క్రికెట్ బాంబు

పోయిన నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో ఎస్‌బిసి పార్కులో జెయింట్స్‌కి, న్యూయార్క్ మెట్స్‌కి మధ్య జరిగిన బేస్‌బాల్ గేమ్ చూడటానికెళ్లాను. చాలా సంవత్సరాల తర్వాత ఇదే మళ్లీ బేస్‌బాల్ ఆట ప్రత్యక్షంగా చూడటం. అది చూస్తుంటే నేను హైస్కూల్లో బేస్‌బాల్ ఆడిన రోజులు గుర్తొచ్చాయి. సాఫ్ట్‌బాల్ అనేవాళ్లం ఆ ఆటని అప్పట్లో.  మా జట్టులో ఫస్ట్ బేస్ క్యాచర్‌ని నేను.

నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, గుంటూరు జిల్లాలోకి అమెరికన్ బేస్‌బాల్ ఎలా అడుగు పెట్టిందా అని! నా హైస్కూలు రోజుల్లో – క్రికెట్ ఇంకా మిగతా ఆటల్ని మింగేయకముందు – పల్నాడు బళ్లలో బేస్‌బాల్‌దే హవా; దాని తర్వాత వాలీబాల్. 1987 ప్రాంతంలో ఇంటింటా టివిలు వెలవటం, అప్పుడే ఇండియాలో రిలయన్స్ ప్రపంచ కప్ పోటీలు జరగటంతో క్రికెట్ ఓ మతమైంది. దాని ధాటికి కొన్నాళ్లకే నాతోటి ఆటగాళ్లు చాలామంది మతమార్పిడి చేసుకుని క్రికెటర్లయిపోయారు.

ఇంటర్మీడియెట్ లోకొచ్చేసరికి ఈ కొత్త మతం పిచ్చి నన్నూ ఆవహించింది. ఇంటర్ మొదటి ఏడాదిలో ఉండగా ఓ శుభోదయాన నేనూ ప్యాడ్లు కట్టేసి బాప్టిజం తీసుకుని మరీ కిరికెట్ మతంలో చేరిపోయాను. నాటినుండీ బేస్‌బాల్ నా జ్ఞాపకాల పొరల్లోకెళ్లిపోయింది. అప్పుడెత్తిన క్రికెట్ బ్యాట్ ఇంకా దించలేదు. ఒక్కో మెట్టెక్కుతూ యూనివర్సిటీ జట్టు దాకా ఎదగ్గలిగా. ఆంధ్రా రంజీ జట్టుకీ లైనేశా కానీ మనకన్నా పోటుగాళ్లు బోలెడుమంది ఉండటంతో కుదర్లేదు. పైగా అప్పట్లో ఆంధ్రా రంజీ జట్టులో అంతా గుంటూరు ఎల్‌విఆర్ క్లబ్ ఆటగాళ్లే ఉండేవాళ్లు. ఇక వేరేవాళ్లకి చోటెక్కడ? ఏదైతేనేం, మనం రంజీల్లోకి రాకపోవటంవల్లనే టెండూల్కర్ వంటి సమకాలీకుడికి భారతజట్టుకాడే అవకాశమొచ్చిందని నిస్వార్ధంగా సంతోషిస్తుంటాం.

మళ్లీ ఇంటర్ రోజుల్లోకెళితే – చదువు పాడయిపోతుందని ఇంట్లోవాళ్లు క్రికెట్ మీద కర్ఫ్యూ విధించినా ఎగస్ట్రా క్లాసులనో మరోటో చెప్పి వారాంతాల్లో మ్యాచులాడటానికి తుర్రుమనేవాణ్ణి. మన ప్రతిభని గుర్తించి ఊళ్లోవాళ్లు వీరతాళ్లేయటం మొదలెట్టాక ఇంట్లో మెల్ల మెల్లగా కర్ఫ్యూ ఎత్తేశారు. వీరతాళ్ల మూలాన మనపేరు క్రమంగా పల్నాటిసీమంతా పాకింది. రెంటచింతల, దుర్గి, రాయవరం లాంటి  చుట్టుపక్కల గ్రామాల్లో ఏవైనా టోర్నమెంట్లు జరిగితే ఆ ఊళ్లనుండి ఆటగాళ్ల వేటగాళ్లు (మేకప్పేసి మరోభాషలో వీరినే స్కౌట్స్ అందురు) మాచర్ల అనబడే మాయొక్క మహానగరానికొచ్చి నాబోటి నలుగురయిదుగురు పోటుగాళ్లని కిరాయికి తోలుకెళ్లేవాళ్లు – వాళ్ల స్థానిక జట్ల తరపున ఆడించటానికి. కిరాయంటే మాకేదో లక్షలు ముట్టేవని కాదు. ప్రయాణ ఖర్చులు, లంచ్ మరియు స్టార్ ఆటగాళ్లనే ప్రత్యేక హోదా – ఇంతే. ఇలాంటి విషయాల్లో పల్నాడు చాలా అడ్వాన్స్‌డ్ లెండి. ఐపిఎల్ పుణ్యాన ఇప్పుడందరికీ తెలిశాయేమోగానీ, ఆటగాళ్లని లీజుకు తీసుకోవటం, వేలం వేయటం లాంటివి అప్పట్లోనే ఉండేవి మాకక్కడ. అసలు బ్రహ్మనాయుడు-నాగమ్మ కూడా ఇలా లీజుకు తెచ్చిన కోళ్లతోనే పందెం ఆడారన్నది నా గట్టి నమ్మకం. అలా అద్దెకెళ్లినప్పుడోసారి జరిగిందిది.

