'అభిప్రాయం' వర్గానికి భండారం

దివాలీ గోల

‘హ్యాపీ దివాలీ’

‘ఏం కావాలీ?’

‘ఏమీ వద్దు. దివాలీ, దివాలీ .. హ్యాపీ దివాలీ బాస్’

‘అర్ధంగాలే. ఏంటిదది?’

‘దీపావళి నాయనా, దీపాల పండగ’

‘ఓ అదా. థ్యాంక్యూ, అండ్ సేమ్ టూ యూ’

‘దీపావళీ దివాలీ ఒకటేనని తెలీదా! పోజులు కాకపోతే’

‘పోజులా? ఆ కూత నేను కుయ్యాలి. అసలు పేరు తెలిసీ దివాలీ అంటూ దిక్కుమాలిన పిలుపేంటి?’

* * * *

కొన్నేళ్లుగా దీపావళి పండగ సందర్భంగా నాకు సాధారణమైపోయిన సంభాషణ ఇది. అచ్చు ఇదే కాదు కానీ, అటూ ఇటూగా అర్ధం ఇదే. దివాలీట, దివాలీ! ఆ పేరు వింటేనే నా నెత్తురు ఉడుకుతుంది, నరాలు ఉబుకుతాయి, పళ్లు పటపటలాడతాయి, కళ్లు ఎర్రెర్రబారతాయి, దవడ కండరం బిర్రబిగుసుకుంటుంది, పిడికిళ్లు మూసుకుంటాయి, ఆవేశం తన్నుకొస్తుంది, ఆగ్రహం కట్టలు తెంచుకొంటుంది …. యూ గాట్ ది పిక్చర్. చెప్పొచ్చేదేంటంటే, నాతో దివాలీ అన్నవాడికి దవడ పగల్టమే తక్కువగా – దబిడీ దిబిడీ దరువే. దివాలీ ఏంటండీ? నిండా మునిగినట్లూ, నెత్తిన గుడ్డేసుకుని కూర్చున్నట్లూ .. దిగులుగా అనిపించటం లేదూ, దిగాలు భావాలు చుట్టుముట్టటం లేదూ? (ఏంటేంటీ, లేదా? ఏం ఫర్లే. ఇకనుండీ ముడతాయి. ముట్టనివారికీ ముట్టించటమే ఈ టపా ముఖ్యోద్దేశం. రీడాన్) నా ముందుకొచ్చి ఆ పిచ్చి పేరు ఉచ్ఛరించినవారికో సుదీర్ఘ లెక్చరు దంచి జీవితమ్మీద విరక్తి కలిగించి, చివరికి చెంపలు వాయించుకుని దీపావళి, దీపావళి అని వందసార్లు అప్పజెబితే కానీ వదలన్నేను. పన్లో పనిగా పాతిక గుంజీలు తీయించి గోడకుర్చీ వేయించి రొండొందలేభయ్యారు సార్లు ఇంపోజిషను కూడా రాయిద్దామనుంటుంది కానీ నేను పంతుల్ని కాను, సదరు దివాలీవాలాలు నా దగ్గర సదూకునే సత్రకాయలూ కారు కాబట్టి అంతటితో క్షమించి వదిలేస్తాను.

అసలు మనోళ్లకీ పేర్లని పచ్చడి చేసేసే పిచ్చేమిటో, పర్వదినాలనీ వేలంవెర్రికి బలిచెయ్యటమేమిటో! దీపావళి అన్న పేరుకెంత అందమైన అర్ధముంది? తెల్లోడికి నోరు తిరక్క దాన్ని దివాలా తీయిస్తే, తిన్నదరక్క ఫ్యాషన్ పేరుతో దాన్నే మనమూ చంకనెక్కించుకోవాలా? పది పదిహేనేళ్ల కిందటి దాకా ఉత్తరాదివాసుల నోళ్లలోనే ఈ దరిద్రప్పేరు ఎక్కువగా నానేది. ఇప్పుడు తెలుగోళ్లకీ జిడ్డులా అంటుకుని ఊరూరా వైరస్‌లా పాకేసింది. ఓ పక్క కాశీని కాషీ, శివని షివ అంటూ ఖూనీ చేసేస్తూ మరోపక్క బాలూ హిందీ ఉచ్ఛారణకి వంకలెట్టే ఉభాకులతో ఈ విషయంలో నేను చాలాసార్లు వాదులాటేసుకున్నాను – అది వేరే కథ. ఏదేమైనా, అది వాళ్ల పైత్యం. దాన్ని మనం వంటబట్టించుకోటానికి ఉవ్విళ్లూరటం చోద్యం.

‘దీపావళి శుభాకాంక్షలు’ అంటూ అంతా తెలుగులోనే వెలగబెట్టమనేంత చాదస్తం నాకు లేదు. కాలానికి తగ్గట్లు ఆంగ్లంలోనే అఘోరిద్దాం. ‘హ్యాపీ దీపావళి’ అంటే అంతో ఇంతో ప్రాస కూడా కలిసి ఎంత చక్కగా ఉంది? ‘హ్యాపీ దివాలీ’ ఏంటి. దివ్యంగా దివాలా తియ్యమనా?  నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు లేదూ? తెలుగోళ్ల ఈ అనుకరణాభిలాష దీపావళికే పరిమితం కాలేదు. ‘దషమి’/'దషరా’ దగ్గర్నుండి సంక్రాంతి దాకా పాకిందది. ఈ మధ్య ఎవర్ని చూసినా ‘హ్యేపీ పొంగల్’ అనేవాళ్లే. ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అన్న ముక్క విని ఎన్నేళ్లయిందో. నాకు తెలిసిన తమిళుడెవడూ ‘హ్యాపీ సంక్రాంతి’ అనడు. ఈ పొంగల్ పిచ్చి మనకెందుకో మరి!

ఆల్రెడీ దీపావళి అంటే అర్ధం తెలీని తరం పుట్టుకొచ్చింది. ఆ పేరెందుకొచ్చిందో తెలీటం తర్వాత సంగతి, ఆ పండగ వెనకున్న కథ కూడా తెలీకుండా పోతుంది కొందరికి. రాముడు పద్నాలుగేళ్ల వనవాసానంతరం అయోధ్యకి తిరిగొచ్చిన రోజుగా దీపావళిని గుర్తించటం ఉత్తరాది హిందూ సంప్రదాయం. నరకాసుర వధ తర్వాతి రోజు దీపావళిగా జరుపుకోటం దక్షిణాది ఆచారం. ఇప్పుడా తేడా చెరిగిపోయి రాముడి కథే ఇక్కడా ప్రాచుర్యంలోకొస్తుండటం మన ఆచారాలపై ఉత్తరాది ప్రభావానికి దర్పణం; వెరసి మన దౌర్భాగ్యం.  పదుగురి పద్ధతులూ తెలుసుకోవాల్సిందే, వాటిని గౌరవించాల్సిందే. అయితే మనవైన సంస్కృతీ, సంప్రదాయాలూ అటకెక్కించి పొలోమంటూ పొరుగువారివి నెత్తినెక్కించుకుని ఊరేగాలా? చెప్పండి.

తరువాతి కాగితం »


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 76,225

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.