నన్ను దోచుకోని తాజ్ మహల్ – 3/3

అంతమందిలో నేనొక్కడినే దొరికినట్లు, వద్దన్నా వినకుండా ఫొటో ఖీచుతానంటూ వెంటపడటం మొదలెట్టాడు. జంటలుగా వచ్చిన వాళ్లనో, ఫ్యామిలీలనో చూసుకోవయ్యా బాబూ, నన్నొదిలెయ్యి అంటే వినడు. ఈ గొడవలో అనుకోకుండా తాజ్ మహల్ వైపు తలతిప్పి చూసేశాను. మొదటి సారిగా తాజ్ ని చూసినప్పుడు కలిగే అద్భుతమైన అనుభూతి గురించి చాలామంది వర్ణనలు చదివి నేనూ అటువంటి అనుభూతిని పొందాలని కష్టపడి అక్కడికొస్తే, ఈ ఫొటోగ్రాఫరుడి పుణ్యాన ఆ క్షణాన నాకే భావమూ కలగలేదు. మబ్బుల కింద, పొగమంచు తెరల వెనక తాజ్ నాలాగే దిగాలుగా కనిపించింది!

ఎంత చెప్పినా వినేలా లేడు, పట్టించుకోకుండా నాదారిన నేనెళితే వదిలేస్తాడేమో అనుకుని తాజ్ కేసి నడవటం మొదలెట్టాను. అయినా వదలకుండా నేనెటు వెళితే అటు వెంటపడి రాసాగాడు. చాలా ఛండాలంగా అనిపించింది నాకు. రోడ్డుమీద నడిచెళుతున్నప్పుడు ఊర కుక్క తోకాడిస్తూ మన వెంటబడి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. చివరికి, ఓ ఫొటో తీయించుకుంటే నన్నొదిలేస్తాడేమో అనుకుని ‘సరే కానీ’ అంటూ ఓ పోజిచ్చాను. అనటమే ఆలస్యం, నేను వారించేలోగా టక టకా డజను ఫొటోలదాకా క్లిక్కుమనిపించాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘ఒకటో రెండో తీస్తావనుకుంటే అడగా పెట్టాకుండా ఇన్ని తీయటమేమిటి’ అని నాదైన హిందీలో కోప్పడ్డా.

‘ఫొటో యాభై రూపాయలే సాబ్. మీకదో మొత్తమా?’ అన్నాడతను నన్నో పీనాసివాడిలా చూస్తూ.

‘ఎంతనేది నాకనవసరం. అసలు నాకు వద్దన్నా కదా. ఇంత లావు కెమెరా ఉంది నాదగ్గర. నీ ఫోటోలెందుకు’ అన్నా మరింత కోపంగా.

‘కెమెరా ఉన్న ప్రతివాడూ ఫొటోగ్రాఫరేనా సాబ్’ అన్నాడతను. పుండుమీద కారం అద్దినట్లనిపించింది. హిందీ అర్ధం కాకపోయినా బాగుండేది – ఆ వెటకారం తెలిసేది కాదు. గట్టిగా జవాబు చెప్పేంత హిందీ పాండిత్యం నాకు లేదు. కోపంతో మాటలు రాని పరిస్థితి.

అటుగా వెళుతున్న ఉత్తరాది జంటొకటి మా గొడవ చూసి ఆగింది. జంటలో ఉన్నతను సంగతి అర్ధం చేసుకుని ఫొటోగ్రాఫర్ మీద ఇంతెత్తున లేచాడు, ‘సౌత్ వాడని మోసం చెయ్యాలని చూస్తున్నావా? నీ లైసెన్స్ రద్దు చేయిస్తా, సాలే’ అంటూ. ఆ దెబ్బకి ఫొటోగ్రాఫర్ తోకముడిచి పారిపోయాడు.

ఎట్టకేలకి స్వతంత్రం! ఆ అపరిచితుడికి ధన్యవాదాలర్పించి తాజ్ దిశగా నడవటం మొదలెట్టాను, మూటలో నుండి కెమెరా తీసి ఫొటోలు తీస్తూ. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఫొటోలు బాగా వస్తాయన్న ఆశ లేదు. అలాంటి ల్యాండ్ స్కేప్ కి ఫ్లాష్ వాడినా ఉపయోగం లేదు – మరింత పాడవటం తప్ప.

అంతలో – నా సరంజామా చూసి నన్నో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అనుకున్నారేమో – ఓ చైనా కుటుంబం నా ముందు నిలబడి పోజులివ్వటం మొదలెట్టింది. ఫొటోలు తీస్తానంటూ వెంటబడ్డవాడిని వదిలించుకునేసరికి ఫొటోలు తియ్యమంటూ వెంటబడేవాళ్లు తయ్యార్! నేనూ మీలాంటి టూరిస్టునే, ఫొటో స్టూడియోవాడిని కాదని ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్లగోల వాళ్లదే. పైగా ‘యూ తేక్ ఫోతొ, ఐ గివ్ యు ఫిఫ్తీ రూపి’ అంటూ ఆఫరొకటి! డిస్నీల్యాండ్ లాంటి చోట్లా ఇలాంటి అనుభవాలెదురయ్యాయి కానీ అప్పుడవి వినోదాన్ని పంచాయి. ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను విసిగించిన వాళ్లందరినీ కరిచేసేటట్లున్నాను. దాంతో, వాళ్లని కసురుకుని విసురుగా ముందుకెళ్లిపోయాను.

తాజ్ ప్రధాన కట్టడం లోకి పాదరక్షలతో వెళ్లనీయరు. వాటిని ఉంచటానికి ఒక పక్కగా స్టాల్ లాంటిది ఉంది. అక్కడో టూరిజం శాఖ ఉద్యోగి కాపలాగా ఉంటాడు. ఇది పూర్తిగా ఉచిత సర్వీసు. అక్కడా ఒక లైన్ ఉంది. లైన్లో నిలబడి ఉండగా ఓ విషయం గమనించాను – కాపలాదారు విదేశీ సందర్శకులను మాత్రమే డబ్బులు అడగటం!

నా వంతు వచ్చింది. కాపలా అతను నన్నేమీ అడగలేదు కానీ, నా వెనుకనున్న తెల్లతన్ని డబ్బుల కోసం సైగ చేశాడు. తెల్లతను విసుగ్గా చూస్తూ Why aren’t you asking them? అన్నాడు, పక్కనున్న భారతీయుల్ని చూపిస్తూ. నాకు తలకొట్టేసినట్లనిపించింది. He thinks you’re rich అన్నా నేను నవ్వుతూ (ఏడవలేక). I’m rich because I’m white? అన్నాడతను మరింత విసుగ్గా. పాపమతనికి నాకన్నా ఘోరమైన అనుభవాలెదురయినట్లున్నాయి.

మొత్తానికి తాజ్ లోపలికెళ్లాను. వెలుతురు పూర్తిగా పోవటంతో ఫొటోలు తీసీ ఉపయోగం లేదని ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పాను. అంత చిరాకులోనూ తాజ్ అందం నన్ను ముగ్ధుడిని చేసింది. అయితే, ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో’ బదులు ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ గుర్తొచ్చింది అక్కడున్నంతసేపూ. నా మూడ్ మహిమ!

బయటికొచ్చేసరికి బాగా చీకటిపడిపోయింది. కారు దగ్గరికి నడక మొదలు పెట్టబోయాను. అంతలో మళ్లీ ఊడిపడ్డాడు ఇందాకటి ఫొటోగ్రాఫరు. ఫొటోలకి ప్రింట్లు వేయించి సిద్ధంగా ఉన్నాడు. నాకోసం ఇంతసేపూ కాపేసినట్లున్నాడు. పన్నెండు ఫొటోలనీ కొనమని గొడవ మొదలు. ‘నువ్వు చేసిన వెటకారానికి అసలు నేనేమీ తీసుకోనక్కరలేదు. నాకు నచ్చినవి రెండో మూడో మాత్రమే తీసుకుంటాను’ అన్నా నేను. కాసేపు వాదులాడి చివరికి గొణుక్కుంటూ ఒప్పుకున్నాడు. ఆ గొణుగుడుకి అర్ధం ‘నీలాంటి కస్టమర్లు మరో నలుగురుంటే నా చేతికి చిప్పే’. లాగిపెట్టి కొట్టాలనే కోపాన్నాపుకుని అతనికో రెండొందలిచ్చి నాలుగు ఫొటోలు తీసుకుని అక్కడినుండి బయటపడ్డాను. 

తిరుగు ప్రయాణంలో ఇదంతా రాజుకి చెబితే, ‘పోలీసులకి చెప్పుండాల్సింది సాబ్. టూరిస్టుల్ని విసిగిస్తున్నట్లు కంప్లైంట్ చేస్తే వాళ్లు చాలా సీరియస్ గా తీస్కుంటారు’ అన్నాడతను. ‘నాకేం తెలుసు బాస్. పోలీసులూ అలాగే ఉంటారనుకున్నాను’ అని ఊరుకున్నా. ఆగ్రాలో ఓ మంచి ఎంపోరియం దగ్గరాగి నాలుగయిదు పాలరాతి తాజ్ మహల్ గిఫ్టు సెట్లు కొని హైవే ఎక్కాము. ఢిల్లీ చేరేసరికి రాత్రి మూడయ్యింది.

