రాష్ట్రంలో బాడుగ నేతలు సృష్టించిన కలకలం ఇప్పుడే సద్దుమణిగేలా లేదు. ఆంధ్రజ్యోతి ఎవరినుద్దేశించి ఆ కధనం రాసిందో అర్ధం కాని వాళ్లు ఎవరన్నా ఉంటే మంద కృష్ణ వీరంగంతో వారికీ గుమ్మడికాయల దొంగలెవరో తెలిసిపోయింది. ఆ కధనానికి నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామ్యయుత మార్గాలెన్నో ఉండగా ఆ పనికి దౌర్జన్యాన్నెంచుకుని మంద కృష్ణ పెద్ద తప్పు చేశాడు. ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి తర్వాతనైనా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకోవాల్సింది పోయి ‘మాజోలికొస్తే అంతు చూస్తాం’ అని రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ద్వారా మరిన్ని తప్పులు చేశాడు. తను తప్పు చేయనప్పుడు దానికి రుజువులు చూపిస్తే సరిపోయేదానికి, విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చూస్తుంటే ఆయనపై ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తుంది. ‘కులాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారు’ అనేది బడుగు నేతలపై ఆంధ్రజ్యోతి ఆరోపణ. మంద కృష్ణ ప్రవర్తన దాన్ని నిరూపించేదిగానే ఉంది. తనపై వచ్చిన ఆరోపణలకు సూటిగా సమాధానమివ్వకుండా ఇది దళిత జాతి మొత్తాన్నీ అవమానించటం అన్న ఆక్రోశం చర్చని దారిమళ్లించే ఎత్తుగడే. నాయకుడనేవాడు ప్రపంచం బాధని తనదిగా భావించాలేగానీ తన బాధని ప్రపంచానిదిగా ప్రచారం చెయ్యకూడదు.
ఈ మొత్తం వ్యవహారంలో మంద కృష్ణ వెనుక ఎవరున్నారనేది సుస్పష్టం. ‘దళిత ఉద్యమాలని స్వలాభానికి తాకట్టు పెడతాడు’ అనే ఆరోపణకి ఇది తాజా దృష్టాంతం. ఇప్పుడు దళితుల ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. ఇరవయ్యేళ్ల పైచిలుకు మంద కృష్ణ నాయకత్వంలో దళితులకి నిజంగా జరిగిన మేలేమిటి? వర్గీకరణ పేరుతో మాలలు, మాదిగల మధ్య చిచ్చు పెట్టటం తప్ప ఈయన చేసిందేమన్నా ఉందా? చూడబోతే దళితుల వెతలకు వారి నాయకులే ఎక్కువ కారణంలాగుంది.
నాయకుడనేవాడికి ఆవేశం అన్నిరకాలా అనర్ధం. అది వ్యక్తిగా అతనొక్కడికే పరిమితమయితే సరే. కానీ ఇక్కడ మంద కృష్ణ ఆవేశానికి అతని సామాజికోద్యమ భవిష్యత్తే పణం. ఈ సంఘటనతో దళిత నాయకుల మధ్యనున్న పొరపొచ్చాలు బయట పడ్డాయి. విశేషమేమిటంటే, ఆంధ్రజ్యోతిపై దాడి విషయంలో మంద కృష్ణని ఖండించిన దళిత నాయకులే ఎక్కువ. వారిపై ‘అగ్ర వర్ణాల తొత్తులు’ లాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా తన కొద్ది బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. ‘నన్ను వెనకేసుకొచ్చినవారు మాత్రమే దళిత బాంధవులు, మిగిలిన వారు దళిత శత్రువులు’ అనే ధోరణి అతని అహంకారాన్ని సూచిస్తుంది.
‘ఆంధ్రజ్యోతి సంపాదకుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద అరెస్టు చేయటం ఎలా కుదురుతుంది’ అని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ పై ‘ఆయన ఐఏఎస్ ఎలా పాసయ్యాడు? తప్పకుండా ఎవడో కమ్మోడు ఆయన పేపరు దిద్ది ఉంటాడు’ అని హద్దులు మీరి వ్యాఖ్యానించటం ద్వారా తన తెలివితక్కువ తనాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానంపై అతని అవగాహనా రాహిత్యానికిదో ఉదాహరణ. పైగా, ‘మేము మాత్రం కులాల ప్రస్తావన తేవచ్చు. ఇతరులు తేకూడదు’ అని నిర్లజ్జగా వ్యాఖ్యానించటం అతని విచక్షణా లేమికో మచ్చుతునక.
