నెల రోజుల క్రితమనుకుంటా, ఏదో షాపింగ్ మాల్ లో నా స్నేహితుడొకడు ఎదురై నవ్వుతూ ‘మొన్నెప్పుడో ఫోన్ చేస్తే ఊర్లో లేవని మెసేజొచ్చింది. ఎప్పుడొస్తున్నావు?’ అని అడిగితే వింతగా చూస్తూ ‘అదేం ప్రశ్న? ఎదురుగానే ఉంటే ఎప్పుడొస్తున్నావంటావేంటి’ అన్నా నేనూ పళ్లు బయటపెట్టి, చెయ్యి ముందుకు చాస్తూ.
వాడు ‘ఓహ్. ఇంకా వారమా? పెద్ద ట్రిప్పే వేసినట్లున్నావే’ అని పెద్దగా నవ్వుతూ నన్ను దాటి వెళ్లిపోయాడు. ముందు నాకు తల తిరిగింది – వాడి ఎదురు ప్రశ్నకి. ఆ తర్వాత తలకొట్టేసినట్లనిపించింది. నేను గాలితో కరచాలనం చెయ్యటం ఎవరన్నా గమనించారా అని తల తిప్పకుండా కళ్లతో స్కాన్ చేస్తే ఫలితం పరువు నిలిపేదిగానే వచ్చింది. ‘బతికిపోయా. ఎవరూ చూడలేదు’ అనుకుంటుండగానే మరో ఆలోచనొచ్చి గుండె ఝల్లుమంది. ‘కొంపదీసి నేను వాడికి కనపడలేదా? Am I invisible? అదెలా సాధ్యం?’ అనుకున్నాను. అంతలో ఎవరో షాపరుడు ‘కాస్త పక్కకు జరుగుతారా, ప్లీజ్’ అనుకుంటూ దాదాపు నన్ను తోసేసి వెళ్లిపోయాడు.
‘హమ్మయ్య. మనం బాగానే ఉన్నాం. మరి వాడికేమయింది, అలా పిచ్చివాడిలా తనలో తనే మాట్లాడుకుంటూ వెళ్లాడు?’ అనుకుని హాశ్చర్యపోయాను.
ఈ మధ్య వీధుల్లో, షాపుల్లో, సినిమా హాళ్లలో – అందుగలరిందులేరని సందేహంబు లేకుండా – ఎక్కడబడితే అక్కడ ఈ బాపతు వాళ్లు విరివిగా కనిపిస్తున్నారు. కొంతమంది రేగు చెట్టు కింద గుడ్డివాడిలా నవ్వుతుంటారు, కొందరు పూనకమొచ్చినట్లు కోపంగా అరుస్తుంటారు, ఇంకొందరు ఊరికే ‘ఊఁ’ కొడుతుంటారు, మరికొందరు వినపడీపడకుండా గొణుక్కుంటుంటారు. పైలాంటి సంఘటనలు మరి రెండు మూడు జరిగాక వీధుల్లో ఎదురైన పరిచయస్తులు నన్ను పలకరిస్తున్నారో, లేక వాళ్ల వెర్రి లోకాల్లో విహరిస్తున్నారో అర్ధం కాకుండా పోయింది నాకు. వాళ్లతో మాట్లాడబోయి నేను వెధవనవ్వటం దేనికని ఒకరిద్దరిని పట్టించుకోకుండా వెళ్లిపోతే, మరుసటి రోజు ఫోన్ చేసి మరీ తిట్టారు – ‘ఏరా, నిన్న రోడ్డు మీదెదురై నన్ను చూసీ గుర్తు పట్టనట్లు వెళ్లిపోతావా?’ అంటూ. దాంతో నాకెటూ పాలుపోని పరిస్థితి. ఎవరు నాతో మాట్లాడుతున్నారో, ఎవరు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటున్నారో కనిపెట్టటం ఎలా?
ఆ ఆలోచనొచ్చాక రెండ్రోజులపాటు కాస్త పరిశీలనగా చూస్తే నాకర్ధమైన విషయం, వీళ్లంతా బ్లూ టూత్ డివైసెస్ అనబడే కర్ణ పిశాచులని చెవికి తగిలించుకుని సెల్ ఫోన్ లలో సంభాషిస్తున్న హైటెక్కు జీవులని. అసలు సంగతి తెలిశాక నేనో నిర్ణయం తీసుకున్నాను – ఇకనుండీ రోడ్లమీద తెలిసిన వాళ్లెదురై పలకరించినప్పుడు ముందు వాళ్ల రెండు చెవులనీ పరీక్షగా చూసిగానీ బదులీయగూడదని!
కొస మెరుపు: ఇంకో వారం రోజుల్లో (జులై 1 నుండీ) క్యాలిఫోర్నియాలో వాహన చోదకులందరూ బండ్లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హ్యాండ్స్ ఫ్రీ సెట్లు వాడాలనే శాసనం అమల్లోకి రాబోతుంది. అప్పటినుండీ మా ఏరియాలో ఈ నీలిదంతాల పిచ్చోళ్లు ఎక్కువైపోతారన్న మాట. మన్లో మాట, నేనూ వాళ్లలో ఒకడిని కాబోతున్నాను.
‘నీలిదంతం’ అని శీర్షిక చదవగానే ’బ్లూటూత్’ గుర్తుకురాలేదు. ఇదేంటబ్బా అని చదవగానే…హాస్యం చన్నీటి తుంపలాగా తగిలింది. అప్పుడప్పుడూ వీళ్ళు కేవలం నవ్వుతారండోయ్! అదీ సరిగ్గా మిమ్మల్నిచూసి నవ్వినట్టే ఉంటుంది. కాస్త జాగ్రత్త.
మీరింకా నయంకదండీ..
ఈ సెల్‌ఫోన్లొచ్చిన కొత్తలో.. “మాది బుల్లి ఫోనం”టూ ఒక ప్రకటన వచ్చేది – హోటల్లో ఒకమ్మాయి ఓ చెంపకు చెయ్యానించుకుని నవ్వుతూంటుంది. ఎదురు టేబులు దగ్గరున్నవాడిని ఈ నవ్వులు మరులు గొలిపి, మతులు పోగొడతాయి. చూసి చూసీ, ఇహ తట్టుకోలేక ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి మాట్లాడబోతాడు. సరిగ్గా అప్పుడే ఆవిడ సెల్‌ఫోనులో నవ్వడం ఆపి, పక్కన నుంచున్న వీణ్ణి సర్వరనుకుని, ‘ఓ కాఫీ పట్రావోయ్’ అంటుంది. 🙂
నీలి దంతమా… హహ.
మీరూ పడ్డారా వీళ్ల బారిన!