ఉపసంహారం

ఇది జరిగి ఆరు నెలలయింది. ఆ తరువాతి రోజు అక్షర్ ధాం వెళ్లాను. తిరుగు ప్రయాణానికి ఎక్కువ సమయం లేకపోవటంతో గంటకన్నా ఎక్కువ సేపు ఉండలేకపోయానక్కడ. మళ్లీ ఢిల్లీ వెళితే అక్షర్ ధాం లో ఎక్కువ సమయం గడపాలనుకున్నాను.

తాజ్ కి వెళ్లిన రోజు అంత విసుగెత్తిపోయినా తరువాత అనిపించింది – ఆ రోజంత ఘోరంగా ఉండకపోతే ఇంత వివరంగా గుర్తుండేది కాదేమో అని. నాకెదురయిన అనుభవాల వల్ల అప్పటికప్పుడు తాజ్ నన్ను మురిపించలేకపోయినా ఇప్పుడనిపిస్తుంది, వీలయితే మళ్లీ ఓ సారి వెళ్లి తాజ్ మహల్ చూడాలని. ఇప్పుడయితే దారిలో ఎన్ని వింతలెదురవుతాయో నేనూహించగలను కాబట్టి పోయినసారిలా తాజ్ నన్ను దోచుకోకపోయే ప్రసక్తి లేదు.

ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. తాజ్ – మంచు తెరల వెనక
2. తాజ్ ప్రధాన మందిరం
3. లోటస్ టెంపుల్ – న్యూ ఢిల్లీ
4. అక్షర్ ధాం – న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)
5. అక్షర్ ధాం – న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)

11 స్పందనలు to “నన్ను దోచుకోని తాజ్ మహల్ – 3/3”


 1. 1 మేధ 7:59 సా. వద్ద జూన్ 19, 2008

  హ్హహ్హహ్హ…. యు తేక్ ఫొటో, ఐ గివ్ ఫిఫ్తీ రుపీ!!!!!! ఇది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను…
  మొత్తానికి అలా తాజ్ ప్రహసనం ముగిసిందనమాట….
  అదేంటో, మనకి తెలియని భాషైనా దానిలోని వెటకారాలు, తిట్లు మాత్రం బాగా అర్ధమవుతాయి!…

 2. 2 sujata 9:00 సా. వద్ద జూన్ 19, 2008

  Hi. Chala baga rasaru. I loved Taj Mahal. However, I didnt like the trip I took from Delhi to Agra. However because I went with friends, I nevertheless enjoyed to look at Taj, touch and feel it and sit by its shadow. I went in Summer. So it was horribly hot. Taj is not well preserved. Entering Agra will also be a miserable experience.

  Everyone no doubt, exploit Tourists. The Foreign Tourists will never come back to ‘exotic India’, if they are on their own. Cant we see that the lone lady tourists are raped, maimed or sometimes get killed in India. There is no law or protection for tourists in India. There is no systematic procedure for Tourism and Foreign Tourists. Even Indians will hate to stay in Paharganj Hotels.. where these American and British Tourists stay in very dirty hotel rooms. Delhi Govt is fully corrupt. Only Rich foreign tourists who book with Thomas Cook or five star hotels can only enjoy. Kerala is a successful tourist destination also, because there is less exploitation.

 3. 3 chandramouli 1:14 ఉద. వద్ద జూన్ 20, 2008

  మీ మూడు వ్యాసాలు చదివాక ఇది చెప్పాలనిపించి ఇలారాస్తున్నాను…

  మిమ్మల్ని దోచుకోనిది తాజమహల్ కాదండి..కేవలం “మీ ప్రయాణం మరియు పరిస్తితులు”. అన్నిటికంటే హింది పూర్తిగా రాకుండా ఒక్కరుగా వెళ్ళటం పెద్ద అపస్రుతి అనిపింఛింది… కులమతవర్ణవర్గభంజితమయిన ఈ సువిశాల దేశం వదిలి వెళ్ళి చాలా రొజులవటం వల్లకాబోలు మీరు అలాంటి పర్తిస్థిని ఆనందించలేకపోయారు .. పైగా ఓంటరిగా వెళ్ళరుకదా ….. మీ టపా పేరు చూసి ఏమి నచలేదు చెప్మా అని ఆసాంతం చదివాక అనిపించింది ..ఈ టపా టైటిల్ మీ తాజ్ త్రిప్ అవ్వగానే రాసుంటారు కాబోలు అదే భావ వ్యగ్రతలో అలా టైటిల్ పెట్టారు అని అనిపించింది ..ఎట్టకేలకు మీకు మనదేశ కట్టడం నచ్చింది …. మీరు రాసినవిధానం …భలేవుంది అబ్రకదబ్ర గారు …

 4. 4 సుజాత 3:10 ఉద. వద్ద జూన్ 20, 2008

  తాజ్ మహల్ నన్ను దోచుకోలేకపోవడానికి కారణం, దాన్ని చూడ్డానికి ముందు నేను చదివ్నిన కొన్ని(నిజాలో, కల్పితాలో గానీ confirm చేసుకునేంత టైము లేదు) కథలు కూడా! ముంతాజ్ మహల్ మొదటి కానుపు నుంచి ఎప్పుడు అనారోగ్యం తో తీసుకుంటునే ఉండేదట! అలా పదమూడు మందిని కని పధ్నాలుగో కానుపులో మృత్యువును వరించిందట! పాపం! అది చదివి చాలా వేదన కలిగింది. బతికున్నపుడు సరైన వైద్యం చేయించో, పెళ్ళాం అన్ని కానుపులు కనకుండా ఉండే పరిస్థితో కల్పించాలి గాని, మనిషి పోయాక పాలరాతి సమాధి కట్టిస్తే ఒరిగేది ఏమిటో? అనిపించింది.ఇది కథ కాదు, నిజమే!

  అదీగాక, ఇంకో కథ ఏమిటంటే, తాజ్ మహల్ ప్లాను గీసిన ఆర్కిటెక్ట్ చేతుల్ని షాజహాను (నిర్మాణం పూర్తయ్యక)ఇంకెవరికీ అటువంటి ప్లాన్ గీసివ్వకూడదన్న స్వార్థం తో నరికించాడని చిన్నప్పుడు మా హిస్టరీ టీచరు చెపుతుండేవారు.(ఇది నమ్మదగ్గ స్టొరీ కాదేమో అని డౌటు)

  కానీ వెన్నెల్లో చూసిన వారికి మాత్రం ఎమ్మెస్ రామారావు పాడిన ‘ఈ విశాల ప్రశాంత ‘ పాట గుర్తుకు రాక మానదు.(ఖర్మ, నాకు వెన్నెల్లో చూసినా శ్రీ శ్రీ గీతమే గుర్తొచ్చింది)

  మనదేశంలో చాలా మాన్యుమెంట్స్ వద్ద ఉండే మనుషులు వాటి మీద ఇంటరెస్ట్ పోవడానికి సగం కారణమవుతారు.మీరు చెప్పింది నిజమే!

 5. 5 ప్రవీణ్ గార్లపాటి 6:11 ఉద. వద్ద జూన్ 20, 2008

  అనుభవం బాలేకపోయినా ఫోటోలు బాగున్నాయి.

 6. 7 అబ్రకదబ్ర 11:48 ఉద. వద్ద జూన్ 20, 2008

  @చంద్రమౌళి,

  “మిమ్మల్ని దోచుకోనిది తాజమహల్ కాదండి..కేవలం మీ ప్రయాణం మరియు పరిస్తితులు”.
  మీరన్నది నిజం. నేనీ మాట వ్యాసం మొదటి భాగం, మొట్టమొదటి పేరాలోనే చెప్పేశా 🙂 నా రాతలతో తాజ్ పై ఏమన్నా బురదజల్లానా అనే అనుమానంతో దాన్ని కడగటానికే ‘ఉపసంహారం’ రాశాను.

  ఈ టపాకి పెట్టిన పేరు గురించి: తాజ్ చూసేనాటికి నాకు బ్లాగులు రాసే అలవాటే లేదు. కాబట్టి క్షణికావేశంలో పెట్టిన పేరు కాదిది. ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల ఎప్పుడు ఇక్కడినుండి బయటపడదామా అనుండటంతో ఏదో ‘వచ్చాం, చాశాం, వెళ్లాం’ అన్నట్లుగానే కానీ నా సహజ పద్ధతిలో (అంటే ఒక్కో రాయినీ పట్టుకుని వివరంగా చూడటం టైపు) తాజ్ ని పరిశీలించటం కుదరలేదు. అదీ నా బాధ.

  @ప్రవీణ్,

  Thank you. నిజానికి బ్యాడ్ లైట్ వల్ల తాజ్ దగ్గర ఫొటోలు అంత గొప్పగా రాలేదు. పైగా టపాలకు జతచేయటానికని వాటిని నేను కంప్రెస్ చేయటం వల్ల ఇంకాస్త క్వాలిటీ తగ్గింది.

  @సుజాత,

  నేపధ్యాన్నటుంచితే, ఒక కట్టడంగా తాజ మహల్ నిజంగానే అద్భుతం. నిర్మాతల ఉద్దేశాలు, స్వభావాలు లాంటి వాటిపై వివాదాలెన్నున్నా, వాళ్ల aesthetic sense కి మాత్రం వంక పెట్టలేం. అంత సిమిట్రీ ఉన్న మహానిర్మాణం ప్రపంచంలో మరేదన్నా ఉందో లేదో నాకు తెలీదు (జీర్ణావస్థలో ఉన్న పిరమిడ్స్ ని వదిలేద్దాం). అది కట్టిన కాలపు టెక్నాలజీని పరిగణనలోకి తీసుకుంటే అదో architectural wonder. అంత పెద్ద డోం ఏ ఆధారమూ లేకుండా ఉండటం మాటలు కాదు కదా (St. Peter’s లో డోం దీనికన్నా పెద్దదేమో, నాకు తెలీదు).

  అన్నట్లు, ‘డోం’ అని కాకుండా ‘మ’ వత్తు లేని ‘డోమ్మ్’ ఎలా రాయాలి లేఖిని లో? ఎవరన్నా చెప్పి పుణ్యం కట్టుకోగలరు. చెప్పిన వారికి ముందస్తు ధన్యవాద నెనర్లు.

  @మేధ,

  నాకూ ఇప్పుడు నవ్వొస్తుంది కానీ అప్పుడు మాత్రం వళ్లు మండింది. అసలు ఫొటోగ్రాఫీ కనిపెట్టినవాళ్లమీద, కేనన్ కంపెనీ మీదా కూడా కోపమొచ్చింది.

 7. 8 సుజాత 7:09 సా. వద్ద జూన్ 20, 2008

  san

  మీరు అందించిన లింకులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటికి తగిన ప్రచారం తప్పకుండా కావాలి!

  అబ్రకదబ్ర,
  నేను అనేక టూర్ల తర్వాత నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఎక్కడికైనా వెళ్ళేముందు అక్కడి మాన్యుమెంట్స్ గురించో, లాండ్ స్కేప్ గురించో ముందే ఏమీ చదవకుండా raw గా వెళ్లాలి.(hotels, shopping వగైరాల గురించి మాత్రం చదివే వెళ్లాలి)ముందే తెలుసుకుని వెళితే నశించిపోయే ఫీలింగ్స్ చాలా ఉంటాయి. అని!

 8. 9 మేధ 10:54 సా. వద్ద జూన్ 20, 2008

  సుజాత గారు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను… కాకపోతే వేరే రకంగా… కొరియా లో ఉన్న ప్రదేశాల గురించి ఏదేదో చదివి, ఏవేవో ఊహించి వెళితే చివరికి అక్కడ ఉన్నవి చూసి హతవిధీ అని నెత్తి కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. అప్పుడు అర్ధమైంది, ఏ అవగాహన లేకుండా వచ్చి ఉంటే, కొంచెమైనా బావుండేది కదా అని!!!

 9. 10 Sri 9:26 ఉద. వద్ద జూలై 11, 2008

  mmmm When I read about that photographer I could’t help thinking from his point of view, If he writes about his day, It may look like this, bunch of local tourists cant pay/dont pay/use some kind of pressures to get it cheep,
  lucky there was this NRI/foreign tourist who can pay, so that I can make few bucks today out of competition from fellow photographers and after shelling bribes to all 100 different kinds of Govt officers, So I spend my 4 hours time on this customer to make that extra buck so that I can survive this Agra expenses and send my kids to school.

  I also could’t help thinking here in theme parks I hate those automated camera pics, come with closed eyes freaky quality, still got to spend 20$(800 Rs) for each, and If by chance I want to get it from some personalized pose I cant Imagine how many 100’s it will be. How cheep human services in India.

 10. 11 kashyap 9:17 సా. వద్ద సెప్టెంబర్ 12, 2009

  November 15th to feb 15th is the time thr is so much fog and the place is not much exciting for the tourists and when some visit agra in jan-october u can find the change of colour of taj in the morning afternoon and evening..

  sad tht u did nt spent time in much beautifulakshardham,u should reach akshardham at 3-4 in the afternoon u can come bck at 8.30-9.00 after watching musical fountain


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: