పోయిన వారమంతా భారతావనిలో ఎక్కడచూసినా అమెరికా అధ్యక్షులవారిపై ఆగ్రహజ్వాలలే! ‘ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి ఈమధ్య భారతీయులు అతిగా తినడమే కారణం’ అని బుష్ దొరవారు అన్నారట. అందుకని జాతీయస్థాయి నాయకుల నుండి సగటు పౌరుల వరకు అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆయన్ని ఉతికి ఆరేశారు. కాలమిస్టులు విజృంభించి పత్రికల్లో పుంఖానుపుంఖానులుగా వ్యాసాలు రాసిపారేశారు. కార్టూనిస్టులక్కూడా చేతినిండా పని దొరికింది. బి.జె.పి. వాళ్లయితే బుష్ తో పాటు పన్లో పనిగా మన్మోహన్ సింగ్ నీ, సోనియానీ, యు.పి.ఏ. ప్రభుత్వాన్నీ కూడా ఆడిపోసుకున్నారు. కొంతమంది మరీ ముందుకెళ్లి దీన్ని దేశ భక్తితో ముడిపెట్టి బుష్ ని ఈ విషయంలో వెనకేసుకొచ్చేవాళ్లు దేశ ద్రోహులన్నట్లు తీర్మానించేశారు.
ఇంతకీ, వీళ్లలో ఎందరు నిజంగా జార్జ్ బుష్ అన్న మాటలు విన్నారు లేదా చదివారు? బుష్ ఏ సందర్భంలో ఆ మాటలన్నాడు, అసలేమన్నాడు, ఏ ఉద్దేశ్యంతో అన్నాడు లాంటి విషయాలు ఎవరికన్నా పట్టాయా? సందర్భాన్ని తీసేసి చూస్తే రామా అన్నా బూతులాగానే వినిపించొచ్చు.
ఇంత దుమారానికి కారణమైన, అమెరికా ఆర్ధిక స్థితిగతులపై మిస్సోరీలో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ జార్జ్ బుష్ చేసిన వ్యాఖ్యలకు యధాతధ అనువాదమిది:
‘ధరలు పెరగటానికి ఎన్నో కారణాలుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం కూడా అందులో ఒకటి. అది మంచిదే. దీనివల్ల వాణిజ్యం పెరుగుతుంది. మరో రకంగా చెప్పాలంటే, ప్రపంచం ఎంత సంపన్నమయితే అంతగా వాణిజ్యావకాశాలు పెరుగుతాయి. అయితే, జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ ప్రజల అవసరాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి, భారతదేశంలో 35 కోట్లమంది మధ్య తరగతి ప్రజలున్నారు. వీళ్ల సంఖ్య అమెరికా జనాభా మొత్తం కన్నా ఎక్కువ. వీళ్ల జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ పౌష్టికాహారం కోసం డిమాండ్ పెరుగుతుంది. దానితో సరుకు లభ్యత తక్కువై ధరలు పెరుగుతాయి’.
‘అయితే, అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి కారణం సరుకుల కొరత కాదు. దానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం. ఇంధనం ధరలు పెరిగితే సహజంగానే అది మిగతా అన్ని వస్తువులపై పడుతుంది. మనకి సరుకుల లభ్యత లేకపోవటమనే సమస్య లేదు. ఉన్న సమస్యల్లా, వాటి ధరలు ఎక్కువగా ఉండటం’.
ఇందులో భారతీయులని అవమానించటానికేముంది? ‘భారతీయ మధ్యతరగతి జీవన స్థాయి పెరగటం మంచిదే’ అన్న వ్యాఖ్యని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. బుష్ చెప్పిందేమీ ఆయన సొంత తెలివితేటలతో పరిశోధించి కనుక్కున్నది కూడా కాదు. ఆర్ధికవేత్తలందరూ అనేమాటే అది. అసలాపాటి విషయం చెప్పటానికి ఆర్ధికవేత్తల అవసరం కూడా లేదు.
అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చెయ్యటానికి కొద్ది రోజుల ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి కొండలిజా రైస్ కూడా దాదాపు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఆమె మనతో పాటు చైనా పేరు కూడా ప్రస్తావించింది. చైనా ఈ విషయం పట్టించుకోకుండా వదిలేస్తే మనవాళ్లు మాత్రం నానా యాగీ చేసి బుష్ మాటలకి అనవసరమైన అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చిపెట్టారు. ‘చీకట్లో సుబ్బారావు భార్యని సుందర్రావు పొరపాటున పట్టుకుంటే, దాన్ని చూసిన సుబ్బారావు అగ్గిమీద గుగ్గిలమై కనపడ్డవాళ్లందరి దగ్గరా సుందర్రావుని పట్టుకుని తిట్టటం మొదలెట్టాడట’. చివరికెవరి పరువు పోయింది?
ఇదే ముఖాముఖిలో పేద దేశాలపై అమెరికా ఔదార్యంపై, అమెరికన్ల దయా గుణంపై బుష్ మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. మనకవి నచ్చకపోవచ్చుకానీ, సందర్భమొస్తే మనగురించి గొప్పలు చెప్పుకోవటానికి మనమూ ముందుండమా?
మంద మనస్తత్వానికి అది ఒక ఉదాహరణ. మన ప్రసార, ప్రచురణరంగాలకు ఇంకొంత సంయమనమూ, ఆలోచనా అవసరం.
You are right.
అయితే మీరు ఇప్పుడు దేశద్ర్రోహులన్నమాట 🙂
మన 24 గంటల వార్తా చానళ్ళకి ఇలాంటివే ఇందనం.
mountain out of a mole hill అంటారు కదా..
దేన్నైనా మొత్తం పరిశీలించకుండా ఆవేశ పడటం మనకలవాటేగా!
mana patrikala vallu TV a vallu ardha satyalu cheppatamlo baga aari terinaru.
బాగా రాశారు.
నిజమే. బుష్ విషయంలో సీ.పీ.ఎం వాళ్ళు వీలైనంత ఎక్కువ చనువు తీసేసుకుంటారు. ఇంతా చేస్తే, ఇప్పుడందరూ అనే మాటే అది. చైనా, ఇండియా వినియోగం పెరగటమే కారణం అని