రాజకీయ చిత్రం

చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమైన నేపధ్యంలో తెలుగుదేశానికి మరింత సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. ఎన్టీయార్ వారసులందరూ తెదెపా వెనుకే ఉన్నారన్న సంకేతాలు జనంలోకి పంపే లక్ష్యంతో బాలకృష్ణ తదితర కధానాయకులని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలీదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చినా, రాకపోయినా ఆయనే పార్టీకి మద్దతిస్తాడో ఎవరికి తెలియదు? ఇప్పుడు ఆయన తెదెపాలో ప్రధాన పాత్ర పోషించినంతమాత్రాన ఆ పార్టీ అదృష్టం రాత్రికి రాత్రి మారిపోతుందనేది అనుమానమే.

మరో వంక, చిరంజీవి పార్టీ వల్ల ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత నష్టం కలగనుందో తెలీని అయోమయ పరిస్థితి. ఒకటి మాత్రం నిజం. 1983లో ఎన్టీయార్ లా ఇప్పుడు చిరంజీవి ప్రభంజనం సృష్టించే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కానీ ఆయన కోస్తా, రాయలసీమల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రధాన పక్షాల ఓటు బ్యాంకులకు గండికొట్టవచ్చు. కులాలవారీ ఓట్ల ప్రాతిపదికన చూస్తే ఈ నష్టం కాంగ్రెసుకే ఎక్కువుంటుందని కొందరి అంచనా. తెలంగాణలో పరిస్థితిపై ఈ నెలాఖరున జరగబోయే ఉప ఎన్నికల ఫలితాలొచ్చేదాకా ఏమీ చెప్పలేం. కెసియార్ ఎంత కష్టపడినా తెరాస ఎన్నో కొన్ని సీట్లు కోల్పోక తప్పేలా లేదు. అదే జరిగితే తెలంగాణ సెంటిమెంటుపై నీళ్లుజల్లేలా ఆయన ప్రత్యర్ధుల రాజకీయాలు నడవటం తధ్యం. అయితే, కెసియార్ పనయిపోయిందనుకున్నపుడల్లా ఆయన ఒక కొత్త ఎత్తుగడతో తిరిగి రావటం ఇప్పటికే చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి, ఉప ఎన్నికల ఫలితాలెంత నిరాశాజనకంగా ఉన్నా కెసియార్ ఏదో ఒక టక్కుటమార ప్రదర్శన చేసి వచ్చే సాధారణ ఎన్నికలనాటికి కూడా తెలంగాణలో ఒక నిర్ణయాత్మక శక్తిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.

కమ్యూనిస్టుల వైఖరెలా ఉండబోతుందో కొంత స్పష్టంగానే ఉంది. 2009 నాటికి సి.పి.ఎం. తెదెపాతో జట్టుకట్టే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. సి.పి.ఐ. ప్రస్తుతానికి వేచిచూచే ధోరణిలో ఉన్నా, ఎన్నికలనాటికి తన సహచర కామ్రేడ్స్ తోనే కలసి నడవొచ్చు. బి.జె.పి.ది ఒక వింత పరిస్థితి. 1999 నుండి 2004 మధ్యకాలంలో తప్ప, రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పుడూ అంటరాని పక్షమే. వచ్చేసారి కూడా ఎన్నికల్లో వాళ్ల ప్రాబల్యం కనిపించే సూచనలు లేవు. ఆదర్శాలు బాగున్నా ఎన్నికల సమరాంగణంలో లోక్ సత్తా సత్తా ఎంతో ఇంకా తెలియదు కాబట్టి వాళ్లతో పొత్తులకు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించకపోవచ్చు.

తెలుగుదేశం – చిరంజీవి పార్టీల నాయకత్వంలో ఒక ఉమ్మడి ప్రతిపక్ష వేదికకై కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేయవచ్చనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్లు చిరంజీవి సన్నిహిత బృందంలో ఎక్కువమంది ఉండటం కూడా ఈ ఊహకి ఆధారం కావచ్చు. బి.వి.రాఘవులు ఈ మధ్య చేసిన వ్యాఖలు దీన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి. సినీ రంగంలో ప్రత్యర్ధులుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాల్లో చేతులు కలిపితే పెద్ద విశేషమే. మీడియా మొగల్ రామోజీరావు కూడా తెరవెనుక ఇవే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని పుకార్లు. ఇటీవల చిరంజీవిని వ్యక్తిగతంగా ఇబ్బందుల పాల్జేసిన పలు సంఘటనల వెనుక కాంగ్రెసు నాయకుల ప్రమేయం ఉన్నదనీ, అందువల్ల, ఆయన ఎవరో ఒకరి వైపు మొగ్గుచూపే పరిస్థితే వస్తే అది తెదేపా వైపే అవుతుందనీ మరికొందరి వాదన. మొత్తమ్మీద వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో సినీ తారల హంగామా ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఉండొచ్చు.

చిరంజీవి ఎవరితో జట్టు కడతాడు అనే విషయంలో పుకార్లు, అంచనాలు ఎలా ఉన్నా, ఆయన కాంగ్రెసు పార్టీతో కలవడని మాత్రం తేలికగానే చెప్పవచ్చు. కాంగ్రెసుని తిరిగి అధికారంలో ఉంచటానికి ఆయన సినిమాలు మానుకుని రాజకీయాల్లోకి రాడు కదా. అలాగే చంద్రబాబునో, బాలకృష్ణనో ఉద్దరించటానికి కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రాడు. వ్యక్తిగతంగా ఎంత కాంగ్రెసు వ్యతిరేకత ఉన్నా ఎన్నికలకు ముందే తెదెపాతో చిరంజీవి పొత్తు పెట్టుకోకపోవచ్చు. పైగా, ఎన్నికలకు ముందే తెదెపాతో చెలిమి చేస్తే తన సామాజిక వర్గం ఓట్లుకూడా గణనీయమైన సంఖ్యలో ఆయనకు పడకుండా పోయే ప్రమాదం ఉంది – దీనికి కారణం ఎక్కువమంది కాపులు మొదటినుండీ తెదెపాకి వ్యతిరేకంగా ఉండటం. కాబట్టి చిరంజీవి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెసేతర కూటమితో చేతులు కలపొచ్చు. అదే జరిగితే (తెరాస – కాంగ్రెసుల ఏడాదిన్నర కాపురాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉంటే) రాష్ట్రంలో మొదటి సంకీర్ణం అధికారంలోకొచ్చినట్లే. ఎందుకంటే, గెలుపుపై వైఎస్సార్ ఎంత ధీమాగా ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 2004లో చంద్రబాబుకి లాగానే చేదు ఫలితాలు ఎదురవక తప్పదు. దీనికి విరుగుడు, తిరిగి ఎవరో ఒకరితో చెయ్యి కలపడం. తెదెపా, చిరంజీవి, బిజెపి, కమ్యూనిస్టులని తీసేస్తే ఇక మిగిలింది తెరాస. తప్పకుండా తెలంగాణ ఇస్తామంటే తెరాస అందుకు ఒప్పుకోవచ్చు. కానీ, ఒక సారి అనుభవమయ్యాక కాంగ్రెస్ మాటని కెసియార్ మళ్లీ నమ్మినా తెలంగాణ ప్రజలు నమ్ముతారా?

1 Response to “రాజకీయ చిత్రం”స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 275,800

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: