మరో పునరంకితం

నాలుగేళ్లుగా ఏడాదికోసారి ఆర్భాటంగా పునరంకిత సభ పేరుతో జరుపుతున్న జాతర ఈ మారు కూడా వందిమాగధగణం సమక్షంలో కమనీయంగా జరిపుకున్నారు ముఖ్యమంత్రివర్యులు. ఈ సభలో యధాప్రకారం పరనిందతో పాటు ఆత్మస్థుతి కూడా కావలసినంత చేసుకున్నారు. నాలుగేళ్ల పాలనలో స్వపరివారంపై తాము జరిపించినన్ని విచారణలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ జరిపించలేదని చెప్పుకుని మురిసిపోయారు. ఇదొక రికార్డని ఆయన ఉద్దేశ్యమేమో. అయితే, ఒక ముఖ్యమంత్రిపై, ఆయన పరివారంపై ఇన్ని ఆరోపణలు రావటం కూడా ఒక రికార్డేనని ఆయనకి తెలియకపోవటం వింతే. ఆయా విచారణల్లో ఎన్ని పూర్తయ్యాయి, వాటిలో ఏమి తేల్చారు లాంటి విషయాలు మాత్రం ఆయనెంత తెలివిగా దాటవేసినా జనాల దృష్టిలోంచి తప్పుకుపోవు.

1999 ఎన్నికల అనంతరం చంద్రబాబు తనకి మంత్రి పదవి కాకుండా ఉపసభాపతి పదవి ఇచ్చినందుకు అలిగి కెసియార్ తెరాస పార్టీ పెట్టాడని వైఎస్సార్ కి ఈ మధ్యనే తెలిసింది. నాలుగవ పునరంకిత సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించటమే కాకుండా ‘ఇది నిజమా కాదా’ అంటూ కెసియార్ ని నిలదీశారు. ఆ విషయం నాలుగేళ్ల క్రితమే తెలిసుంటే 2004 ఎన్నికలప్పుడు తెరాసతో సర్దుబాటు చేసుకునేవాళ్లు కాదేమో! ‘తెలంగాణా ఏమన్నా మీ ఒక్కరి సొత్తా?’ అని కెసియార్ ని ఒకవంక నిలదీస్తూనే మరోవంక ‘ఈ సమస్యకి పరిష్కారం చూపగలిగేది కాంగ్రెస్ ఒక్కటే’ అని ముక్తాయించటం ద్వారా తెలంగాణా కాంగ్రెసు పార్టీకి మాత్రమే గుత్త సొత్తు అని చెప్పకనే చెప్పారు. కమిటీలపై కమిటీలేయటం, అందరి అభిప్రాయాలూ తీసుకుని తమ అభిప్రాయం మాత్రం చెప్పకపోవటం, రోజుకో రకంగా మాట్లాడటం .. ఇలాంటి వాటితో తెలంగాణా సమస్య పరిష్కారమవుతుందనేది ఆయన ప్రగాఢ నమ్మకం కావచ్చు.

వైఎస్సార్ కి ఈ మధ్య కలిగిన మరో కనువిప్పు కమ్యూనిస్టుల గురించి. ఇన్నాళ్లూ సి.పి.ఎం. సిద్ధాంతాలున్న పార్టీ అని ఆయన అనుకునే వాడట. తమని కాదని ఉప ఎన్నికల్లో తెదెపాతో జట్టు కట్టేసరికి ఆ పార్టీ సిద్ధాంతాలు గాలికెగిరిపోయానని ఈయన ఆవేదన చెందటం మొదలెట్టాడు. పదిహేనేళ్ల పాటు తెదేపాతో అంటకాగి 2004లో కాంగ్రెసుతో కలిసి నడిచినప్పుడు కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు ఢోకారాలేదేమో మరి.  ‘కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొద్దు’ అని చంద్రబాబు నుద్దేశించి బి.వి.రాఘవులుకి సభాముఖంగా సలహా ఇచ్చారు. ‘మరి నాలుగేళ్ల క్రితం మీ తోక పట్టుకుని ఈదాం కదా. మీరూ కుక్కేనా, లేక మరేదన్నా జంతువా?’ అని రాఘవులు గారు ధర్మ సందేహం వ్యక్తం చేశారు కానీ దానికి సమాధానమిచ్చేంత తీరికా, ఓపికా వైఎస్ కేవీ?

ఇదే సభలో, ఏడాదిలో రాబోయే సాధారణ ఎన్నికలకోసం ఇప్పటినుండే జనంలోకెళ్లి నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని వాళ్లకు వివరించాలని కాంగ్రెసు కార్యకర్తలను ఆదేశించారు వైఎస్. అవినీతి వరదలో కొట్టుకుపోతున్న జలయజ్ఞం, సెజ్ ల పేరిట బక్కరైతుల పొట్టకొట్టి అస్మదీయులకు చేస్తున్న భూసంతర్పణ, రాష్ట్రమంతటా రకరకాల పార్కుల పేరుతో సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా, రాజధానిలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల వేలం, దేవుడి పాలనలోనూ ఆగని రైతుల ఆత్మహత్యలు, రాయలసీమలో పెచ్చరిల్లిన ఫ్యాక్షన్ హత్యలు, వెగటు పుట్టించే రాజీవ నామ జపం, నాలుగేళ్లయినా పాలనపై పట్టు చిక్కలేదని వస్తున్న విమర్శలు, ఎంతటికైనా తెగించి స్వజనానికి లాభం చేకూర్చటం, కొన్ని వర్గాలను పనిగట్టుకుని సాధించటం, అవినీతిపై ఎవరేమి ప్రశ్నించినా తెగబడి ఎదురుదాడి చెయ్యటం .. ఇవా అభివృద్ధి సూచికలు? అభివృద్ధి ఉంటే ప్రచారంతో పనిలేకుండానే జనాలకర్ధమవుతుంది. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే వచ్చేసారి వైఎస్ కూ పట్టటం తధ్యం.

2 Responses to “మరో పునరంకితం”


  1. 2 Sri 4:31 ఉద. వద్ద మే 20, 2008

    Chala manchi analysis. Meeru ikkada prastavinchina vishayalu prajalandariki teliyali ante em cheyaala ani alochistunnanu.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 275,741

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: