కాంగ్రెసు పార్టీలో విదూషకులకేనాడూ కొరతలేదు. సీనియర్ కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ సత్తెన్న గారు వయోభారం వల్లనో, తన కామెడీని ఎవరూ పట్టించుకోవటంలేదని అలగటంవల్లనో, మరే చెప్పలేని కారణంవల్లనో, మొత్తానికి మంత్రిపదవికి రాజీనామా చేసిపారేశాక పత్తాలేకుండా పోయారు. రేలంగి పోయాక రాజబాబు, ఆయనా పోయాక బ్రహ్మానందం వచ్చినట్లు – సత్తెన్నగారి వారసులకోసం ఆంధ్ర ప్రజానీకం ఎక్కువగా ఎదురుచూసే అవసరం లేకుండా నేనున్నానంటూ దూసుకొచ్చారు మార్కెటింగ్ శాఖామాత్యులు మారెప్పగారు. రాష్ట్రంలో దేవుడి పాలన చల్లగా సాగుతుండటంతో వీరు వీధులెంటబడి పెద్దగా సరుకులు మార్కెటింగ్ చెయ్యాల్సిన అవసరం లేకుండాపోయింది. దాంతో తెలుగు ప్రజలకు రోజూ వినోదాన్నందించే బాధ్యత మారెప్పగారు నెత్తినేసుకున్నారు. స్వతహాగా ఈయనకు దైవ భక్తి మెండు. తన దేవుడినెవరేమన్నా వెంటనే పత్రికా సమావేశం పెట్టి ఆ అన్నవాళ్లని చెడామడా కడిగిపారేస్తారు. ఐతే, పేరడీ సినిమాల్లో ఫ్యాక్షనిస్టులా వీరి ఆగ్రహం జనాలకు నవ్వులాటగా ఉంటుందని పాపం ఈయనకు తెలియదు.
కొన్నాళ్ల విరామం తర్వాత ఈమధ్య మంత్రి మారెప్పగారి దృష్టి చంద్రబాబుమీద పడింది. ఏమయిందో ఏమో కానీ ఉన్నట్లుండి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ‘బాబుది ఐరన్ లెగ్’ అంటూ తను కొత్తగా కనుగొన్న విశ్వ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇన్నాళ్లూ మారెప్పగారు విశ్వరహస్యాల్ని ఛేదించే పనిలో నిమగ్నమయ్యున్నారని అప్పుడర్ధమయింది విలేకర్ల సమూహానికి. ఇంతకీ చంద్రబాబుది ఐరన్ లెగ్ అని మారెప్పగారు నిర్ధారించటానికి కీలకాధారాలు రెండు – అంటే, ‘న్యూటన్ గమన సూత్రాలు మూడు’ అన్నట్లుగానన్నమాట. అవి:
1. మీకోసం యాత్రలో భాగంగా బాబు తిరుపతిలో పర్యటించి వెళ్లిపోగానే శ్రీవారి గొడుగులు కాలిపోయాయి.
2. ఆతర్వాత బాబు గుంటూరు జిల్లాలో పర్యటించి వెళ్లగానే అక్కడ మిర్చి యార్డు తగలబడిపోయింది.
తను కనుగొన్న బ్రహ్మాండమైన విషయాన్ని అందరికీ తెలియజెప్పే ఆతృతలో మారెప్పగారు తొందరపడి నోరుజారారేగానీ, ఈ సంగతి చంద్రబాబు చెవినబడితే కలిగే విపరిమాణాలు ఆయన ఊహించలేకపోయారు. ‘అర్రెర్రె.. నా కాలుకి అంత పవర్ ఉందా! ఈ ఎండల్లో చెమటలు కక్కుకుంటూ బస్సు యాత్ర చేసేబదులు పులివెందుల వెళ్లి వై.ఎస్. ఇంట్లో ఓ సారి కాలు పెట్టొస్తే పోతుంది కదా’ అని బాబు అనుకుంటే ముఖ్యమంత్రి కొంపలంటుకుపోవూ?
విశ్వరహస్యాల్నివిడగొట్టే క్రమంలో రోజులతరబడి టెలిస్కోపుతో గ్రహాలనీ, నక్షత్రాలనీ పరీక్షించీ, చించీ, మారెప్పగారికి కాస్తంత జ్యోతిష్యం కూడా వద్దన్నా వంటబట్టేసింది. దాంతో తన జ్యోతిష్య ప్రావీణ్యాన్నికూడా పన్లో పనిగా చంద్రబాబు మీదనే ప్రయోగించారు. ‘జూన్ 12 తర్వాత చంద్రబాబు ఔట్’ అని అదే విలేకర్ల సమావేశంలో ఎలుగెత్తి చాటారు. ఈ నెలాఖరు తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 12 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు గెలుచుకోవటం ఖాయమట. ఆ దెబ్బకి బాబు పార్టీ మట్టిలో కలవటం తధ్యమట! మరి మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారో విలేకర్లడగలేదు, ఆయన చెప్పలేదు.
ఈ సంగతి ఖమ్మం జిల్లాలో మనకోసం యాత్ర చేస్తున్న చంద్రబాబు చెవిలో ఎవరో ఊదారు. ‘అవన్నీ తెరాస సిట్టింగ్ స్థానాలు కదా. వాటిని కాంగ్రెస్ గెలుచుకుంటే కెసియార్ కదా ఔట్ కావలసింది, మరి నేను ఔట్ అంటాడేమిటి మారెప్ప? ఇందులో ఏమన్నా మతలబుందా? ఇంతకీ ఇది క్లీన్ బౌల్డ్ కిందకొస్తుందా లేక రన్నౌటా? రన్నౌటైతే ఫర్వాలేదుగానీ క్లీన్ బౌల్డంటే ఇబ్బందే. ఇప్పటికే నా బ్యాటింగ్ టాలెంట్ మీద మా టీం మెంబర్లకి అనుమానాలొస్తున్నాయి. వైస్ కెప్టెన్ దేవేందర్ ఎప్పుడు వెళ్లిపోయి సొంత టీం పెట్టుకుందామా అని చూస్తున్నాడు. నా టెన్షన్ లో నేనుంటే మధ్యలో ఈ మారెప్ప జోస్యాలొకటి. ఎందుకన్నా మంచిది, ఎవరన్నా స్పెషలిస్టు జ్యోతిష్యుడిని సంప్రదించాలి’ అనుకుంటూ మాసిన గెడ్డం బరుకుతూ దీర్ఘాలోచనలో పడిపోయాడు బాబు.
chethaga undhi
నాగం జనార్ధన రెడ్డి,కేసియార్,బి.వి.రాఘవులు మరియు బండారు దత్తాత్రేయల స్థాయికి ఎదిగేందుకు విఫలయత్నం చేస్తున్నాడు మారెప్ప విదూషకుల స్థానానికి
రాజేంద్రగారూ,
జోకర్ల జాబితాలో బి.వి.రాఘవులు నెందుకు కలపడం? ఆయన చాలా పద్ధతిగా మాట్లాడే వ్యక్తి.
Excellent!
Mee rachana shaili adhbutham. I wish you soon write a book/ dialogues for a movie. Trivikram ni minchi pothaaru! 🙂
Wish you best of luck( chaalaa mandhiki adhi andhani dhraakshaane ) .
Regards,
Samba
>>>”ఈ ఎండల్లో చెమటలు కక్కుకుంటూ బస్సు యాత్ర చేసేబదులు పులివెందుల వెళ్లి వై.ఎస్. ఇంట్లో ఓ సారి కాలు పెట్టొస్తే పోతుంది కదా’ అని బాబు అనుకుంటే ముఖ్యమంత్రి కొంపలంటుకుపోవూ?”
రాశ్శేఖర్రెడ్డి పోబోయే ముందు ఓపాలలా ఎల్లొచ్చినట్టున్నాడేమో సెండ్రబాబు ఎవులికీ తెల్వగుండా