తన కోపాన్ని అగ్రవర్ణాలమీద చూపించినా ఏదోవిధంగా అర్ధం చేసుకోవచ్చు. కానీ తోటి దళిత సామాజిక ఉద్యమకారుడు చక్రపాణిని ‘నీవు దళితుడవా? అయితే నీదే ఉప కులం’ లాంటి ప్రశ్నలు వేయటం ద్వారా తనో కరడుగట్టిని కులవాది మాత్రమే కానీ తనలో నాయకత్వ లక్షణాలేమీ లేవని రుజువు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ‘నేను గాంధీ అంతటి వాడిని. గాంధీని ఎవరన్నా చెప్పులతో కొడతారా’ అని వింత లాజిక్కులు గుప్పించి అతి తెలివి ప్రశ్నలు వేస్తూ తన తెలివితక్కువతనాన్నే బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. కొందరు వ్యక్తులు పుట్టుకతో గొప్పవారు, కొందరు కష్టపడి గొప్పవారుగా గుర్తింపు తెచ్చుకుంటారు, మరి కొందరికి మాత్రం గొప్పదనం ఆపాదించబడుతుంది. మంద కృష్ణ నిస్సందేహంగా మూడో రకం. ఆ గొప్పతనమూ తనకు తాను ఆపాదించుకున్నదే.
చక్కగా చెప్పారు. అయితే ఆయన్ని మందమతి అన్నందుకు మీమీద కూడా చట్టప్రకారం చర్య తీసుకోవచ్చు జాగ్రత్త!:-)
తెలుగోడు గారూ మీరు రాష్ట్రంలో జరుగుతున్నంతా చూస్తూ కూడా ఇంత ధైర్యంగా ఈ వ్యాసాన్ని వ్రాసారంటే మామూళోళ్ళు కాదు. ఇది కూడా అట్రాసిటీ కిందకే వస్తుందేమో చూసుకోండి :). ‘నన్ను వెనకేసుకొచ్చినవారు మాత్రమే దళిత బాంధవులు, మిగిలిన వారు దళిత శత్రువులు’ . నిన్న రాత్రి T.V.9 చర్చ చూసినోళ్ళంతా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం విషయ స్పష్టత అన్న విషయం అసలు వీళ్ళకి తెలుసో లేదో ??
JP గురించే కాదు తెలిసీ తెలియని అజ్ఞానంతో ఇలా ఎవరి గురించి బడితే వాళ్ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం కృష్ణ మాదిగ (ఆయన కులం పేరు పెట్టకుండా పిలిస్తే ఏమొచ్చి పడుతుందో ఏమో) కి అలవాటే! అది కొద్ది బుద్ధి కాదు! అవధులు లేని అజ్ఞానం!TV9 లో చూసాను. చర్చ కంటెంట్ సంగతి అలా ఉంచి ఇంకోళ్ళకి (కనీసం చానెల్ వాళ్ళకి కూడా) మాట్లాడే అవకాశం ఇవ్వడే! గొంతు చించుకుని మిరపకాయలు తిన్న కాకి అంటారే ఆ లెవెల్లో..! చక్ర పాణీ ని కూడా..’నీదే ఉప కులం ‘ అని అడుగుతున్నాడు. అడిగే ప్రశ్నని skip చేసి ‘నాకు ఎక్కడా అస్తులు లేవు, లెక్కలు చూసుకోండి..’ అని ఏదేదో..ఎందుకు లెండి, ఏం మాట్లాడాలో కూడా తెలీయట్లేదు.
మొత్తానికి మందకృష్ణ కొరివితో తల గోక్కుంటున్నాడన్నది స్పష్టం! అవసరం తీరగానే శివదేవుడు ఆయన్ని ‘ఏమి ‘ చేయడానికైనా వెనుతీయడని మందమతి గ్రహిస్తే మంచిది.
ఈ మొత్తం ప్రహసనంలో లాభపడింది రాజశేఖర్ రెడ్డైతే, నష్టపోయింది భావప్రకటనా స్వేచ్చ, మందమతి కృష్ణ లాంటి మందభాగ్యుడి నాయకత్వం తప్ప మరో గతిలేని మాదిగ ప్రజలు. ఈ కుల నాయకుల వల్ల సామాజిక న్యాయం సంగతి దేవుడెరుగు, కాస్తోకూస్తో ఇప్పటివరకూ ఉన్న గౌరవం, స్వాభిమానం పోతున్నాయ్ అనిపిస్తోంది.
కాస్తన్నా సైంద్ధాంతిక జ్ఞానం, నిజాల అవగాహనా లేని నాయకులవల్ల ఇరిగేదేమీ లేదని ఈ నాయకుడు నిరూపించాడు. “పోరాటం అగ్రకుల ఆధిపత్యంపైనేగానీ, అగ్రకులాల మనుషులతో కాదు !” అన్న కనీస ఇంగిత జ్ఞానం నశించిన ఈ మనిషి ఉద్యమాన్ని పెంచి పెద్దచెయ్యడం మాని, పెంట చేస్తున్నాడు.నోరు విప్పేముందు కాస్త తన ఆలోచనల్ని via మెదడు తీసుకెల్తేనే ఇతనికి భవిష్యత్తులో మనుగడ.