ఓ సారి వెల్దుర్తిలో ఓ క్రికెట్ గేమాడుతున్నాం (ఇప్పటికీ ఈ ఊర్లో బాంబుల మోత మోగని రోజుండదు – పల్నాటి పౌరుషం అన్నమాట). ఎవరో లోకల్ ఫ్యాక్షనిస్టు మెమోరియల్ టోర్నమెంటని గుర్తు. ఇలాంటి ఊర్లలో క్రికెట్ టోర్నమెంట్లప్పుడు జాతర వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా వ్యవసాయం పనులు లేనప్పుడు ఇలాంటి పోటీలుంటాయి. దాంతో జనాలు తండోపతండాలుగా విచ్చేసి పోటీలు తిలకిస్తారు. పోటీలకోసం నరసరావుపేట పున్నయ్య మైక్ సెట్ కంపెనీనుండో, గురజాల లక్ష్మారెడ్డి టెంట్ హౌస్ నుండో ప్రత్యేకంగా తెప్పించిన మైకుల ద్వారా ఊరంతా వినిపించే లెవెల్లో తెలుగులో రన్నింగ్ కామెంటరీ కూడా ప్రసారం చేయబడుతుంది – ‘బౌలరు లగెత్తుకొచ్చి బంతిసిరిండు…. ఎయ్య్…. అద్దీ…. బ్యాటబ్బి దాన్ని బాది ఉరికిండు…. బంతిబోతనే ఉంది…. రెండు దీసిండ్రు’ అంటూ.   

సరే. టోర్నమెంట్లో మా జట్టు రెండో మూడో గేములు గెలిచి ఊపుమీదుంది. క్వార్టర్ ఫైనల్సులోననుకుంటా, షరా మామూలుగానే ఎదుటి జట్టుతో గొడవలొచ్చాయి – అంపైరింగు దగ్గర. టోర్నమెంటు పోతేపోయిందని పోటీ వదిలేసుకుని వెళ్లిపోటానికి తయారయ్యింది మా జట్టంతా. ఐతే ఇది మా ఆట చూట్టానికొచ్చిన వందా యాభైమంది ప్రేక్షక జనాలకి నచ్చలా. వాళ్లు ఏ జట్టు గెలుస్తుందనే విషయమ్మీద బెట్టింగులు కాసుకున్నారట – మేమేదో పందెం కోళ్లమైనట్లు! ‘అబ్బీ, ఆట పూర్తిగానీకుండాబోతే ఏమయిద్దో తెలుసా’ అని మర్యాదగానే చెబుతూ గుడ్డసంచిలో భద్రంగా మూటకట్టున్న నాటు బాంబులు చూపించాడో మొరటుమనిషి. పైప్రాణాలు పైనే పోవటం అంటే ఏమిటో చక్కగా అర్ధమయిందప్పుడు. ఇంకేం చేస్తాం? ప్రాణాలరచేత పెట్టుకుని ఆట పూర్తి చేశాం. ఆటైతే హోరా హోరీగా సాగింది కానీ, చివర్లో మా అదృష్టం బాగుండి మేమే ఓడిపోయాం. దాంతో మరో గేమ్ కోసం మళ్లీ వెల్దుర్తిలో అడుగుపెట్టాల్సిన అవసరం రాలేదు. ఆ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు గ్రౌండులోనే బాంబులేసుకున్నారని నాలుగయిదు రోజుల తర్వాత ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్లో చదివి ఓడిపోయి బ్రతికిపోయాననుకున్నా. నా ‘కిరాయి క్రికెటర్’ వృత్తికి ఆ నాటితో తెర. అప్పటినుండీ కళాశాల, విశ్వవిద్యాలయ జట్లకి తప్ప ఇలాంటి అరువు తీసుకెళ్లే జట్ల జోలికెప్పుడూ వెళ్లలేదు.

13 స్పందనలు to “క్రికెట్ బాంబు”


 1. 1 శ౦కర రెడ్డి 7:33 సా. వద్ద జూలై 9, 2008

  నిజమె న౦డి …క్రికెట్ రావడ౦ తొ …మిగతా ఆటలు మరుగున పడిపొయాయి….

  మా ఊళ్లొ ఐతె బా౦బులు వేసుకొనె వాళ్ళ౦ కాదు గాని …..

  ఓడిపొయిన వాళ్లు ట్రాక్టర్ తిసుకొని పొయి …పిచ్ ను దున్ని వచ్హె వాళ్లు …..

 2. 2 వేణూ శ్రీకాంత్ 7:36 సా. వద్ద జూలై 9, 2008

  నిజమేనండీ, టీవీ లు బాగా ప్రచారం పొందక ముందు ఎలా వచ్చిందో గుర్తు లేదు కానీ బేస్ బాల్ కి బాగానే పేరొచ్చింది, స్కూల్ లో నేను కూడా ఒకటి రెండు సార్లు ఆడాను, మా డ్రిల్లు మాస్టారు (కాన్వెంటు పిల్లలకి sports sir అని చెప్పాలేమో) పుస్తకం లో చూసి మరీ రూల్స్ చెప్పేవారు. ఇక్కడికి వచ్చాక దానికున్న క్రేజ్ చూసి ఔరా అనుకున్నా… మీ టపా బావుంది ప్రత్యేకించి పల్నాటి ఊర్ల పేర్లన్నీ మళ్ళీ ఒక సారి చదువుతుంటే felt good.

 3. 4 ప్రతాప్ 3:43 ఉద. వద్ద జూలై 10, 2008

  మీరు university దాకా వెళ్ళారా. మనం కూడా అంతే నండి. కాకపొతే ఈ చదువుల పుణ్యమా అని డిగ్రీ తర్వాత దించిన బ్యాటు, మరలా పెద్దగా ఎత్తి పట్టుకొన్నది ఏమీ లేదు. IPL వాళ్లు మనల్ని చూసే ఇది కాపీ కొట్టారు లెండి (మనం కూడా ఇలానే వేరే ఊర్లకి వెళ్లి ఇరగ దీసినోళ్ళమే) .

 4. 5 అబ్రకదబ్ర 1:08 సా. వద్ద జూలై 10, 2008

  @ప్రతాప్,

  ఎత్తిన బ్యాటు దించలేదనేకానీ ఈ మధ్య క్రికెట్టనేది మరీ ఖరీదైన యవ్వారమైపోయింది. మ్యాచ్‌కెళ్లిరావటానికి పర్మిషన్ కోసం భార్యామణికి షాపింగ్ తాయిలాలు పెట్టాల్సొస్తుంది మరి. రెండువారాలకో నెలకో ఓ సారి ఆడే నా పరిస్థితే ఇలా ఉంటే పాపం ఏడాది పొడుగునా ఆడుతుండే సచిన్, గంగూలీ లాంటివాళ్ల పరిస్థితేంటో! చిన్నప్పుడు ఇంట్లో క్రికెట్ మీద అదోరకం కర్ఫ్యూ, ఇప్పుడు మరో రకం. ప్చ్..
  @శంకర్రెడ్డి,

  మీవాళ్లెవరో శివసేనలో చేరిపోయి ఈ ‘పిచ్చిలు దున్నే అవిడియా’ వాళ్లకి చేరేసినట్లున్నారు 🙂

  @వేణు,

  మాకు ఇద్దరు డ్రిల్లు మాస్టార్లుండేవాళ్లు. ఎత్తులని, బరువులని బట్టీ పిలగాళ్లని సీనియర్లు, జూనియర్లు అని విభజించేవాళ్లు. ఇద్దర్లో ఒకాయన సీనియర్ జట్లకి, రెండో ఆయన జూనియర్ జట్లకీ కోచ్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ లో మా స్కూలు తరపున సీనియర్లెక్కువ మెడల్సు కొట్టుకొస్తారా, జూనియర్లు కొట్టుకొస్తారా అని వీళ్లిద్దరికీ మధ్యా తెగ పోటీగా ఉండేది.

  పల్నాటి వీరులు చాలామందున్నట్లున్నారు బ్లాగుల్లో. ఆ మధ్యెప్పుడో నేను, నా స్నేహితుడొకడు కలిసి ‘కోడి పుంజు’ అని పల్నాటి వాళ్లకోసం ఓ యాహూ గ్రూపు మొదలెట్టాం కానీ దానికి ఆదిలోనే హంసపాదడింది. ఆరంభ శూరత్వమన్నమాట.

  @సిరిసిరిమువ్వ,

  Thank you. మీ ప్రశంసలు కామెంటరీ చెప్పినోళ్లకే చెందుతాయి.

 5. 7 రాజేంద్ర 1:57 ఉద. వద్ద జూలై 11, 2008

  నా హైస్కూలు రోజుల నాటి కిరికెట్టు,బేసుబాలు తలుచుకుంటే,వా ఆ..ఆ.ఆ ఇప్పటికీ ఏడుపొస్తుంది.అదొక దారుణమైన గాధానుభవాలు.బాబోయ్

 6. 8 వేణూ శ్రీకాంత్ 1:52 సా. వద్ద జూలై 11, 2008

  అవునండీ చాలా మందే ఉన్నట్లున్నారు మళ్ళీ ఓ సారి కదిల్చి చూద్దాం కోడిపుంజు ని (పేరు భలే పెట్టారు ఎవరో కాని)

 7. 9 గీతాచార్య 4:50 ఉద. వద్ద మే 5, 2009

  హాహ్హాహ్హా. మీరూ పల్నాటి వాళ్ళేనా? ఏ ఊరు?

 8. 10 వెంకటరమణ 2:44 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  బాగుంది మీ టపా. చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి.
  ఈ క్రికెట్ రావటంతో పల్లెటూరి ఆటలైన గోళీలు, బిళ్ళంగోడు, బొంగరాలు, బచ్చాలు, ఓకులాట, పులి-మేక, జాడీ, దండు ఆట, జిగ్గాట, అన్నీ పోయాయి.
  అందరిలాగానే నాకు కూడా క్రికెట్ మీద ఆసక్తి కలిగింది.
  కిరాయి ఆటగాళ్ళను తీసుకు రావటం పల్లెటూళ్ళలో సర్వ సాధారణం.
  వీటి గురించి మా ఊర్లో కూడా చాలా గొడవలు జరిగాయి. బాపట్ల ఆర్ట్స్ , ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళను, టౌన్ ప్లేయర్స్ ను తీసుకు వచ్చేవాళ్ళు . దానికి ప్రత్యక్ష సాక్షిని. క్రికెట్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో మా ఊరి ఆటగాళ్ళకు మంచి పేరు ఉండేది.
  నాలుగైదు సంవత్సరాల నుండి అయితే, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించటం కూడా తగ్గిపోయింది. కార్కు బాల్, కుట్ల బాల్స్ పోయి టెన్నిస్ బాల్స్ తో ఆడిస్తున్నారు.
  పల్లెటూరి ఆటలు ఎంతోకొంత ఆడిన చివరి వాళ్ళం మేమే.
  ఏంటో ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒక రకమైన దిగులు ఆవహిస్తుంది.

 9. 12 మానస సంచర 11:08 ఉద. వద్ద జనవరి 18, 2010

  చదువుతుంటే సెలవులకి మా ఊరెళ్ళి నప్పుడు ఆడే (నేను కాదండోయ్ ఊరిలో వాళ్ళు) మ్యాచ్లు గుర్తొచ్చాయి. పక్క ఊరితో బెట్ పెట్టి ఆడేవారు. నాకు తెలిసి బెట్ ఒకరు గెలవడం ఎప్పుడూ చూడలేదు. మ్యాచ్ మూడొంతులు అయ్యే లోపు ఏదో గొడవ రావడం, ఒకరినొకరు వాడిగా వేడిగా తిట్టుకోవడం (ఈ సెక్షన్ మ్యాచ్ కంటే బావుండేది) మ్యాచ్ ఆగిపోవడం. క్రికెట్ కోసం కాకపోయినా ఆ కొట్టుకోవడం చూడడం కోసం జనం బానే వచ్చేవారు.


 1. 1 రికార్డుల మోత « తెలు-గోడు 9:57 ఉద. వద్ద అక్టోబర్ 18, 2008 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: