రెండు రోజుల క్రితం జరిగిన చివరి ప్రైమరీతో ఎట్టకేలకు డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్ధిత్వం బరాక్ ఒబామాకు దాదాపు ఖాయమయింది. ఊహించని రీతిలో హిల్లరీ క్లింటన్ చక్రం తిప్పితే తప్ప ఆయనే డెమొక్రాట్ల అధికారిక అభ్యర్ధిగా ఎంపిక కావచ్చు. హిల్లరీ అధికారికంగా ఓటమిని ఇంకా అంగీకరించకపోవటంతో ఆ అవకాశాన్ని కొట్టిపారేయలేం. శనివారం ఆమె ఓటమినంగీకరిస్తూ ప్రసంగిస్తారని వార్త.
పదిహేడు నెలలుగా హోరాహోరీగా జరిగిన ప్రైమరీల ప్రచారం సందర్భంగా ఒబామా, హిల్లరీ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ముఖ్యంగా హిల్లరీ ఒబామాను ఇబ్బందిపెట్టే అంశాలను ప్రధానంగా చేసుకుని ఆయనమీద దాడికి దిగారు. ఇదంతా చివరకు అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాన్నే ప్రశ్నార్ధకం చేస్తున్న విషయం ఆలస్యంగా గ్రహించిన పార్టీ రంగంలోకి దిగి ఇద్దరినీ చల్లబరిచే ప్రయత్నం చేసినా అప్పటికే ఎంతో కొంత నష్టం జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా ఒబామా పట్ల శ్వేత జాతీయుల్లో విముఖత వచ్చేలా హిల్లరీ చేయగలిగారు. ఇంతగా ఒబామాను దుమ్మెత్తిపోసిన హిల్లరీ ఇప్పుడు ఆయనతో కలిసి ఉపాధ్యక్ష పదవికి పోటీచేయాలని కోరుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.
అయితే ఒబామా దీనికి అంగీకరిస్తారా? ఇద్దరూ కలిసి పోటీ చేస్తే మంచిదనేవారు కొందరు, మంచిది కాదనేవారు మరి కొందరు. హిల్లరీ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడితే శ్వేత జాతీయుల ఓట్లు రిపబ్లికన్లకు పడకుండా చేయొచ్చని కొందరి వాదన. అలా చేయటం వల్ల పార్టీ కూడా ఐకమత్యంగా ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. ఇంత జరిగాక ఆమెతో కలిసి పనిచేయటమంటే ఒబామా ఒత్తిడికి లొంగిపోయినట్లే, అది ఓటర్లలోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది అని మరి కొందరి వాదన. పైగా, ‘మార్పు కోసం ఉద్యమిద్దాం’ అని ఎప్పుడూ చెప్పే ఒబామా క్లింటన్ కుటుంబాన్ని తోడుగా తెచ్చుకుంటే వాళ్ల నీడలో మిగిలిపోవటమే తప్ప బలమైన అధ్యక్షుడిగా ఎలా ఎదగగలడు అనేది వారి సూటి ప్రశ్న.
ఇప్పుడు బంతి ఒబామా కోర్టులో ఉంది. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధిగా తనకు నచ్చిన వారిని ఎన్నుకునే హక్కు ఆయనకుంది. మరి ఆయన పార్టీ వత్తిడికి లొంగిపోయి హిల్లరీకే ఓటేస్తారా, లేక తనతో భావసారూప్యం ఉన్న కొత్తతరం నాయకుడిని తోడుగా తెచ్చుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులాగాలి.
0 స్పందనలు to “ఒబామా-హిల్లరీ జోడీ కుదిరేనా?”