ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక ఇండియన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న తెలుగు కుర్రాడితో మాటలు కలిపితే అతన్నుండి రాలిన వివరాలు నన్నాశ్చర్యపరిచాయి. మా ఊర్లోనే ఉన్న ఒకానొక యూనివర్సిటీలో చదువుతున్నాడట అతను. ఆరు నెలల క్రితమే ఇండియా నుండొచ్చాడు. చాలా ఏళ్ల నుండీ ఉంటున్నా మా ఊర్లో ఆ పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉన్నట్లే తెలీదు నాకు! ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుసని విర్రవీగుతుండే నాకో చిన్నపాటి గర్వభంగం. ఆ సంగతే అతనితో అంటే నవ్వి మా ఊర్లోనే ఉన్న మరో రెండు విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పాడు. నాకు మరో రెండు షాకులు!!
ఇతను చదివే యూనివర్సిటీ రెండేళ్ల క్రితమే స్థాపించబడింది. పోయినేడాది వందమంది, ఈ ఏడాది నూట యాభై మంది – వెరసి మొత్తం విద్యార్ధుల సంఖ్య రెండొందల యాభై. ఇదేం యూనివర్సిటీయో అర్ధం కాలేదు. ఈ రెండొందల యాభై మందిలో వందమందిదాకా భారతీయులు (అందులోనూ అత్యధికులు తెలుగు వాళ్లు), మరో నూట పాతికమందిదాకా చైనీయులు ఉంటారట. సెమిస్టరుకి పదిహేను వందల డాలర్ల దాకా ట్యూషన్ ఫీజులవుతాయి. మొత్తం ఆరు వేల డాలర్లతో ఎం.ఎస్. పూర్తయిపోతుంది! చూడబోతే ఇండియాలో ఎం.ఎస్./ఎం.టెక్. చదవటం కన్నా అమెరికాలోనే చవకలాగుంది.
నేను ఈ కుర్రాడిలాంటి వాళ్లని మరింత మందిని చూసి ఉన్నాను. ఎక్కువమంది ఇటువంటి విశ్వవిద్యాలయాల్లోనే చదువుతూ ఉంటారు. ఇండియాలో ఎంత పేరులేనిదైనా (డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మినహాయిస్తే) ఫలానా యూనివర్సిటీ అనగానే ఒక ఒక పెద్ద ప్రాంగణం, దాని కిందనుండే వందలాది అఫిలియేటెడ్ కాలేజీలు గుర్తుకు రావటం సహజం. అమెరికాలో పద్ధతి దానికి భిన్నం. ఇక్కడ యూనివర్సిటీలని మన కాలేజీలతో పోల్చవచ్చునేమో. మనకి గొందికో కాలేజీ ఉన్నట్లు ఇక్కడ సందుకో విశ్వవిద్యాలయం ఉంటుంది. వాటిలో ఎక్కువ శాతం పై బాపతే.
ఉన్నత విద్యకోసం అమెరికా రాదలుచుకున్న భారతీయ విద్యార్ధులకు స్టాన్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, కెల్లాగ్స్, ఎం.ఐ.టి., ప్రిన్స్టన్, హార్వర్డ్, యేల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే అవకాశం అంత తేలికగా రాదు. తట్టుకోలేని ట్యూషన్ ఫీజులు ఒక కారణమైతే, ఆయా సంస్థల అర్హతా పరీక్షల్లో గట్టెక్కటం అంత సులభం కాకపోవటం మరో కారణం. అందువల్ల ఎక్కువమంది పైన ఉదహరించిన చిన్నా చితకా విశ్వవిద్యాలయాల్లోనే చేరవలసి వస్తుంది. కొన్ని అమెరికన్ యూనివర్సిటీలలో ఎనభై శాతం దాకా భారతీయ విద్యార్ధులే ఉంటారంటే ఆశ్చర్యం లేదు. ఈ యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకోవటం వరకూ తేలికే. ఆ తరువాతే వీళ్ల కష్టాలు మొదలవుతాయి. ఇంటి అద్దె, భోజనం, ఇతరత్రా ఖర్చుల కోసం ఏదో ఒక పని చూసుకోవలసి వస్తుంది. ఇండియన్ గ్రోసరీ షాపులు, రెస్టారెంట్ల వంటి వాటిలో పని చేసే అవకాశం కొందరికొస్తుంది (విద్యార్ధుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటంతో ఇక్కడా కాంపిటీషనే). మరి కొందరు గ్యాస్ స్టేషన్లలోనో, నైట్ క్లబ్బుల్లోనో, బార్లలోనో పని చేయవలసి వస్తుంది. ఇంత కష్టపడి చదువు పూర్తి చేసినా అమెరికాలో చదివారని చెప్పి పిలిచి ఉద్యోగం ఎవరూ ఇవ్వరు. పైగా ఎక్కువమంది వాళ్ల చదువుకి ఏ మాత్రం సంబంధం లేని ఐ.టి. రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. దాంతో, చదువు పూర్తయ్యాక మరో ఆరో ఏడో నెలలు ఎస్.ఏ.పి. నో మరే ఇతర సాఫ్ట్ వేరో నేర్చుకోవలసి వస్తుంది. ఇదంతా పూర్తయ్యి ఉద్యోగ మార్కెట్లోకి దూకాక ఆ రంగంలో అప్పటికే అనుభవం ఉన్న వాళ్లతో – వీళ్లలో కొందరు అమెరికన్లు, చాలామంది తోటి భారతీయ హెచ్-1 సోదర సోదరీమణులు – భీకరమైన పోటీ తట్టుకుని నిలబడితే కానీ ఉద్యోగం రాదు. ప్రస్తుతం అమెరికాలో నెలకొని ఉన్న ఆర్ధికమాంద్య పరిస్థితుల్లో ఈ పోటీ మరింత ఎక్కువ.
నాకెదురైన చాలామంది విద్యార్ధుల లక్ష్యం స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగు పెట్టి ఎలాగో ఇక్కడే ఉద్యోగం సంపాదించుకుని సెటిలైపోవటం. వాళ్ల కధలు వింటుంటే నాకనిపిస్తుంది – ఈ చదువేదో ఇండియాలోనే చదివి రెండు మూడేళ్లు అక్కడే ఉద్యోగం చేసి అనుభవం సంపాదించుకుని ఆపై ఇంకా అమెరికా రావాలనే కోరికుంటే హెచ్-1-బి నో, మరే ఇతర మార్గంలోనో ఇక్కడకు రావచ్చు కదా. ‘అమెరికాలో చదువుకోవటం’ అన్న పాయింటు ఉద్యోగాన్వేషణలో ఎటువంటి బోనస్ కానప్పుడు పై చదువులకి ఇక్కడికొచ్చి ఇంత కష్టపడటం దేనికి? ఉద్యోగాల సంగతవతలుంచి ఇలా చదువుకోవటం వాళ్ల మానసిక వికాసానికేమన్నా దోహదం చేస్తే మంచిదే. అయితే ఆ విషయమూ నాకనుమానమే.
పైన మీరు ఉదహరించిన సాధకబాధకాలను ఎదుర్కొని అధిగమించే క్రమంలో నేర్చుకునే జీవితపాఠాలు అమూల్యం. విశ్వవిద్యాలయాల్లోని పాఠాలు వీటి కొనగోటికి కూడా సరితూగవు. భారతదేశంలో ఇంటిపట్టున ఉంటూ చదవటం వేరూ..హార్వర్డైనా, కమ్యూనిటీ కాలేజీ అయినా..అమెరికా చదువుల లెవెలే వేరు (అదేదో గొప్ప సంగతని కాదు సుమా)
రవి గారూ, మీరు చెప్పినది నిజమే కావచ్చు, కానీ అక్కడేదో పొడిచేస్తాం అనే ఉద్దేశ్యంతో, ఇక్కడ అంత తాహతు లేకపోయినా కూడా, తల తాకట్టు పెట్టి మరీ వస్తున్నారు కదా.. అది సమస్య.. మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఒకరు, వాళ్ళ పిల్లలని అమెరికా కి పంపించడానికి తను వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని పంపించారు… పోనీ అక్కడ ఏమైనా మంచి కాలేజీలా అంటే కాదు.. ఏదో శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం కాలేజీ అది.. ఉన్నది ఇద్దరు పిల్లలు, ఇద్దరినీ అమెరికా కి పంపించి ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి.. ఇప్పటికీ మన వాళ్ళకి అమెరికా అంటే డాలర్ల గని లాగా కనిపిస్తోంది.. ఆ అభిప్రాయం మారాలి…
డాలర్ల గని నిజమే కావచ్చు – కాకపోతే ఈజీ గా డబ్బులు సంపాదించచ్చు అనే అభిప్రాయం
నాకు అమెరికా చదువుల గురించి ఎక్కువ తెలీదు, కానీ మీరు చెప్పిన H1 లాంటి వర్క్ వీసా అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి కదండీ… అంతవరకూ వేచి చూసి రాలేదని తిట్టుకునే కన్నా చదువు పేరుతో ముందే ఈ దేశం లో అడుగు పెట్టడం సులువైతే అదే మంచిది కదా అనే ఆలోచన అయి ఉండచ్చు. ఇక్కడ చదివి పని చేయాలి అనుకునే వారికి H1 Visas కూడా ప్రత్యేక మైన కోటా వుంటుంది కదా. అదీ కాక పని చేస్తూ చదువుకోడం బాధ్యతని తెలియ చేస్తుంది కాస్త కష్టమైనా, కాదంటారా.
kastamo nistooramo kanee…..
Alaa chaduvukovataniki velli…bhaagupadinollu boledu…. maa college management bharinchaleni kurrolandaru ippudu USA lo meeru cheppina colleges lo chaduvutunnaru…andariki jobs vastunnayi chinnaga ….
Toppers kante…ekkuva salary to…adee america ane tag name to…. kekalu puttistunnaru… colleges ki vachi kooda …chai shops lo aagipoye … students…akakdaki velli edoka rakam ga …sharam viluva telusukuni vallonchukuni pani chestunanru… First things first – Dabbu rupena ayina “Dignity of Labour” telugusukuntunnaru….
kastala maata atunchite..chala labhalu vunnayi…. coin has every shades annattu..konni nastalu, failures leka poledu…..
CHala bagundhi
Thats some food for thought.
నేను అమెరికాలో చదవలేదు.ఇప్పటికైతే అమెరికా చూడనుకూడాలేదు కానీ, రవి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఈ తతంగం అంతా ఇచ్చే జీవితానుభవం ఏ కాలేజీ, ఏ ప్రొఫెసరూ ఇవ్వలేంది.
ఇండియా లో M.Tech చెయ్యాలంటే 8000 రూపాయలు ఉంటే చాలు. 6000 డాలర్లు అవసరం లేదు. కాని దాని కంటే ముందు GATE లో మంచి ర్యాంక్ రావాలి. ఇక ఏదో ఒక చెత్త యూనివర్సిటీ ఐతే 6000 డాలర్లు కంటే ఎక్కువ అవుతుంది. కాని నాకు తెలిసి US లో మన ఐఐటి లాంటి యూనివర్సిటీ లో MS చెయ్యాలంటే తడిసి మోపెడు అవుతుంది. ఏమంటారు?