గెలిచి ఓడెనా, ఓడి గెలిచెనా?

రెండు రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ఫలితాలొచ్చాయి. భాజపా అత్యధికంగా 110 స్థానాల్లో గెలిచి దక్షిణాదిన మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో వడి వడిగా అడుగులేస్తుంది. పూర్తి మెజారిటీకి మరో మూడు స్థానాలు తక్కువయ్యాయి కానీ స్వతంత్రులుండనే ఉన్నారుగా. ఈ సారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వారి పంట పండినట్లే.

దక్షిణాదిలోకెల్లా అత్యంత అనిశ్చితమయిన ప్రభుత్వాలుండేది కర్ణాటకలోనే. కప్పల తక్కెడ రాజకీయాలకీ రాష్ట్రం గొప్ప ఉదాహరణ. ఇక్కడ ఐదేళ్లలో ఎందరు ముఖ్యమంత్రులు మారతారో చెప్పటం ఎప్పుడూ కష్టమే. 1988లో ఎస్.ఆర్.బొమ్మై నుండి పోయినేడాది ఆఖర్లో బి.ఎస్.యెడ్యూరప్ప దాకా ఇరవయ్యేళ్ల కాలంలో సరిగా పదిమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు! అంటే సగటున ప్రతి రెండేళ్లకూ ఒకరు మారినట్లు. ఈ సారీ ఆ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. దక్షిణాదిన పాగా వేసిన సంతోషంలో ఇల్లలకగానే పండగ కాదనే విషయాన్ని కమలనాధులు మర్చిపోతే ప్రమాదమే. కొన్నేళ్లలో కాంగ్రెసు, దేవెగౌడ కలిసిపోయి భాజపాని చీల్చే ప్రయత్నం చెయ్యరనే నమ్మకమేమీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి కర్ణాటక భాజపాలోని కొందరు ముఖ్య నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలుండటం ముందు ముందు కాషాయదళానికి కలవరం కలిగించే విషయం కావచ్చు.

ఈ ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మొదటి స్థానంలో ఉన్న భాజపా కన్నా రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెసుకి ఎక్కువ శాతం ఓట్లు పడటం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసుకి 34.6 శాతం ఓట్లు రాగా భాజపాకి 33.9 శాతం మాత్రమే లభించాయి. అంటే కర్ణాటకలో కాంగ్రెసు గెలిచీ ఓడినట్లా?

అసలు మనదేశంలో ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ధారించే పద్ధతే అర్ధరహితంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక పార్లమెంటు స్థానంలో పది లక్షల ఓట్లున్నాయనుకుందాం. అక్కడ నలుగురు పోటీ చేశారనుకుందాం. పోలయిన ఓట్లు ఆరు లక్షల చిల్లర – వాటిలో చెల్లినవి ఆరు లక్షలు ఉంటే, గెలిచిన వాడికి రెండున్నర లక్షలు, రెండో స్థానంలో ఉన్నవాడికి లక్షన్నర, మిగతా ఇద్దరికీ కలిపి రెండు లక్షలు వచ్చాయనుకుందాం. అంటే, విజేత తన సమీప ప్రత్యర్ధిపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాడన్న మాట. ఆహా, ఎంత పెద్ద మెజారిటీయో అనుకుంటాం మనం.

అయితే, ఇందులో ఓ తిరకాసుంది. రెండున్నర లక్షల మంది ఇతను మాకు కావాలంటే, మిగతా మూడున్నర లక్షల మంది ఇతను మాకొద్దు మొర్రో అన్నారు. ఇతను కావాలన్న వారి కంటే వద్దన్న వారు లక్ష మంది ఎక్కువ. అయినా ఇతను గెలిచి ఎం.పి. అయ్యాడు! అదృష్టం బాగుంటే ఇతనే ప్రధాన మంత్రి కూడా కావచ్చు. ఇంత సొంపుగా ఉంది మన ప్రజాస్వామ్యం.

పోలయిన ఓట్లలో సగం కన్నా ఎక్కువ ఓట్లు పడితేనే గెలిచినట్లు అనే నియమం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. మన దగ్గర కూడా అటువంటిదెందుకు పెట్టరు? సగం కన్నా ఎక్కువ ఎవరికీ రాకపోతే ఏం చెయ్యాలన్న ప్రశ్న వస్తుంది వెంటనే. అప్పుడు మళ్లీ ఓటింగ్ పెట్టమనండి. అలా ఎన్ని సార్లంటారా? ఎవడో ఒకడు గెలిచేటన్ని సార్లు. డబ్బు దండగంటారా? ఎవడి మీదో అలిగొకడు, ఏదో చేసేస్తున్నట్లు కనిపించటానికి ఇంకొకడు, ఏం చెయ్యాలో అర్ధం కాక మరొకడు  .. ఇలా పనికిమాలిన కారణాలతో రాజీనామాలు చేసేవాళ్లకోసం సంవత్సరం పొడుగూతా ఎక్కడో ఒకచోట ఉప ఎన్నికలు జరుగుతూనే ఉండే డేశంలో ఒక మంచి మార్పు కోసం మళ్లీ మళ్లీ ఎన్నికలు పెట్టినా దండగేముంది?

 

 

2 స్పందనలు to “గెలిచి ఓడెనా, ఓడి గెలిచెనా?”


  1. 1 వికటకవి 3:59 సా. వద్ద మే 27, 2008

    మీరన్నది నిజమే. కానీ రెండు పార్టీల వ్యవస్థ మన దేశంలో జరిగే పని కాదు. ఇంకా చెప్పాలంటే వంద పార్టీలు ఒక రాష్ట్రపు బ్యాలెట్టు పత్రంలో వచ్చినా రావచ్చు. అదేదో చెప్పినట్లు, ఉన్న పుచ్చు వంకాయల్లో మంచివి ఏరుకోవటమే మనం చెయ్యగలిగింది.

  2. 2 ఒకడు 7:09 ఉద. వద్ద మే 28, 2008

    వికటకవిగారూ, దశాబ్దాలుగా మనం పుచ్చుల్లోంచి మంచివి ఏరుకుంటూనే ఉన్నాం. సమస్యేమిటంటే, రాన్రానూ అన్నీ పుచ్చుకాయలే అయిపోయాయి. ఇప్పుడు మనం మంచివి ఏరుకోవటం అవతలుంచి, ఉన్నవాటిలోంచి తక్కువ తక్కువ పుచ్చిన వాటిని ఏరుకోవాల్సిన రోజులొచ్చాయి. అబ్రకదబ్ర పుచ్చుల్ని అసలు లేకుండా చేసే సూత్రం చెప్పటం లేదు కానీ మరింత effective గా ఎలా ఏరుకోవాలో చెబుతున్నాడు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: