ఏకాంతపు దిలీప్ తన మొద్దబ్బాయి లో ప్రస్తావించిన బెంచ్లీడర్ అనే మాట ఏళ్ల కిందట సుషుప్తావస్థలోకెళ్లిన కొన్ని జ్ఞాపకాలని తట్టిలేపింది. అక్కడ వ్యాఖ్య రాయబోయాను కానీ అది మరీ పొడుగైపోవటంతో ఇలా టపాగా మార్చేశాను.
హైస్కూల్లో ఒక ఏడాది నేనూ బెంచ్ లీడర్ గా వెలగబెట్టాను. భవిష్యత్తులో ఏ రకమైన పదవి అన్నా విరక్తి కలగటానికి బీజాలు అప్పుడే పడ్డాయి నాలో. ఎందుకంటే ….
తొమ్మిదో తరగతిలో మా హెడ్మాస్టారే మా క్లాస్ టీచర్. ఈయన ఆంగ్లం బోధించేవాడు. తరగతిలో చిట్ట చివరి ర్యాంకరుకి కూడా పాఠం మొత్తం అర్ధమైతే కానీ తర్వాతి పాఠానికెళ్లకూడదనేది ఆయన సిద్ధాంతం. అందుకోసం ఆయనకి చిత్ర విచిత్రమైన శిక్షణా పద్ధతులుండేవి. వాటిలో ఒకటి ఈ బెంచ్ లీడర్ కాన్సెప్టు. బెంచికో పోటుగాణ్ని ఎంపికచేసి వాడిని లీడర్ని చేసేవాడు. నా ఖర్మకాలి నా బెంచిలో నేనెంపికయ్యా. బెంచ్ లీడరుడు ఏ రోజుకారోజు తన బెంచ్ వాళ్లందర్నీ నిన్న హెడ్మాస్టారు చెప్పిన ఆంగ్ల పదాలకి అర్ధాలు అడిగి టెస్ట్ చెయ్యాలన్నమాట. ఎవరన్నా ఆ టెస్టులో ఫెయిలయితే వెంటనే ఆయనకి ఫిర్యాదు చెయ్యాలి. ఆయనకసలే బిపి హెచ్చు. ఆవేశంలో చీపురు, చెప్పులు, ఏవి కనిపిస్తే అవి పట్టుకుని పిల్లల్ని కొట్టే రకం (ఓ సారి ఆయన దెబ్బలకి విద్యార్ధొకడు మూర్చపోతే ఆ అబ్బాయి తల్లిదండ్రులొచ్చి హెడ్మాస్టారిపై పోలీసు కేసెట్టారు కూడా). మనదసలే జాలి గుండె. తోటి బెంచ్మేట్ల మీద ఫిర్యాదు చెయ్యటానికి మనసొప్పేది కాదు. అక్కడే తిప్పలొచ్చాయి.
హెడ్మాస్టారు చంద్రబాబునాయుడి స్టయిల్లో అప్పుడప్పుడూ ఆకస్మిక తనిఖీలు జరిపేవారు. వారానికో, పది రోజులకో ఓ సారి క్లాసుని పాఠాలు చెప్పటానికి కాకుండా ఇంతకు ముందు ఆయన చెప్పిన మాటలకి అర్ధాలెంతవరకూ గుర్తున్నాయో పరీక్ష చెయ్యటానికి వాడుకునేవారు. ఆ రోజు నాబోటి మనసున్న బెంచ్ లీడర్లకో కాళ దినమే. మొహమాటానికి పోతే ఏదో అయింది అంటారే, అలా ఉండేది మా పరిస్థితి. నా బెంచ్మేట్లని ఆయన ప్రశ్నలడక్కూడదు దేవుడా అని రకరకాల దేవుళ్లకి మొక్కుకునేవాడిని. అయితే ఏ స్వామీ నను బ్రోచేవాడు కాదు. అలా, నాలో నాస్తికత్వానికి బీజాలూ తొమ్మిదో క్లాసులోనే పడ్డాయి.
ముందూ వెనకగా హెడ్మాస్టారి చూపులు నా బెంచ్ మీదకి ప్రసరించేవి – దేవుడు లేడనే కఠోర వాస్తవాన్ని రుజువుచేస్తూ! నా కుడిభుజం కొ.వెం.రా.నా.కో.రెడ్డి ని లేపి ‘Tell me, what is meant by blind dagma?’ అనే వాడు. అడగ్గానే తెలీదంటే ఆయనకి పిచ్చకోపం వస్తుంది – కనీస ప్రయత్నమన్నా చేసి చూడాలనేది ఆయన ఫిలాసఫీ. అందుమూలాన కొ.వెం.రా.నా.కో.రెడ్డి కాస్త ఆలోచించి ‘గుడ్డి కుక్కమ్మ సార్’ అనేవాడు చేతులు కట్టుకుని ధీమాగా. ఆంగ్లాన్ని, బీజగణితాన్ని తెలుగు ఛందస్సుతో మిళాయించి వాడు తయారు చేసిన ప్రత్యేక శాస్త్రం ప్రకారం ‘Blind + Dog + Ma = గుడ్డి + కుక్క + అమ్మ’ అవుతుందిష!
ఇక చూడాలి హెడ్మాస్టారి వీరంగం. అప్పటికే ఆయన ప్రశ్నలడిగిన పదిమందిలో ఆరేడుగురు తప్పులు చెప్పి ఉండేవారు. దాంతో ఈయన రక్తపోటు ఆల్రెడీ 250 దగ్గరుండేది. రెడ్డిగాడి తిక్క సమాధానంతో అది ఎకాఎకీ ట్రిపుల్ సెంచరీ దాటేసేది. ఈయనవసలే మిలటరీ తరహా పద్ధతులు – సిపాయిల తప్పొప్పులకి వాళ్ల కెప్టెన్‌ని బాధ్యుడ్ని చేసేరకమన్నమాట. ఇంకేముంది, నాకు శిక్ష పడేది. అది కూడా చాలా సృజనాత్మకంగా ఉండేది.
నా బెంచ్మేట్లందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నాకు చెంపదెబ్బలు కొట్టాలని హుకుం జారీ చేసేవాడు. మొదటి వడ్డన రెడ్డిదే. ఎవడన్నా ‘పాపం మనకోసం దెబ్బలు తింటున్నాడు’ అని దయతలచి తగిలీ తగలనట్లు చేతులంటిస్తే ఆయనూరుకునేవాడు కాదు. వాడ్ని దగ్గరికి పిలిచి గూబ గుయ్యిమనేటట్లొకటి పీకి ‘కొడితే ఇలా శబ్దం రావాలి. తెలిసిందా? ఇప్పుడు కొట్టెళ్లి’ అని హుంకరించేవాడు. వాడొచ్చి చేతుల్రెండూ నూటెనభై డిగ్రీల కోణంలో చాపి మరీ వాయించేవాడు. నా బెంచిలో నేను కాక మరో ఐదుగురుండేవాళ్లు. అంటే ఐదుగురితో దండన! పెద్దాయనకి ఆ రోజు మూడ్ అస్సలు బాగోలేకపోతే వెనక బెంచీ వాళ్లతో కూడా బోనస్ వడ్డింపులుండేవి.
ఈ హింస తట్టుకోలేక బెంచ్ లీడర్ పదవికి రాజీనామా చేశానోసారి. ఐతే దాన్ని ఆమోదించ వలసింది హెడ్మాస్టారే కదా. ‘కుదర్దు. బెంచిలో బెస్టెవడయితే వాడే లీడర్’ అంటూ రాజీనామాలేఖ చించవతల పడేశాడు. ఏం చేస్తాం? పుణ్యానికిపోయి మూడు నాలుగు సార్లు ఇలా బుగ్గలు బూరెల్జేసుకున్నాక వేరేదారిలేక స్ట్రిక్ట్ గా మారిపోయాను. ఎవరన్నా పాఠాలు నేర్చుకోకపోతే వెంటనే హెడ్మాస్టారికి చెప్పెయ్యటం మొదలెట్టాను. ఆ దెబ్బతో నెల తిరిగే సరికి బెంచ్మేట్లతో గొడవలొచ్చాయి – అది వేరే కధ.
హ హ హ కబుర్లు భలే ఉన్నాయి.. అయితే మీరు పరోపకారి పాపన్న బిరుదును కొంచెం లో మిస్ అయ్యారనమాట.
Blind Dogma .. fantastic!
I think such experiences also cultivated this sort of very special cynical humor in you – trust me, it’s a rare quality my friend! Rushdie even got “best of Booker” it seems. Perhaps you shd start writign in English!
ఆ రోజులలో ప్రతి స్కూలులో ఈ బెంచ్ లీడర్లు, చెంప దెబ్బల ప్రహసనాలు మామూలే. ఈ చెంప దెబ్బలతో ఎంతమంది మితృలని శతృవులగా చేసుకున్నామో!!ఆ జ్ఞాపకాలన్నిటిని ఓ సారి కదిలించారు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లు చెంపలు పగలగొడితె వీళ్ళకి(పిల్లలకి)కోపం, సుతారంగా చెంపలకి వేళ్ళని అంటిస్తే వాళ్ళకి (మాస్టార్లకి)కోపం. దానికన్నా ఆ చెంప దెబ్బలు తినటమే సుఖంగా అనిపించేది.
భలే వున్నాయి మీ బెంచ్ లీడర్ కష్టాలు. గుడ్డి కుక్కమ్మ జోక్ కేక.
హమ్మ్.. వద్దన్నా అందరూ “బెంచీ లీడర్” నే పట్టుకున్నారన్న మాట. ఈ పదవి నేనూ వెలగబెట్టాను. కాకపోతే బెంచీలో కూర్చున్నంత సేపూ.. ఎప్పుడూ నేనే లీడర్ ని. అప్పుడెందుకో విజయగర్వం అధికారం చూసుకుని. ఐ.టి.లోకి వచ్చాక మాత్రం.. ఇదే కాంసెప్ట్ మరో పేరుతో నాకు ఎదురయితే చిర్రెత్తుకు వచ్చింది. నేనీ సారి receiving end లో ఉన్నా అందుకేనేమో!! “బెంచీ లీడర్”.. డౌన్ డౌన్ .. అలా అని అనిపించేంత.
మీ టపా మాత్రం అదుర్స్!! కానీ ఇక పై చదవదలచుకోలేదు. నాకో విచిత్రమైన జబ్బు ఉంది. ఎవరైనా ఏదైనా సీరియస్, ఫన్నీ రెండు విధాలుగా చెప్తే.. నాకు ఫన్నీయే గుర్తుండిపోతుంది. సో.. ఇప్పటినుండి.. డోగ్మా అంటే నాకు.. శునక మాతే!! 😉
🙂 గుడ్డి కుక్కమ్మ ……కేక.
భలే ఉంది.. 🙂 కానీ బాగా చదవకపోతే మాకు కంప్లైన్ చెయ్యాలిగాని ఇలా బుగ్గలు బూర్లవ్వడం ఉండేది కాదు… కొత్తపాళీ గారు చెప్పినదాని గురించి ఒకసారి ఆలోచించండి…
మీ టపా చదివిన తర్వాత నామధురస్మృతులు గుర్తొచ్చాయి.7వ తరగతిలో ఉండగా నేను మాబెంచ్ లీడర్‌గా ఉండేవాడిని.ప్రతిరోజు మొదటి క్లాసు ఇంగ్లీష్.బెంచి లీడర్లు అందరూ రోజూ ఒక స్టోరీ మేడంకి తప్పులులేకుండా అప్పజెప్పాలి.లేదంటే బడితి భజనే.క్లాసులో మిగతా వాళ్ళంతా ఏదొక లీడర్‌కి అప్పజెప్పాలి.నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువమంది ఉండేవారు.అందరూ నాదగ్గరకి వచ్చి పెదాలు కదుపుతూ నటించేవారు.మీలా చంద్రబాబు తనిఖీలు, చెంపదెబ్బలు లేకపోవడం వల్ల అన్నీ ‘హ్యాపీ డేస్’.
@వేణు,
తనకుమాలిన ధర్మం అనే సామెతేదో ఉంది కదా. బాగా వంటబట్టింది అప్పుడు.
@పూర్ణిమ,
‘కానీ ఇకపై చదవదలచుకోలేదు’: నాకర్ధం కాలేదు. ఏం చదవదలచుకోలేదు, ఎందుకు చదవదలచుకోలేదు? (ఒకవేళ బెంచ్ లీడర్ పార్ట్ 2 రాసి విసిగిస్తానేమోనని మీ భయమా? ఆ భయమే వద్దు. సీక్వెల్స్ రాసే ఉద్దేశం నాకు లేదు)
@కొత్తపాళీ,
ఏదో నామానాన ఇలాంటివి రాసుకోనీకుండా మరీ రష్దీలాంటోళ్లతో పోల్చేస్తే ఎలాగండీ 🙂 (ఏ మాటకామాటే, మీ వ్యాఖ్యకి నా ఛాతీ రెండంగుళాలుబ్బింది. ధన్యవాదాలు)
@సిరిసిరిమువ్వ, శ్రీవిద్య, రాధిక, దిలీప్ & శ్రీను
ధన్యవాదాలు.
మీకు సీక్వెల్స్ రాసే ఉద్ధేశ్యం లేదని తెలిపి అమితానందాన్ని ఇచ్చారు. ఇక చదవదలచుకోలేదు అన్నది.. మీరలా నాకొచ్చిన కాస్త ఇంగ్లీషుకీ కొత్త అర్ధాలు చెప్పితే.. అవే గుర్తుండి, అసలు సిసలు అర్ధాలు (మర్చిపోతానని) పోతాయని. 😉
నా smartness అంతా ఆ వ్యాఖ్యలో చూపించాలి అనుకున్నా.. మీ వ్యాఖ్య చెప్పకనే చెప్తుంది.. నా smartness gurinchi.
భలే ఉన్నాయి. 🙂
గుడ్డి కుక్కమ్మ అన్న మాటకి పగలబడి నవ్వొచ్చింది. మీరు ఇంగ్లీషులో రాస్తే మీక్కూడా బుకర్ ప్రైజో పులిట్జరు ప్రైజో వస్తుందని కొత్తపాళీ గారి ఆశ, మా ఆశాను.