‘అర్ధరాత్రి స్వతంత్రమొచ్చింది, ఇంకా తెల్లవారలేదు’ – మేడిపండులాంటి మన స్వతంత్రం గురించి ఏనాడో శ్రీశ్రీ వెలిబుచ్చిన ఆవేదనిది. ఆంధ్ర దేశంలో దేవుడి పాలనలో పత్రికల నోరునొక్కే ప్రయత్నాలు చూస్తుంటే అసలు మనకి స్వతంత్రమే రాలేదా అనిపిస్తుంది. స్వేచ్చలన్నింటిలోకీ తలమానికమైనది పత్రికా స్వేచ్చ. అది లేనిదే ఏ సమాజమూ ముందడుగేయదు. దుర్వినియోగమైనా సరే ఆ స్వేచ్చ ఉండటమే సమాజానికి మంచిది. పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో నిత్య అసమ్మతివాది స్థాయి నుండి పత్రికల ఊతంతో పైపైకెదిగిన ముఖ్యమంత్రికి ఆ సంగతి తెలియదనుకోవాలా?
వైఎస్సార్ కి ఆ రెండు పత్రికలపై ఉన్న కోపం బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రయ్యాక మొదటేడాదిని మినహాయిస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విరుచుకుపడటానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ ఆయన వదులుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన పాదయాత్రని మొదటి పేజీ వార్తలుగా ప్రచురించినప్పుడు మాత్రం ఆ రెండూ ప్రత్యర్ధి వర్గం కొమ్ముకాసే పత్రికలని ఆయనకి అవసరార్ధం గుర్తుకురాలేదు! పత్రికల దృష్టి ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులపైనే ఉంటుందని, ప్రతిపక్షాల పైన కాదనీ ఆయనెరగడా? పత్రికలపై వైఎస్ అక్కసు ముందుగా ఆయన మంత్రివర్గ సహచరులకు, తర్వాత మిగతా కాంగీయులకూ పాకి ఇప్పుడు ఇతరులకూ అంటుకుంది. దానికి దృష్టాంతమే మంద కృష్ణ మాదిగ తాజా ఎపిసోడ్. నెల రోజుల కిందటి ఆంధ్రజ్యోతి బాడుగ నేతల వివాదం సమసిపోయిందనుకుంటున్న దశలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఆ పత్రిక సంపాదకుని అరెస్టు వివాదాన్ని తిరగదోడేదే.
వారం పది రోజులుగా ఆంధ్రజ్యోతిని ఇబ్బందిపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పావులు కదుపుతున్న నేపధ్యంలో – దొంగలు పడ్డాక ఆర్నెల్లకైనా మొరగని మన పోలీసులు రాత్రి పూట ఆఘమేఘాలమీద వెళ్లి ఆంధ్రజ్యోతి సంపాదకుడిని, ఇతర ఉద్యోగులను అరెస్టు చేయటం దేనికి సూచిక? ‘ఆంధ్రజ్యోతి పై దాడి చేయించింది నేనే, మాకు వ్యతిరేకంగా రాస్తే ఇంకా ఏమైనా చేస్తాం’ అని బహిరంగంగా రొమ్ములు చరుచుకున్న మంద కృష్ణని వదిలేసి ఆంధ్రజ్యోతి ఉద్యోగులని అరెస్టు చేయటంలో మతలబేంటి? పెట్రోలు పోసి మహిళని తగలబెట్టబోవటం, ఆస్థులు ధ్వంసం చేయటం, అంతు చూస్తామని బహిరంగంగా బెదిరించటం కన్నా దిష్టి బొమ్మని చెప్పులతో కొట్టటం పెద్ద నేరమా! మరి వివిధ సందర్భాల్లో మంద కృష్ణ తగులబెట్టిన దిష్టిబొమ్మల సంగతేమిటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అరిగిపోయిన వాక్యం ఎన్నిసార్లు వల్లె వేసినా ఈ అరెస్టుల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం లేదంటే నమ్మటం కష్టం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామని గొప్పలు పోతున్న వైఎస్ ఎమర్జెన్సీ చీకటి రోజుల ముప్పై మూడో వార్షికోత్సవం గుర్తుగా ప్రజలకిస్తున్న బహుమతా ఇది?
అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లిపోతుందన్న భ్రమలో ఉన్న వైఎస్ రాష్ట్రంలో నడిపిస్తున్నది అక్షరాలా ఆటవిక రాజ్యం. అక్షరం మీద దాడులు ఆయన అసహనానికి నిలువెత్తు సాక్షాలు. బండ్లు ఓడలవుతాయనే సామెత ముఖ్యమంత్రి గుర్తుకు తెచ్చుకోవటం మంచిది. ఎల్లకాలమూ తనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భ్రాంతిలో ఆయనున్నా, అది జరిగే పని కాదు. ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై జరుగుతున్న దాడులు రేపు సాక్షిపై జరగవనే నమ్మకమేమీ లేదు. ఏలయన, అది నీవు నేర్పిన విద్యయే రాజశేఖర!
Yes. I agree with you. Its big shame on YSR and congress.
Only god can save AP. Dear AP people please DO NOT VOTE FOR congress.
‘ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై జరుగుతున్న దాడులు రేపు సాక్షిపై జరగవనే నమ్మకమేమీ లేదు. ‘ అప్పటి వరకూ సాక్షి ఉంటుందంటారా ?? :).. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాల్లే దాని మనుగడ అని నా అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో పాంప్లెట్గా పంచిపెట్టుకోవడానికి మాత్రం ఖచ్చితంగా పనికొస్తుంది. నేనేదో కాంగ్రెస్ వ్యతిరేకిననుకొనేరు.. ఈ అబిప్రాయం కేవలం సాక్షి పత్రిక మీద మాత్రమే. నాకింతకూ అర్ధం కాని విషయం ఏంటంటే ఏ కారణంచేత మంద కృష్ణ గారు ఇంకా బయటే తిరుగుతున్నారు. మన జానారెడ్డిగారేమో ఆయన్ని చాలాసార్లు అరెస్ట్ చేసామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీడియా సరిగ్గా కవర్ చెయ్యలేదా లేక నేనే పర్ధ్యానంలో గమనించలేదా?