వ్యాపార చిత్రాల వెల్లువలో కొట్టుకుపోయే తెలుగు సినీ పరిశ్రమలో విప్లవ నటుడు, ఎర్ర సినిమాల దర్శక నిర్మాత, ‘రెడ్ స్టార్’ గా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న ఆర్. నారాయణమూర్తిది ఓ విభిన్న పంధా. 1970 – 80 లలో ఎర్ర మల్లెలు, విప్లవ శంఖం, ఎర్ర మట్టి వంటి చిత్రాల ద్వారా ఈ తరహా చిత్రాలకు నాంది పలికిన మాదాల రంగారావు బాణీని అంది పుచ్చుకుని 1990 దశకం నుండి నేటి వరకూ విజయాపజాయాలకు అతీతంగా విప్లవ చిత్రాలనే నమ్ముకుని చిత్రసీమలో మనుగడ సాగిస్తున్న నటుడీయన. 1995 – 98 మధ్య కాలంలో ఎర్ర చిత్రాల ప్రాభవం ఎలా ఉండేదంటే, వ్యాపారాత్మక చిత్రాలతో లబ్ద ప్రతిష్టులైన అగ్ర నటీనటులు, దర్శకులు కూడా ఇటువంటి చిత్రాలవైపు మొగ్గు చూపేంత. ఎన్ కౌంటర్, ఒసేయ్ రాములమ్మా, స్వర్ణక్క, సమ్మక్క-సారక్క, అడవి చుక్క వంటి చిత్రాలు దీనికి ఉదాహరణ. ఎర్ర సినిమాలకు ఆ తరహా క్రేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా నారాయణమూర్తిదే.
నారాయణమూర్తి విజయాల్లో సగ భాగం సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాసరావుకి చెందుతుంది. ప్రజా బాణీలను జనరంజకంగా మలిచి భావావేశంతో స్వయంగా ఆలపించటం ద్వారా నారాయణమూర్తి చిత్రాల్లోని ఆవేశపూరిత సందేశాన్ని ఆయన చిత్రాలు చూసేవారికే కాక ఆ పాటలు విన్నవారికీ చేరగలిగేలా చేసిన ప్రతిభావంతుడు వందేమాతరం శ్రీనివాస్. ఈతని ఎర్ర పాటలు లేకుండా నారాయణమూర్తి చిత్రాలు అంతటి విజయాలు సాధించగలిగేవంటే అనుమానమే.
వ్యాసానికి ‘హాస్యం’ టాగ్ పెట్టి ఈ సీరియస్ సోదేంటని మీ అనుమానమా? అక్కడికే వస్తున్నాం.
ఆర్. నారాయణమూర్తి సినిమాల విజయాపజయాల గురించి, అవి సాధించిన రికార్డుల గురించి మనందరికీ తెలిసు. అయితే ఆ విజయగాధల వెనుక చాలామందికి తెలియని వింత విషయమొకటి దాగుంది. అదేమిటంటే: ఆర్. నారాయణమూర్తికి చిత్ర పరిశ్రమలో ఆరు నారాయణమూర్తిగా మారు పేరుంది. దానిక్కారణం, ఆయన ప్రతి చిత్రానికీ ఆరుగురు ఛాయాగ్రాహకులు పనిచేయటమే! ఎందుకో తెలుసా?
నారాయణమూర్తి చిత్రాల్లోని ఆవేశపూరితమైన పాటలను చూసిన వారికి ఆ రహస్యం సులువుగానే తెలిసిపోతుంది. ఆ పాటల్లో ఓ చేత తుపాకీ, మరో చేత ఎర్ర జెండా పట్టి భీకరమైన హావభావాలు ప్రదర్శిస్తూ నారాయణమూర్తి వేసే వీరంగం ప్రేక్షకులకెరుకే. ఒక్కో పాటలో కనీసం రెండు మూడు సార్లు వందేమాతరం శ్రీనివాస్ ఉన్నట్లుండి ‘భల్’ అనో ‘ఛల్’ అనో గొంతు చించుకుని అరవటం, దానికనుగుణంగా నారాయణమూర్తి రొమ్ము విరుచుకుని, ప్రపంచంలోని రౌద్రాన్నంతా రంగరించి తన ముఖంలో ఒలికిస్తూ కెమెరా ముందుకి లంఘించి క్లోజప్పులో ఉరిమురిమి చూడటం అతి సాధారణమైన సన్నివేశం. ఆ దెబ్బకి కెమెరా వెనకున్న అభాగ్య సినిమాటోగ్రాఫరుడు గుండెపోటుతో నేలకొరగటమూ అంతే సాధారణం.
షాట్ కట్ చేస్తే, తరువాతి సన్నివేశం నుండీ మరో ఛాయాగ్రాహకుడు రంగంలోకొస్తాడు. నారాయణమూర్తి ప్రతి సినిమాలోనూ దాదాపు ఆరు పాటలుంటాయి. లెక్క ప్రకారం పాటకొకరు చొప్పున ఆరుగురు ఛాయాగ్రాహకులు, ఆ తర్వాత మరొకడు – మొత్తం ఏడుమంది ఉండాలి. అయితే, ఈ ఆరిట్లో ఒక సెంటిమెంటు దట్టించిన పాట (అంటే, అవ్వ నీకు దండమే లేదా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా టైపులో) ఉంటుంది కనుకా, అందులో నారాయణమూర్తి విశ్వరూపం ప్రదర్శించే అవకాశం ఉండదు కనుకా, ఒక ఛాయాగ్రాహకుడికి మాత్రం రెండు పాటలకు పనిచేసే అదృష్టం ఉంటుంది. అలా మొత్తం ఆరుగురితో సినిమా పూర్తవుతుంది. అదండీ, ఆరు నారాయణమూర్తి మారుపేరు వెనక రహస్యం.
(కృతజ్ఞతలు: ఈ జోకు సృష్టికర్త, మితృడు ‘తమ్ముడు’ సత్యంకి)
ఇది హాస్యానికే అయితే ok. మరీ గుండేపోటుతో చచ్చేలా రంకెలు నిజంగా వెయ్యడులెండి!
కొత్త నటులను నిజంగా ప్రోత్సహించేవాళ్ళలో ఇతనొకరు.అతని సినిమాలు కోట్లు సంపాదించినా, ఇప్పటికీ హవాయి చెప్పులూ, సైకిలే తప్ప ఇంకేమీవాడని ఆదర్శవాది. తన సినిమాలో నటించిన నటులందరికీ సక్రమంగా డబ్బులు ఇచ్చే చాలా కొద్ది నిర్మాత-దర్శకుల్లో ఈయన ఒకరు. ఇప్పటికీ తను నమ్మిన విషయాలనే తప్ప త్వరగా డబ్బులు చేసుకుందామని ట్రెండు ఫాలో అయ్యేరకం కూడా కాదు. అతని ట్రెండుని ప్రముఖదర్శకులు ఫాలో అయ్యారు తప్ప తనుకాదు.
అతని నటనపై నాకు కొన్ని రిజర్వేషన్లుఉన్నా; కొంత నిబద్ధత, కొంత క్రమశిక్షణ, కొంత వినయం,కొంత భోళాతనం ఉన్న మనిషి, గౌరవించదగ్గ దర్శక- నిర్మాత ఆర్.నారాయణమూర్తి.
mahesh garu cheppindi nijamandi.Hasyam kosamina kaani enduko koncham baledanipisthundi.Emi anukokandi athani siddanthalaki athanu kattubadi unnadante inni samvatsaralanundi he is great ani naa feeling.
మహేష్ & క్రాంతి,
నా వ్యాసంలో మొదటి రెండు పేరాలూ మరోసారి చదవండి. నారాయణమూర్తిపై ప్రశంసలే అవన్నీ. నా జోకంతా ఆయన ఓవర్ యాక్టింగ్ గురించే. ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి వాళ్లకే తప్పలేదీ అపహాస్యాలు.
నారాయణమూర్తి సైద్ధాంతిక నిబద్ధత గురించి నేనూ వినున్నాను. అయితే, ఆయన సినిమాల నిర్మాణానికి ‘అన్నలు’ సహాయం చేస్తుంటారని కూడా గుసగుసలున్నాయి. ఇందులో నిజమెంతో తెలీదు మరి. వ్యక్తిగా నారాయణమూర్తిపై గౌరవమున్నా, ఆయన సినిమాలు తీసే పద్ధతిపై నాకు అభ్యంతరాలున్నాయి. ఈయన సినిమాల్లో జనాలని ఆలోచింపచేసేకన్నా రెచ్చగొట్టే గుణం ఎక్కువగా కనిపిస్తుంది. తుపాకి గొట్టం ద్వారా సమ సమాజమొస్తుందనే బూజు పట్టిన భావాలని పట్టుకుని వేలాడటం ఏ రకం సైద్ధంతిక నిబద్ధత? ఇది కమ్యూనిజం కాదు – అనార్కిజం.
🙂 Good one!
R.Narayana Murthy – నాకు అతని నటన రొటీన్ అయిపోయిందనిపిస్తుంది. his expressions are highly predictable these days. కానీ, అతను లాభ నష్టాలతో సంబంధం లేకుండా తన బాటలోనే నడవడం మెచ్చుకోదగ్గ విషయమే అనిపిస్తుంది నాకు. మీరు పాటలకి లిరిక్స్ రాసేవారిని మర్చిపోయారు! వాళ్ళ క్రెడిట్ వారికి కూడ ఇద్దురూ! వందేమాతరం శ్రీనివాస్ కి మాత్రం క్రెడిట్ ఇచ్చి వదిలేస్తే ఎలా?