ్చేవాడు క్లాసుకి. ఎవడినైనా కొట్టాల్సొచ్చినప్పుడు ‘ఏ బెత్తంతో కొట్టమంటావు?’ అంటూ ఆ ఛాయిస్ శిక్ష పడ్డ విద్యార్ధికే వదిలేసేవాడు!
తెలుగు పండితుల ప్రహసనం బావుంది. ఆచార్య ఆత్రేయ జోకు సూపర్. మేస్టారు ప్రశ్న అడిగి నించోబెట్టి, మనకి సమాధానం తోచని ఆ అవస్థ అదొక అనిర్వచనీయమైన మానసిక స్థితి. ఆ సమయంలో మునిగే వాడు ఏ గడ్డిపోచ దొరికినా అన్నట్టు ఉంటాము. పక్కనోడు ఏ మాట అందించినా, బుర్ర దాన్ని గ్రహించే లోపునే నోరు దాన్ని బయటికి అనేస్తుంది.
అష్టదిగ్గజాలుగా పేరు పొందినది వీరు – విరిలో కొందరు రాయలి తరవాతి వాళ్ళు అని చరిత్రకారులు నిర్ధారించారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన, మాదయగారి మల్లన, ధూర్జటి, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు.
శిక్షల విషయంలో మోకాళ్ళనీ గుంజీలనీ కలిపి మోకాళ్ళ గుంజీలని ఉండేవి. ఇంకా పూర్వపు కాలంలో కోదండం అని వేయించే వారుట – Supposed to be extremely painful.
Hmm…. మత్తేభం,శార్ధూలం సందేహాన్ని నాకూ వేటూరి గారే తీర్చారు.
చిన్నయసూరి జోకు ఇదే వినడం…బాగుంది. పదోతరగతి తరువాత నాకు తెలుగు క్లాసన్నది తెలీదు కనుక తెలుగు మాస్టార్ల మీది కామెంట్లు గురించి ఐడియా లేదు. ఇప్పుడు చూస్తున్న మళ్ళీ తెలుగు క్లాసుల్ని… కాలేజీలో humanities course offerings లో భాగంగా. కొంతవరకూ కామెంట్లూ వింటున్నాను 🙂
బాగుంది. మాష్టార్ల మీద కామెంట్లు ఎక్కడైనా మామూలే 🙂 . డిగ్రీ వరకు తెలుగు చదివారా! . ఏమీ లేదు ఈ రోజుల్లో డిగ్రీ వరకు తెలుగు చదివిన వాళ్ళు కనపడటం అరుదు, అందుకని ఆశ్చర్యం.
Meeru cheppinavi bagunnayi. ide chadivina tharvatha naaku kuda naa chinnappati school sangathulu guruthu vacchayi. appatlo telugu master lu ante gowravam, bhayam rendu vundevi. vallu patalu cheppi vidhanam navvu teppinchevi. maa telugu master kuda ilage o joke pelcharu. teertha samayallo janaalu ekkuvaga vunde (rush places)chotuni “thoda throkkidi” ga vundi anadam alavataina mata. daaniki aayana “thoda throkkidi” ante thodalu tokkukovadam kadabbayi antha janam vunnarani artham anevaru. ilantivi chala vundevi. samaya sandarbaalanu batti bhale matlade varu. aa rojule veru.