జైపూర్ లో మొన్న జరిగిన బాంబు పేలుళ్లపై స్పందిస్తూ బి.జె.పి. అగ్రనేత ఎల్.కె.అద్వానీ అలవాటు ప్రకారం యు.పి.ఎ. ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి సందర్భాన్నీ అవతలి పక్షాన్ని దుయ్యబట్టటానికే వాడుకోవాలనిచూసే నాయకులు దొరకటం భరతజాతి ఎన్నడో చేసుకున్న పాప ఫలితమేమో. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా యు.పి.ఎ. అధికారంలోకి రాగానే తీవ్రవాదుల పీచమణచటానికుద్దేశించిన ‘పోటా’ చట్టాన్ని రద్దు చేసిందట, దాని ఫలితంగానే దేశంలో తీవ్రవాద దాడులు పెరిగిపోతున్నాయట. తమ ఎన్.డి.ఎ. హయాంలోనే, పోటా అమల్లో ఉండగానే, అందునా ‘లోహ పురుష్’ అద్వానీజీ పోలీసు శాఖ మంత్రిత్వం నెరపుతున్నప్పుడే పార్లమెంటుపై తీవ్రవాద దాడి జరిగిన సంగతి ఆయనకీ సందర్భంలో గుర్తుకురాకపోవటం గమ్మత్తే. అవసరానికనుగుణంగా కొన్ని నిజాలను నాయకమ్మన్యులెంత అనువుగా మర్చిపోయినా జనాలకవి బాగానే గుర్తుంటాయి.
మతం ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలు నడపటమనే కళని దేశవ్యాప్తం చేసిన అద్వానీ ఆ పేరిట వేరే వాళ్లని విమర్శించటం మరో గమ్మత్తు. మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థుల మెదళ్లు కలుషితం చేసే పనిలో ఇరవయ్యేళ్లుగా అలుపెరగక శ్రమిస్తున్న యోధుడాయన. ఓటు బ్యాంకు రాజకీయాలు ఆయనకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు?
జైపూర్ సంఘటనకి సంబంధించి అతి పెద్ద వైఫల్యం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానిదే. శాంతి భద్రతలకు సంబంధించినంతవరకూ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేయటం మినహా మరేమీ చెయ్యలేవని అద్వానీజీకి తెలియనిదా? ఎంత తమ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వాన్ని అద్వానీజీ వెనకేసుకురావటమేంటి?
నాలుగేళ్ల యు.పి.ఎ. హయాంలో ఎన్ని తీవ్రవాద దాడులు జరిగినా ఒకరికీ శిక్ష పడలేదని ఆయన వాపోయారు. నిజమే కావచ్చు. ఏడేళ్ల ఎన్.డి.ఎ. పాలనలో ఎందరికి పడ్డాయి శిక్షలు? గ్రాహం స్టెయిన్స్ హంతకుడు దారా సింగ్ కే శిక్ష పడింది? వందలాది మందిని బలిగొన్న గుజరాత్ నరమేధానికి కారకులు కళ్లెదుటే దర్జాగా తిరుగుతున్నా, దాని తెరవెనుక సూత్రధారులు సొంత పార్టీలో మహానేతలుగా ఎదుగుతున్నా అడ్డుకోలేని ఈయన ఎదిరి పక్షానికి వంకలు పెట్టటం విడ్డూరం. అద్వానీ స్థాయి నేతలు ప్రతి సంఘటననీ రాజకీయ లబ్దికే వాడుకోవటం తగదు.
చేయి తిరిగిన రచయిత రాసిన పత్రికాసంపాదకీయం లా నిశితంగా రాసారు.అభినందనలు.