ఈ మధ్య అనుకోకుండా జీ-టీవీ లో రెండు మూడు జీడిపాకం సీరియళ్లు చూడాల్సిన అవసరం పడింది (ఎవరి వత్తిడితోనో చెప్పుకోండి చూద్దాం). లేని కధ గురించి చెప్పుకోటానికేమీ లేదుగానీ, ఈ సీరియళ్లలో నన్నాకర్షించినవి కొన్ని పాత్రల పేర్లు. ఇంత వింత పేర్లు నిజ జీవితంలో ఎక్కడా వినుండలేదు నేను. వాటిలో మచ్చుకు కొన్ని: జిగ్యాస, దక్ష్, నహర్, కాళిక, శుభ్ర, నర్పత్, క్షితిజ్, భవిష్య్, రసిక్.
ఇలాంటి పేర్లు పెట్టే ఆలోచన రచయితలకెలా వస్తుందో కానీ కొన్నిసార్లు ఆ పేర్లకి అర్ధం కూడా తెలుసుకోకుండా పెట్టేస్తారేమో అనిపిస్తుంది. ఇవి ఇంకా నయం. కేవలం సీరియళ్లలో పాత్రల పేర్లు మాత్రమే ఇవన్నీ. తమిళనాట దర్శక శిఖామణులు తాము పరిచయం చేసే నటీమణుల తెరనామధేయాలు ఎంత ఘోరంగా పెడతారో చూడండి: రసిక (ఈమె సంగీత గా తెలుగు సినిమాల్లో ప్రసిద్ధురాలు), రహస్య (ఒక్కడున్నాడు లాంటి ఒకటి రెండు తెలుగు చిత్రాల్లోనూ కనిపించిన ఐటం డాన్సర్), విచిత్ర (మరో ఐటం డాన్సర్) …. రేపో మాపో అసహ్య, రక్కసి, కురూప లాంటి పేర్లూ పెట్టేస్తారేమో!
పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగు వాళ్ల చాంతాడు పేర్లపై చలామణిలో ఉన్న జోకొకటి చెబుతాను. పాతది కాబట్టి మీరిప్పటికే వినుండొచ్చు.
ఓ సారి జేమ్స్ బాండ్ విమానంలో ప్రయాణిస్తూ పక్క సీట్లో ఉన్న తెలుగు కుర్రాడితో మాటలు కలిపాడు. కరచాలనం కోసం చేతిని ముందుకు చాపుతూ అలవాటు ప్రకారం ఇలా పరిచయం చేసుకున్నాడు:
‘My name is Bond, James Bond’.
ఇక మన తెలుగబ్బాయి మొదలెట్టాడు.
‘Nice to meet you. My name is Lakshman, Sai Lakshman, Venkata Sai Lakshman, Veera Venkata Sai Lakshman, Vangivarapu Veera Venkata Sai Lakshman, Vundraju Vangiva…. ‘
పాపం, మొట్టమొదటిసారిగా 007 మరొకడి దెబ్బకి కళ్లు తేలేశాడు.
నిజంగా ఇంత పొడుగు పేర్లుంటాయా తెలుగు వాళ్లకి అని నా పరభాషా మిత్రుల సందేహం. తెలుగు వాళ్లలోనూ కొంతమంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. నా మిత్రుల్లో కొందరికి ఇలాంటి పొడుగాటి పేర్లున్నాయి. వాటిలో మచ్చుకి రెండు.
నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల్లో నా సహ విద్యార్ధి పేరిది: కొమ్మిరెడ్డి వెంకట రామ నాగేంద్ర కోటి రెడ్డి. అప్పట్లో నాకు తెలిసిన అతి పొడుగు పేరదే. వాడు కూడా ఆ పేరు చూసుకుని విర్రవీగుతుండేవాడు – తనని మించిన మొనగాడు స్కూల్లోనే లేడని. ఐతే మేం హైస్కూల్లోకొచ్చేసరికి వాడి ఇగోకి భీకరమైన దెబ్బ తగిలింది. ఆరో క్లాసులో పక్క ఊర్నుంచి వేరే కుర్రాడొచ్చి మా క్లాసులో చేరాడు. వీడి పేరు – కాస్త ఊపిరి బిగపట్టి చదవాలి మీరు:
గ్రంధి వెంకట లక్ష్మీ నరసింహ శివ రామ కృష్ణ కోటి సూర్య సుధాకర సుబ్రహ్మణ్య ఆంజనేయ దేవీ పద్మ ప్రసాద చిరంజీవి అజయ్ బాబు
ఇదేదో నేను కల్పించిన పేరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ పేరుగల వ్యక్తి నిఝ్ఝంగా ఉన్నాడు. రికార్డుల్లో మాత్రం ఇతని పేరు పట్టక ‘జి. అజయ్ బాబు’ అని కుదించేశారు. ఇతనికి ఒక తమ్ముడు, ఒక అన్న ఉన్నారు. వాళ్లిద్దరికీ మిగతా తోకంతా ఉంటుంది – తేడా అల్లా ‘అజయ్ బాబు’ బదులు ఒకతను ‘విజయ్ బాబు’ మరొకడు ‘సుజిత్ బాబు’. ‘ఉరేయ్, ఎందుకురా మీకింత పొడుగు పేర్లెట్టారు’ అంటే ‘మాది చాలా పెద్ద ఫ్యామిలీ. చుట్టాలంతా ఎవరికి తోచిన పేరు వాళ్లు చెబితే అవన్నీ కలిపి మాకెట్టేశార్రా‘ అనేవాడు దిగులుగా. పాపం, కొ.వెం.రా.నా.కో.రెడ్డిలా పేరు పొడుగు చూసుకుని మిడిసిపడే రకం కాదు వీడు. హైస్కూలు చదువుల తర్వాత తలో దారిన వెళ్లటంతో ఇప్పుడెక్కడున్నారో తెలియదు వీళ్లిద్దరూ.
baagundi “nEmu” puraanam 🙂
ఇంటిపేరు, కుటుంబ దైవం పేరు,తాత పేరు, తండ్రి పేరు పెట్టడం చాలా మంది కోస్తా జిల్లాలవారి పద్ధతిగా నాకు అనిపించింది. నాకు తెలిసి, రాయలసీమలో ఇంత పెద్ద పేర్లుండవు. కానీ ఇంటిపేరు,తాత లేక తండ్రి పేరు వరకూ ఇక్కడా తగిలించేస్తారు.అంటే కొంత రాయితీ అన్నమాట. వంశగౌరవాలు నిలబెట్టడం మనవాళ్ళకు సరదా కదా! చేసే పనులతోకాక ఇలా పేర్లతో సరిపెట్టు కుంటున్నామేమో!
అబ్రకదబ్ర గారు,
మీకా పేర్లు ఇప్పటికీ నిజంగా గుర్తున్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండీ. నిజమే పేరులో ఏముంది, అంతా అతని వ్యక్తిత్వంలోనే ఉంది.
కనీసం అర్థం కూడా చూసుకోకుండా పేర్లు పెట్టడాన్ని నేను కూడా ఖండిస్తాను! మీరు మొదటి పేరాలో చెప్పిన పేర్లు ఖచ్చితంగా ఏక్తా కపూర్ సీరియళ్లలోవే అయి ఉంటాయి. మా ఎదురింటి పాప పేరు ‘సాయి నిషా’ (సాయి బాబా ఏమనుకుంటాడో అని కూడా లేదు)
మరో బాబు ని ‘కుష్’ అని పిలవడం విని వాడి పేరేమిటని వాళ్లమ్మనడిగితే ఆవిడ చెప్పింది ‘కుశాగ్ర్ ‘ అట!
మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉండేవి.. కానీ సర్టిఫికేట్స్ లో కుదరదు కదా, అందుకని చిన్నగా చేసుకునే వారు…
ప్రతాప్ గారు చెప్పినట్లు అంత పొడుగు పేర్లు భలే గుర్తు పెట్టుకున్నారండీ, మా కాలేజ్ లోనూ పొడుగు పేర్లుండేవి కానీ నాకు పూర్తి పేర్లు గుర్తు లేవు.
:)baagundi
కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. నా పేరు నిడివి ని నేనే భరించలేక సింపుల్ గా రవి అని చెప్పుకుంటున్నాను.
ఈ మధ్య మా మిత్రుల ద్వార కొన్ని పేర్లు విన్నాను (వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నవి) అవి…నారాయణ నమన్ ఆశ్రిత్, రుహాన్ గంధర్వ, రమేశ్ వివేచన్ వగైరా వగైరా …మల్లిక్ నవ్వితే నవ్ రత్నాలలో ఓ కథ రాసాడు దీని మీద.
🙂 బాగుందండీ.
మందడి తిలక్ “పేర్ల పురాణం” అని ఒక వ్యాసం రాసాడు. ఒక కరణంగారింట్లో లేకలేక పిల్లాడు పుట్టాట్ట. నామకరణం రోజున అంతా చేరారు. తాతగారి పేరు పెట్టాల్సిందే అని బామ్మ పట్టుబట్టింది. పిల్లాడికోసం నాగేంద్రస్వామికి మొక్కుకున్నాను నాయనా అంది అమ్మమ్మగారు. వెంకన్నబాబు కులదైవం అన్నారు తాతగారు. చైతన్య అన్న పేరు ఎక్కడో అక్కడ తగిలించాల్సిందే అన్నాడు అభ్యుదయభావాలు కల బాబాయి. పేరులో “కమల్” ఉండితీరాల్సిందే అని పట్టుపట్టింది మేనత్త కమలహాసన్ని తలుచుకుని లొట్టలేస్తూ. ఇలా అందరి మొక్కులు, కోరికలు, చెల్లించేసరికి పేరు చాంతాడంతయ్యింది – “ద్రోణంరాజు నాగేంద్ర వీర వెంకట సత్య సూర్య పరంధామ సుబ్బరాయ చైతన్య కమల్” అని. కానీ వాడి అసలు పేరు గుర్తుంచుకున్నవారే లేకపోయారు పాపం. చిన్నప్పుడు “చిన్నబ్బాయ్”, పెద్దయ్యాక “కరణం గారు” అనే వ్యవహరించబడ్డాట్ట.